Others

రియాలిటీ షోలలో పిల్లలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి దృశ్యం
కొంతమంది ఓ గదిలో కూర్చుని సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ గదిలోనే ఓ మూల ఉన్న ఒకామే తను చెప్పిన పని చెయ్యనందుకు మరొకామెను పరుష పదాలతో పెద్దగా తిడుతోంది. నెమ్మదిగా వారిద్దరిమధ్య మాటల పోట్లాట మొదలయ్యింది. వాళ్ళిద్దరూ మంచి వేడిమీదున్నారు. ఆ గదిలోనే పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న వారిలో ఇద్దరు అక్కడే ఉన్న మరో వ్యక్తి గురించి చెడుగా గుసగుసలాడుకుంటున్నారు.
రెండవ దృశ్యం
ఒక ఇంటర్నేషనల్ మోడల్ ఎంపికకు పోటీలు జరుగుతున్నాయి. పోటీలో పాల్గొనడానికి వచ్చి అక్కడ కూర్చున్న నాజూకైన కనె్న పిల్లల మాటలు ఆ మోడలింగ్ కాంట్రాక్ట్ దక్కించుకోడానికి ఎంతకైనా తెగించాలన్న వారి సంసిద్ధతను తెలియజేస్తున్నాయి. జీవితంలో ఇతర విలువలకన్నా శరీర లావణ్యం ద్వారా డబ్బూ, పేరూ సంపాదించడమే ముఖ్యమన్న భావం వాళ్ల ముఖాలలో కనిపిస్తోంది.
ఇలాంటివే మరికొన్ని దృశ్యాలను టీవీ షోలలో చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఆ దృశ్యాలన్నీ టీవీలలోంచి మన ఇళ్ళలోకి దిగబడిపోతున్నాయి. ఇదంతా టీవీలలోని రియాలిటీ షోలు మన పిల్లలపై చూపుతున్న దుష్ప్రభావం పరిణామమే!
ఆశ్చర్యంగా ఉందా? నేడు టీవీ చానెళ్ళలో ‘ప్రైమ్‌టైమ్’ రియాలిటీ షోలలో ఏం చూస్తున్నాం? మాటల్లో, భావప్రదర్శనలో కొంచెం కూడా సహజత్వం లేని నాటకీయత, ఒకరినొకరు పరుష పదాలతో తిట్టుకోవడం, బెదిరించుకోవడం, వెనుకనుంచి చెవులు కొరుక్కోవడం, అర్థంలేని పోసుకోలు కబుర్లు, చెడు సావాసాలు. ఈ రియాలిటీ షోలలో కొన్ని సరదా కాలక్షేపంలా ఉంది చూస్తున్నవారిని కట్టిపడేస్తాయి. మనుషుల్లో అవాంఛనీయ ధోరణులను ప్రేరేపించే ఇలాంటి షోలు పిల్లలకి తగినవేనా? ఈ విషయం గురించి తల్లిదండ్రులు ఏమైనా ఆలోచిస్తున్నారా?
సందేశం ఉందా?
హోలీ పీక్ అమెరికాలోని న్యూఓర్లాండ్స్‌కి చెందిన మానసిక వైద్యురాలు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పబ్లికేషన్ ప్రచురించిన ఒక వ్యాసంలో ఆమె ఇలా అంటారు. ‘‘అసలు రియాలిటీ షోలు ఎలాంటి సందేశాలు, విలువలు ఇస్తున్నాయి? ఇవి చూసే పిల్లలపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అవి చూసే పిల్లల ఆలోచనలు ఎలా వక్రమార్గం పడతాయి? అన్న విషయాలపై మనం పిల్లల్లో సరైన అవగాహన కలిగించాలి. ఇందుకు మొదట తల్లిదండ్రుల్లో చాలా జాగరూకత ఉండాలి. ఎందుకంటే ఈ రియాలిటీ షోలన్నీ చాలా అందంగా, ఆకర్షణీయంగా, సులువుగా ప్రేక్షకులను తప్పుదారి పట్టించి మోసంచేస్తాయి. వాస్తవ ప్రపంచంలో కూడా ఇలానే ఉంటుంది అని భ్రమింపజేస్తాయి.’’
బయట ప్రపంచంలో జరిగే విషయాలకు, రియాలిటీ షోలలో చూపించే విషయాలకు మధ్య ఉండే వ్యత్యాసం గురించి పెద్దవాళ్ళలో ముఖ్యంగా తల్లిదండ్రులలో సరైన అవగాహన తప్పకుండా ఉంటుంది. కానీ పిల్లల్లో ఈ విషయంలో ఇది అర్థంచేసుకునేందుకు తగిన మానసిక పరిపక్వత ఉండదు. అందువల్ల తాము చూసేదే నిజమని పిల్లలు నమ్మే ప్రమాదం ఉంది.
