AADIVAVRAM - Others

తిమింగలం మాతృప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిల్లర్ వేల్ జాతికి చెందిన ఓ తిమింగలం తను జన్మనిచ్చిన పిల్ల తిమింగలం చనిపోయాక కూడా దాని శరీరాన్ని పదిహేడు రోజుల పాటు వదిలిపెట్టలేదని పరిశోధకులు వెల్లడించారు. కెనడాలోని వాంకోవర్ దీవి సమీపంలోని సముద్రంలో చనిపోయిన పిల్ల తిమింగలాన్ని తన తలతో నెట్టుకుంటూ దాదాపు 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది తల్లి తిమింగలం. పదిహేడు రోజుల తర్వాత చనిపోయిన పిల్లను వదిలేసింది తల్లి తిమింగలం. తన గుంపులోని ఇతర తిమింగలాలతో కలిసి సాల్మన్ చేపల గుంపు వెంట పడిందని సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ (సీడబ్ల్యూ ఆర్) తెలిపింది. క్షీరదాలైన కిల్లర్ వేల్స్.. తమ పిల్లలు చనిపోతే వాటిని వారం రోజుల పాటు విడవకుండా అట్టిపెట్టుకోవడం సాధారణం. అయితే ‘జే 39’గా గుర్తిస్తున్న ఈ కిల్లర్ వేల్ తల్లి ఈ విషయంలో కొత్త ‘రికార్డు’ సృష్టించిందని పరిశోధకులు చెబుతున్నారు. చనిపోయిన పిల్ల తిమింగలం శరీరంతో తల్లి తిమింగలం జులై 24న వాంకోవర్ దీవి తీరంలో మొదట కనిపించింది. అప్పటి నుంచి గత మూడువారాలుగా ఈ కిల్లర్ వేల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పిల్ల తిమింగలం ఆ రోజే చనిపోయినట్లు భావిస్తున్నారు పరిశోధకులు. కానీ పిల్ల తిమింగలం మృతికి ఇప్పటివరకు కారణాలు తెలియదు. ‘ఆ తల్లి తిమింగలం విషాద పర్యటన ఇప్పుడు ముగిసింది. తీరం నుంచి తీసిన టెలిఫొటో డిజిటల్ చిత్రాల్లో అది శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది’ అని సీడబ్ల్యూఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది. పిల్ల తిమింగలం మృతశరీరం.. శాలిష్ సముద్రజల్లాలో (అమెరికా, కెనడాల మధ్య సముద్రజలాలు) మునిగిపోయి అడుగుభాగానికి వెళ్లిపోయింది. దానికి నెక్రోప్సీ (జంతుకళేబరాలకు చేసే శవపరీక్ష) చేసే అవకాశం పరిశోధకులకు లభించకపోవచ్చు అని తెలిపింది. సదరన్ రెసిడెంట్ కిల్లర్ వేల్ జాతి తిమింగలాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతిగా కెనడా, అమెరికాలు పరిగణిస్తున్నాయి. ఈ జాతి తిమింగలాలు గత ఇరవై ఏళ్లలో జన్మనిచ్చిన పిల్లల్లో కేవలం మూడో వంతు మాత్రమే మనగలిగాయని పరిశోధనలు చెబుతున్నాయి. గత మూడేళ్లుగా ఒక్క తిమింగలం కూడా బతకలేదని వారు చెబుతున్నారు. ఈ తిమింగలాలు ఆహారం కోసం చినూక్ సాల్మన్ చేపలపై ఆధారపడతాయి. ఆ చేపలు కూడా ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయాయి.