AADIVAVRAM - Others

కీర్తి తరగని మెదక్ ఖిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటలు కూలినా చరిత్ర చెరగదు... ప్రాణాలు పోయినా కీర్తి తరగదు అన్నట్లు రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా అలనాటి ఆనవాళ్లు చరిత్రకు నిలువెత్తు నిదర్శనాలు. అలనాటి రాచరిక పాలనకు సజీవ సాక్ష్యంగా చెప్పుకునే ‘ఖిల్లా’ మెదక్ పట్టణానికి ఓ మణిహారం. నేటికీ నిలిచిన పురాతన కట్టడాలు.. కోట గోడలు.. బురుజులు మెదక్ జిల్లా రాచరిక పాలనకు దర్పణం. రోమనులతో వర్తక, వాణిజ్య సంబంధాలు పెట్టుకోగా.. ఆంధ్ర శాతవాహనులు, రాష్టక్రూటులు, దేవగిరి యాదవులు, హోయసాలలు, కాకతీయ రాజులు, రెడ్డిరాజులు, గోల్కొండ(కుతుబ్‌షాహీలు) మొగలాయిలు, సంస్థానాధిపతులు, నైజాం నవాబులు పాలించడంతో చరిత్ర, సంస్కృతిలో మెదక్ ఖిల్లా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మెదక్ ఖిల్లా నిర్మాణం-ప్రాముఖ్యత
పూర్వ రాజ్యాలలో కోటల నిర్మాణానికి రాజులు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. సంస్కృతంలో దుర్గం, ఇంగ్లీష్‌లో ఫోర్ట్, ఉర్దూలో ఖిల్లా అని పేర్కొంటాం. కౌటిల్యుడి అర్ధశాస్త్రం ప్రకారం కోటలను నాలుగు రకాలు. అవి జలదుర్గం, స్థలదుర్గం, వనదుర్గం, గిరిదుర్గం. అంతేగాక ప్రతి రాజ్యానికి సప్తాంగాలు అవసరమని స్వామి, అమాత్య, జానపద, దుర్గ, కోశ, దండలము, మిత్రలు మొత్తం కోటలోనే ఏర్పాటు చేసేవారు. మెదక్ పట్టణానికి పశ్చిమాన మూడు వందల అడుగుల ఎత్తున ఉన్న కోటను కాకతీయ చక్రవర్తులు ఒకటిన్నర మైలు పొడవు, ఒక మైలు వెడల్పుతో నిర్మించారు.
కాకతీయుల తరువాత దీనిని 16 శతాబ్దంలో ముస్లిం రాజులు నిర్మించారని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఈ కోటలో ఇత్తడి. పంచలోహాలతో తయారుచేసిన నాలుగు ఫిరంగులున్నాయి. వీటిలో ఒకటి పదడుగుల పొడవు ఉంది. 1620లో డచ్చివారి కోసం అమ్‌స్టర్‌డ్యామ్ పట్టణంలో ఇది పోత పోయబడినది. ఈ కోటలోని ముబారక్ మహల్ అనే రాజమందిరం ఉంది. ప్రస్తుతం ఇందులో తెలంగాణ టూరిజం హరిత రెస్టారెండ్ ఏర్పాటు చేశారు. సింహద్వారంపై రెండు శిరస్సులు గల కబోదములతో కూడిన చిహ్నం ఒకటి ఉంది. రెండు శిరస్సుల కబోదము కాకతీయ సామ్రాజ్యం రాజ్య చిహ్నం అయినందున ఈ కోట శాతవాహనులు క్రీ.పూ. 78వ సంవత్సరం నుండి ఈ ప్రాంతం పాలించినట్టు కొండాపూర్‌లో పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల ద్వారా స్పష్టమవుతోంది. చరిత్ర ఉపన్యాసకులు జయరాజు తన రచనల్లో ఈ వివరాలను వెల్లడించడం విశేషం. కొండాపూర్ శాతవాహన రాజుల టంక్‌శాల నగరమని తెలుస్తోంది. రాజమందిరము ముఖ ద్వారముపై ద్విముఖాత్మకమగు గంఢబేరుండము ముక్కు, గోళ్లతో ఏనుగులను