Others

రాచరిక వ్యవస్థకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1724లో తెలంగాణలో ప్రారంభమైన ఆసఫ్‌జాహీల పాలన 1948 సెప్టెంబర్ 17న ముగిసింది. రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగిడిన రోజు అది. రెండు శతాబ్దాలకు పైగా కొనసాగిన రాచరికపు పాలనలో ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేకుండా కట్టుబానిసలుగా వెట్టిచాకిరితో భూస్వామ్య వ్యవస్థలో మాతృభాష సాంస్కృతులకు దూరంగా నెట్టివేయబడ్డ తెలంగాణ ప్రజలు చరిత్రలో స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం మొదలు పెట్టిన రోజు సెప్టెంబర్ 17. అలాంటి సెప్టెంబర్ 17ను తెలంగాణకు విద్రోహ దినమా? విలీన దినమా? విమోచన దినమా? దాన్ని ఏ విధంగా పరిగణించాలి అనే చర్చ మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న కాలంలో ప్రారంభమైంది. అంతముందు ఈ చర్చ అంతగా లేదు. ఈ చర్చను ప్రధానంగా తెరపైకి తెచ్చింది అతివాద వామపక్ష భావవాదులే అన్నది నిర్వివాదాంశం. అతివాద వామపక్ష భావవాదులు సెప్టెంబరు 17ను విద్రోహ దినంగా పరిగణించాలని వ్యాఖ్యానిస్తే మితవాదులు దాన్ని విమోచన దినంగా పాటించాలనడం మధ్యేయవాదులు దాన్ని విలీన దినంగా పరిగణించా లనడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెప్టెంబరు 17కు భాష్యం చెప్పడం జరుగుతుంది. తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17ను ఏ విధంగా పరిగణించాలి అనే విషయం అర్థం కావాలంటే 224 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ కొనసాగిన ఆసఫ్‌జాహీల పాలనను స్థూలంగా అవగాహన చేసుకొని ప్రజలు ఆ రోజుల్లో ఏం కోరుకున్నది సెప్టెంబరు 17ను నాటి ప్రజలు ఏ విధంగా పరిగణించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే దాన్ని విమోచన దినమనాల్నో, విలీన దినమనాల్నో లేక విద్రోహ దినమనాల్నో మనకే తెలుస్తుంది.
ఆసఫ్‌జాహీ వంశానికి చెందిన మొదటి ఐదుగురు నిజాం కాలంలోనే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన భూకమతాల పద్ధతి రూపుదిద్దుకొంది. విశాలమైన భూక్షేత్రాలను గ్రామాలకు గ్రామాల్నే పెత్తందార్లకు భూస్వాములకు అప్పగించడం, వారు తమ కింది రైతుల నుంచి నిర్దాక్షిణ్యంగా ఎంత పన్నులు వసూలు చేసినా నిజాం రాజులు పట్టించుకోకుండా సాలీనా తమకు నిర్ణీత సమయంలో పన్నులు కడితే చాలనుకొనేవారు. నిజాంలు అవలంబించిన ఈ విధానంతో తెలంగాణలో పెత్తందార్లు, భూస్వాములు బలపడి వారి చేతుల్లో సువిశాలమైన భూకమతాలు ఉండిపోయినవి. దీంతో హైదరాబాదు సంస్థానంలో భూకమతాలలో అతితీవ్రమైన అసమానతలు ఏర్పడ్డవి. భూమిని సాగు చేసే రైతులకు భూమి మీద అధికారం లేని స్థితి ఒకవైపున, తమ భూమి ఎక్కడ ఉందో, ఎంత ఉందో కూడా తెలియని భూస్వాములు మరొక వైపున ఉండే స్థితి నెలకొంది. ఆరవ, ఏడవ నిజాంల కాలంలో భూకమతాలలో మరొక రకమైన అసమానతలు చోటుచేసుకుని కొత్త తరహా భూయాజమాన్యాలు వెలుగులోకి వచ్చినయి. అవి 1.రాజకుటుంబపు భూములు, వీటినే సర్ఫేఖాస్‌భూములని అనేవారు. 2.పాయోగాలు, 3.సంస్థానాలు, 4.జాగీర్దారీలు, 5.ఇజారాదార్లు, 6.మక్తాదార్లు, 7.ఇనాందార్లు, 8.అగ్రహారికులు, 9.వతన్‌దారీ యాజమాన్య విధానం మొదలగు పెక్కువిధాలైన భూయాజమాన్య విధానాలు పుట్టుకొచ్చి మనిషికి ఆ రోజుల్లో జీవనాధారమైన భూమి కొంత మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమై భూకమతాలు ఉన్నవారి లేనివారి మధ్య ఆర్థిక సాంఘిక అసమానతలకు దారితీసి వారి మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు నెలకొనేందుకు కారణమైనాయి. నాటి తెలంగాణ సమాజంలో నెలకొన్న అసమ భూసంబంధాలు, శ్రమదోపిడీ, పన్నుల విధానం ఆరవ, ఏడవ నిజాంల కాలంలో సమాజంలో కదలిక రావడానికి, తిరుగుబాట్లు, ఆందోళనలు, పోరాటాలు విస్తరించడానికి కారణాలుగా పేర్కొనవచ్చును. ఆనాటి సామాజిక వ్యవస్థ కల్పించిన ఒత్తిడి నుంచి బయటపడటానికి ప్రజలు సామాజిక, రాజకీయ సాంస్కృతిక రంగాలలో పెక్కు మార్పులకు శ్రీకారం చుట్టిండ్రు. మొత్తంగా ఆరవ, ఏడవ నిజాంల కాలంలోని చరిత్ర అంతా వారి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన సంఘర్షణల సారాంశమే అన్నది నిర్వివాదాంశం.