కొన్ని రియాలిటీ షోల కార్యక్రమాలలో పాల్గొనేవారు ప్రమాదకర విన్యాసాలు చెయ్యడం గొప్పగా కామెంటరీ ఇస్తూ చూపిస్తాయి. సాధారణంగా పిల్లల్లో ఏ విషయమైనా సరే అనుకరణ ద్వారా నేర్చుకునే మనస్తత్వం ఉంటుంది. తాము చూసింది స్వయంగా చెయ్యాలని అనుకుంటారు కూడా. ఇందువల్ల వాళ్ళు అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందికూడా. జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ చైల్డ్ సైకాలజీ ప్రచురించిన ఒక అధ్యయన నివేదిక ప్రమాదకర విన్యాసాలను చూసే పిల్లలు మిగతా పిల్లలకంటే ఎక్కువగా ‘‘రిస్క్-టేకింగ్’’ ఆలోచనలని కలిగి ఉన్నారని పేర్కొంది.
కొన్ని రియాలిటీ షోలు ఎంపికచేసుకున్న కొందరు వ్యక్తుల దైనందిన జీవితాలలోని చెత్తంతా చూపడానికి ఉబలాటపడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను వీక్షించకుండా పిల్లలపై పెద్దలు ఒక స్పష్టమైన ఆంక్షలు విధించాలి. ఇలాంటి షోలు ప్రతి విషయాన్ని చాలా అతిగా, అసహజంగా చూపిస్తాయి. ఇక రియాలిటీ టాలెంట్ షోలు ఎలా ఉంటాయంటే, అవి చూసే తల్లిదండ్రులు నిజంగానే తమ పిల్లల పట్ల న్యూనతా భావాన్ని ఏర్పరచుకుంటారు.
రేటింగ్ ఒక్కటే ప్రధానం
అన్ని రియాలిటీ షోలు పైనచెప్పిన విధంగానే ఉంటున్నాయా అంటే కాదనే చెప్పాలి. పిల్లల్లో ఆరోగ్యకరమైన పోటీతత్త్వాన్ని పెంచే విధంగా, కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించే విధంగా కార్యక్రమాలతో ప్రసారమయ్యే రియాలటీషోలు కూడా ఉన్నాయి.
‘‘అయితే ఇప్పుడు టీవీ ఛానెళ్ళమధ్య అర్థంలేని పోటీ, రేటింగ్‌కోసం పరుగులాట ప్రధానమైపోయింది. ఇది దృష్టిలో పెట్టుకునే ప్రతి ఛానెల్ తమ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాయి. తాము ప్రసారంచేసే కార్యక్రమాలను చూసే ప్రేక్షకులు ముఖ్యంగా పిల్లలు ఎలాంటి దుష్ప్రభావాలకు లోనవుతారన్నది ఆ ఛానెల్స్‌వారికి పట్టదు. భారతదేశంలో ప్రసారమయ్యే ‘ప్రైమ్‌టైమ్’ షోలలో అత్యధికంగా 25-40 మధ్య వయస్కుల వారిని ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. తల్లిదండ్రులలో తమ కార్యక్రమాలపట్ల ఆసక్తికలిగిస్తే పిల్లలుకూడా వారితో కలిసి టీవీలకు అతుక్కుపోతారు అన్నదే ఛానెల్స్ యాజమాన్యాల ఆలోచన’’ అని ఇరవయ్యేళ్ళుగా టీవీ పరిశ్రమలో పనిచేస్తున్న ఒక సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రొఫెషనల్ అంటారు.
పిల్లలపై దుష్ప్రభావం
అరుంధతి స్వామి పిల్లలపట్ల ఎలాంటి శ్రద్ధవహించాలో తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ ఇచ్చే నిపుణురాలు. ఈమె పేరెంట్ సర్కిల్ సంస్థకి అధిపతి. ‘‘మానవులలోని అవాంఛనీయమైన అసహజ ధోరణులను పెద్దగా చేసి చూపడానికే రియాలిటీ షోలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. అవన్నీ వాస్తవాలు కావనీ, ముందుగా రచించుకున్న కథనాల ప్రకారం చిత్రీకరించినవేననీ, పెద్దలు చెప్పకపోతే అవే నిజమని భ్రమించి పిల్లలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది’’ అని ఆమె అంటారు.
రియాలిటీ షోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అరుంధతి ఇలా వివరిస్తారు.
1. రియాలిటీ షోలలో చూపే ప్రాణాంతక సాహసాలను అనుకరించడంవల్ల పిల్లలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
2. కొన్ని రియాలిటీ షోలలోని ‘‘నెగెటివ్ మెస్సేజ్’’లు పిల్లలను ఇట్టే ఆకర్షిస్తాయి. దీనివలన ఏ పని చేయడంలోనైనా స్వయం నిర్ణయం తీసుకోవడంలో వారి ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. టీవీలలో వచ్చే షోలన్నీ వాస్తవాలు కావనీ, కల్పితాలన్న అవగహన వారికి ఉండదుకదా.
