AADIVAVRAM - Others

పద్య సాహిత్యంలో గణపతి స్తుతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణవ స్వరూపుడు - ప్రమద గణాధిపతి - పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన విఘ్న నాయకుడు వేదాల్లో - ఉపనిషత్తుల్లో.. అష్టాదశ పురాణాల్లో కీర్తింపబడినాడు. అలాగే తెలుగు సాహితీ నందనవనంలో, ప్రబంధాలలో - శతక సాహిత్యంలో భాగవత భారత రామాయణాలలో తొలి వేలుపుగా ప్రస్తుతింపబడినవాడు. భావ భాషాత్మకమైన శబ్ద వాచ్యుడై పద్య రచనలలో ప్రాచీనులచే గాక - ఆధునిక కవులచే నుతింపబడి వారి కవిత్వానికి విఘ్నాలు - ఎలాంటి ఆటంకాలు కలుగకుండా సాహిత్యంలో పద్యాలలో స్తుతింపబడి, నిండి నిబిడీకృతమైనాడు గజముఖుడై పద్య సుమాలచే ఆరాధింపబడినాడు.
గాయత్రీ మంత్రంలో - అంతర్భాగమైన ఒక పద్యం ఇలా ఉంది.
ఉ.తొండము నేక దంతమును - తోరపు బొజ్జయు, వామ హస్తమున్
మెండుగ - మ్రోయు గజ్జెలును - మెల్లని చూపుల - మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున - కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి ‘పార్వతీ తనయ’ ఓయి ‘గణాధిప’ నీకు మ్రొక్కెదన్
అని వర్ణించాడో కవి.
భాగవత పురాణంలో - సహజ కవి బమ్మెర పోతనామాత్యుని అద్భుత వర్ణన గావించిన అంత్యప్రాసతో గూడిన ఒక పద్యం
ఉ.ఆదరమొప్ప మ్రొక్కిడుదు - నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి - దోష బేధికి - ప్రసన్న వినోదికి - విఘ్నవల్లికా
చ్ఛేదికి - మంజువాదికి - నశేష జగజ్జన - నందవేదికిన్
మోదక ఖాదికిన్ - సమద మూషకసాదికి - సుప్రసాదికిన్
ననె్నచోడుని గ్రంథం కుమార సంభవంలో గణపతి ప్రార్థన
చం.తనునసితాంబు దంబుసిత - దంతయుగంబచిరాంశులాత్మ గ
ర్జన - మురుగర్జనంబుగ - రసద్రుచి - శక్రశరాసనంబునై
చన - మదవారివృష్టి - హితసస్యసమృద్ధిగ - నభ్రవేళ నా
జన ‘గణనాథు’ గొల్తు - ననిశంబు - నభీష్ఠ ఫలప్రదాతకున్
అంటూ మనోజ్ఞంగా వర్ణించాడు మహాకవి.
అభీష్ట సిద్ధి కొరకు అనంతామాత్య కవి తన ప్రబంధం భోజరాజీయంలోని వర్ణన ఇలా సాగింది.
ఉ.విఘ్నము లెల్ల బాపి - పృథివిన్ - భవనీరధి పేరి మిగుల్చి, సం
దఘ్నము చేసి నిల్తు - రుచిరస్థితి నెవ్వని భృత్యులట్టి- దుః
ఖఘు్నడు - షణ్ముఖ ప్రథమ గర్భుడు - భద్రగజాస్యుడైన - యా
విఘ్నవిభుండు - మత్ కృతికి - వేడుకతోడ - సహాయుడయ్యెడున్
ఉ.అంకము చేరి - శైలతనయాస్తన - దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్ఠ తొండమున - నవ్వలిచన్ గబళింపబోయి యా
వంక కుచంబు గానక హివల్లభుహారము గాంచి వే మృణా
ళాంకుర శంకనంటిడు - గజాస్యుని గొల్తు - నభీష్ట సిద్ధికిన్
అని నుతించారు ఆ హేరంబునీ, గణపతినీ.
జక్కన కవి తన విక్రమార్క చరితంలోని గణనాయకుని వర్ణన.
