Others

బ్రహ్మ విద్యాభాస్కరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతిని, నాగరికతను ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మవిద్యా భాస్కరుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప పండితుడు, ఘనుడైన విద్యావేత్త, ప్రఖ్యాత రచయిత, ప్రత్యేక నైపుణ్యం సాధించిన వేదాంతి, విజ్ఞుడైన రాజ్యకార్యదురంధరుడు, విజేతగా నిలిచిన దౌత్యవేత్త, సమర్ధుడైన పార్లమెంటేరియన్. ఆది శంకరాచార్యుల వారి తరువాత సంస్కృతంలోని ‘ప్రస్థానత్రయాని’కి (భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు) ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానం రాసిన జ్ఞాన భాస్కరుడు ఆయన.
రాధాకృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5న సీతమ్మ, వీరా సామయ్య దంపతుల రెండవ కుమారుడిగా జన్మించారు. వీరా సామయ్య గారి పూర్వీకులు చిత్తూరు జిల్లా సర్వేపల్లిలో నివసించేవారు. కాలగమనంలో వారు తిరుత్తణి పుణ్యక్షేత్రంలో స్థిరపడ్డారు. రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలో అభ్యసించి, సెకండరీ విద్య తిరుపతి లూథరన్ మిషన్ హైస్కూలులో పూర్తిచేశారు. వెల్లూరులోని వూర్హే కాలేజిలో ఎఫ్.ఏ, మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బి.ఏ.(ఆనర్స్) విద్యనభ్యసించి 1906లో డిగ్రీ సాధించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో తన అభిమాన విషయమైన ఫిలాసఫీలో ఎం.ఏ పూర్తి చేశారు. ఈ కాలంలో ఆయన The ethics of the vedanta and its Metaphysical presuppositions అనే సిద్ధాంత వ్యాసం వ్రాసి పరీక్షాధికారులకు సమర్పించగా, వారు ఆమోదించి 1909లో ఎం.ఏ. డిగ్రీ ప్రసాదించారు.
మద్రాసు ప్రభుత్వ విద్యాశాఖలో సబ్ అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్‌గా 1910లో 60 రూపాయల జీతంపై ఉద్యోగ జీవితం ఆరంభించారు. అనంతరం ఆయనకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఉద్యోగమిచ్చారు. కొన్నాళ్లకు సైదాపేట ట్రెయినింగ్ కళాశాలలో డిప్లమో చేసేందుకు చేరారు. అక్కడ శిక్షణ పొందుతూనే, సహచర విద్యార్థులకు తర్కశాస్త్రం బోధించారు. శిక్షణ ముగిశాక ప్రెసిడెన్సీ కళాశాలలో 1911లో అడిషినల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అక్కడే పదోన్నతి పొందారు. 1916లో మూడు నెలలు అనంతపురం కళాశాలలో పనిచేశాక, 1917లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు ప్రొఫెసర్ హోదాలో బదిలీపై వెళ్లి 1918 వరకూ సేవలందించారు. 1918లో మైసూరు యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్లి, 1921 వరకు పనిచేసి విద్యార్థుల, అధికారుల ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నారు. కలకత్తా యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్లే సమయంలో- తన గృహం నుండి రైల్వేస్టేషన్‌కు రాధాకృష్ణన్ అధిరోహించిన గుఱ్ఱపుబగ్గీని విద్యార్థులే లాగి, ఆయనను రైలు ఎక్కించారు. ఒక అధ్యాపకుడికి లభించిన గౌరవం చరిత్రలో అపూర్వ సంఘటనగా మిగిలింది.
1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో వైస్-చాన్సలర్ అశుతోష్ ముఖర్జీ కోరిక మేరకు రాధాకృష్ణన్ ‘జార్జి ఫోర్’ మెంటల్ అండ్ మోరల్ సైనె్సస్ శాఖలో ఆచార్యుడిగా చేరారు. ఇక్కడే ఆయన తాను రచించిన బృహత్ వేదాంత గ్రంథం ‘ఇండియన్ ఫిలాసఫీ’ని రెండు సంపుటాలుగా 1,480 పుటలతో (1923,1927) ముద్రించారు. ఈ గ్రంథం ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. 1931 నుండి 1936 వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయాని (విశాఖ)కి వైస్ చాన్సలర్‌గా సేవలందించారు. వీసీగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రాధాకృష్ణన్ ‘స్పాల్డింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ది ఈస్ట్రన్ రెలిజియన్స్ అండ్ ఎథిక్స్’ అన్న పేరున ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1939లో బెనారెస్ హిందూ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా వెళ్లారు. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్పాల్డింగ్ ప్రొఫెసర్‌గాను, బెనారస్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా ఆయన ఏకకాలంలో బాధ్యతలు నిర్వహించడం చరిత్రలో అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటనగా మిగిలింది.
