AADIVAVRAM - Others

అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఓ పెద్ద జాగా... ఒక ఎకరం భూమిలో మధ్యన ఇల్లు, చుట్టూరా ఫలవృక్షాలు, పూల తీగెలు, స్విమ్మింగ్ పూల్ వగైరా వగైరా...
అది ఊరికి సుదూరం.. ఇది రమణమూర్తి చిరకాల ఆశయ తీరం-
ఈ తోటకి ఆనుకుని కొండగట్టు - ఎతె్తైన కొండ కొనలపై పచ్చటి కొంగు కప్పుకున్న అప్సరసలా అన్పిస్తుంది చూపరులకి. అలా ఎదిగి పెరిగిన పచ్చని పచ్చిక మొక్కలపై నుంచి వీచే గాలులు చల్లచల్లగా.. మెల్లమెల్లగా.. శరీరాన్ని తాకుతుంటే.. తన తోటలోని లతలు తలలూచుతుంటే.. అప్పుడప్పుడు వచ్చిపోయే తొలకరి చినుకులు నుదురు తాకుతుంటే ‘ఎంత హాయి నాదోయి..’ అని పెదవి పల్లవిస్తుంటే.. ఈ జన్మకి ఇంకేం కావాలి అని మనసు కవ్వాలి పాడుతుంది.

సిటీ మాయ వల నుంచి బయటపడటానికి.. కలల సాకారానికి ఐదు పదుల వయసొచ్చింది రమణమూర్తికి. ఒక్కగానొక్క కూతురు అర్చనకి వయసొచ్చింది.. కలలు కనేవాళ్లకి వెలుగొచ్చింది ప్రకృతి ఒడిలో నివాసం.. పసిడి కలలో పయనం.. అర్చన నయనాలలో తెలిసిపోతుంటుంది రమణమూర్తికి, భార్య వసంతకి.
రమణమూర్తి అంచనాల ప్రకారం తను అర్చనకి ఓ సుందర ప్రాకారం. అర్చనను సివిల్స్ చేయించి, ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా ప్రజాసేవ చేస్తే చూడాలన్నది రమణమూర్తి మరో కల. అర్చన ఇంతవరకు తన అంచనాల మేరకు కాలేజి ప్రథమ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. ఇకపై కూడా తన అంచనాలని వర్తించే ఉంటుందని విశ్వాసం. తనకి ఇంతకి మించి ఏం కావాలి. తృప్తిగా శ్వాస తీస్తూ భవిష్యత్, వర్తమానాలను సమన్వయం చేసుకుంటున్నాడు రమణమూర్తి. అంతలో భార్య వసంత దగ్గరగా వచ్చి కూర్చొని ‘ఏంటి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు?’ అంది.
అదే విషయాన్ని వసంతతో పంచుకున్నాడు. వసంత వారించింది.. మరీ అంతగా ఫిక్సవకండి.. అర్చన ఆలోచన ఎలా ఉందో.. అంటున్నంతలోనే వసంత, అర్చన మేడ మెట్లు దిగి హాల్లోకి వచ్చి ‘ఏంటి నా గురించి ఏదో చర్చ జరుగుతున్నట్లుంది. ఎంతవరకు వచ్చింది. తెగిందా.. అంతు దొరికిందా’ అంటూ చిన్నారి అర్చన చిలకలా చిరునవ్వు చిందిస్తూ వసంత పక్కగా వచ్చి కూర్చుంది. ‘రారా.. మాకింక నీ గురించి కాక వేరే విషయం ఏముంటుంది. నీవే మా ప్రపంచం. నీవే మా సర్వస్వం... నీ కోసమే మా ఇద్దరి జీవన పయనం - నీవేగా మా నయనం..’ రమణమూర్తి అలా మాట్లాడ్తూంటే, ‘అమ్మా డాడీ ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు ఈ రోజు.. దేని గురించి డాడీలో ఈ కలవరం’ అంటూ అర్చన వసంతని కార్నర్ చేసింది.