హైదరాబాద్ సంస్థానంలో హిందువులు 81శాతం ఉండగా ముస్లింలు 10.5 శాతం పోగా మిగిలినవారు ఇతర మతాలకు చెందినవారు. ఆసఫ్‌జాహీ పాలకులు మెజార్టీ ప్రజల భాష అయినటువంటి తెలుగు భాష స్థానంలో పర్షియన్ భాషను అధికార భాషగా ప్రజలపై రుద్ది స్థానిక భాషాసాంస్కృతుల స్థానంలో పర్షియన్ భాషాసాంస్కృతులను ప్రోత్సహించారు. వస్త్ధ్రారణ, ఆహారపు అలవాట్లలో కూడా పర్షియన్ పద్ధతినే అనుకరించారు. తెలంగాణలోని కులీన వర్గం దీన్ని స్వీకరించి పాలకుల మెప్పు పొందేందుకు ప్రయత్నించేవారు. పాఠశాలల్లో శిక్షణామాధ్యమంగా పర్షియన్ భాషనే విధించినందున స్థానికులు మాతృభాషలో విద్యాభ్యాసానికి దూరంగా నెట్టివేయబడ్డారు. దాంతో స్థానికులు అవిద్యావంతులుగా మిగిలిపోయి వ్యవసాయానికి పరిమితమై ప్రభుత్వ రంగంలోని ఉపాధి అవకాశాలకు దూరమైపోయారు. పర్షియన్ భాష అధికార భాషగా 1885 వరకు కొనసాగింది. 1885లో పర్షియన్ స్థానంలో 6వ నిజాం ఉర్దూను అధికార భాషగా, శిక్షణామాధ్యమంగా ప్రవేశపెట్టారు. దాంతో స్థానికులు తమ భాషయైన తెలుగు స్థానంలో ఉర్దూను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 1948లో ఆసిఫ్‌జాహీల పాలన ముగిసే వరకు ఉర్దూనే అధికార భాషగా కొనసాగింది. వేషధారణ విషయానికొస్తే ముస్లిమేతరులందరూ షేర్వాని, పైజామాలే ధరించి పాఠశాలలకు వెళ్లవలసి వచ్చేది. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడ్డా అన్ని స్థాయిల్లోను ఉర్దూ శిక్షణామాధ్యమంగా ఉండటంతో ఇక్కడి పట్ట్భద్రులకు పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు లభించేవికావు. ఇక్కడి ఉద్యోగాలను నిజాంలు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముస్లింలకు, కాయస్తులకు స్థానికులను కాదని కట్టబెట్టేవారు. సంస్థానంలో మొత్తం చదువుకున్నవారి సంఖ్య 4.8శాతం ఉండగా జనాభాలో 89శాతం పైగా ఉన్న తెలుగు భాష మాట్లాడేవారిలో అక్షరాస్యత కేవలం 3.3 శాతం మాత్రమే ఉండేది. 1911 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది ముస్లింలలో విద్యావంతులు 59 మందికాగా ప్రతి వెయ్యి మంది హిందువులలో విద్యావంతులు 23 మంది మాత్రమే. విద్యాపరంగా హిందువులు వెనుకబడి పోవటానికి ప్రధాన కారణం ఉర్దూను బోధనా మాధ్యమంగా విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టడమే. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో సింహభాగం ముస్లింలకే దక్కేది. 