1946లో ‘భారత రాజ్యాంగ నిర్మాణ సభ’కు సభ్యుడిగా, 1948లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 1949లో రష్యాలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టి, ఆ పదవిలో 1952 వరకూ పనిచేసి రష్యా నేత స్టాలిన్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. రాధాకృష్ణన్ మన దేశం తరఫున యునెస్కో సమావేశాలకు హాజరైన ప్రతినిధి వర్గానికి 1946-52 మధ్య నాయకుడిగా ఉంటూ, 1952-54 మధ్య యునెస్కో సాధారణ సమావేశాలకు అధ్యక్షత వహించారు. 1952 నుంచి 1962 వరకు భారత దేశ ఉప రాష్టప్రతిగా రెండు సార్లు పనిచేశారు. ఇదే కాలంలో 1953 నుండి 1962 వరకు ఢిల్లీ యూనివర్సిటీ చాన్సలర్‌గా వ్యవహరించారు. 1962లో బ్రిటీషు అకాడెమీ గౌరవ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1962 నుండి 1967 వరకు దేశంలోనే అత్యున్నతమైన రాష్టప్రతి పదవిలో రాధాకృష్ణన్ విలసిల్లారు. ఈ కాలంలోనే ఇండో- చైనా యుద్ధం, ఇండియా-పాకిస్తాన్ సమరం, నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్ర్తీ మరణం వంటి ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. 1962లో రాధాకృష్ణన్ రాష్టప్రతి అయినప్పుడు ప్లేటో కలలుకన్న PHILOSOPER KING అనే ఊహ నెరవేరినట్లు విద్యావేత్తలు, వేదాంతులు, తత్త్వశాస్తవ్రేత్తలు, ప్రజలు అమితానందం పొందారు. 1967లో రాష్టప్రతి హోదాను విరమించిన పిమ్మట మద్రాసు వెళ్లి అక్కడ తన స్వగృహం ‘గిరిజ’లో శేషజీవితం గడుపుతూ 1975 ఏప్రిల్ 17న పరమపదించారు.
1954లో అత్యున్నత ప్రభుత్వ పురస్కారం ‘్భరతరత్న’ను అప్పటి దేశాధ్యక్షుడైన బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా రాధాకృష్ణన్ అందుకున్నారు. 1964 డిసెంబరులో క్రైస్తవ ప్రపంచ మత ప్రవక్త పోప్ పాల్ ని వాటికన్ సిటీ నుండి బొంబాయి వచ్చి అక్కడ అత్యున్నత క్రైస్తవ అవార్డు KNIGHT OF THE GOLDEN ARMY OF ANGELS రాధాకృష్ణన్‌కు అందజేశారు. మరణించడానికి కొన్ని నెలల ముందు రాధాకృష్ణన్‌కు 95,000 పౌండ్ల టెంపుల్‌టన్ అవార్డును ప్రదానం చేశారు. దానిని ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి ఇచ్చివేశారు. రాధాకృష్ణన్ కోరిక మేరకు ఆయన జన్మదినాన్ని మనమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
రాధాకృష్ణన్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయం సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల వారు 110 డాక్టరేట్ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. ఆయన రాసిన గ్రంథాలు చాలావరకు లండన్‌లోని అల్లెన్ అండ్ అన్‌విన్ కంపెనీ ముద్రించింది. వారి రచనలలో ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ది ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ రెలిజియన్’, ‘ఫ్రీడమ్ అండ్ కల్చర్’, ‘మహాత్మా గాంధీ’, ‘గ్రేట్ ఇండియన్స్’, ‘ది ధమ్మపథ’ ‘గౌతమ్ ది బుద్ధ’ ఎంతో ప్రఖ్యాతి పొందాయి. భారతదేశ సంస్కృతిని, నాగరికతను ప్రపంచానికి చాటిచెప్పిన ఆయన ఈనాడు భౌతికంగా మనముందు లేకపోయినా, ఆయన వెలిగించిన విజ్ఞాన చైతన్య జ్యోతి మన హృదయాలలో నిత్యం వెలుగొందుతూనే ఉంటుంది.
*
(నేడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)
*
చిత్రం..పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

-డా. రాపాక ఏకాంబరాచార్యులు 94404 94752