పట్టుకొన్న చిత్రం దర్శనమిస్తోంది. ఈ చిత్రం హిందూ పౌరాణిక గాథలకు సంబంధించినది పేర్కొంటున్నారు. కోట ద్వారం మొత్తం రాతి కట్టడంపై నిలువెత్తు చెక్కుడు రాళ్ల తలుపు చెక్కలకు ప్రత్యామ్నాయంగా అమర్చిన తీరు అబ్బురపరుస్తుంది. ఈ కట్టడాలకు అవసరమైన రాళ్లను ఎత్తిన కూలీల నైపుణ్యానికి అద్దం పడుతుంది. రాజమందిరం పక్కనే అత్యంత రహస్య ప్రదేశం నుండి సొరంగ మార్గం ఉన్నట్లు, ప్రవేశ ద్వారం ఇరుకుల ఉన్నందు వల్ల ఒక్కరు మాత్రమే లోపలకు వెళ్లే అవకాశం ఉండగా బొయ్యారం లోపల మాత్రం విశాలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ బొయ్యారం ప్రస్తుతం ఎక్కడ కనిపించనివ్వరు. ఈ సొరంగం మెదక్ ఖిల్లా నుండి నేరుగా గోల్కొండ ఖిల్లా వరకు ఉందని కొందరు, అంతదూరం సొరంగం నిర్మించడం అసాధ్యమంటూ ఖిల్లా నుండి మెదక్ పట్టణం నడిమధ్య వరకు ఉండవచ్చునని పురావస్తు శాస్తజ్ఞ్రుల అంచనా. నేరుగా ఖిల్లాపై నుండి రహస్య ద్వారం గుండా సైన్యం లేదా రాజు మెదక్ పట్టణం నడివీధిలో ప్రవేశించే అవకాశం ఉంది. ఆరోద్వారం, ఏడో ద్వారానికి ఇరువైపుల సైనికులు సవారీ చేస్తున్నట్లు మలిచిన రాతిశిల్పం, ఏనుగులు దర్శనమిస్తాయి. తూర్పు భాగాన గుట్ట నేల నుండి ఒకటిన్నర కిలోమీటర్ల ప్రయాణించే వీలుంది.
దాదాపు 300 అడుగుల ఎత్తు ప్రాంతంలో గుట్టమీద విశాలమైన భూమి ఉన్నందువల్ల అక్కడ కందకంతో కూడిన పెద్ద బురుజులు, 7 ద్వారాలు బండలను కలుపుతూ గోడల నిర్మాణం చేపట్టారు. నాటి రాజులు అశ్విక దళాన్ని పెంచి పోషించడానికి, ఏనుగులపై సైనికులు సవారీ చేస్తున్న చిహ్నం స్పష్టం చేస్తుంది. మెదక్ ఖిల్లాపై సప్త ద్వారాలపైన ఓ ప్రసిద్ధి పొందిన బావి ఉంది. ప్రస్తుతం అది పెద్దగా వాడుకలో లేదు. కానీ నీరు ఎప్పుడూ స్వచ్ఛతను సంచరించుకుని ఉంటుంది. ఈ బావి గతంలో మెదక్ పట్టణ ప్రజలకు ఆపద కాలంలో తాగునీరందించిందని పూర్వీకులు చెబుతారు. దీన్ని పాలబావిగా అభివర్ణిస్తారు. ఎతె్తైన ప్రాంతంలో ఉన్నా ఎన్నడూ ఈ బావి ఎండిపోదు. 30 అడుగుల వైశాల్యంలో రాతిమీద ఉన్నా నీరు సమృద్ధిగా లభిస్తుంది. మధ్యన రాళ్ల తెట్టెలతో అడ్డుకట్టవేసి పాలబావిని రెండుగా విభజించారు. ఒకదానిలో రాజు, మరొకదానిలో రాణి స్నానాలు చేసేవారట. అందుకేనేమో రాజు బావి, రాణి బావిగా పిలుస్తారు. గుట్టపై గట్టమ్మ గుడి ఉంది. వీరవనిత గట్టమ్మ కాకతీయుల ఆరాధ్యదైవమని ప్రతీతి. ప్రతి సంవత్సరం గట్టమ్మ జాతరను ఇక్కడి ప్రజలు ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. శకటభ్రమణోత్సవం కన్నులపండువగా కొనసాగుతుంది. ఈ కోటపై అనేక ధాన్యాగారాలున్నాయి. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న గిడ్డంగులకంటే అతి పెద్ద భవనాలు ఉన్నాయి. ఇందులో నిల్వ ఉంచిన ధాన్యం ఈ ప్రాంత ప్రజలకు దశాబ్ద కాలంపాటు సరిపోయేదని చరిత్ర చెబుతుంది. సుమారు ఏడు ఎకరాల వైశాల్యంలో ధాన్యాగారాలను నిర్మించారు. బహుమనీ సుల్తానుల దాడులలో చారిత్రాత్మకమైన మెదక్ ఖిల్లా కొంత ధ్వంసమైంది. అయినప్పటికీ కాకతీయ రాజ్యపాలన అంతమొందించి అధికారం చేజిక్కించుకున్న బహుమనీ సుల్తానులు తమ పాలనలో పాక్షికంగా ధ్వంసమైన ఖిల్లాను పునఃనిర్మాణం గావించినట్లు తెలుస్తోంది. ఖిల్లాపై గల మసీదుకు నలువైపుల నాలుగు బంగారపు మినార్‌లను అమర్చారు. మినార్‌లను దుండగులు ధ్వంసం చేసి కూలగొట్టి అందులోని బంగారం దొంగిలించినట్లు చెప్పుకుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జాగిలాలు అనే్వషణలో మినార్ నుండి విరిగిపడ్డ ఓ బంగారపు ముద్ద దొరికిందంటారు. బహుమనీ సుల్తానుల దండయాత్ర అనంతరం మసీదు కట్టడం నుండి ఖిల్లాపై మోహర్రం (పీర్లపండుగ) వేడుకలు మొదలయ్యాయి. గంగమ్మ, పీర్ల ఉత్సవాలు మెదక్‌లో హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకలయ్యాయి.
బహుముఖ పేర్లతో ఖ్యాతి
నేడు మెదక్‌గా పిలవబడుతున్న ఈ పట్టణం బహుముఖ పేర్లతో వర్ధిల్లింది. దక్షిణ భారతంలో బౌద్దుల కాలంలో మెదక్‌ను అశ్మక రాష్టమ్రు, కళింగ, రాష్టక్రూట, చోడ రాజుల కాలంలో పులాక రాష్ట్రం, శాతవాహనుల కాలంలో మంజీరికా దేశము, రాష్ట్ర కూటుల పరిపాలనలో నాగభూమిగా పిలిచినట్లు చరిత్ర. త్రైలోక్యమల్లుని, కాకతీయ బేతరాజు శాసనములు డాకూరు, ముదిమాణిక్యం, అల్లాదుర్గములో లభించినవి. ఈ ఆధారాలతో కొరవి దేశముగా కూడా పిలిచినట్లు తెలుస్తుంది. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో మెదక్ రాచవీడుగా పిలిచారు. ఇక్కడ సన్నని వరిధాన్యాన్ని పెద్దయెత్తున పండించడం వల్ల అన్నసమృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెతుకుగా పిలుస్తున్న క్రమంలో మెదక్‌గా మార్చినట్లు తెలుస్తోంది. ఆందోలు రెడ్డి రాజులు కూడా మెదక్‌ను రాచవీడుగా పిలిచారు. శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దేవాలయంలో కూసలనాడుగా వర్ణించినట్లుగా చెప్పుకుంటారు.
వీనపు ముక్కనత్తునరవీసపు మంగళ సూత్రమమ్మినన్
గాసునురాని కమ్మల రకాసును రానివి పచ్ఛపూగులున్
మాసిన చీరగట్టి యుపమాన మొసంగగ నేడురాగానా
కాసలనాటి వారి కనకాంగిని చూచితి నీళ్లరేవునన్.
అంటూ కూసలనాడును గూర్చి కవిసార్వభౌముడు శ్రీనాథుడు వర్ణించాడు. గోల్కొండ నవాబు కాలంలో ఇది గుల్షనాబాద్‌గా పునః నిర్మాణం పొందడంతో నిజాంలు దీన్ని మెదకు దుర్గంగా మార్చారు. క్రీ.శ. 12, 13 శతాబ్దాల్లో మెతుకు దుర్గం ముఖ్యాంతర్భాగం నిర్మించబడింది. ఇది అత్యంత ప్రాచీన నగరం కావడంతో ఇప్పటి వరకు తొమ్మిది పేర్లతో పిలవబడింది.
