Others

యుద్ధ నేపథ్యంలో ఉదాత్త ప్రేమగాథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్మిరల్
*
ప్రపంచ సినిమా : రష్యన్
*
జారిస్టు రష్యా పభుత్వంలో నౌకాదళ అధిపతిగా, రష్యా అంతర్యుద్ధ కాలంలో కమ్యూనిస్టు వ్యతిరేక నాయకుడిగా పనిచేసిన అలెగ్జాండర్ కొల్చాక్ జీవిత చరిత్ర ఆధారంగా 2008లో తీసిన రష్యన్ చిత్రం ‘అడ్మిరల్’ యుద్ధ నేపథ్యంలో అడ్మిరల్, అతని భార్య, అతని ప్రేమికురాలి మధ్య నడిచిన ముక్కోణపు ప్రేమకథను కూడా ఇందులో చిత్రించారు.
అది 1914లో బాల్టిక్ సముద్రం జర్మన్ ప్రాంతీయ జలాల్లో ప్రవేశించిన రష్యన్ నౌకను నడిపిస్తున్న కెప్టెన్ అలెగ్జాండర్ కొల్చాక్‌కు, దూరంగా వస్తున్న ఆయుధ నౌక తమ సిగ్నల్స్‌ను లెక్కచేయకుండా కాల్పులు జరుపుతుండటంతో, ఎదురుదాడికి సిద్ధపడమని తన అనుచరులతో చెబుతాడు. ఆ జర్మన్ నౌక చేసిన విధ్వంసంతో, దాన్ని ఎదుర్కోవడం సులభం కాదని భావించి, కొన్ని మందు పాతరలను నీళ్ళలోకి జారవిడుస్తారు. రష్యన్ నావికులు పేల్చిన తుపాకులకు జర్మన్ నౌక డెక్ దెబ్బతింటుంది. జర్మన్ నౌక కాల్పులకు చిక్కకుండా మందుపాతరలకు దూరంగా రష్యన్ నౌక తప్పుకోగా, మందుపాతరకు తట్టుకొని జర్మన్ నౌక పేలిపోయి, క్రమంగా సముద్రంలో మునిగిపోతుంది.
అప్పట్లో రష్యన్ సామ్రాజ్యంలో ఒక భాగంగా వున్న ఫిన్లాండ్ నావికా స్థావరంలో, ‘అడ్మిరల్’గా ప్రమోషన్ పొందిన కొల్చాక్ గౌరవార్థం విందు ఏర్పాటుచేస్తారు. ఆ విందులో అడ్మిరల్‌ను ఆటపట్టిస్తూ అమ్మాయిలు పోటీలో భాగంగా, తలుపు తెరుచుకుని వచ్చే వారికి ముద్దుపెట్టాలని షరతు పెడతారు. తీరా చూసేసరికి తన సబార్డినెంట్, క్లోజ్ ఫ్రెండ్ సెర్జీ తిమిరేవ్ తన అందాల భార్య అన్నా తిమిరేవ్‌తో లోపలకు వస్తాడు. అమ్మాయిలంతా కలిసి హడావుడి చేసి అడ్మిరల్‌తో ఆమెను ముద్దుపెట్టుకునేలా చేస్తారు. తొలిచూపులోనే కొల్చాక్, అన్నాలు గాఢమైన ప్రేమలో పడతారు. హుందాగా, దర్జాగా, మర్యాదగా, ఆకర్షణీయంగా వుండే అడ్మిరల్ కొల్చాక్‌ను చూసి అన్నా మనసు పారేసుకుంటుంది. అన్నా అంద చందాలు, ఠీవిని చూసి కొల్చాక్ ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. వీళ్ళ వ్యవహారాన్ని అటు కొల్చాక్ భార్య, ఇటు అన్నా భర్త గమనించి ఏమనలేక వౌనం వహిస్తారు. కొల్చాక్ భార్య కొడుకుతో పెట్రోగ్రాడ్ వెళ్ళిపోతున్నాననీ, తనకిష్టమైతే అన్నాతో కలిసి వుండవచ్చని నిర్వేదంగా చెబుతుంది. ఆమె