Others

ఎవరెస్ట్ ఇపుడు.. ‘కాలుష్య శిఖరం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వతారోహణం అనేది కొందరికి సాహసం. ఇంకొందరికి సరదా. ఇది కొందరికి వ్యాపారాత్మకంగా మలచుకోడానికీ అవకాశంగా మారింది. దీనినే ‘కమర్షియల్ వౌంటెనీరింగ్’ అని వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ వ్యాపార ధోరణే హిమాలయాలకు, ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరానికి శాపంగా మారింది. ఎవరెస్టు శిఖరారోహణం చేసే వారికి శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఎంతోమంది ఆ శిబిరాలలో పాల్గొనడం అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి శిక్షణ కోసం డబ్బున్నవారే ఎక్కువగా వస్తారు. తమ పని పూర్తయ్యాక ఆ పరిసరాలలో వ్యర్థ పదార్థాలను వదలేసి వెళ్తారు. అక్కడ ఉన్నంతకాలం తాము పారవేస్తున్న ‘వేస్టేజ్’ పర్యావరణానికి ఎంతగా హాని చేస్తుందోనన్న స్పృహే వారికి ఉండదు. శిక్షణ కాలంలోనూ, శిఖరారోహణ కాలంలోనూ వారు వాడి విడిచిపెట్టిన ఫ్లోరోసెంట్ టెంటులు, శిఖరారోహణకు ఉపయోగించిన వస్తువులు, ఖాళీ అయిన ఆక్సిజన్ సిలిండర్లు, ఇంకా వారుచేసే మలమూత్ర విసర్జన ఎవరెస్టు శిఖరాన్ని చేరుకునే దారంతా కలుషితం చేస్తున్నాయి. ఎవరెస్టు శిఖరం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన ‘వేస్టేజ్ డంప్ సైట్’గా మారింది.
ఎవరెస్టును అధిరోహించడానికి ఉత్సాహం చూపేవారి సంఖ్య గతంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యింది. ఒక్క 2017 సంవత్సరం లోనే ఆరువందల మంది శిఖరారోహణ కోసం వచ్చారు. ఈ సంఖ్య ముందు ముందు ఇంకా పెరుగుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎవరెస్టును అధిరోహించే వారి సంఖ్య పెరిగేకొద్దీ, వారి బాధ్యతా రాహిత్యం వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. శిఖరారోహణకు వచ్చేవారి సంఖ్య వందలలో ఉంటుండడంతో అక్కడి పరిసరాల పరిశుభ్రత పట్ల ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. ఫలితంగా ఎవరెస్టు శిఖరం కాలుష్య శిఖరంగా మారుతోంది.
‘‘ఎవరెస్టు శిఖరారోహణ అనేది చాలామందికి ఒక సరదా అయిపోయింది. శిఖరారోహణకు వచ్చే వారిలో ఎక్కువమంది పర్వతాల మీద ప్రేమతోకాక పేరు కోసం, గొప్పలు చెప్పుకోవడం కోసం వస్తున్నారు’’ అని కల్నల్ హెచ్.ఎస్.చౌహాన్ అంటారు. ఈయన ఇండియన్ వౌంటెనీరింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు. గడచిన రెండు దశాబ్దాలలో ‘ఎవరెస్ట్ ఇండస్ట్రీ’ బాగా పుంజుకుంది. పర్వతారోహణ శిఖర నిర్వాహకుల మధ్య పోటీ పెరిగింది కూడా. సంపన్నులనే కాకుండా మధ్యతరగతి వారిని కూడా ఆకర్షించడానికి తక్కువ ఖర్చులతో కూడిన ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో ఎవరెస్టుకు పర్వతారోహకుల తాకిడి పెరిగింది. ఫలితంగా ఎవరెస్టుపై వ్యర్థ పదార్థాల డంపింగ్ పెరిగింది.
పర్వతారోహకుల సంఖ్య పెరగడం ఎవరెస్ట్ వద్ద పర్యావరణ సంతులనాన్ని దెబ్బతీస్తోందా? గతంలో పర్వతారోహకులు తమకు అవసరమైన సామగ్రిని తామే మోసుకువెళ్ళేవారు. ఇప్పుడలా కాదు. ఎవరెస్టుపైకి ఎక్కాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. వారికి అవసరమైన టెంట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, స్లీపింగ్ బ్యాగులు, తాళ్ళు మొదలైన వాటిని శిబిర నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. వాటిని పైకి మోసుకువెళ్ళేందుకు స్థానికులను వినియోగించుకుంటున్నారు. ఎవరెస్టుపై కాలుష్యం పెరగడానికి ఇది కూడా ఒక కారణం. గత 50 సంవత్సరాలుగా ఎవరెస్టువద్ద 45వేల కిలోగ్రాముల వ్యర్థాలు పేరుకుపోయాయి. అక్కడి అతి శీతల వాతావరణం వల్ల ఆ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడం లేదు.