1931 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలోని మొత్తం ఉద్యోగస్థుల్లో ముస్లింలు 1,07,737 మంది కాగా, హిందువులు 23,368 మంది మాత్రమే. మొదటి నిజాం ఉల్‌ముల్క్ కాలం నుండే దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లింలు హైదరాబాద్ సంస్థానానికి రావడం మొదలయ్యింది. దీనికి తోడుగా ఏడవ నిజాం కాలంలో అంజుమన్- ఇ-తబ్లిక్- ఉల్‌ఇస్లామ్ అనే సంస్థ మతమార్పిడులను విస్తృతంగా చేపట్టింది. దానికి విరుద్ధంగా ఆర్యసమాజికులు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి ముస్లింలుగా మారినవారిని తిరిగి హిందూ మతంలో చేర్చేవారు. సంస్థానంలో కాసిం రజ్వీ నేతృత్వంలో ఏర్పడిన రజాకర్ల సంస్థ (ముస్లిం మతోన్మాద సంస్థ) గ్రామాల్లో ప్రవేశించి అనేక దుర్మార్గాలకు, దురంతాలకు పాల్పడేవారు. ఇండ్ల మీదపడి దోచుకోవడం, రైతుల పంటలను, సంపదను బలవంతంగా లాక్కోవడం, స్ర్తిలపై ఆత్యాచారాలకు, మానభంగాలకు పాల్పడటం, గ్రామాలకు గ్రామాల్నే తగులబెట్టడం, ప్రశ్నించేవారిని అంతమొందించటం, తిరగబడే వారిని సజీవంగా దహనం చేసేవారు. ఒక అంచనా ప్రకారం రజాకర్ల దౌర్జన్యాలకు బలికాని గ్రామం తెలంగాణలో లేదంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజుల్లో నెలకొన్న పరిస్థితి గురించి మహాత్మాగాంధీ గారు ఈ విధంగా అభిప్రాయపడ్డారు ‘‘హైదరాబాద్‌లో పరిస్థితుల దినదినం క్షీణిస్తున్నవి. ఒక్కొక్క వార్త వింటే ఎవరో గొంతు నులిమినట్లు అనిపిస్తున్నది. ఊపిరాడకున్నది. వారు ఈదుతున్నది ఏటికి ఎదురీత. ఎక్కుతున్నది హిమాలయ పర్వత శిఖరం. ప్రమాదభరితమైనది. అయినా పోరాటానికి నడుంకట్టారంటే వారి ధైర్యస్థైర్యాలు మెచ్చుకోదగినవి. ప్రజలు సత్యానికి పాల్పడుతున్నారు. వాళ్లు హింసించబడుతున్నారే గాని ఎవరిని హింసించుట లేదు. విజయలక్ష్మి తప్పక వారినే వరిస్తుందని ఆశిస్తాను’’ హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజుల్లో మత స్వాతంత్య్రం అనేమాట వినబడేది కాదు. గస్తీ నిషాన్ తిర్పాన్ అనే జీవో నెం.53 ప్రకారం ఏదైనా సమావేశం జరుపుకోవాలంటే నిజాం నవాబుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పత్రికా స్వేచ్ఛ ఉండేది కాదు. తెలంగాణ సంస్కృతిపై పెనుచీకట్లు ఆవరించిన కాలమది. తెలంగాణ ప్రజల రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక జీవితం అతి నికృష్టదశకు చేరుకున్నది. ప్రజలకు పౌరసత్వపు హక్కుల్లేవు. వాక్, సభా, పత్రికా స్వాతంత్య్రాలను గురించి చెప్పనక్కర్లేదు. జాగీర్దార్లు గానీ, మక్తాదార్లు గానీ ప్రజల విషయాలను పట్టించుకొనేవారు కాదు. నిజాం సర్కారు పన్నుల భారం రోజురోజుకు ప్రజలను కృంగదీయసాగింది. ప్రజల్లో క్రమంగా అసహనానికి, అశాంతికి, అలజడులకు, ఆందోళనలకు ఇవన్నీ కారణమయ్యాయి. పాలకవర్గంపై నిరసన, అణచివేతలకు ప్రతిఘటన, దౌర్జన్యాలపై తిరుగుబాటును ప్రజలు అనేక నిరసన రూపాల్లో వ్యక్తం చేశారు. చిన్న చిన్న నిరసనలతో ప్రారంభమై సాయుధ పోరాటంగా పరిణమించిన ఈ ప్రజాపోరాట చైతన్యానికి ఊపిరిలూదిన సంస్థలు వాటి పాత్ర నిత్యస్మరణీయాలు.