బాధను పసిగట్టిన కొల్చాక్ ‘మనమిద్దరం భార్యాభర్తలుగా ఎప్పుడూ ఇలాగే వుండిపోతాం’ అని సముదాయిస్తాడు. అక్కడ సెర్జీ తన భార్య అన్నాతో ‘మనం దేవుని ముందర దంపతులుగా విశ్వాస పాత్రంగా మెదులుతామని ప్రమాణం చేశాం గుర్తుందా’ అని జ్ఞాపకం చేస్తాడు. కొల్చాక్, అన్నాలు ఒకరినొకరు చూడకుండా వుండలేని స్థితిలో సమాజం దృష్టిలో వివాహితులు కాబట్టి, దూరం నుండే చూసుకుని సంతృప్తిపడుతుంటారు. వారి మూగ ప్రేమ రోజురోజుకు పెరిగి వాళ్ళను కలవరపెడుతుంది. అన్నా భర్తను పట్టించుకోకుండా, నిరంతరం కొల్చాక్ ఆలోచనల్లో మునిగి వుండటం సెర్జీ భరించలేకపోతాడు. సముద్ర జలాల్లో నౌకలో వున్న అడ్మిరల్ కొల్చాక్ దగ్గరకు సెర్జీ వచ్చి తనను వేరే నౌక మీదికి బదిలీ చేయమని, ఇక్కడ వుండలేనని గిల్టీగా చెబుతాడు. అంతలో శత్రువుల కాల్పులకు తేరుకున్న కొల్చాక్ ‘నేను అడ్మిరల్‌ను. నీవు కెప్టెన్‌వి. మనమిద్దరం శత్రువులను ఎదిరించడమే ముఖ్యం’’ అని బుజ్జగించి, వెన్ను తట్టి పంపిస్తాడు. జార్ ప్రభుత్వం సెవాస్టొపొల్‌లో వున్న విమాన వాహక నౌక మీదకు కొల్చాక్‌ను అడ్మిరల్‌గా ప్రమోషన్ ఇచ్చి పంపిస్తుంది.
1917 ఫిబ్రవరి విప్లవ విజయంతో ఎర్ర సైనికలు వచ్చి, క్రోన్‌స్టాడ్ నావికా స్థావరంలో వున్న అధికారులను నిరాయుధులను చేసి విచారణ జరుపుతారు. సెర్జీ తన భార్య అన్నాతో కలిసి ఆ ద్వీపం నుండి పారిపోతాడు. జారిస్టు చిహ్నాలున్న నావికుల టోపీలను తీసివేసి, ఆ స్థానంలో ఎర్రటోపీలను ధరించిన ఒక గుంపు కొల్చాక్ వున్న నౌక మీదకు దూసుకువచ్చి, నౌకాదళం ఆయుధాలు అప్పగించి లొంగిపొమ్మంటారు. రక్తపాతాన్ని నివారించడానికి అలాగే చేయమని కొల్చాక్ తన అనుచరులను ఆదేశిస్తాడు. కాని తన ఆయుధాన్ని వాళ్ళకు అప్పగించడానికి ఇష్టపడక, దాన్నిసముద్ర జలాల్లోకి జారవిడుస్తాడు. కొత్తగా ఏర్పడిన రష్యా విప్లవ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న అలెగ్జాండర్ కెరెన్‌స్కీ, కొల్చాక్‌ను పెట్రోగ్రాడ్‌కు పిలిపించి, రక్షణశాఖ మంత్రిగా వుండమని కోరుతాడు. దానికి ఒప్పుకోని కొల్చాక్ విప్లవం పేరిట రష్యన్ సైన్యంలో, నౌకాదళంలో క్రమశిక్షణ లేకుండా చేస్తున్నారని విమర్శిస్తాడు. తిరిగి జారిస్టు ప్రభుత్వాన్ని ప్రతిష్టిస్తేనే, ఆ పదవిని స్వీకరిస్తానంటాడు. దానికి ఆగ్రహించిన కెరెన్‌స్కీ, కొల్చాక్‌ను విప్లవ వ్యతిరేకిగా గుర్తించి దేశబహిష్కరణ విధిస్తాడు.