చం.కనకనగంబు బొమ్మరముగా - భుజగేంద్రుడు జాలెగా నమ
ర్చిన గిరిపుత్రికాంచి - యివి రెండును - దేవధనంబులన్న -న
జ్జనని హితోపదేశమున సన్మతివాని బునః ప్రతిష్ఠ చే
సిన గణనాయకుండు కృపసేయుత సిద్ధన మంత్రి కోరికల్
అని నుతించాడు. వేడినాడు.
అలాగే శ్రీనాథ కవి ప్రణీతమైన హరవిలాస కావ్యంలోని వర్ణన ఒక సీస పద్యం
సీ.కలిత శుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజల ధరములు
వప్రక్రియా కేళి వశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్న మేఖలములు
పక్వజంబూఫల ప్రకట సంభావనా
చుంబిత భూభృత్ కదంబకములు
వికట కండూలగండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు
తే.గీ.శాంభవీ శంభులోచనోత్సవ కరములు
వాసవాద్య మృతాశన వందితములు
‘విఘ్నరాజ’ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి - గావించుగాత
అని రచించారు.
మనోజ్ఞ కవి రామరాజ భూషణుడు తన కావ్యం వసుచరిత్రలో గజముఖుని ప్రస్తుతించిన తీరు ప్రశంసనీయము.
శా.దంతాఘట్టిత రాజతాచల - చలద్గౌరీ స్వయంగ్రాహమున్
కంతుద్వేషికి గూర్చి - శైలజకు - దద్గంగాఝ రాచాంతి న
త్యంతామోదము మున్నుగానిడి - కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతం బుల్వెలయింపంజాలు నిభ రాడ్వక్త్రుం బ్రశంసించెదన్
ప్రాచీన నవీన కవులేగాక నేటి మేటి కవిపుంగవులెందరో గణపతిని స్తోత్రం చేసిన తీరు అద్భుతం. అమోఘం. మచ్చుకు కొన్ని. ఆధునిక కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ గారు వినాయకుని స్తుతించమని విద్యార్థులను మేల్కొలిపిన తీరు ఇలా ఉంది సీస పద్యంలో.
సీ.ఎలుక గుఱ్ఱము మీద - నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు,
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్ద కొడుకు
నల్లమామాయంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుర్ర
వడకు గుబ్బలి రాచవారి బిడ్డ - భవాని
నూరేండ్లు నోచిన - నోముపంట
తే.అమరులందగ్రతాంబూలమందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలి వచ్చె
ఆంధ్ర విద్యార్థి లెమ్ము - జోహారులిడగ - అని వర్ణించారు అభినవ పోతన బిరుదాంకితులు కరుణశ్రీ. వీరే మరొక పద్యంలో గణపతిని బోళా గణపతిగా వినాయకుని ఆహార నైవేద్యాదుల సరళిని తెల్పినారు. గుంజిళ్లు తనకు ఎంతో ఇష్టమని గణపతి పొంగిపోయే రీతి అద్భుతం.
సీ.లడ్డూ జిలేబీ హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్లకే చెయ్యి చాచు
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలు పడును
ముడుపుమూటల పెట్టుబడి పట్టుదల లేదు
పొట్టి గుంజిళ్లకే పొంగిపోవు
కల్కితురారుూలకై తగాదా లేదు
గరిక పూజకె తలకాయనొగ్గు
గీ.పంచకల్యాణికై - యల్కపాన్పు లేదు
ఎలుకతత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టులేదు
పచ్చి వడపప్పె తిను - వట్టి పిచ్చి తండ్రి’ అని జాలిగా వర్ణించారు.
గణపతికి భోగభాగ్యాలక్కరలేదనీ తెలిపారు. ఈ విధంగా భారతీయ ఆంధ్ర సాహితీ సీమలో పద్య రచనలో విఘ్న నాయకుడైన విఘ్నాధిపతిని సకల జగతీ ఆరాధించి అర్చించి తరించాలనీ మనసారా ఆకాంక్ష.
ఓం శ్రీ గణాధిపతయే నమః

-పి.వి.సీతారామమూర్తి 9490386015