Others

మత్తులో యువత భవిత చిత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్తవయసులోనే అనారోగ్యానికి గురౌతున్నారు. శరీర అంతర్భాగం తూట్లుతూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు. తులసి వనం లాంటి అడవులలో గంజాయి మత్తెక్కిస్తోంది. రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలామంది ఈ అలవాటుకు బానిసవుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదాటే ప్రమాదం ఉంది.
గంజాయి గుప్పు
డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు, పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా చైతన్యం కలిగిస్తున్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లో గంజాయి భూతం యువతను పట్టిపీడిస్తోంది. విద్యార్థుల జీవితాలను మత్తులో ముంచేస్తోంది. గంజాయి, బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే, బానిసైన యువత భవిష్యత్తును చిత్తుచేస్తోంది. తమ అక్రమ సంపాదనకోసం మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాల, కళాశాలల విద్యార్థులకు గంజాయిని అలవాటుచేసి కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు గంజాయికి అలవాటు పడటంతో లేత వయసులోనే వారి జీవితాలు చిక్కి శల్యమైపోతున్నాయి. ఇలా బానిసలు అవుతారు..
ప్రస్తుత సమాజంలో చెడు వ్యసనాలను ప్రోత్సహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మొదటగా సాఫ్ట్‌డ్రింక్‌తో ప్రారంభమైన మత్తు, చివరకు మద్యపానీయాలు, గంజాయి, డ్రగ్స్ వరకు ఎగబాకుతున్నాయి. కుటుంబంలో పరిస్థితులు సక్రమంగా లేకపోవటం, తల్లిదండ్రుల మధ్య సఖ్యత లోపించి పిల్లల ముందే పోట్లాడుకోవటం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులరుూ్య పిల్లలతో గడిపే సమయంలేక వారి బాగోగుల్ని వాళ్ల ఇష్టానికి వదిలేయటం, చెడు స్నేహాలు, ప్రేమ వైఫల్యాలు.. డ్రగ్స్‌కు బానిసలవటానికి కారణాలుగా ఉండవచ్చు.
పిల్లలతో చర్చించలేకపోవడం: పాఠశాల, కాలేజినుంచి ఇంటికొచ్చిన పిల్లలు తమ కుటుంబ సభ్యులతో తమ అనుభవాలను, పాఠశాల, కాలేజిలో జరిగిన విషయాలను పంచుకోవాలనుకున్నా, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం లభించక ఒంటరితనంతో మానసికంగా కుంగిపోతారు. ఒంటరితనాన్ని, బాధను మర్చిపోవటం కోసం మత్తుపదార్థాలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి డ్రగ్స్‌కు అలవాటుపడిన తర్వాత తాము తప్పుచేస్తున్నామనే భావనతో ఆత్మన్యూనత ఏర్పడుతుంది. ఆత్మన్యూనతనుంచి తప్పించుకోవటం కోసం భరోసాకై ఎదురు చూస్తూంటారు. అది దొరక్క తిరిగి మత్తుపదార్థాల మీదే ఆధారపడతారు.
కౌమార దశలో హార్మోన్స్ ప్రభావం: బాల్యం అనేది భవిష్యత్తుకు పునాది వేసుకొనే మంచి అవకాశాల దశ. కౌమార దశకు ఎదిగే క్రమంలో పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకోవడం, పలు సామర్థ్యాలను రూపొందించుకోవడం, శారీరకంగా, మానసికంగా పరిపక్వత, శారీరకంగా హార్మోన్స్‌లో మార్పు, మంచి వ్యక్తిత్వానికి పునాది వేసుకోవడం జరుగుతుంది. ఈ దశలోనే మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, ధూమపానం వంటి అనారోగ్యకర వ్యసనాలకు అలవాటు పడటానికి దోహదం చేసే పరిస్థితులు ఉన్నాయి. పేదరికం, పరిసరాల్లోని హింసాత్మక వాతావరణం, తల్లిదండ్రుల నుంచి ప్రేమాదరణలు లోపించడం, మత్తు పదార్థాలు సునాయాసంగా లభ్యం కావడం, సంక్లిష్ట మానసిక స్థితి, స్నేహితుల ప్రేరేపణ వంటి వాటి వల్ల పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకోవడానికి కారణమవుతున్నాయి.
తల్లిదండ్రులు కాస్త ఇవి గమనించండి...