1919 వేసవిలో అనగా అక్టోబర్ విప్లవం తర్వాత రెండు సంవత్సరాలకు - అన్నా, సెర్జీలు ట్రాన్స్ సైబీరియన్ రైలులో ప్రయాణిస్తుంటారు. కొల్చాక్ తిరిగి వచ్చాడనీ, ఓమ్‌స్క్‌లో వున్న జారిస్ట్ మూకలతో కలిసి పనిచేస్తున్నాడని తెలుస్తుంది. రష్యా అంతర్యుద్ధ కాలంలో ఎటువైపు వుండాలో సెర్జీ తేల్చుకోలేకపోతాడు. తాను ఒంటరిగా తన బతుకు తాను బతుకుతాననీ అన్నా తేల్చివేస్తుంది. అది ఇష్టం లేకపోయినా చేసేది లేక సెర్జీ స్వయంగా ఆమె సామాన్లు సర్దిపంపిస్తాడు. కొల్చాక్ తన సైన్యానికి దేశభక్తిని ప్రబోధిస్తూ బోల్షివిక్కులను ఓడించి, రష్యాను పునరుద్ధరించాలని పిలుపునిస్తాడు. రష్యన్ అంతర్యుద్ధంలో గాయపడుతున్న వందలాది మందికి సేవచేయడానికి అన్నా నర్స్‌గా మారుతుంది. విప్లవ సానుభూతిపరుల సహాయంతో ఎర్రసైన్యం ఓమ్‌స్క్ వైపు దూసుకువస్తుంది. కొల్చాక్ అనుచరులు ఎలాగైనా ఓమ్‌స్క్‌ను దక్కించుకోవాలని తలపోస్తారు. కాని కొల్చాక్ దాన్ని త్రోసిపుచ్చి, ఓమ్‌స్క్‌ను ఖాళీచేసి ఇర్క్‌టస్క్‌ను ఆక్రమించుకుని, కమ్యూనిస్టు వ్యతిరేక రష్యాకు కొత్త రాజధానిగా ఏర్పరచుకోవాలని చెబుతాడు. ఓమ్‌స్క్ పట్టణం ఖాళీ చేయబడుతున్న దశలో ఓ జారిస్టు అధికారి అన్నాను చూసి గుర్తుపట్టి కొల్చాక్‌కు తెలియజేస్తాడు. ప్రాణం లేచి వచ్చిన కొల్చాక్, అన్నాను కలిసి ఒకసారి నిన్ను వదులుకుని పొరపాటు చేశాను. మళ్ళీ ఆ పొరపాటు చేయనంటాడు. ఇర్క్‌టస్క్‌కు రైల్లో వెళుతున్న కొల్చాక్, పారిస్‌లో వున్న భార్యకు విడాకులు ఇవ్వాలని కోరుతూ ఇప్పుడే ఉత్తరం రాస్తానంటాడు. ఇప్పుడయినా పెళ్ళి చేసుకో అని అన్నాను కోరగా, ఇప్పుడు ప్రత్యేకంగా పెళ్ళిచేసుకోవాల్సిన అవసరం లేదనీ, కలిసి బ్రతుకుదామని, ప్రతిపాదిస్తుంది.
నిజానికి ఇర్క్‌టస్క్, ఫ్రెంచ్ జనరల్ మరియూ జెకోస్లోవేకియా సైనిక దళాల పర్యవేక్షణలో వుంటుంది. వారి రక్షణ దళాలు బలహీనంగా వుండటంతో ఎర్ర సైన్యం విధించిన షరతులకు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఫలితం అడ్మిరల్ కొల్చాక్‌ను అరెస్టుచేసి ఎర్ర సైన్యానికి అప్పగిస్తారు. అది చూసి అన్నా, నేను ఆయన భార్యను, నన్ను కూడా అరెస్టుచేయండి అని అరిస్తే, ఆమెను కూడా అరెస్టు చేస్తారు. ఘనీభవించిన శీతల జలాలతో వున్న ప్రాంతాన్ని, కొంత శిలువ మాదిరిగా తయారుచేసి దాని ఒడ్డున కొల్చాక్‌ను, మాజీ ప్రధానమంత్రిని నిలబెట్టి ఫైరింగ్ స్క్వాడ్ కళ్ళకు గంతలు కట్టుకోమంటే, వద్దని కొల్చాక్ నిరాకరిస్తాడు. చివరికోరిక తెలపమంటే ‘నా కొడుకు గురించిన దీవెనలు పారిస్‌లో వున్న నా భార్యకు తెలియజేయండి’ అంటే ‘నీకెంతమంది భార్యలు’ అని వాడు అవహేళన చేసి వెళతాడు. ఫైరింగ్ స్క్వాడ్ కాల్పులతో వాళ్ళు కూలిపోయి, శీతల జలాలలో పడి మెల్లగా మునిగిపోతారు. వర్తమానానికి వస్తే- 44 ఏళ్ళ తర్వాత అన్నా మోస్ ఫిలిం స్టూడియోకి వస్తుంది. డెబ్బయి ఏళ్ళ వయసులో వున్న కులీన స్ర్తిగా కనిపించే అన్నా, ముప్పయి సంవత్సరాలు గులగ్ జైల్లో గడిపి కృశే్చవ్ పాలనలో విడుదల చేయబడుతుంది. అన్నా ‘వార్ అండ్ పీస్’ చిత్రం తాలూకు బాల్‌రూమ్ డాన్స్ చిత్రీకరణ దృశ్యంలో, ఒక వెయిటర్ ట్రే నుండి వైన్‌తో వున్న గ్లాస్ కిందపడి ముక్కలు ముక్కలు అవడంతో- అచ్చు అదే సన్నివేశం తాను మొదటిసారి కొల్చాక్‌ను కలిసినప్పడు జరిగి వుండటం వలన ఆమె ఫ్లాష్‌బాక్‌లోకి వెళ్ళిపోయి, సినిమాను మన కళ్ళముందు నిలబెడుతుంది.
