Others

సన్మార్గానికి దారి ప్రార్థనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందం ప్రభాతే కరదర్శనం అంటూ నేను నిద్రలేవగానే సర్వాంతర్యామి అయిన భగవంతుని నా చేతుల్లోనే దర్శనం చేసుకొంటాను.ఇక నా దినవారి కృత్యాలు చేస్తూనే నా మనసులో శివనామాన్ని, విష్ణునామాన్ని స్మరిస్తూ ఉంటాను. ఒకే సత్యాన్ని పండితులు బహువిధాలుగా చెప్పినట్లుగానే ఉన్నది ఒకే పరమాత్మ. కానీ అనేకులు అనేక రూపాల్లో కొలుస్తుండడం అనాదిగా వస్తున్నదే కదా. అందుకే నేను శివకేశవులిద్దరినీ నా శక్తిమేర ప్రతిరోజూ ప్రార్థిస్తుంటాను. నిన్నమొన్న కృష్ణాష్టమి వచ్చింది కదా. అపుడు చక్కగా కృష్ణుని విగ్రహాన్ని పెట్టుకుని పూలతో అలంకరించుకుని అష్టోత్తర శతనామాలతో పూజించాను. ఆ తరువాత నిన్న వచ్చిన వినాయక చవతినాడు వినాయకునికి దూర్వాయుగ్మం గరికతో అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొన్నాను.
అన్నింటికీ ఆదిపరాశక్తి అమ్మే కారణం కనుక, అమ్మకు, అయ్యకు భేదమేమీ లేదుకనుక పైగా అమ్మా అని పిలిచినంతనే కలిగే ఆనందం కోసం నేను పలురూపాల్లో ఉన్న అమ్మవారిని కూడా పూజిస్తుంటాను. వరలక్ష్మీ వ్రతం నాడు వరలక్ష్మీదేవిగా అమ్మను సంభావించి పూజించాను. ఆరోగ్యము, భాగ్యమూ రెండు ఇచ్చే తులసమ్మ ను ప్రతిరోజు పూజిస్తుంటాను.
ఇక రాబోయే దసరా నవరాత్రుల్లో అమ్మను తొమ్మిది రూపాలలోనూ పూజిస్తుంటాను.
ఇలా నేను ప్రతిరోజు ఓ అరగంట సమయాన్ని పూజకు కేటాయించుకుని మనసా వాచా కర్మణా భగవంతుని ఆరాధన చేస్తుంటాను. మానసికంగా ధ్యానించాలనుకొని కళ్లు మూసుకుని అన్ని ఆలోచనలను పక్కకు పెట్టి భగవంతుడే నా ఎదురుగా కూర్చుని ఉన్నాడనుకొంటూ షోడశోపచారాలు మానసికంగా చేస్తుంటాను. ఇలా చేయడం వల్ల నాలో ప్రశాంతి కలుగుతుంది. ఇక నా సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ నావిధిని నిర్వర్తిస్తూ భగవంతునిపైన నామనసు నిలవాలని గురుదేవుని ప్రార్థిస్తూ ఉంటాను. భగవంతుడే కదా సన్మార్గానికి దారి చూపించేది అని నా భావన. దానివల్లే నేను నిరంతరమూ భగవంతుని ప్రార్థిస్తుంటాను.
ప్రతి పనిని భగవంతుని కోసం చేసే పనిగా భావించి చేస్తుంటాను. పని ప్రారంభించేటపుడు భగవంతుని ప్రార్థించి నా చేత నీవు చేయించాలనుకొన్న పనిని ఏ ఆటంకమూ ఎదురవకుండా చూడమని వేడుకొంటాను. పని పూర్తి అయిన తర్వాత ఈశ్వారార్పణం అనుకొంటాను. లేదా కృష్ణార్పణం అనీ అంటుంటాను. ఇలా నేను నా దినచర్యలో ఎక్కువ భాగం దేవుని నామోచ్చారణకు ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇక రాత్రి పడుకునేటపుడు కూడా కాసేపు భగవంతుని ధ్యానిస్తాను. ఆధ్యాత్మిక గురువుల ఉపన్యాసాలు వింటాను. భగవంతుని కీర్తనలు ఆలపిస్తూ పడుకుంటాను. ఇలా నేను మా ఇంటిదైవాన్ని పూజించుకుంటూ ఉంటాను. నాకున్నంతలో ఇతరులకు సాయం చేస్తుంటాను. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అని భావంతో నాకున్నంతలో అవసరమైనవారికి చేతనైనంత సాయం చేస్తుంటాను.

- ఆర్. సుశీల