Others

వివక్షలో - అణచివేతలో ముస్లిం స్ర్తిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లో స్ర్తి, శిశు సంక్షేమానికి సంబంధించి బాల్టిమార్‌లోని జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ మరియూ జె.యస్.ఐ. రిసెర్చి అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్ కార్పొరేషన్ వాళ్ళు 2009లో పాకిస్తాన్ నిర్మాత, దర్శకుడు షోయబ్ మన్సూర్‌తో ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళంతా కలిసి కుటుంబ నియంత్రణ, జెండర్ వివక్షతతో పాటు స్ర్తిల హక్కులను మీడియా దృష్టికి తేవాలనే ప్రయత్నంలో భాగంగా ‘‘బోల్’’ అనే ఉర్దూ సినిమాను తీశారు. మతవ్ఢ్యౌం, పురుషాహంకారం, అధిక సంతానం, జెండర్ వివక్షతో ఎన్ని ముస్లిం కుటుంబాలు అస్తవ్యస్తమైపోతున్నాయో ‘‘బోల్’’ చిత్రం కళ్ళకు గట్టినట్లు చిత్రీకరించింది.
మతాచార సంప్రదాయబద్ధుడైన హకీం సాబ్‌కు (యునానీ వైద్యుడు) కుటుంబాన్ని పోషించేది కొడుకు మాత్రమే, కూతుళ్ళు అందుకు పనికిరారని ప్రగాఢ నమ్మకం. కొడుకు కోసం ప్రయత్నిస్తూ వరుసగా పధ్నాలుగు కాన్పుల్లో కూతుళ్ళనే కన్నందుకు తల్లిని, చనిపోగా మిగిలిన ఏడుగురు కూతుళ్ళను ఎప్పుడూ తిడుతూ, చీదరించుకుంటూనే వుంటాడు. ఈసారి హకీం భార్య అటు మగ కానీ, ఆడ కాని శిశువును ప్రసవించిందనే విషయం తెలియగానే విచారంతో, బాధతో కుప్పకూలిపోతాడు. అతని బాధను చూసిన మంత్రసాని ఒక హిజ్రా నాయకుడిని తీసుకొచ్చి, వాడికి ఆ శిశువును అమ్మివేయమంటుంది. అలాంటి నీచమైన పని చేయలేనని వాళ్ళను తరిమేస్తాడు. శిశువు మీద అసహ్యంతో వాడికి పేరు పెట్టడానికి కూడా నిరాకరిస్తాడు. ముద్దులు మూటకట్టే ఆ శిశువుకు సైఫుల్లాఖాన్ అనే పేరుపెట్టి అక్కలందరూ ప్రేమగా చూసుకుంటారు. ఆడవాళ్ళు బయటకు పోకూడదని ప్రగాఢంగా నమ్మే హకీంసాబ్ ఇంటి పక్కన వున్న స్కూల్‌కు కూడా పంపడు. కొడుకు స్కూల్‌కు పోతే వాడు హిజ్రా అని తెలుస్తుంది కాబట్టి వాడ్ని కూడా బయటకు వెళ్ళొద్దని శాసిస్తాడు. మూసి వున్న తలుపుల లోపుల పిల్లలందరూ ఖైదీల్లా వుండాల్సిందే. ఆ పెద్ద ఇంట్లో ఆడుతూ, ఉల్లాసంగా వుండే ఆడపిల్లలు తండ్రి అలికిడి వినిపిస్తే గజగజ వణికిపోయి, తమలోతాము ముడుచుకునిపోతారు. పొరపాటున సైఫ్ తండ్రి కళ్ళబడ్డాడంటే, వాడి వీపు చిట్లాల్సిందే. ఒకసారి హకీం సాబ్ తలుపులు మూసి భార్యతో ‘‘నువ్వు ప్రసవించి చాలా రోజులయింది కదా! మరి శుభవార్త ఎప్పుడు వినిపిస్తావు’’ అంటూ అడుగుతుంటే, పెద్ద కూతురు జైనాబ్ తలుపు అవతల నుండి దానికి నేను సమాధానమిస్తానని చెబుతుంది. ఆశ్చర్యంతో బయటకు వచ్చిన తండ్రితో, కాన్పులతో తల్లి శరీరం క్షీణించింది. ఆమె బతకాలంటే ట్యూబెక్టమీ చేయించక తప్పలేదు అంటే, హకీం సాబ్ ఆగ్రహంతో విరుచుకుపడతాడు. దేవుడిచ్చిన సంతానాన్ని కాదనుకోవడం పాపమని అంటే, మరి తిండి గింజలు కూడా ఆ దేవుడ్నే అడక్కపోయారా? అని ప్రశ్నిస్తే, ఆమెను కొట్టి వెళ్ళిపోతాడు.