రాజకీయ చరిత్ర
తెలంగాణ ఇతర జిల్లాల్లో మాదిరిగానే మెదక్ కూడా వౌర్య చక్రవర్తి అశోకుని కాలంలో ఉంది. వౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుని మరణానంతరం అతని సామంతులు శాతవాహనులు క్రీ.పూ.78 నుండి క్రీ.శ. 218 వరకు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు భూగర్భమునుండి బయటపడిన నాణాన్ని బట్టి కొండాపురం శాతవాహనుల కాలం నాటి 30 ప్రాకారాలు ఉన్న పట్టణంగా గ్రీకు చరిత్రకారుడైన మెగస్తనీస్ పేర్కొన్న ఆంధ్ర పట్టణం ఇదేనని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
శాతవాహనుల తర్వాత బాదామి, చాళుక్య, రాష్టక్రూట, కల్యాణి, చాళుక్య వంశముల ఏలుబడిలో ఉండెను. వారు వరుసగా ఆధిపత్యం వహించి పతనమైన తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది. కళ్యాణీ చాళుక్యుల కాలంలో రాజ్యాధికారం చేపట్టిన కాకతీయ వంశంలోని 9 మంది రాజులు ఆధీనంలో అంతర్భాగంగా మెదక్‌ను పాలించారు. మెదక్ పట్టణానికి పడమరగా శిథిలమై ఉన్న కోట కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు (1296-1323) కట్టించారట.
క్రీ.శ 1309లో అల్లాఉద్దిన్ ఖిల్జీ సామంతుడైనా మాలిక్‌కాఫిర్ ఓరుగల్లు వెళ్తూ దారిలో మెదక్ ఖిల్లాను ముట్టడించి హస్తగతం చేసుకున్నాడు. క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని పదవీచ్యుతుని చేసి కాకతీయ సామ్రాజ్యానికి సుల్తానాపూర్ అని నామకరణం చేసి ఢిల్లీ సుల్తానులు తమ సామ్రాజ్యాన్ని దక్షిణాపథమంతా విస్తరించారు. మహమ్మద్‌బీన్ కాలంలో బహుమనీ రాజ్యస్థాపన తర్వాత రెడ్డిరాజైన రెచర్ల రెండవ అనపోతారెడ్డి ఆధీనంలో మెదక్ ఖిల్లా ఉండేదని మెదక్ సంస్థానాధీశ్వర చరిత్ర తెలుపుతుంది. అపుడు బీదరును పాలిస్తున్న బహుమనీ సుల్తాన్ ఖాసీము బరీద్‌షా మెదక్ ఖిల్లాను రెడ్డి రాజుల నుండి కైవసం చేసుకున్నాడు. గోల్కొండ దుర్గమును జంషీద్ పరిపాలిస్తున్నప్పుడు తమ్ముడైన ఇబ్రహీం కుతుబ్‌షా అన్న చంపుతాడనే భయంతో బీదర్‌కు పారిపోయి ఖాసీంబరీద్‌షా దగ్గర దాచుకోగా సమాచారం తెలుసుకున్న ఇబ్రహీం కుతుబ్‌షాను పట్టి తీసుకురావడానికి బీదర్‌పై దండెత్తగా ఖాసీం బరీద్‌షా భయంతో అక్కడి నుండి పారిపోయి విజయనగర అళియ రామరాయల దగ్గర తలదాచుకొన్నాడట. ఇందుకు ఫలితంగా మెదక్ ఖిల్లా, నారాయణఖేడ్‌లు జంషీద్‌కు ఇచ్చి సంధి చేసుకున్నారట. జంషీద్ మరణానంతరం బీదర్ బారీదుషా మెదక్ ఖిల్లాను స్వాధీనపర్చుకోగా కులీకుతుబ్‌షా బరీద్‌ను ఓడించి ఖిల్లాను ఆక్రమించుకున్నాడు. రాక్షసంతంగడి (తళ్లికొట్ట) యుద్దం తర్వాత కృష్ణానది దాటి కాచేభూపతి ఇబ్రహీం కుతుబ్‌షా వద్దకు రాగా మెదక్ ఖిల్లా పాలనాధికారిగా నియమించారు. కాచె భూపతి సంతతివారు భిక్కనూరు కేంద్రంగా పాలించారు. దోమకొండకు మూడు మైళ్ల దూరంలో ఉన్న భిక్కనూరు కూడా మెదక్ ఖిల్లా క్రింద ఉందన్నమాట. క్రీ.