Others

వరవరరావు ఎరుగని వాస్తవం ఇది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విప్లవాల యుగమిది.. విప్లవిస్తే జయం మనదే..’ అని గొంతెత్తి ఆలపించిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత గృహనిర్బంధంలో ఉంచడం ఇపుడు చర్చనీయాంశమైంది. భీమా కోరెగాఁవ్ అల్లర్ల సందర్భంగా నమోదైన కేసులో తీగ లాగితే డొంకంతా కదిలింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర బహిర్గతం కావడంతో గత జూన్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వరవరరావును అప్పుడే అరెస్టు చేస్తారన్న మాట వినిపించినా, పోలీసులు మరింత ‘హోం వర్క్’చేసి అయిదు రోజుల క్రితం అరెస్టుచేశారు. వరవరరావును హైదరాబాద్‌లో అరెస్టు చేయడంతో పాటు ఢిల్లీకి చెందిన గౌతమ్ నవలఖా, ఫరీదాబాద్‌కు చెందిన సుధా భరద్వాజ్, ముంబయికి చెందిన అరుణ్ ఫెరేరా, వెర్నాన్ గొంజాల్వెస్‌లను పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు చేశారు. జూన్‌లో ఢిల్లీకి చెందిన రోనా విల్సన్, రోనా జాకబ్, మహారాష్టక్రు చెందిన సుధీర్ దావలె, షోమా సేన్, మహేశ్ రావత్, న్యాయవాది సురేంద్ర గాడ్లిగ్‌లను పూణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్యచేసిన రీతిలో మోదీ హత్యకు పథక రచన చేశారన్నది వీరందరిపై అభియోగం. మోదీతోపాటు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను అదే తరహాలో అంతమొందించాలన్నది అసలు కుట్ర అని పోలీసులు కనుగొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పూణె పోలీసులు కేసు నమోదు చేసి, ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించాక ఇప్పటివరకు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్, సూర్‌గఢీ, గడ్చిరోలి ప్రాంతాల్లో వరవరరావు, సురేంద్రల నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలకు జాతీయస్థాయిలో మంచి ప్రచారం లభించింది. ఈ తరహాలోనే భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, నిధుల సమీకరణను వారే చేస్తారని లభించిన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే హైదరాబాద్‌లో వరవరరావును అరెస్టుచేశారు. నిందితులందరిపైన ‘చట్టవ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం’ (యూపీపీఎ) కింద కేసులు పెట్టారు. ఈ చట్టం పోలీసులకు అపరిమిత అధికారాలను కట్టబెడుతోంది.
దేశవ్యాప్తంగా పౌర హక్కుల సంఘాల ముసుగులో మావోయిస్టులకు సహకరిస్తున్న వారిని అరెస్టు చేయడంతో కలకలం రేగింది. వారి ఇళ్ళలో సోదాలుచేసి కొన్ని వస్తువులను, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. హార్డ్‌డిస్క్, సెల్‌ఫోన్లు వరవరరావు ఇంట్లోనుంచి స్వాధీనం చేసుకొన్నారు. మావోయిస్టుల సాహిత్యం, కొన్ని లేఖలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరవరరావు కుమార్తెల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు జరిపారు.
అరెస్టుకు ముందురోజు ‘మావోయిస్టుల కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వరవరరావు ప్రసంగిస్తూ, రైతుల, పోడు భూముల సాగుదారుల హక్కుల కోసం మావోయిస్టుల మద్దతు ఉంటుందని వారి తరఫున పక్షాన పేర్కొన్నారు. పోడు, కౌలుదారుల పోరాటాలకు మావోయిస్టు పార్టీ పూర్తిగా సహకరిస్తుందన్నారు. సాగు హక్కుల కోసం రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు వీరికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఇలా వరవరరావు మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర పట్టణాల్లోనేగాక దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కదిలిస్తూ మావోలకు వెన్నుదన్నుగా నిలిచారు. మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. విరసం, అమరవీరుల బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం పనుల్లోనేగాక ఇతర పనుల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటున్న వైనం పోలీసులకు లభ్యమైన పత్రంలో స్పష్టంగా ఉంది. ఆర్థిక వనరుల నుంచి మానవ వనరుల వరకు వరవరరావు ‘ముద్ర’ మావోయిస్టు పార్టీలో ఉంటుందన్నది జగమెరిగిన సత్యం.
కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తిల కాలంలోనూ పీపుల్స్‌వార్ పార్టీకి వెనె్నముకగా వరవరరావు నిలిచారని చాలామందికి తెలుసు. అదే సంప్రదాయాన్ని ఇంకా ఆయన కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా ఆయన ఏ పనులు చేసినా విప్లవకవి, వక్త పేరుతో కప్పేశారు. రహస్య పార్టీకి రహస్యంగా, బహిరంగంగా తోడ్పాటునందిస్తూ ‘రాజ్యం’పై తిరుగుబాటును ప్రోత్సహించారు. దీనే్న పాలకులు ‘కుట్ర’ అంటున్నారు. తాజాగా మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా లాంటి జాతీయ నాయకులను హతమార్చేందుకు చేసిన కుట్ర ముందుగానే బయల్పడటంతో 12 మందిని అరెస్టు చేశారు. భవిష్యత్‌లో మరెన్ని అరెస్టులు జరుగుతాయో తెలియదు.
విచిత్రమేమిటంటే- తామేమీ తిరుగుబాటును ప్రోత్సహించడం లేదని ఎలాంటి కుట్రలకు పాల్పడటం లేదని, తమ హక్కులకు ‘రాజ్యం’ భంగం కలిగిస్తోందని, వాక్ స్వాతంత్య్రం, సభా స్వాతంత్య్రం లేకుండా తమ హక్కులను కాలరాస్తోందని, అమాయకులను అరెస్టుచేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ప్రభుత్వాలు ఫాసిస్టు పద్ధతులను అనుసరిస్తున్నాయని అటువైపు నుంచి నరుక్కురావడంలో ‘హక్కుల నేతలు’ నైపుణ్యం సాధించారు. ఇందులో వరవరరావుది అందెవేసిన చేయి. వరవరరావును దగ్గరగా పరిశీలించినవారు- ‘ఆయన ఇంత తెగింపుతో ఎలా మాట్లాడుతున్నార’నే ప్రశ్న చాలా సందర్భాల్లో వేసుకున్నారు. వేరేవారు ఆ విధంగా మాట్లాడితే, ప్రవర్తిస్తే ఎప్పుడో జైల్లో తోసేసేవారని వ్యాఖ్యానించిన సందర్భాలు అనేకం. అంటే తానేమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, తానేమి చేసినా నడుస్తుందన్న ఓ ధీమాతో వరవరరావు దశాబ్దాల పాటు ‘రాజ్యం’పై వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు. తన ప్రసంగాలతో ఎందరినో రెచ్చగొట్టారు. రచనా వ్యాసంగం ద్వారా కూడా ఎందరినో ఆకర్షించారు. ఉద్యమంలోకి చాలామందిని తరలించారు. అలా తుపాకులు పట్టి తనువు చాలించిన వారు కొందరున్నారు.
ఇది ‘నేరం’ కాదన్నది వరవరరావు వాదన. ఆ ‘చర్య’లను అడ్డుకుంటే హక్కులకు భంగం కల్పిస్తున్నారని ఎదురుదాడి చేస్తారు. ఇలా రెండువైపులా పదునైన ‘కత్తి’లా ఆయన దశాబ్దాల తరబడి కలకలం సృష్టిస్తూ ఉన్నారు. తుపాకీ పట్టి అడవుల్లో పోరాడుతున్న మావోయిస్టులకన్నా మెట్రో నగరాల్లో, నగరాల్లో-పట్టణాల్లో ఉంటున్న ‘అర్బన్ నక్సల్స్’ చాలా ప్రమాదకరమన్న నిర్ధారణకు చాలామంది వచ్చారు. అది నూటికి నూరుపాళ్లు నిజమని వరవరరావు లాంటివాళ్లు, తాజా కేసులో అరెస్టు అయిన మిగతావారు రుజువు చేశారు.
