AADIVAVRAM - Others

ఇదో ‘టైపు’ కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైప్ మిషీన్‌తో ఎవరైనా ఏం చేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న. టైపు మిషీన్‌తో ఎవరైనా టైపే కదా చేస్తారు అని విసుక్కుంటున్నారా!? టైప్ రైటర్ మెషీన్‌తో పేపరుపై అక్షరాలు టైపు చేయడం అందరికీ తెలిసిన విషయమే.. కానీ టైప్ మిషీన్‌తో ఎవరైనా చిత్రాలను టైపు చేయగలరా? ఇది చాలా అసాధ్యమైన విషయం. కానీ ముంబయికి చెందిన చంద్రకాంత్ భిడే మాత్రం చిత్రాలను చకచకా టైపు చేస్తారు. టైప్ రైటర్ చిత్రకారుడిగా చంద్రకాంత్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
చంద్రకాంత్‌కి చిన్నప్పటి నుంచీ చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ చక్కటి బొమ్మలు వేసేవాడు. పదోతరగతి తర్వాత చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుందామని అనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది సాధ్యం కాలేదు. పదోతరగతి వరకు ఇంట్లోనే బొమ్మలు ప్రాక్టీసు చేసి, మంచి రంగులు అద్దేవాడు. పదోతరగతి తరువాత ఆర్ట్ స్కూల్లో చేరాలనుకున్నా అతని తల్లిదండ్రులు చేర్పించలేదట. దానికి బదులుగా టైపింగ్, స్టెనోగ్రఫీ నేర్చుకుంటే ఉద్యోగం త్వరగా వస్తుందని తండ్రి చెప్పడంతో అవి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తండ్రి చెప్పినట్టుగానే టైపింగ్ నేర్చుకోవడంతో యూనియన్ బ్యాంకులో కొలువు దొరికింది అతనికి. ఆ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆయనకు చిత్రకళపై ఆసక్తి తగ్గలేదు. తనలోని కళా నైపుణ్యాన్ని మరువలేక అందులోనే ఓ కొత్త పద్ధతిని కనుక్కున్నాడు. దానిపై మరింత కృషిచేసి అనుకున్నది సాధించాడు చంద్రకాంత్. ఒకరోజు చంద్రకాంత్ విధుల్లో ఉన్నప్పుడు బాస్ ఆదేశాల మేరకు ఆఫీసులో ఫోన్ నెంబర్ల జాబితా తయారుచేయాల్సి వచ్చిందట. ఆ జాబితాను చంద్రకాంత్ టెలిఫోన్ ఆకారంలో టైపు చేసి ఇచ్చాడుట. దాంతో ఆఫీసులోని సహచర ఉద్యోగులందరూ ఆశ్చర్యపోయారుట. టైప్ రైటర్‌తో కూడా చిత్రకళ చేయొచ్చని, పేరు తెచ్చుకోవచ్చని గ్రహించి అప్పటినుంచి మరింత శ్రద్ధతో టైప్ రైటర్‌పై చిత్రకళను ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ప్రముఖ కళాకారుల, క్రీడాకారుల చిత్రాలను టైప్ చేయడం ప్రారంభించాడు చంద్రకాంత్. అమితాబ్ బచ్చన్, సచిన్ తెందూల్కర్, డా. బీ ఆర్. అంబేడ్కర్, లతామంగేష్కర్, సునీల్ గవాస్కర్.. ఇలా చాలామంది సెలబ్రెటీల చిత్రాలను చక్కగా టైప్ చేశాడు చంద్రకాంత్. సచిన్ తెందూల్కర్ చిత్రం టైపు చేసేటప్పుడు చంద్రకాంత్ చాలా ఇబ్బంది పడ్డాడుట. కారణం సచిన్‌ది ఉంగరాల జుట్టు. ఆ జుట్టును ఎలా టైపు చేయాలో ఆయనకు తెలియలేదుట. తర్వాత ఈమెయిల్‌కి వాడే గుర్తుతో (అట్) ప్రయత్నిస్తే సఫలమయ్యాడుట. అలా మొదలైన చిత్రకళ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంటే యాభై ఒక్క సంవత్సరాల నుంచి టైప్ రైటర్‌తో చిత్రాలను వేస్తూనే ఉన్నాడు చంద్రకాంత్. ఒకరోజు చంద్రకాంత్ తన చిత్రాలను ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్‌గారికి చూపిస్తే ఆయన చాలా ఆశ్చర్యపోయారట.. పెన్ను, బ్రష్‌తో వేసినా ఆ చిత్రాలు అంత అద్భుతంగా రావు అని పొగిడారట.. భవిష్యత్తులో నువ్వు మంచి చిత్రకారుడివి అవుతావు అని ఆశీర్వదించారట.. ఆ క్షణం తనకు మాటలు రాలేదని చెబుతాడు చంద్రకాంత్. అలాగే ప్రముఖ కార్టూనిస్టు డే మిరండా సలహా మేరకు తాను వేసిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టడం ప్రారంభించాడు చంద్రకాంత్. త్వరలో చంద్రకాంత్ మన ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాణి ఎలిజిబెత్ చిత్రాలను కూడా టైప్ చేయాలనుకుంటున్నాడట.. ఆల్ ద బెస్ట్ చంద్రకాంత్ గారూ.. మీ ‘టైపు’ కళ మాత్రం అదిరింది!!