Others

గణపతి అవతారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగత్తుకు విపత్తు వాటిల్లినప్పుడు, ధర్మగ్లాని సంభవించినప్పుడు, దుష్టజన శిక్షణకు, సాధుజన రక్షణకు యుగయుగాల్లో అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నాడు. ఈ విషయం సర్వులకు విదితమే!
అయితే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రయోజనాలను కాంక్షించి శివుడు ఆదిగా ఎందరో పరబ్రహ్మ స్వరూపులు అవతారాలు దాల్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని పురాణాలు వచిస్తున్నాయి. అలా ఎన్నో అవతారాలు దాల్చిన గణపతి ప్రతి యుగంలోను ధర్మసంస్థాపన చేశాడు. ఆయా అవతారాలు దాల్చడానికి గల కథనాలు పురాణాల్లో పుష్కలంగా లభిస్తాయి.
సకల సృష్టి స్థితి లయకర్తయైన పరబ్రహ్మ స్వరూపుడు గణపతి. కాని, కేవలం పార్వతీ పరమేశ్వరుల తొలి పంటయని, గణపతిగా ప్రసిద్ధి పొందాడని అందరూ భావన చేస్తారు.
వినాయకునికి ఎన్నో అవతారాలున్నాయి. అనాదియైన పరబ్రహ్మ స్వరూపమే గణపతి. ఈ జగత్తంతా అనేక సమూహాలతో (గణాలతో) నిండి ఉంది. ఆ గణములన్నిటికీ అధిపతియైనవాడు గణపతి. గణపతి రూపంలోనే ఎన్నో విశేషాలతో కూడిన అద్భుతాలున్నాయి గణపతికి విఘ్ననాయకుడని. విశ్వనానాయకుడని అనేక పేర్లున్నాయి.
వినాయకుడు ఎన్నో అవతారాలను దాల్చినా ‘ముద్గల పురాణం’ ప్రధానంగా ఏడు అవతారాలను పేర్కొంది. అవి- వక్రతుండావతారం, చింతామణి గణపతి అవతారం, గజాననావతారం, శ్రీవిఘ్నరాజావతారం, బల్లాళావతారం (మయూరేశ్వరావతారం), ధూమకేతు అవతారం, గణేశావతారం. ఈ ఏడు అవతారాలను గణేశుడు దాల్చడానికి వెనుక పురాణ కథనాలు ఉన్నాయి. వాటిని గురించి తెలియజేయాలన్నదే ఈ ప్రయత్నం.
వక్రతుండావతారం
బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించే సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. సృష్టి స్తంభించింది. అపుడు బ్రహ్మ వేద మంత్రాలతో పరబ్రహ్మను ధ్యానించాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి పరబ్రహ్మ సాక్షాత్కరించాడు. ఆ రూపం గజముఖంతో, వక్రతుండంతో, చతుర్భుజునిగా, సృష్టి నిర్విఘ్నంగా సాగింది. తన తపశ్శక్తితో బ్రహ్మ గణపతి యొక్క శక్తుల్ని దర్శించి పరాశక్తి అంశలతో ఇరువురు స్ర్తిమూర్తులను సృష్టించాడు. వారే సిద్ధి, బుద్ధి. ఆ మహాశక్తులతో బ్రహ్మ గణపతికి వివాహం జరిపించాడు. ఆ విధంగా సిద్ధి, బుద్ధి సమేత వక్రతుండ గణపతిగా ఆరాధనలందుకుంటున్నాడు. గణపతి మొదటి అవతారం ‘వక్రతుండావతారం’గా ప్రసిద్ధి పొందింది. వక్రములను (విఘ్నములను) తుండెములు (ముక్కలు)గా చేసేవాడు వక్రతుండుడు. వక్రతుండుని ఆరాధిస్తే మనలోని వక్రబుద్ధులను తప్పక తొలగిస్తాడు.
చింతామణి గణపతి
గణుడనే రాక్షసరాజు దురహంకారంతో సర్వప్రాణులకు కీడు కలిగించేవాడు. ఒకసారి గణుడు కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా, ఆ మహర్షి తన వద్దనున్న ‘చింతామణి’ మహిమతో రాక్షసరాజుకు ఆతిథ్యమిచ్చాడు. మణి మహిమను చూసి, గణుడు తనకు మణినీయమని కపిల మహర్షిని కోరాడు. మహర్షి నిరాకరించడంతో బల ప్రయోగంతో మణిని స్వాధీనం చేసుకున్నాడు. కపిలుడు గణపతిని ప్రార్థించాడు. కపిలుని కోరిక మేరకు గణపతి గణుని సంహరించి ‘చింతామణి’ని స్వాధీనం చేసుకుని, కపిల మహర్షికి ఇచ్చాడు. అయితే ఆ మణిని కపిలుడు గణపతికే ఇచ్చివేశాడు. అలాగ గణపతి నాటినుంచి ‘చింతామణి గణపతి పేరుతో ప్రసిద్ధి పొందాడు.
భక్తులు చింతించిన అర్థాలను నెరవేర్చే గణపతి ‘చింతామణి గణపతి’.
గజాననావతారం: సింధు రాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మనే సంహరించడానికి సాహసించాడు. బ్రహ్మ విష్ణువును రక్షించమని కోరాడు. విష్ణువు సింధురాసురునితో ‘బ్రహ్మ నీతో యుద్ధం చేయలేడు కదా! శంకరునితో యుద్ధంచేసి జయిస్తే బ్రహ్మను జయించినట్లే’నని హితవుపలికాడు.