శ 16వ శతాబ్దంలో మెదక్ ఖిల్లా గోల్కొండ కుతుబ్‌షాహీల వశం కాగా అతని మరణానంతరం 1687లో మొగల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు వశమైంది. మరాఠీ నాయకుడైన శంభూజీ అతని అనుచరులు మెదక్‌లో బలపడుతున్నారని తెలిసి ఫిరోజ్‌జంగ్‌ను, షేక్‌నిజాంను మరాఠాలను అణచి మొఘల్ సామ్రాజ్యం స్థాపించడానికి పంపించాడు. ఔరంగజేబు మరణానంతరం 18వ శతాబ్దంలో మెదక్ నిజాం రాజ్యమైంది. ఆసఫ్‌జాయిల కాలంలో సుబాలు, జిల్లాలు, సంస్థానములు, జాగీర్లుగా ఏర్పడ్డాయి. నిజాం నవాబు మెదక్ దుర్గ పాలనాధికారము పాపన్నపేట సంస్థానాధిపతి అయిన రాణిశంకరమ్మకు అప్పగించారు. నిజాం ముల్ ముల్క్ మరణానంతరం నాసిర్‌జంగ్, ముజఫర్‌జంగ్ తర్వాత సలాబత్‌జంగ్ రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ 1761లో సలాబత్‌జంగ్ తమ్ముడైన నిజామలీఖాన్ చేత పదవీచ్యుతుడయ్యాడు. అలీజా మెదక్ జాగీర్దార్ అయిన సదాశివరెడ్డితో చేతులుకలిపి బీదర్ కోటలో యుద్ధానికి సిద్ధంకాగా నిజాంఅలీఖాన్ మెదక్ మొదలైన ప్రాంతాలను తాత్కాలికంగా రేమాండ్‌కు ఇచ్చాడు. ఈ కుట్రదారులను అణచడానికి రేమాండ్‌ను పంపగా సదాశివరెడ్డి చేతిలో తీవ్రమైన ఓటమిని చవిచూశాడు. ఈ మధ్యలో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగాయి. అలీజా మరణం, మెదక్‌ను రేమాండ్‌కు ఇవ్వడం, దక్షిణాపథంలో బలపడుతున్న ఫ్రెంచివారిని నిజాం బలపరుస్తున్నట్లు విన్న బ్రిటీష్‌వారు నిజాంను ఎదిరించారు. ఈ ప్రాంతాలకు బాడుగగా సంవత్సరానికి 16 లక్షలు చెల్లించడానికి రేమాండ్ ఒప్పుకోగా ఈ ఒప్పందం 1798 వరకు అమలులో ఉంది. అనంతరం రేమండ్ మరణించగా జిల్లా స్వాతంత్య్ర పోరాటం వైపు సాగింది. 1920లో గాంధీజీ ప్రారంభించిన దేశ స్వాతంత్య్రోద్యమం అన్ని జిల్లాల మాదిరిగా మెదక్ జిల్లాపై ప్రభావం చూపింది. 1930లో జోగిపేటలో జరిగిన ఆంధ్రమహాసభ ప్రభావం మెదక్‌పై ప్రభావం చూపడంతో 1948లో సైన్యం చర్యలతో మెదక్ జిల్లా నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది. 1956లో జరిగిన రాష్ట్రాలు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో మెదక్ పేరుతో పిలుస్తున్న జిల్లాకు సంగారెడ్డి పట్టణం జిల్లా కేంద్రమైంది. 1980లో అనివార్యమైన మధ్యంతర ఎన్నికల్లో మెదక్ నుండి పోటీ చేసిన ఇందిరాగాంధీ అఖండ విజయాన్ని అందుకొని దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఘనత ఉంది. దీంతో మెదక్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
చారిత్రకంగా ఈ ఖిల్లాకు సుదీర్ఘకాల చరిత్ర ఉన్నా శాస్ర్తియ పరిధోధనలు లేకపోవడం వల్ల మరుగునపడుతుంది. ఈ దుర్గంపై సమగ్ర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పర్యాటక కేంద్రంగా ఖిల్లా
మెదక్ ఖిల్లా నేడు పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. కోటపై భాగంలో గల ముబారక్ మహల్ నేడు హరిత రెస్టారెంట్‌గా మారింది. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు ఖిల్లాపై అభివృద్ధి పనుల కోసం నిధులు కూడా వెచ్చించింది. పోలీసు శాఖ రిపీటర్ స్టేషన్ కూడా ఈ ఖిల్లాపై ఏర్పాటు చేశారు. ఈ ఖిల్లాను పర్యాటకులు ఆకట్టుకునేలా మరింత ఆకర్షణీయంగా తయారుచేసి చరిత్రను కాపాడుకోడానికి మెదక్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

-తమ్మలి మురళీధర్ 9989507333