పక్కింటి వాళ్ళతో మాట్లాడాలనుకుంటే మేడమీద సరిహద్దు గోడలు కలుసుకున్నచోట వుండి మాట్లాడుకోవాల్సిందే. పక్క ఇంట్లో వుండే టీచర్‌కు ఒక ఆడ, ఒక మగ ఇద్దరే సంతానం. ఇద్దర్ని బాగా చదివిస్తుంటాడు. వారికి హకీం సాబ్ మూర్ఖత్వం నచ్చదు. అమాయకులైన ఆ ఆడపిల్లల మీద వారికి జాలి. వారు అప్పుడప్పుడు చిన్న చిన్న సహాయాలు చేస్తుంటారు. వారి అబ్బాయి డాక్టరీ చదువుతున్న మాజిద్‌కు, హకీం సాహెబ్ రెండో కూతురు అంటే ఇష్టం. వారిద్దరి ప్రేమను మిగతా ఆడవాళ్ళు ప్రోత్సహిస్తారు. ఆమెకు సంగీతం నేర్పిన మాజిద్, ఒక సాయంత్రం ఆమెను బ్యూటీపార్లర్‌కు తీసుకుపోయి మాడ్రన్‌గా తీర్చిదిద్ది, అక్కడినుండి పబ్‌లో పాడటానికి తీసుకుపోతాడు. దానివల్ల వచ్చే ఆదాయం కుటుంబానికి పనికి వస్తుందని అతని ఆశ. సంగీతం నేర్చుకోవడం, బ్యూటీపార్లర్, పబ్‌లో పాడటం పాపమని తండ్రి చెప్పిన మాటలను నమ్మిన ఆ అమ్మాయికి మాజిద్ అతి కష్టంమీద నచ్చజెప్పగలుగుతాడు. కొత్తగా ఏర్పడిన మజీద్ కమిటీ మజీద్ నిర్మాణానికి విరాళాలు వసూలుచేస్తూ, ఒక నమ్మకమైన వ్యక్తి క్యాషియర్‌గా వుండాలని, అందుకు హకీం సాబ్‌ను ఎన్నుకుని, వసూలుచేసిన డబ్బును దాచమని అతనికి ఇస్తారు.
ఒకవైపు ఆడపిల్లలు పెరుగుతున్నారు. ఇంకోవైపు ఆదాయం తగ్గిపోతూ వుంటుంది. ఒకరోజు మందులు తీసుకోవడానికి వచ్చిన వేశ్యాగృహ యజమాని సాకా తమ పిల్లలకు ఖురాన్ నేర్పిస్తే డబ్బు ఇస్తానంటాడు. వాడి వృత్తి తెలుసుకున్న తర్వాత వాడ్ని అసహ్యించుకొని వెళ్ళగొడతాడు. వాడు ఇచ్చిపోయిన మిఠాయి డబ్బాను, డబ్బును బిచ్చగాడికి పిలిచి ఇచ్చేస్తాడు.