‘ఏం లేదురా నీ కాలేజీ చదువు పూర్తి కావస్తోంది కదా.. నిన్ను సివిల్స్ చేయిద్దాం అనుకుంటున్నారు డాడీ. ఇంతలో నీవే వచ్చావ్. ఏం చేద్దామనుకుంటున్నావమ్మా..’ అంది వసంత భర్త వైపు ఓ లుక్ వేస్తూ.
‘చూద్దాం.. ఇంకా సమయం ఉందిగా..’ అంటూ ఫ్రిజ్ వైపు అడుగు వేసింది అర్చన. రమణమూర్తి కూడా ప్రస్తుతానికి సైలెంట్ మోడ్‌లో పెట్టాడు విషయాన్ని. వసంత కాఫీ చేసుకొస్తానని కిచెన్‌లోకి వెళ్లింది. అప్పటికి ముగ్గురూ ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నారు.
ఓ తండ్రిగా రమణమూర్తి అర్చన విషయంలో ఓ అంచనాలో ఉంటాడు. అది తండ్రిగా తన బాధ్యత. అందువల్ల తను అర్చన ఆశల ఆశయాల వెన్నంటే ఉంటాడు. అందుకు వసంత సహకారం కూడా తీసుకుంటాడు. వసంతని అర్చనని గమనించమని సూచనలిస్తుంటాడు కూడా. కారణం అర్చన విరిసీ విరియని తెలిసీ తెలియని ప్రాయంలో ఉంది.
తనకి ఇతిహాస పరంగా అవగాహన ఉండింది ఓ పక్క.. మరో పక్క సమాజంలో ఈడు వచ్చిన పిల్లలు, నాగరికత పేరున తొక్కుతున్న దారులు వింటూంటాడు, చూస్తూంటాడు రమణమూర్తి. అందుకని తన మనసు ఆ విషయంగా జాగ్రత్త చెప్తూంటుంది. కాళిదాసు కావ్యాలు ఎన్నో తను అధ్యయనం చేశాడు, ముఖ్యంగా అభిజ్ఞాన శాకుంతలం-
అర్చన ఒక కోణంలో చూస్తే అభినవ శాకుంతలలా అన్పిస్తుంటుంది. తన కల కలవరింతలోకి వచ్చి ‘తప్పేమైనా దొర్లుతుందా’ అని పలవరిస్తుంటాడు, రమణమూర్తి అప్పుడప్పుడు గుండె చప్పుడు చేస్తుంటే.. అర్చన ఎన్నటికి తన అంచనాలని మీరి ప్రవర్తించదు అంటూ తన వెన్ను తనే తట్టుకుంటాడు రమణమూర్తి ధైర్యం తెచ్చుకొని. బహుశా ఎదిగొచ్చిన పిల్లంటే తల్లిదండ్రుల గుండెలపైన కుంపటే సుమా!! దీన్ని భరించటం ఎలా అనుకుంటుంటాడు రమణమూర్తి. చాలా కలవరపాటుగా ఉంటున్నాడు రమణమూర్తి ఇటీవల, గమనిస్తూనే ఉంది వసంత.
‘డాడీ నేను ఎం.ఏ. ఇంగ్లీష్ లిట్ చేద్దామనుకుంటున్నాను’ అంటూ డాడీని సూటిగా చూడలేక తలదించుకుని ఉంది అర్చన. అర్చన నోటి వెంట ఇలాటి మాట వినవలసి వస్తుందని, తన అంచనా తప్పుతుందని ఊహించని రమణమూర్తికి, అశనిపాతంలా ధ్వనించింది అర్చన ధ్వని.
