Others

ఒత్తిడితో బాల్యానికి బాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల మంబయిలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సంజయ్ కోర్‌గావ్రీకర్ అనే 12 ఏళ్ల వయస్సు వున్న విద్యార్థి బ్లేడుతో చేతి నరాలు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమయానికి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించడంతో వాడి ప్రాణాలు దక్కాయి. ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించావని ఫ్యామిలీ సైకాలజిస్టు అడిగితే నిలువెత్తు న్యూనతా భావంతో, నిరాశా నిస్పృహలలో కూరుకుపోయిన ఆ విద్యార్థి ఇచ్చిన కారణాలు దిగ్భ్రాంతికరంగా వున్నాయి. ‘‘నేను మా తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం కావడాన నాపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. చిన్నతనం నుండి చదువులు, స్పోర్ట్స్, చెస్, పెయింటింగ్, క్రాఫ్ట్‌వర్క్, సంగీతం, డాన్స్ వంటి అంశాలలో కోచింగ్ ఇవ్వడంతోపాటు నేను అన్నింటా మెరుగ్గా రాణించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చేవారు.
ప్రతీ అంశంలో ఇతరులతో పోల్చి చిన్నచూపు చూసేవారు. అన్ని రంగాలలో అందరికంటే మెరుగ్గా రాణించాలన్న తపన ఒత్తిడిగా మారింది. ఇంతగా కష్టపడేకంటే ప్రాణాలు తీసుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాను’’. సంజయ్ లాంటి విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురై, మధురమైన బాల్యాన్ని ఆస్వాదించలేక, నిత్యం మానసిక సంఘర్షణకు గురవుతూ క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నవారు ఎందరో? విద్యార్థులుగా, ఉద్యోగస్థులుగా మనం సాధించలేని వాటిని, కోరికలు, ఆశయాలను మన పిల్లల అభిరుచికి వ్యతిరేకంగా వారిపై బలవంతంగా రుద్దుతూ, వారు ఎంతో శ్రమకోర్చి వాటిని సాధిస్తుంటే, అవి మన విజయాలుగా భావించి, విజయగర్వంతో పొంగిపోయే తల్లిదండ్రులు ఎందరో వున్నారు. మేము వాళ్లకు జన్మను ఇచ్చాం, వారి పాలనా పోషణా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం కాబట్టి వారు మా మాటలు వినాల్సిందే! మేము చదవాలన్న చదువులే చదవాలి! మాకు కావాల్సిన విధంగా ర్యాంకులు రావాలి! ఐఐటిలలో సీట్లు తెచ్చుకోవాలి. అందుకోసం రోజుకు 16 గంటలలైనా కష్టపడాల్సిందేనన్న విధంగా పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడం సర్వసాధారణం అయిపోయింది.
అటు ఇలాంటి మనస్తత్వం వున్న తల్లిదండ్రులకు సరిగ్గా సరిపోయే విధంగా విద్యా సంస్థలుకూడా పనిచేస్తున్నాయి. ఎల్‌కెజి నుండే బరువైన స్కూలు బ్యాగులు, ఎనిమిది గంటలపాటు స్కూలు, కంప్యూటర్లు, ప్రాజెక్టు వర్కు, హోంవర్కులతో పిల్లలకు క్షణం తీరిక ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడితే స్పెషల్ క్లాసులతోపాటు ఆదివారాలు కూడా తరగతులను నిర్వహిస్తూ పిల్లలకు చదువు తప్ప వేరే జీవితం లేదనే అభిప్రాయం కల్పిస్తున్నారు. ఇక స్కూలు వేళల తర్వాత సంగీతం, డాన్స్, కంప్యూటర్ క్లాసులు, డ్రాయింగ్, క్రాఫ్ట్‌వర్క్, వేదిక్ మ్యాథ్స్, అబాకస్, స్పీకింగ్ కోర్సు వంటి కోర్సులలో కూడా పిల్లలను చేర్పించి వారిని ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు.
ఇందువలన పిల్లలకు ఉన్న శక్తులన్నీ హరించుకుపోయి, రాత్రి అయ్యేసరికి నిస్త్రాణంగా తయారవుతున్నారు. పిల్లలకు బాల్యం అనేది ఒక అద్భుతమైన రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో వారిని స్వేచ్ఛాజీవులుగా, స్వతంత్రంగా ఎదగనివ్వాలి. వారికి కావాల్సిన విధంగా చదువుకునేలా, కోర్సులు ఎంపిక చేసుకునేలా స్వాతంత్రం ఇవ్వాలి.
అయితే ఈ ప్రక్రియలో వారిపై నిరంతర నిఘా, పరీక్ష నియంత్రణ ఎంతో అవసరం. తప్పు నిర్ణయాలు తీసుకునే సమయంలో అందులోగల తప్పొప్పులు వారికి అర్థమయ్యేలా స్పష్టంగా వివరించాలి. వయస్సుకు మించిన భారం, ఒత్తిడి వారిపై తీసుకువస్తే శారీరక, మానసిక అనారోగ్యాలు ఎన్నో చుట్టుముడతాయి. జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం 2008-2018 మధ్యకాలంలో దేశంలో సగటున 10-30 సం.ల మధ్య ముప్ఫైవేల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు లక్షలకుపైగా మానసిక ఆందోళన, నిర్వేదం, ఆత్మన్యూనతాభావం, డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్న వారి సంఖ్య ఇరవై కోట్ల వరకు వుండవచ్చునని అంచనాలు.
అందుకే పిల్లలపై ఎలాంటి ఒత్తిడి భారం లేకుండా వారిని స్వేచ్ఛాయుతులుగా, మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ధార్మిక జీవనంలో వారిని ఎదగనివ్వడం ఎంతో అవసరం. చిన్నతనం నుండే సంప్రదాయ సంగీతం, యోగా, మెడిటేషన్‌ను అలవాటు చేయడంతోపాటు వారిలో ధార్మిక, ఆధ్యాత్మిక ఆలోచనా విధానం, నాయకత్వ లక్షణాలు, ప్రేమానురాగాలు, కుటుంబ విలువలు, బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చడం, కరుణ, జాలి, మంచితనం వంటి అత్యున్నత విలువలు ఆపాదించడం కోసం రామాయణం, భారతం, భాగవతం ఇత్యాది పురాణాలను, గాంధీజీ, శివాజీ, వివేకానంద, రామకృష్ణ పరమహంస, అబ్దుల్ కలాం వంటి మహనీయుల జీవిత చరిత్రలను చెప్పాలి. ఒత్తిడికి దూరంగా, ఆహ్లాదకరమైన, ఆనందభరిమైన జీవనం మన పిల్లలకు ఇవ్వాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులపై, విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రభుత్వంపై వుంది.

-సి.ప్రతాప్