Others

వాకిలి ఓ పచ్చకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకిలిలో నిలబడితే అనంత భావాల వెల్లువ
తెల్లరంగుతో ఆ పూలు రోజూ నవ్వుతుంటయ్
నిన్న రాలినవి, రాలబోయేవీ ఆత్మ సంవేదన గుర్తులు
ఎప్పుడో అమ్మను నిమిరినట్టు
ఇప్పుడు బిడ్డను తడిమినట్టు
కాసేపు చెట్టు దగ్గర తచ్చాట
కొబ్బరి చెట్టు తన మిత్రుడని
గాలి కబుర్లను ముచ్చట్ల మీద ముచ్చట్లు బెడ్తున్నది
మా ఇంటి నంది వర్ధనం
ఆకుల మధ్య మెరిసే వెలుగును పిలుస్తూ
గిలిగింతలు పెట్టే కీటకాలు
నల్లని సాలెపురుగు పరుగులు
రోజులకు వెళ్ళదీస్తున్నవనే భ్రమ!
గోముగ తిరిగే చీమలదీ
గండు చీమలదీ బెడదంటే ఎట్లా
అవేమన్నా బాలవిరుల చిదిమేవా ఏమన్నా?
రెండు చేతులేవో చెంబెడు నీళ్ళు దెచ్చిపోస్తుంటే
అన్నీ ఆగిపోయి నిశ్శబ్దం ఆవరించె
అయినా ప్రాణదాతను ఎట్లా వద్దంటుంది?
వౌనం ఇష్టంలేని చెట్టు
ఏదో భాషలో నాతో రోజూ సంభాషిస్తూనే ఉంటుంది
పక్కనున్న గులాబిమొక్క ఇంకా సిగ్గుదొంతరలు వీడలేదు
అక్కడే ఉన్న రంగుల బొట్ల మధ్య
ఠీవీగా ఉన్న తులసి ప్రవచిస్తూనే ఉన్నది
రోజూ కొత్తగ వెలిగే ముగ్గు చేసే భాష్యాలు
మధ్య మధ్య దోమల సయ్యాటలు
మంచిగా గమనిస్తున్న నందివర్ధనం
మేం ప్రవర్ధమానులం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు
పచ్చపచ్చగా నవ్వుతున్నది
దూరంగా ఉన్న వేపచెట్టు తన ప్రత్యేకత తనదనె
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మామిడి చెట్టేమో
శుభకార్యాలలో తలుపులను ముద్దాడాలని ఆశిస్తున్నది
ప్రతిరోజూ చెలిమి కలిమి గురించే..
ఆ వాకిలి పలవరిస్తుంటే ఇంకా ఎరుపెక్కని కోయని
దానిమ్మలు వత్తాసును ప్రకటించె
కుండీల్లో ఎప్పుడూ ఎదగని క్రోటన్స్
తమవంతుగా ఆనందాన్ని పంచుతూ
ప్రేమిస్తున్న ఎర్రమట్టికి వేళ్ళతో
కృతజ్ఞతలు చెప్తున్నవి
కిలకిల నవ్వులతో ఇద్దరు పిల్లలు
నీళ్ళ పంపు పట్టుకొని నేనంటే నేనని
కాకుల అరుపులా లొల్లి చేస్తుంటే
గేటువంకా చూస్తున్న కుక్క ఊహలకు రెక్కలు గట్టె
ఎప్పటిలాగే పాలుదాగాలని పిట్ట గోడమీంచి
పిల్లిలా వచ్చే పిల్లి మనిషితత్త్వ జాడలాతోచె
ఇదంతా ముగ్గుబుట్ట తలకాయల
కలతల మూటను కాసేపు పక్కన బెట్టించింది
నల్లబల్లపై సుద్దముక్క విన్యాసాలు
బతుకు చిత్రం కళకళలాడినట్లున్నది
ప్రశాంత వాతావరణంలో నితాంతమానమైన పొదరిల్లులా
ఊరంతా పచ్చకావ్యమై మెరవాలని
మా వాకిలి చెబుతున్నది

--కొండపల్లి నీహారిణి