సోవియట్ చరిత్రలో విలన్‌గా నిలిచిపోయిన కొల్చాక్‌ను హీరోగా పెట్టి సినిమా తీయడం పట్ల అనేక విమర్శలు, చర్చలు బయలుదేరాయి. దీన్ని అలా కాకుండా కొల్చాక్ దృష్టితో చూడాల్సిన అవసరముంది. ప్రభుభక్తి నిండినఅప్పటి ఉన్నత వంశీకుల ఆలోచనా ధోరణి కొల్చాక్‌లో కనిపిస్తుంది. తాను ఉన్నత వంశీకుడు కావడంవలన అలగాజనాల తిరుగుబాటుగా ఎర్ర సైన్యాన్ని గుర్తిస్తాడే తప్ప, దాని పట్ల సదభిప్రాయాన్ని ఏర్పరచుకోలేకపోతాడు. అతని నిజాయితీ, నిబద్ధతను గుర్తించి ఎర్ర సైన్యం అతడ్ని రక్షణ మంత్రిగా వుండమంటే నిరాకరించడం, తిరిగి జారిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పగలనని విశ్వసించడం- అతని జీవితంలో సరిదిద్దుకోలేని సంఘటనలు. చివరకు దానికి మూల్యాన్ని చెల్లించుకుంటాడు. అన్నాను ప్రేమించి అటు మిత్రద్రోహం, ఇటు భార్యకు అన్యాయం చేస్తున్నాననే అపరాధ భావనకు లోనవుతాడు. ఆమెను మరచిపోలేకపోతాడు. తన ప్రేమను వ్యక్తపరచడంలో ఎంతో డిగ్నిఫైడ్‌గా ప్రవర్తిస్తాడు. ఇక అన్నా ప్రేమ మైకంలో ఇంటిని, భర్తను వదిలేసి కొల్చెక్‌కు తెలియకుండా, అతడ్ని అనుసరిస్తూనే వుంటుంది. చివరకు కొల్చెక్‌తోపాటు జైలుకు వెళుతుంది. నలభై సంవత్సరాలు జైల్లో గడిపి 1960లో విడుదలైన ఆమె తన 81వ యేట అనగా 1975లో మాస్కోలో చనిపోతుంది. అన్నా భర్త సెర్జీ సైబీరియాలో జారిస్టు సైన్యాలకు అధిపతిగా వుంటూ, చివరకు చైనా పారిపోతాడు. అక్కడ షాంఘైలో 1932లో మరణిస్తాడు. అడ్మిరల్ కొల్చాక్ భార్య పారిస్‌లో స్థిరపడి, తన కొడుకు భవిష్యత్తుపైనే దృష్టిపెడుతుంది. చివరకు వృద్ధాప్యంతో 1956లో ఆస్పత్రిలో చనిపోతుంది. అడ్మిరల్ కొల్చాక్ కొడుకు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, ఫ్రాన్స్ తరఫున యుద్ధంలో పాల్గొంటాడు. 1965లో పారిస్‌లో చనిపోతాడు.
ఇందులో అడ్మిరల్ కొల్చాక్‌గా కాన్‌స్టాంటిన్ కబెన్‌స్కీ, అన్నాగా ఎలిజబేటా బోయర్ స్కాయా అద్భుతంగా నటించారు. ‘డాక్టర్ జివాగో, వార్ అండ్ పీస్’ల మాదిరి యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకున్న అద్భుత ప్రణయగాథ ఇది. భారీ సెట్టింగులతో, అప్పటి వాతావరణాన్ని మన కళ్ళముందు నిలబెడుతూ, ఖర్చుకు వెరవకుండా భారీ బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. అత్యంత సహజంగా తీసిన యుద్ధ దృశ్యాలు, ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎలాంటి వెకిలివేషాలు వేయకుండా, అసభ్యత, అశ్లీలతలకు చోటివ్వకుండా ఈ చిత్రాన్ని ఉదాత్త ప్రేమకథా చిత్రంగా రూపొందించడడంలో దర్శకుడు ఆండ్రీ క్రావ్‌చక్ చేసిన కృషి ప్రశంసనీయం. ఈ చిత్రం ఇంటాబయటా భారీ వసూళ్ళను రాబట్టడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఉత్తమ హీరో, హీరోయిన్, సినీమాటోగ్రపీలతో పాటు ఉత్తమ చిత్రంగా కూడా గోల్డెన్ ఈగిల్ అవార్డ్సును, యంటివి రష్యా మూవీ అవార్డ్సును అందుకోగలిగింది.
- కె.పి.అశోక్‌కుమార్