ఒకరోజు ఇంట్లో సైఫ్ ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోతుండటం పెద్దక్క జైనాబ్ చూసి హడలిపోతుంది అక్కలందరూ కలిసి ఇలా కనిపిస్తే తండ్రి చంపి వేస్తాడు. నువ్వు మగాడిలా తయారుకావాలి అని చెబితే వాడికి అర్ధం కాదు. ‘‘నాకు ఇలా తయారుకావాలని ఏదో తెలియని శక్తి నన్ను ప్రేరేపిస్తుంది’ అని భోరుమంటాడు. అమాయకంగా వుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్లని సైఫ్‌ను, మాజిద్ తీసుకెళ్ళి ట్రక్కులకు రంగులు వేసే పనిలో చేరుస్తాడు. దీనివల్ల అతనిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తెచ్చే డబ్బువల్ల ఇల్లు గడుస్తుందని తలపోస్తాడు. కాని అక్కడ పనిచేసేవాళ్ళు సైఫ్ హిజ్రా అని గుర్తించి వేధిస్తుంటారు. యజమాని లేని సమయం చూసి వాళ్ళు గాంగ్ రేప్ చేస్తారు. బంధించి పొలాల్లో పడవేసిన సైఫ్‌ను ఒక హిజ్రా చూసి, ఇంటికి తీసుకువస్తుంది. భవిష్యత్తులో ఏదైనా సహాయం కావాలనుకుంటే తన దగ్గరకు రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది. అది చూసిన, సైప్ రేప్ సంగతి తెలిసిన హకీం సాబ్ అవమానంతో ఉడికిపోతాడు. ఆడవాళ్ళంతా వాడ్ని పెనవేసుకుని రోదిస్తారు. సిగ్గుతో అవమానంతో రగిలిపోతున్న హకీంసాబ్, అమాయకంగా పడుకున్న సైఫ్ ముఖాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌తో అదిమి ఊపిరాడకుండా చంపివేస్తాడు. కేసును పరిశోధిస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ విషయాన్ని గ్రహించి, రెండు లక్షలు లంచమిస్తే వదిలేస్తానంటాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మజీద్ ఫండ్స్‌నుండి డబ్బు తెచ్చి ఇన్‌స్పెక్టర్‌కిస్తాడు. ఇల్లు గడవడానికి హకీంసాబ్ మెడకు ట్రేవేసుకుని, అందులో మందులు పెట్టుకుని రోడ్లమీద అమ్ముతుంటాడు. హఠాత్తుగా వేశ్యాగృహ యజమాని సాకా జ్ఞాపకం రాగా అతని దగ్గరకు వెళ్ళి, పిల్లలకు ఖురాన్ చెప్పడానికి ఒప్పుకుంటాడు. కొత్త క్యాషియర్‌ను ఎన్నుకున్నాం కాబట్టి మజీద్ తాలూకు డబ్బు అతనికి అప్పగించమని కమిటీ వాళ్ళు చెప్పడంతో హకీంసాబ్‌కు ఏం చేయాలో అర్ధం కాదు. వెంటనే వెళ్ళి వేశ్యాగృహ యజమాని సాకా సహాయం కోరతాడు. దానికి సాకా, హకీంసాబ్ తన చిన్న కూతుర్ని పెళ్ళిచేసుకుని ఆడపిల్లను కని ఇవ్వమంటాడు. మాకు అమ్మాయిలే డబ్బు. అబ్బాయిలు బేకార్ గాళ్ళు. నీకు అమ్మాయిలు బేకార్. అబ్బాయిలే ఆస్తిగా భావిస్తావు. నీకు అందరూ ఆడపిల్లలే. కాబట్టి నా బిడ్డను పెళ్ళిచేసుకుంటే తప్పకుండా ఆడపిల్లే పుడుతుంది. పెళ్ళి చేసుకుంటానంటే ఇప్పుడే రెండు లక్షలు ఇస్తాను. ఆడపిల్లను కని తెచ్చి ఇచ్చినప్పుడు మరో మూడు లక్షలు ఇస్తాను. ఒకవేళ మొగపిల్లాడే పుడితే మీ ఇంటికే తీసుకుపో. కాని నేను ఇచ్చిన రెండు లక్షలు తిరిగి ఇవ్వాల్సి వుంటుందని హెచ్చరిస్తాడు. హకీంసాబ్ జుట్టుకు, గెడ్డానికి రంగువేసి అలంకరించి తన బిడ్డ మీనాను ఇచ్చి పెళ్ళిచేసి, ఆ వేశ్యాగృహంలోనే వారికి ఒక గదిని కేటాయిస్తాడు. ముభావంగావున్న హకీంసాబ్‌ను తన ప్రవర్తనతో మీనా దారికి తెచ్చుకుంటుంది. వారిచ్చిన డబ్బుతో హకీం సాబ్ మజీద్ కమిటీకి డబ్బు అందజేసి ఇంటికి వస్తాడు. అప్పుడు కూతురు జైనాబ్ వచ్చి, పక్కింటి మాజిద్‌తో చెల్లి పెళ్ళిచేసి పంపించానని చెబితే కోపం పట్టలేక పోతాడు. పక్కింటి వాళ్ళు సున్నీలనీ, తాము పవిత్ర షియాలమని చెప్పుకునే అతని అహంభావం దెబ్బతినడంతో ఇంట్లో వాళ్ళమీద తన కోపాన్ని వ్యక్తపరుస్తాడు. ఇదంతా పెద్దకూతురు జైనాబ్ చేస్తుందనీ, సైఫ్ బదులుగా నువ్వు ఛస్తే పీడాబోయేది అంటాడు.