ఎవరెస్టు, హిమాలయాలపై వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతో అక్కడి నుంచి ప్రవహించే నదీ జలాలు కూడా కలుషితమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ఏటా 3 కోట్ల 65 లక్షల టన్నుల మురికినీరు లాసా నదిలో కలుస్తున్నది. దీనివల్ల దిగువ ప్రాంతాలలో నివసించే ప్రజల, అక్కడ సంచరించే జంతువుల, అక్కడ పెరిగే మొక్కల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ‘శిబిరాల వద్ద వ్యర్థ పదార్థాలను సేకరించి తెచ్చాక దిగువ ప్రాంతాలలోని గ్రామాలలో కాలువలలో వాటిని పారేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు ఈ వ్యర్థాలు నదులలో కలుస్తున్నాయి’ అని గేరీ పోర్టర్ అనే అమెరికన్ ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఎవరెస్టు పరిసరాలు టన్నుల కొద్దీ వ్యర్థాలను మోస్తున్నాయి. ఇప్పుడక్కడ అసహ్యమే కాని అందమనేదే కనిపించడం లేదు. అవినీతిపరులైన కొందరు అధికారులు పర్వతారోహకుల శిబిరాల పరిసరాల పరిశుభ్రత విషయంలో తమకేమీ పట్టనట్టు ఉంటున్నారు’’ అని పెంబా దొర్జేషేర్పా అంటారు. ఈయన ఎవరెస్టు శిఖరాన్ని 18సార్లు అధిరోహించారు.
ఇదిలా ఉండగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు భారీగా కరిగిపోతూ ఉండడం వల్ల 65 ఏళ్ల క్రితం మొట్టమొదట శిఖరారోహణం చేసిన ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే పారేసిన వ్యర్థాలు కూడా ఇపుడు బయటపడుతున్నాయి.
ఆంగ్ షెరింగ్ నేపాల్ వౌంటెనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ విషయాలపై మాట్లాడుతూ- ‘ఎవరెస్టు పరిసరాలలో వ్యర్థ పదార్థాలు ముఖ్యంగా మానవ విసర్జితాలు ప్రమాదకర స్థాయిలో పేరుకుపోయాయి. ఎతె్తైన పర్వతాలలో శౌచాలయ సౌకర్యం ఉండదు. అందువల్ల పర్వతారోహకులు మంచు దిబ్బలలోనే గోతులు తీసి తమ ప్రకృతి అవసరాలను తీర్చుకుంటారు. ఇలా దశాబ్దాల తరబడి జరుగుతుండడం వల్ల ఎవరెస్టు పరిసరాలలో నాలుగు ప్రధాన శిబిరాల వద్ద 26,500 పౌండ్ల మానవ విసర్జితాలు పేరుకుపోయాయి. ఇక్కడ ఎప్పుడూ వాతావరణం చలిగానే ఉండడంవల్ల ఈ విసర్జితాలు ఎండిపోవు. భూమిలో కలిసిపోవు. ఇందువల్ల ఆ శిబిరాలలో వారాల తరబడ బసచేసే పర్వతారోహకులు రోగాల బారిన పడుతున్నారు’ అని చెబుతున్నారు.
ఎవరెస్ట్ పరిసరాలను శుభ్రపరచే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఐదేళ్ళుగా తమ దేశం మీదుగా శిఖరారోహణకు వెళ్ళే బృందం నుండి నేపాల్ ప్రభుత్వం నాలుగు వేల డాలర్లు వసూలు చేస్తోంది. శిఖరారోహణ పూర్తిచేసిన ఆ బృందంలోని ప్రత ఒక్కరూ కనీసం 8 కిలోల వ్యర్థాలను తీసుకువస్తే ఆ డబ్బును వెనక్కి ఇచ్చేస్తారు. 2017లో నేపాల్ ద్వారా శిఖరారోహణ చేసిన వారు 25 టన్నుల చెత్తనూ, 15 టన్నుల మానవ విసర్జితాన్నీ ఎవరెస్ట్ పరిసరాల నుంచీ సేకరించి తెచ్చారు. ఈ వ్యర్థాల పరిమాణం మూడు డబుల్ డెక్కర్ బస్సుల పరిమాణంతో సమానమని ‘సాగరమాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ (ఎస్.పి.సి.సి.) పేర్కొంది. 2018లో ఇంకా ఎక్కువ పరిమాణంలోనే శిఖరారోహకులు వ్యర్థాలు సేకరించి తెచ్చారనీ, అయితే ఇప్పటిదాకా ఎవరెస్ట్ పరిసరాలలో పేరుకుపోయిన వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా స్వల్ప పరిమాణమనీ ఎస్‌పిసిసి చెబుతోంది.

--డా. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690