గతంలో చైనాలో గ్రామాలను విముక్తి చేసి, పట్టణాలను చుట్టుముట్టి విముక్తిచేసి విప్లవాన్ని విజయవంతం చేయాలన్న ప్రణాళికతో అక్కడి కమ్యూనిస్టు పార్టీ కదిలింది, విజయవంతమైంది. మన దేశంలో అదే పంథా అనుసరించడానికి నక్సల్‌బరీ (పశ్చిమ బెంగాల్)లో 50 ఏళ్ళ క్రితం చిన్న నిప్పురవ్వ బయలుదేరింది. ఇంత సుదీర్ఘ సమయం గడిచినా సరైన ఫలితాలు లభించక పోవడంతో ‘అర్బన్ నక్సల్స్’ కొత్తపంథాను ప్రతిపాదించే పనిలో పడ్డారు. అందులో భాగమే రాజీవ్ గాంధీ హత్య తరహాలో మోదీ హత్యకు కుట్ర పన్నడంగా కనిపిస్తోంది.
జనారణ్యంలోని ‘అర్బన్ నక్సల్స్’ను అదుపుచేయడం కష్టమని ఆచరణలో రుజువైంది. రహస్య పార్టీ గనుక అన్నీ రహస్యంగానే జరుగుతాయి. ఒక చిరునామా అంటూ ఉండదు కాబట్టి ఎవరు ఎక్కడ సమావేశమై ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. ఆ పార్టీలోని వివిధ స్థాయిల్లో పనిచేసే వారికే జరుగుతున్న నిర్ణయాలు సంపూర్ణంగా తెలియవు. కాబట్టి నిశ్శబ్దంగా విప్లవం వైపు వరవరరావులాంటి ‘అర్బన్ నక్సల్స్’ ప్రజల్ని, యువతను, విద్యార్థులను, వృత్తి నిపుణులను కదిలిస్తున్నారు.
ముఖ్యంగా మీడియాలో వీరి అనుచరులు, మద్దతుదారులు లెక్కకు మించి కనిపిస్తారు. చీమ చిటుక్కుమన్నా, మరుక్షణం మీడియాలో ఆ విషయం ప్రత్యక్షమవుతుంది. ఆ ‘నెట్‌వర్క్’ను బలంగా కొనసాగిస్తున్నారు. తాజాగా వరవరరావు అరెస్టు ప్రక్రియ పూర్తిగాకముందే విడుదల చేయాలన్న డిమాండ్ మీడియా, పత్రికా కార్యాలయాల్లోకి చేరింది. అరెస్టు వార్తకు ఎంత ప్రాధాన్యత లభించిందో ఖండనలకు, విడుదల చేయాలన్న డిమాండ్‌కు అంతే ప్రాధాన్యత లభించిందంటే వారి ‘నెట్‌వర్క్’ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.
మన దేశంలో చైనా పంథా ఎలాగూ విజయవంతం కాదు కాబట్టి మరో మార్గంలో విప్లవాన్ని విజయవంతం చేయాలనుకుంటున్న ‘అర్బన్ నక్సల్స్’కల సాకారం అయ్యే అవకాశాలు అసలే లేవు. ఎందుకంటే ఇది విప్లవాల యుగం కాదు. విప్లవిస్తే విజయం మాట దేవుడెరుగు పరాభవం ఎదురవుతుంది. అపార నష్టం మూటకట్టుకుంటారు. అందమైన, ఆకర్షణీయ పదబంధాలతో నినాదాలు గుప్పించినంత మాత్రాన విప్లవం విజయవంతమయ్యే రోజులు పోయాయి. కృత్రిమ మేధ- డిజిటల్ టెక్నాలజీ, ‘రోబో’ల సహకారంతోఉత్పత్తి ద్విగుణీకృతమవుతోంది. ఈ సందర్భంలో రక్తపాత విప్లవాలకు స్థానమెక్కడ?

-వుప్పల నరసింహం 99857 81799