Others

రక్త సంబంధం (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందురునిమించు అందమొలకించు ముద్దు పాపాయివే/ నీ కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే/ కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే/ లోకములనేలు వేంకటేశ్వరుడు నిన్ను దీవించులే.. తెలుగు సినిమాల్లోని నాకు బాగా నచ్చే పాటల్లో ఇదొకటి. శారీరకంగానో, మానసికంగానో అలసటకు గురైన సందర్భాల్లో ఈ పాట వింటే ఎక్కడలేని హాయి కలుగుతుంది. నిజానికి ఇది విషాద గీతమే అయినా.. మెత్తని లాలిత్యంలోని జోల మనసుకు హాయినిస్తుంది. 1962లో వచ్చిన ‘రక్త సంబంధం’ చిత్రం కోసం అనిశెట్టి సుబ్బారావు రాసిన గీతమిది. ఎన్టీఆర్ -సావిత్రి అన్నా చెల్లెలుగా ఉదాత్తమైన పాత్రలు పోషించడం సినిమాలోని ప్రత్యేకత. రెండు కుటుంబాల మధ్య దూరం ఏర్పడిన సందర్భంలో ఇక్కడ అన్న, అక్కడ చెల్లెలు ఒకరినొకరు తలచుకుంటూ వాళ్ల పిల్లలకు ‘ఇద్దరు అనుబంధాన్ని’ వివరిస్తూ.. మీవల్లే మళ్లీ రెండు కుటుంబాలు ఒకటవ్వాలని కోరుతూ పాడే జోలపాట.
అన్నవొడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా/ కలతలకు లొంగి కష్టముల కుంగు నేటి కథ పాడనా/ కన్నీటి కథ పాడనా- అంటుంది సావిత్రి. అన్నదగ్గర ఉన్నప్పటి ఆనందాలే చెప్పనా? దూరమైనప్పటి వేదనలోని కష్టాలే పాడనా? అన్న సన్నివేశంలో సావిత్రి అభినయం అద్భుతం. కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే/ మము విధియె విడదీసె/ వెతలలో త్రోసె/ మిగిలె నీ కోసమే.. అంటూ ఎన్టీఆర్ పాడే సన్నివేశం అత్యంత సహజంగా తోస్తుంది. లలితమైన పదాలతో అనిశెట్టి రాసిన గీతానికి ఘంటశాల బాణీ కట్టి పాడితే, ఆయనతో స్వరకోకిల సుశీలమ్మ గాత్రం కలిపారు.
పాటకు ముగింపుగా.. -మనసులను కలుపు మధుల బంధాలు మాసిపోరాదులే/ పెరిగి నీవైన మామగారింటి మనుమునే కోరుమా/ బంధమే నిలుపుమా- అని నిద్రకు ఉపక్రమించే కొడుకుకు తల్లి చెబితే.. కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా/ పెరిగి నీవైన అత్తవారింట కోడలిగ చేరుమా/ మా బంధమే నిలుపుమా- అంటాడు ఎన్టీఆర్. ఆనాటి బంధాలు, అనుబంధాల్లోని తియ్యదనాన్ని హృద్యమైన పదాలతో రచయిత ఎంత చక్కగా అందించాడో కదా.

కె బాలాకుమారి, నర్సాపురం