4. భావాత్మక పరిపక్వత అనేది చాలా తక్కువమంది పిల్లల్లోనే ఉంటుంది. అలాంటి వారికి తమపై కొంతవరకూ నియంత్రణ ఉంటుంది కూడా. కానీ భావాత్మక పరిపక్వత లేని చాలామంది పిల్లలు రియాలిటీ షోలలోని నెగటివ్ అంశాలని అనుకరిస్తూ పది మంది దృష్టిలో పడేందుకు అసహజంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది కూడా.
5. ఇతరుల పట్ల అగౌరవం ప్రదర్శించడం, వారితో దురుసుగా మాట్లాడటం, వారితో తెలివిగా లేదా హింసాత్మకంగా ప్రవర్తించడమే సరైనదని పిల్లలు భావించే ప్రమాదం ఉంది.
6. పిల్లలు రియాలిటీ షోలపట్ల ఎంతగా ఆకర్షితులౌతారంటే వాస్తవ ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంది.
7. జీవితంలో నిజాయితీగా ఉండాలన్న ఆలోచననే వారు తిరస్కరిస్తారు. ఏ రకమైన పద్ధతుల్లోనైనా పైకి రావడమే సరైనదని పిల్లలు భావిస్తారు.
పాల్గొనే పిల్లల పరిస్థితి
పిల్లల్ని స్టార్లుగా చూపిస్తూ నేడు లెక్కలేనన్ని రియాలిటీ షోలు వస్తున్నాయి. వీటిలో సినిమా పాటలు, డాన్సులకు సంబంధించినవే ఎక్కువ. చాలామంది తల్లిదండ్రులు సరదా కాలక్షేపంగా, ఏమాత్రం నష్టం కలిగించనివిగా ఈ కార్యక్రమాలను భావిస్తుంటారు. పైకి చూడటానికి ఈ కార్యక్రమాలు పిల్లల్లోని నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలుగా కనిపిస్తాయి. కానీ ఆ దిశలో ప్రయత్నించి, విజయం సాధించే కృషిలో పిల్లలు ఎంతగా ఒత్తిడికి లోనవుతారో ఎవరికీ తెలియదు. గెలుపే ప్రధానమైన ఈ కార్యక్రమాలలో పాల్గొనే పిల్లల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. వారు నిరంతరం పరీక్షలకు, విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై దెబ్బతీస్తుంది.
సరైన అవగాహన, పరిపక్వత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల నైపుణ్యాన్ని సరైన దిశలో, ఆరోగ్యకరమైన రీతిలో వికసింపజేసే ప్రయత్నం చేస్తారు. గెలుపు మాత్రమే ప్రధానంగా సాగే అర్థంలేని పోటీలతో పిల్లల్ని ఒత్తిడికి బలిచేయాలని అనుకోరు. అలాచేస్తే పిల్లలు తమ నైపుణ్యాన్ని తమ స్వార్థానికే పరిమితం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా పిల్లలు తమ నైపుణ్యాన్ని సమాజానికి ప్రయోజనం కలిగించే దిశలో వికసింపజేసుకునే విధంగా పెద్దలు సహకరించాలి. పిల్లల్లో పోటీతత్త్వం తప్పక ఉండాలి. అయితే అది సగుణాత్మకంగా ఉండాలి. అందువల్ల పిల్లల ఆలోచనలు ఆరోగ్యకరంగా వికసిస్తాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ, అవసరమైతే వాటితో సర్దుబాటు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు తమనితాము మెరుగుపరచుకునే ధోరణి పిల్లల్లో అలవడుతుంది. అలా కానప్పుడు పోటీలవల్ల పిల్లల్లో అవాంఛనీయ ధోరణులు తలెత్తుతాయి.
తల్లిదండ్రులు ఏం చెయ్యాలి?
1. రియాలిటీ షోలకు ప్రాధాన్యతనివ్వడం తగ్గించాలి.
2. పిల్లల వయస్సు, అవగాహనా సామర్థ్యాన్నిబట్టి పిల్లలకి కుటుంబ విలువలను గురించి, రియాలిటీ షోలు కుటుంబ విలువలకు ఏవిధంగా సరిపడవో వివరించి చెప్పాలి.
3. రియాలిటీ షోల దుష్ప్రభావం ఎలా ఉంటుందో, వాస్తవ ప్రపంచానికి ఆ కార్యక్రమాలు ఎంత విరుద్ధంగా ఉంటాయో పిల్లలకి వివరించి చెప్పాలి.
4. మనం పిల్లలకి ఇచ్చే వివరణ వారికి అవగాహన కలిగించే విధంగా సాగాలి కానీ, భయాన్ని కలిగించే విధంగా ఉండకూడదు.

- డాక్టర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690