Others

ఆలోచనలు ప్రగతికి మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో బోధ
======

ఇప్పుడు మనిషి జీవితాన్ని నీషే విభజించిన మూడురకాల క్రమానుగత చైతన్య రూపాల రూపాంతరాలైన ఒంటె, సింహం, శిశువుల గురించి విశే్లషిద్దాం. ప్రతి మానవుడు తన మతం, సంస్కృతి, మనుషుల గురించి పూర్తిగా తెలుసుకుని, తన సమాజ సాంస్కృతిక వారసత్వంతోపాటు అందుబాటులో ఉన్న గతాన్నంతా తనలో జీర్ణించుకోవాలి. దీనినే నీషే ఒంటె స్థాయి అంటాడు. ఎందుకంటే, ఎడారిని దాటే ప్రయాసతో కూడిన ప్రయాణానికి కావలసిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని, ఎక్కువ నీటిని తన శరీరంలో నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఒంటెకు ఉంది. అలాగే ప్రయాసతో కూడిన ప్రయాణమైన ఎడారి లాంటి జీవితంలో గతాన్ని పూర్తిగా జీర్ణించుకుని ప్రయాణించగల సామర్థ్యం మనిషికి ఉంది.
కేవలం జ్ఞాపకముంచుకోగలిగినంత మాత్రాన మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. ఎందుకంటే, పూర్తిగా జీర్ణంకానిది మాత్రమే మీకు జ్ఞాపకముంటుంది. గతాన్ని మీరు పూర్తిగా జీర్ణించుకోగలిగితే, దానినుంచి మీరు వెంటనే విముక్తులవుతారు. అప్పుడు మీరు గతాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని ఎప్పుడైనా దానిని ఉపయోగించగలరు. కానీ, గతం ఎప్పటికీ మిమ్మల్ని తన అధీనంలో ఉంచుకుని ఉపయోగించుకోలేదు.ఆహారాన్ని జీర్ణించుకున్న తరువాత దానిని మీరు గుర్తుంచుకోవలసిన అవసరముండదు. ఎందుకంటే, అది మీలో అలాగే ఉండకుండా రక్తంగా మారి మీ శరీరమంతా ప్రవహిస్తూ మీలో కలిసిపోతుంది.
గతాన్ని పూర్తిగా జీర్ణించుకోవాలి. గతంతో ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే, అది మీ గతం. దానిని మీరు మొదటినుంచి ప్రారంభించక్కర్లేదు. ఎందుకంటే, అందరూ అలాగే చేస్తే అంతగా పరిణామం జరగదు. అందుకే జంతువులు ఏమాత్రం పరిణమించలేదు. యుగయుగాల క్రితం కుక్క ఎలా ఉందో నేటికీ అలాగే ఉంది. ఒక్క మనిషి మాత్రమే పరిణామం చెందుతున్న జంతువు. అలా ఎందుకంటే, గతాన్ని జీర్ణించుకోగల జంతువు కేవలం మనిషి మాత్రమే కాబట్టి. గతం జీర్ణమైన వెంటనే దానినుంచి మీరు విముక్తులై స్వేచ్ఛగా ముందుకువెళ్తూ మీ గతాన్నికూడా మీరు ఉపయోగించగలుగుతారు. లేకపోతే, మీరు అనేక అనుభవాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలా మీ జీవితం వృథా అవుతుంది.
మీరు మీ తండ్రి, తాత, ముత్తాతల భుజాలపై ఆధారపడి నిలబడగలరు. మనిషి అలా అందరి భుజాలపై ఆధారపడుతూనే ఉన్నాడు కాబట్టి, ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. కుక్కలు, తోడేళ్ళు లాంటి జంతువులు మనిషిలా ఉన్నత స్థానానికి చేరుకోలేవు. ఎందుకంటే, అవి తమపైనే ఆధారపడతాయి తప్ప, ఎవరిపైనా ఆధారపడవు. వాటి ఔన్నత్యం ఏమాత్రం మారదు. మీ ఔన్నత్యంలో బుద్ధుడు, క్రీస్తు, పతంజలి, మోజెస్, లావోట్జూలు జీర్ణమయ్యారు. అలాంటి మహానుభావులు ఎంత ఎక్కువమంది మీలో జీర్ణమైతే, అంత ఎక్కువ ఉన్నతస్థానంలో మీరుంటారు. అప్పుడు మీకు అత్యున్నతమైన దార్శనికత లభిస్తుంది. అందువల్ల మీరు అత్యున్నత శిఖరాగ్రం నుంచి చూడగలుగుతారు.
కాబట్టి, మీరు ఈ భూమిపై ఉన్న అందరి గతాలను పూర్తిగా జీర్ణం చేసుకుని మొత్తం భూగ్రహానికి చెందిన పౌరునిగా నిలబడండి. అంతేకానీ, మీరు కేవలం క్రైస్తవులుగా, హిందువులుగా, మహమ్మదీయులుగా పరిమితమై పోవలసిన అవసరం ఏమాత్రం లేదు. భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేదాలు- ఇలాంటివన్నీ మీవే. కాబట్టి, వాటన్నింటినీ జీర్ణంచేసుకుని అత్యున్నతంగా ఎదిగి అద్భుతమైన దార్శనికతను సాధించండి. అప్పుడు సుదూర తీరాలన్నీ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
దీనినే నీషే ఒంటె స్థాయి అంటాడు. అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే, ఒంటె పసిగుడ్డు లాంటిది. అంతేకాదు, దానిక నిల్వ ఉంచుకునే సామర్థ్యముంది. అక్కడితో ఆగిపోతే మీరు ఒంటె స్థాయిలోనే ఉండిపోతారు. అప్పుడు జీవన వసంతాల ఆశీర్వాదాల దివ్యత్వం మీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే, ఒంటె గతాన్ని జీర్ణించుకోగలదు కానీ, దానిని ఉపయోగించుకోలేదు.
కాలక్రమంలోని మార్పులకు అనుగుణంగా ఒంటె సింహంగా మారే సమయం వస్తుంది.
-------
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.