గంజాయికి బానిసలుగా మారిన యువకుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. తల్లిదండ్రులు, తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. గంజాయి బానిసలుగా మారిన యువకుల కళ్లు కాస్త ఎరుపురంగులో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. తాను ఉండే గదికి లోపలి నుంచి గడియ పెట్టుకుని గంటల తరబడి ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం చేస్తూ ఉంటారు. మాట్లాడే మాటలలో తేడాగా, కాస్తంత తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు. శుభ్రతను ఎక్కువగా పట్టించుకోక మాసిన దుస్తులతో తిరుగుతుంటారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు. ఎందుకని అడిగితే ప్రస్తుత సినిమా ఫ్యాషన్ అంటూ గొప్పగా చెప్పుకుంటారు. డబ్బులు కోసం పదే పదే తల్లిదండ్రులపై ఒత్తిడిచేస్తుంటారు. డ్రగ్స్‌కి అలవాటుపడ్డవారు సామాజిక సంబంధాలకు దూరంగా, సన్నిహితులకు, స్నేహితులకు దూరంగా గడపడానికి ప్రిఫరెన్స్ ఇస్తూఉంటారు. అనవసరంగా కోపం తెచ్చుకుంటూ తరచూ ఉద్రేకానికి గురవుతూ స్వీయ సంభాషణకు (వారిలో వారే మాట్లాడుకోవడం) లోనవుతారు. డ్రగ్స్‌లో కూడా అనేక రకాలుంటాయి. ముక్కుద్వారా పీల్చేవి, నోటితో తీసుకునేవి, ఇంజెక్షన్‌ల ద్వారా తీసుకునేవి. పొగద్వారా పీల్చేవి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ సిగరెట్లు తాగేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది.
గంజాయితో నరకమే
గంజాయి స్కిజోఫ్రీనియాకి కారకం: గంజాయి పీల్చేవారి మానసిక స్థితి క్రమేణా అధ్వాన్నం అవుతుంది. వారు తరచూ, మనుషులు లేనిచోట మనుషులను చూడడం, మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను, శూన్యంలో శబ్దాలను వింటున్నట్లుగా జరుగుతుంది. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు హాని తలపెట్టే ఉద్దేశంతో ఉన్నారని భావిస్తూ ఉంటారు.
సంతాన ప్రాప్తికి దూరం: గంజాయి సేవించే పురుషులలో స్పెర్మ్‌కౌంట్ తగ్గిపోయి వారు తండ్రులు కాలేకపోవడం, స్ర్తిలలో అండాలు తగ్గి, వారు గర్భవతులు కాలేకపోవడం కూడా జరుగుతుంది.
వికలాంగ శిశువుల జననం: బాగా గంజాయి పీల్చే స్ర్తిలు గర్భవతులవుతే, వారికి కలగబోయే శిశువులు అవయవ లోపాలతో పుట్టే అవకాశం ఉంటుంది.
మెదడు మీద పెత్తనం: మెదడు పనితీరు మందగిస్తుంది.
శరీరం అనారోగ్యమే: మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కిడ్నీవ్యాధుల బారిన పడుతున్నారు. టిబి, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచం పడుతున్నారు. మత్తుపదార్థాలు సరదాకోసం అలవాటుచేసుకొని వాటికి బానిసలై అతి చిన్న వయసులోనే వృద్ధులుగా కనిపిస్తారు. జీవచ్ఛవాల్లా కాలం గడుపుతుంటారు.
మాదక ద్రవ్యాల కట్టడికి మూలాలను తొలగించే ప్రయత్నం చేయాలి:
నిషేధం విధిస్తేనో లేక నియంత్రిస్తేనో మాదకద్రవ్యాల సమస్య అంతం అయ్యేనా. మాదకద్రవ్యాలను దొంగదారిలో యువతకు చేరవేసే అరాచక శక్తుల ప్రాభవం పెరిగిపోతోంది. నిషేధంతోపాటు సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని తొలగించే ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే సమస్యను అంతం చేయవచ్చు.
పాఠశాల స్థాయిలో విలువల విద్యను ప్రోత్సహించాలి
పాఠశాల స్థాయినుంచే పిల్లలకు ధ్యానం, యోగ, కుటుంబ విలువలు, శారీరక, మానసిక ఆరోగ్యాల ప్రాధాన్యతను వివరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనలోని నమ్మకం, ఆనందమే మన సమాజంలో స్థితిని నిర్ణయిస్తాయి. అయితే ఆ ఆనందాన్ని ఏవిధంగా సంపాదించుకుంటామన్నదే ముఖ్యం. తాత్కాలిక ఆనందాలు, సుఖాలు తర్వాత జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో, ఎటువంటి పతనావస్థకి చేరుస్తాయో వారికి సరైన పద్ధతిలో వివరించాలి. మానవ విలువలతో కూడిన పెంపకాన్ని పిల్లలకు అందించాలి.
సాటి మనిషికి సహాయం చేసే అలవాటు పిల్లల్లో పెంచాలి:
మాదకద్రవ్యాలకంటే కిక్‌నిచ్చే విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక గంటసేపు కదలకుండా ఒకచోట కూర్చుని, ఒక విషయంపై శ్రద్ధపెట్టి తదేకంగా ధ్యానంచేస్తే వచ్చే కిక్ ఎన్ని మాదకద్రవ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి పనిచేసినప్పుడు, సాటి మనిషికి ఉపకారం, సహాయం చేసినప్పుడు, ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్లకు కడుపునిండా అన్నం పెట్టినప్పుడు వచ్చే కిక్ ఎంతో బాగుంటుంది. ఇటువంటి విషయాలను ప్రతీ విద్యార్థికి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్నతనంనుంచి చెప్పగలగాలి.

- డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321