అనుకున్నంతా జరిగింది.. రమణమూర్తి అంచనాలకి విఘాతం ఏర్పడింది మొట్టమొదటిగా. కాసేపు ఇరువురి మధ్యా వౌనం రాజ్యం చేసింది. తనని తను సంభాళించుకుని రమణమూర్తి ‘అర్చనా! కంగారుపడకు. నిన్ను, నీ ప్రతిపాదనని నేను సమర్థిస్తున్నాను. నిన్ను ఓ బాధ్యతగల కలెక్టర్‌గా.. ప్రజా సేవకురాలిగా చూడాలనుకున్నాను. అలాగని నా కోరికను నీపై బలవంతంగా రుద్దేంత దుర్భలత్వం నాలో లేదు.. నీ ప్రతిపాదన ఎంతవరకు సమంజసమో నీతో నీవే చర్చించుకో.. ఆ తరువాత ఏం చేద్దామా అని నిర్ణయించుకో. తుది నిర్ణయం నీదే’ అనునయించాడు రమణమూర్తి.
‘సారీ డాడీ.. మిమ్మల్ని డిస్సపాయింట్ చేస్తున్నాను అని మీరనుకోకపోతే నేనొక్క మాట చెప్తాను’ అంది అర్చన.
‘చెప్పమ్మా.. నీ అభిప్రాయం నీ తండ్రి అని కాకుండా, ఓ శ్రేయోభిలాషిగా భావించి చెప్పు తల్లీ. నీ విచక్షణా శక్తి మీద నాకు పూర్తి విశ్వాసముంది. నా గుండెల మీద ఆడిన నీకు నా గుండె చప్పుడు బాగా తెలుసు’ అన్నాడు రమణమూర్తి.
‘మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్లు.. నన్ను నేను సమర్థిస్తున్నట్లు అనుకోకండి. అధ్యాపక వృత్తిలో మీరు ఆశించినట్లు ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్ది సివిల్స్‌కి వెళ్లేటట్లు చేసి భావితరంలో భావి పౌరులని తయారుచేసే మహా యజ్ఞంలో నేనొక సమిధని కావాలనే నా ఈ నిర్ణయం’ అంది అర్చన.
అంతటితో ఆగక అర్చన ‘పెద్ద మనసుతో మీరాశీర్వదిస్తే ముందుకెళ్తాను. లేదూ మీరు ఆదేశిస్తే, సివిల్స్‌కే ప్రిపేర్ అవుతాను’ అంది భావోద్వేగంతో.
‘చాలా సంతోషం తల్లీ. చిన్నదానివైనా నీవు తీసుకున్న నిర్ణయం చాలా సమంజసంగా ఉంది.. నా పెంపకంలో పెరిగిన సంపంగి సుమ సౌరభాలు వెల్లివిరుస్తున్నాయ్ నీ ఆదర్శంలో’ అంటూ సంతృప్తిగా ఆశీర్వదించి డిన్నర్‌కి సిద్ధమయ్యాడు రమణమూర్తి, అనుసరించారు వసంత, అర్చన తేలికపడ్డ మనసులతో.
రెండు సంవత్సరాలు రెండు క్యాలెండర్లు మారినంత సులువుగా కరిగిపోయినయ్. కాలచక్ర భ్రమణంలో అర్చన కాలేజీ ఫస్ట్ రావడం, మంచి విద్యాసంస్థలో ఉద్యోగానికి పిలవడం.. అన్నీ ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయినయ్ అర్చన దైనందిన జీవితంలో. ఇంక మిగిలింది అర్చన వివాహ పర్వం.
సర్‌ప్రైజింగ్‌గా పెళ్లిచూపులు ఏర్పాటు చేశాడు స్వంత గార్డెన్‌లో రమణమూర్తి. ఆశ్చర్యం.. అర్చన తన కళ్లని తను నమ్మలేక పోయింది. ఆ వచ్చిన పెళ్లికొడుకు సందీప్ తను ఎంచుకున్న వరుడు... సందీప్‌ని, రమణమూర్తిని మార్చిమార్చి చూసింది అర్చన. తనవైపే చూస్తూ ఇద్దరు ముసిముసిగా నవ్వుకున్నారు.