కొంత కాలానికి మీనా ప్రసవించి ఆడపిల్లను కంటుంది. సాకా వేడుకలు చేసుకుంటాడు. హకీం సాబ్ మీనా దగ్గరకు వెళ్ళి ఈ నరక కూపంలో ఆ పసిపిల్లను పడవేయలేను. ఆ పిల్లను తీసుకొని సాకాకు దొరకకుండా ఎక్కడికైనా పారిపోదామని నచ్చజెప్తుండగా విన్న సాకా, వచ్చి హకీంసాబ్‌ను తన్ని తరిమేస్తాడు. ఆ రాత్రి ముసుగులో వున్న అమ్మాయి (మీనా) వచ్చి, హకీంసాబ్ ఇంటి తలుపు తట్టగా, జైనాబ్ తలుపు తీస్తుంది. ఆమె చేతిలో పసిపిల్ల నుంచి ఏమి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా వచ్చి ఎవరెవరు అని అడగగా, హకీంసాబ్ లోపలకు భార్యను తీసుకెళ్ళి ఆమె తన భార్యయనీ, ఆ శిశువు తన కూతురని చెబుతాడు. భర్త చేసిన నమ్మకద్రోహానికి అతని భార్య ఏడుస్తూ బయటకు వచ్చి పిల్లలతో ‘‘ఈ పాప మీ ఎనిమిదో చెల్లెలు. ఆ వేశ్యకు పుట్టిందని’’ తెలియజేస్తుంది. ఆమె ఏడుస్తూ యాగీ చేస్తుందని హకీం సాబ్ కొడితే, జైనాబ్ ముందుకు వచ్చి తండ్రిని వదిలి మన బతుకు మనం బతుకుదామని చెబుతుంది.
ఆ రాత్రి సాకా, మీనా వదిలేసి వెళ్ళిన పాపను తీసుకుపోవడానికి హకీంసాబ్ ఇంటికి వస్తాడు. వాడు ఎలాగైనా పాపను తీసుకెళ్తాడు. ఆ నరకంలోకి వెళ్ళి బతకడం కంటే, పాప చనిపోవడమే మేలని తలదిండుతో అదిమి చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆడపిల్లలు అందరు కలిసి అడ్డుకుంటున్నా వినకుండా, చంపబోతుంటే జైనాబ్ మూలకున్న ఒక కర్రను తీసుకుని తలమీద బాదటంతో వెల్లకిలాపడి హకీంసాబ్ చచ్చిపోతాడు. ఈలోపున ఆడపిల్లలు ఆ పసికందును మేడ మీదనుండి టీచర్ ఇంట్లోకి చేరవేస్తారు. హకీంసాబ్ ఆడపిల్లను చంపి ఎక్కడో పారేశాడనీ, అందుకే నేను అతడ్ని చంపేశానని చెప్పడంతో, సాకా వెళ్ళిపోతాడు. పోలీసులు జైనాబ్‌ను పట్టి జైలులో వేస్తారు. ఆమెకు ఉరిశిక్ష అమలుపరుస్తున్నప్పుడు వచ్చిన పత్రికా విలేఖరులతో తన కథ చెప్పడం ద్వారా, ఫ్లాష్‌బాక్‌లో ఈ సినిమా నడుస్తుంది. హకీంసాబ్ చనిపోవటంతో ఇంట్లో ఆడవాళ్ళంతా, ఇంటి ముందర ఒక చిన్న హోటల్ పెట్టుకుంటారు. అది క్రమంగా పెరిగి పెద్ద హోటల్‌గా జైనాబ్ పేరుతో అవతరిస్తుంది. ఒకసారి మీనా ఆ హోటల్‌కు వచ్చి తన కూతురు, వాళ్ళ చిన్న చెల్లెలుగా అపురూపంగా పెరుగుతుండడం చూసి ఆనందంగా వెళ్ళిపోతుంది. జైనాబ్ కథ విన్న జర్నలిస్టులు క్షమాభిక్ష కోరుతూ ప్రెసిడెంట్‌కు వినతిపత్రం పంపిస్తారు. అంతా తెలుసుకున్న ప్రెసిడెంట్ ‘‘చంపడం పాపం కాదు. పుట్టించడమే పాపం’’ అని తీర్మానిస్తాడు. ఏమి చేయలేని అతని నిస్సహాయతలో ఉరిశిక్ష అమలుకాగా, జైనాబ్ ఉరికంబం మీదుగా వేలాడుతూ వుండగా, ఆమె శవాన్ని చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా చూసింతర్వాత చాలాసేపటివరకు మనం కోలుకోలేకపోతాం. అంతగా డిస్టర్బ్ చేస్తుంది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మనల్ని వెంటాడుతాయి. వేధిస్తాయి. ఈ పరిస్థితులను మనం ఏమీ మార్చలేమా అన్న ఆలోచనలు ముసురుకుంటాయి. అదే ఈ సినిమా సాధించిన ప్రయోజనం. నిజానికి చెప్పాలంటే ఇది అందరికి తెలిసిన కథే. మన కళ్ళముందు జరుగుతున్నదే. అయినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అంతా అలాగే ఆలోచిస్తారు కాబట్టి. ఈ సినిమాకు సంభాషణలే ప్రాణం. చాలా సన్నివేశాలలో వినిపించే సంభాషణలకు మనదగ్గర సమాధానం వుండదు. సిగ్గుతో మనం తలదించుకోవాల్సి వస్తుంది. మన సినిమాల్లో అమెరికా గురించి తప్పనిసరి ప్రస్తావనలు ఎలా వుంటాయో, పాకిస్తాన్ చిత్రాలలో ఇండియా గురించిన ప్రస్తావనలు అలాగే కనిపిస్తాయి. హకీంసాబ్‌కు క్రికెట్ పిచ్చి. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతుంటే ట్రాన్సిస్టర్ నేలకు విసిరికొట్టి ధ్వంసం చేస్తాడు. అల్లాను వేడుకున్నా లాభం లేకపోయిందని వాపోతాడు. అలాగే వేశ్యాగృహ యజమాని సాకా కూతురు నఫీసాకు మీనాకుమారి అంటే ఇష్టం. అందుకే తన పేరు మీనాగా మార్చుకుంటుంది. ఆమె ‘‘పాకీజా, ఉమ్రావ్‌జాన్’’ సినిమాల గురించి ప్రశంసిస్తుంది. వాటి ప్రభావం వల్లనే వేశ్యగా లక్నోలో పుడితేనే బాగుండేది అని విచారిస్తుంది.
‘‘బోల్’’ చిత్రం అనేక ప్రధాన సమస్యల్ని చర్చకు బెట్టింది. పొరలు పొరలుగా వివిధ ఉపకథలు ప్రధాన కథకు జోడించబడి, దాన్ని మరింత పరిపుష్టంగా తయారుచేశాయి. ఇది స్ర్తిలకు, స్ర్తిల హక్కులకు, స్ర్తివాద సమస్యలకు సంబంధించినది కాదు. ఈ కథ ప్రతి పురుషుడికి, ప్రతి స్ర్తికి, ప్రతి బాలుడికి సంబంధించినది. ఇందులో నటించిన వారి ప్రదర్శనకు మెచ్చుకోవాలి. అందరూ తమతమపాత్రలకు సరియైన న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా తార్కికంగా, హేతుబద్ధంగా వాదిస్తూ తండ్రిని ఎదిరించిన పెద్దకూతురు జైనాబ్‌గా హుమాయిమా మాలిక్ బాగానే నటించింది గాని ఆమె పాత్ర పరిధి తక్కువ. అదే సంప్రదాయవాది, పురుషాహంకారియైన తండ్రిగా మంజర్ సెహబాయ్ హడలగొట్టాడు. ఈ చిత్రానికి కథ,స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకుడు షోయబ్ మన్సూర్ ఈ విజయానికి అన్ని విధాలా అర్హుడు.
పాకిస్తాన్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే అన్ని రికార్డులను బద్దలుగొట్టి, అత్యధిక వసూళ్ళతో బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా పాకిస్తాన్‌లోనే కాకుండా ఇండియా, అమెరికా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్ అరబ్ ఎమిరెటిస్, ఆస్ట్రేలియాలలో కూడా విడుదలై మంచి వసూళ్ళతోపాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటిలకు గాను లక్స్‌స్టైల్ అవార్డ్సును, లండన్- ఆసియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటి, ఉత్తమ చిత్రాలకు గాను పాకిస్తాన్ మీడియా అవార్డులను, ఉత్తమ నటుడికి గాను సార్క్ ఫిలిం అవార్డ్‌ను, ఉత్తమ నటికిగాను సౌత్ ఆసియన్ రైజింగ్ స్టార్ ఫిలిం అవార్డ్‌ను గెలుచుకోవడం విశేషం.

- కె.పి.అశోక్‌కుమార్