తెలంగాణలో దోపిడీని ప్రశ్నించి ప్రజల్ని చైతన్యపరచడం 1850 నుండే మొదలయ్యింది. 1850 పిదప ఈ పోరాటాలు విస్తృతంగా కావటం ప్రారంభమయ్యింది. అవి 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో గ్రంథాలయోద్యమంతో సాహిత్యోద్యమంగా ప్రారంభమై 1921లో ఆంధ్ర జనసంఘం స్థాపనతో రాజకీయ వేదికకు పునాదులు పడి 1930లో ఆంధ్రమహాసభ స్థాపనతో ఒక విశాల పోరాట నేపథ్యాన్ని సంతరించుకుంది. 11వ ఆంధ్ర మహాసభ పిదప సంస్థ నిట్టనిలువునా చీలిపోయింది. మితవాదులు తమది జాతీయ ఆంధ్ర మహాసభ అని చెప్పుకొని స్టేట్‌కాంగ్రెస్‌తో కలిసిపోయి జాయిన్ ఇండియన్ యూనియన్ పిలుపుతో ఉద్యమిస్తే అతివాదులు తెలంగాణ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన పిదప కూడా హైదరాబాద్ సంస్థానం ఇండియన్‌యూనియన్‌లో చేరకపోవడంతో సంస్థానంలో రాజకీయాలు వాడివేడిని సంతరించుకున్నాయి. 1947 నవంబరు 29న భారతప్రభుత్వానికి నిజాం ప్రభుత్వానికి మధ్య యథాతథ ఒప్పందం జరిగింది. జరిగిన ఈ ఒప్పందాన్ని నిజాం ఉల్లంఘించి సిడ్నీ కాటన్ ద్వారా ఆయుధాలు అక్రమ రవాణాకు పాల్పడిండు. రజాకార్ల ఆగడాలను అణచడంలో సంస్థానంలో శాంతి భద్రతలను కాపాడటంలో నిజాం పూర్తిగా విఫలమయ్యిండు. దీంతో భారత ప్రభుత్వం విధి లేని పరిస్థితుల్లో 1948 సెప్టెంబరు 13న సైనిక చర్యకు పూనుకుంది. చివరకు నిజాం సెప్టెంబరు 17న దక్కన్ రేడియోలో ఈ విధంగా ప్రకటించిండు. ‘‘నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. రాజకీయ పరిస్థితులను పూర్తిగా హస్తగతం చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ చర్య ఇంతకు ముందే తీసుకోనందుకు విచారిస్తున్నాను. నా ప్రజల యోగక్షేమమే నా ఏకైక లక్ష్యం. కాబట్టి వారు భారతదేశంలోని ఇతర ప్రజలతో కలిసి మెలసి సుఖశాంతులతో జీవితం గడపాలని ఆశిస్తున్నాను’’.
పై పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబరు 17ను పరిశీలించి చూస్తే దాన్ని విమోచన దినంగానే పరిగణించాలి. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంలోని మెజార్టీ ప్రజలు కోరుకున్నది రాచరిక వ్యవస్థ నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని. అదే విధంగా వెట్టిచాకిరి నుండి విముక్తి పొంది తమను నిర్ణయాధికారంలో భాగస్వాములు చేసి తమ భాషాసాంస్కృతుల వికాసాన్ని పాలకులు ప్రోత్సహించాలని, సర్ఫేఖాస్ భూములు, పయోగ, సంస్థానాల, జాగీర్దారీ భూములు ఈ విధంగా సంస్థానంలో ఉన్న 40శాతం భూముల్ని ప్రభుత్వ భూమిశిస్తు వ్యవస్థ కిందకు తీసుకురావాలని ప్రజలు ఆ రోజుల్లో ఆకాంక్షించారు. ఇవన్నీ సాకారమైన రోజు సెప్టెంబర్ 17. ఇది తెలంగాణ చరిత్రలో తెలంగాణ ప్రజలకు ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చిన రోజు. అందుకే ఇది విమోచన దినమే తప్ప విద్రోహ దినం ఎంత మాత్రం కాదు.

-ప్రొ.జి.లక్ష్మణ్, ఉస్మానియా యూనివర్సిటీ - 9849136104