‘డాడీ..’ అంటూ పక్కకి వెళ్లి రమణమూర్తిని హత్తుకుని ఎమోషనల్‌గా ఏడ్చినంత పనే్జసింది అర్చన, అంతులేని ఆనందంతో. ‘బీ హ్యాపీ మై చైల్డ్..’ అంటూ రమణమూర్తి వసంత వైపు ఆత్మీయంగా చూశాడు. ఫార్మాలిటీగా పెళ్లిచూపుల తతంగం ముగిసింది. మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు ఉభయులు. ఆ తర్వాత ఒకరోజు అర్చన అమ్మని ‘నేను ప్రేమించిన సందీప్‌నే నాన్నగారు పెళ్లిచూపులకి ఎలా తీసుకురాగలిగారు’ ఆత్రంగా అడిగింది.
ఎలాగంటే నీలో నీవు ఏదో విషయంలో మధనపడ్తున్నట్లు అమ్మ మనసు పసిగట్టింది. ఆ విషయం నాన్నగారితో ప్రస్తావించాను. సరే అమ్మాయిని నీవేమీ కదపకు, నేనే విషయం తెలుసుకుంటాను అని భరోసా ఇచ్చారు. అదే ఎలా.. నాన్నగారు.. కనిపెట్టారు.. వాళ్లని జతకట్టారు.. అంతుచిక్కని ప్రశ్న... అర్చనకి.
‘నే చెప్తా మిలార్డ్..’ అంటూ డాడీ సీన్‌లోకి ఎంటరయ్యారు.
‘చెప్పు డాడీ.. సస్పెన్స్ భరించలేక పోతున్నాం మమీ, నేను’ అంది అర్చన.
‘నీకు డైరీ రాసే అలవాటుంది - డాడీకి డైరీ తెరిచి ఏ రోజుకారోజు చదివే అలవాటుంది - వెరీ సింపుల్. కంటికి రెప్పలా నిన్ను కాయాలంటే నేను ఎంచుకున్న సిసి కెమెరా నీ డైరీ - తప్పు కాదనుకుంటా.. తప్పు చెయ్యక తప్పింది కాదనుకుంటా. నిన్నూ నీ ఆశల్ని, ఆశయాల్నీ గెలిపించటానికి మీ ప్రేమ వ్యవహారం నా దృష్టికి వచ్చిన వెంటనే సందీప్‌ని గురించిన ఎంక్వైరీలన్నీ జరిగిపోయినయ్. అధ్యాపక వృత్తిలోకి నిన్ను మళ్లించిన సందీప్ మీ సీనియర్ అని, నీకు లెక్చరర్‌గా వచ్చి నీ మనసు గెలుచుకున్నాడని తెలుసుకున్న నేను వాళ్ల పెద్దవాళ్లని సంప్రదించాను. వాళ్లని మనవైపు మళ్లించాను. దట్సాల్ యువరానర్..’ అంటూ రమణమూర్తి ఆత్మీయంగా అర్చన నుదురు ముద్దు పెట్టుకుని తల నిమిరి ఆశీర్వదించాడు నిండు మనసుతో. వాతావరణం ప్రశాంతమైంది.. ఆవరణం ప్రకాశించింది నిండు పున్నమిలో..
ఇప్పుడు తోటలో గులాబీల పరిమళం గుబాళిస్తోంది. సిరిమల్లెలు పరిమళిస్తున్నాయి. విరజాజులు విరగకాస్తున్నాయ్.. సుమ సుగంధాలు కనులకు, శాంతించిన మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయ్.. ఎక్కడి నుండో ఝుమ్మంది నాదం.. సయ్యంది ‘అర్చన’ పాదం.

-ఆచార్య క్రిష్ణోదయ 7416888505