సింధురాసుడు కైలాసం వెళ్ళేసరికి శివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ప్రక్కనే ఉన్న సౌందర్యవతియైన పార్వతిని చూసి కామించాడు. ఆమె కేశ పాశాన్ని గుంజాడు. పార్వతి ఉలిక్కిపడి అరిచింది. శివుని ధ్యానం భగ్నమైంది. లేచి శివుడు త్రిశూలం ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఒక విప్రుడు వారిమధ్య ఆవిర్భవించి, యుద్ధం అవసరం లేదనీ, ఇరువురు తమ అస్త్రాలను ప్రయోగించి ఎవరి ఆయుధం నాశనమవుతుందో వారు ఓడినట్లేనని షరతుపెట్టాడు. ఆ విప్రుడు శివుని త్రిశూలం పరిశీలిస్తున్నట్లుగా స్పర్శించాడు. ఇరువురూ ఒకరిపై ఒకరు అస్త్రాలను సంధించారు. రాక్షసుని ఆయుధం త్రిశూలంచే తునాతునకలైంది. సింధురాసురుడు పాతాళానికి పారిపోయేడు. పార్వతి ప్రార్థన మీద ఆ విప్రుడు గజాసురుని శిరస్సు ధరించిన గణపతిగా ప్రత్యక్షమయ్యాడు. అదే ‘గజాననావతారం.’
విఘ్నరాజావతారం: కాలపురుషుడు విఘ్నాలకు పాల్పడడంతో ధర్మగ్లాని సంభవించింది. దేవ, మానవులు ప్రార్థనతో గణపతి అవతరించాడు. అందరికీ అభయమిచ్చి, విఘు్నడుగా నిలిచిన కాలపురుషుని యుద్ధంలో ఓడించి ధర్మరక్షణ గావించాడు. విఘు్నడు గణపతిని శరణుజొచ్చి, ‘‘స్వామీ! మీ పేరు ముందు, నా పేరును కూడా ఉంచమని ప్రార్థించాడు. గణపతి అనుగ్రహించాడు. ‘విఘ్నరాజు’గా పేరునందిన గణపతియొక్క అవతారం ‘విఘ్నరాజావతారం’.
బల్లాళావతారం: జగత్తును సంక్షోభంలో పడవేసిన కమలాసురుడు అనే రాక్షసుని మట్టుపెట్టడంకోసం వేద స్వరూపుడైన పరబ్రహ్మము బల్లాళుడుగా అవతరించిన గణపతి స్వరూపమే బల్లాళ గణపతి. మయూరేశ్వరుడుగా ఖ్యాతిపొందాడు. ఒకప్పుడు గర్గుడు ఆదిగా ఋషులు ఒక యజ్ఞం నిర్వహించగా, ఆ యజ్ఞకుండంనుంచి మహా మయూరం (పెద్ద నెమలి) ఆవిర్భవించింది. దానిని ఋషులు గణపతికి బహూకరించారు. మయూరేశ్వరుని రూపంలో కమలాసురుని సంహరించి జగత్తులో సుఖశాంతులు నెలకొల్పేడు. ‘బల్లాళ గణపతి’ మహారాష్ట్రులు- గాణాపత్య ఉపాసకులు ఆరాధించే అష్టవిధ గణపతులలో ప్రత్యేక స్థానం కల్పించారు.
ధూమకేతు అవతారం: మాధవుడు, సుమద అనువారు రాజ దంపతులు. సుమద గణపతికి అత్యంత భక్తురాలు. ఆమె భక్తికి మెచ్చిన గణపతి సాక్షాత్కరింపగా, తనకు కుమారునిగా జన్మించమన్న కోరికను చెప్పింది. గణపతి ‘తథాస్తు’అన్నాడు. సుమద గర్భాన జన్మించిన గణపతి, తదనంతర కాలంలో లోక కంటకుడైన ‘‘్భముడు’’అనే రాక్షసుణ్ణి సంహరించి లోక కల్యాణమూర్తిగా భాసిల్లాడు. అదే ధూమకేతు అవతారం.
గణేశ అవతారం: శంకరుడు త్రిపురాసురుల సంహారానికి బయల్దేరే ముందు విఘ్ననివారకుడైన గణపతిని పూజించాడు. అప్పుడు తండ్రి ముందు సాక్షాత్కరించిన గణపతి త్రిపురాసుర సంహారానికి గల విఘ్నాలను తొలగించేడు. ఆ అవతారమే ‘గణేశావతారం’.
ఆ సమయంలో గణపతి తన తండ్రితో ప్రసంగిస్తూ ‘తండ్రీ’ఈ విశ్వమంతా గుణముల మయము. త్రిగుణాత్మకమైన మాయాకల్పితం. సకలసృష్టి త్రిగుణాత్మకమే. ఆ గుణములకు కారణభూతుడను. ప్రభువును. కనుక, నన్ను ఋషులు ‘గణేశుడు’అన్నారు. అదే గణేశావతారం.
ఈ ఏడు అవతారాలను గురించి ముద్గల పురాణంలో విస్తారంగా లిఖించబడి ఉంది.
ఆదిశంకరులు ప్రవేశపెట్టిన పంచాయతన మూర్తులలో గణపతి, శక్తి, శివుడు, విష్ణువు, సూర్యుడు పంచదేవతలు. ఒకే పరబ్రహ్మం యొక్క ఐదు రూపాలు. ఈ ఐదుగురు దేవతల తత్త్వాన్ని సాక్షాత్తు శివుడే కుమారస్వామికి చెప్పినట్లు శంకర షణ్ముఖ సంవాదంలో ఉంది.
‘గణపతి’అనే నామమే మహామంత్రం.
ఓం గం గణపతియేనమః’

- ఏ.సీతారామారావు