Others

గోండుల కోసం గర్జించిన గళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు కుంరం భీం 78వ వర్ధంతి
*
గోండుల హక్కుల సాధన కోసం ‘జంగ్ సైరన్’ మోగించిన ఓ పోరాట యోధుడి జీవిత చరిత్ర ఈ ప్రపంచానికి తెలియాల్సి ఉంది. ఆ మహావీరుని పోరాట పటిమ, అరాచక శక్తులపై ఆయన సాగించిన సమరం గురించి నేటి తరం వారు తెలుసుకోవాలి. ఆదివాసీ పోరాట యోధుడు కుంరం భీమ్ జీవితానికి సంబంధించి తగినంత ప్రచారం లేదనే చెప్పాలి.
స్వాతంత్య్రానికి పూర్వం మన దేశాన్ని తెల్లదొరలు, తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. అడవితల్లి ముద్దుబిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం అనాదిగా అష్టకష్టాలు పడుతున్నారు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే హతమార్చడమే జవాబుగా నిజాం సర్కారు సాగిస్తున్న పాశవిక పాలనలో అడవంతా అల్లాడింది. అడవిబిడ్డల ఆక్రందనల నుంచి ఓ పున్నమి రాత్రి హోళి పండుగనాడు పుట్టుకొచ్చింది ఓ కొదమసింహం. అతడే కుంరం భీం. అమాయక గిరిజనుల కళ్లలో ఆయన రుధిరజ్వాలలు రగిలించినాడు. గిరిజనులను ఏకం చేసి, అన్యాయానికి వ్యతిరేకంగా జోడేఘాట్ కొండల్లో రగల్ జెండా ఎగరవేశాడు. పోలీసులను, అధికారులను బంధించి, నిజాం దొరలకు సవాల్ విసిరాడు. కొరకరాని కొయ్యగా తయారైన కుంరం భీంను అణగదొక్కేందుకు నిజాం ఆదేశాలతో పెద్దఎత్తున పోలీసులు జోడేఘాట్‌లో దిగారు.
ఓ పున్నమిరాత్రి దొంగ దెబ్బతీసి కుంరం భీంను నిజాం పోలీసులు హతమార్చారు. అది ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి (1-9-1940). కుంరం భీం పుట్టినరోజు కూడా పౌర్ణమి నాడే. చారిత్రాత్మక గిరిజన పోరాట యోధుని వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ ఉండడం మంచి పరిణామం.
జల్, జంగిల్, జమీన్, హమారా.. భీం పోరాట నినాదం. స్వయం పాలన ఆయన ఆశయం. ‘మా ఊళ్ళో మా రాజ్యం’ అంటూ నిజాం సంస్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని జోడేన్‌ఘాట్, పట్నాపుర్, బాటేఝరి, నర్సాపుర్, కల్లెగాం, చాల్‌బడి, బొయికన్, మోహడ్, భీమస్‌గోంది, అంకుసాపుర్, దేవునిగూడెం, గోగినవమోహడ్ మొదలైన 12 గూడల గోండులు తుడుం దెబ్బ మ్రోగించారు. కుంరం భీం తన పోరాటాన్ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేలోపే నిజాం సర్కారు దాడి ముమ్మరం అయింది. సెప్టెంబర్ 1న జరిగిన దాడి నిజాం పోలీసులు, అధికారుల క్రూరత్వానికి పరాకాష్ఠ.
‘జల్ జంగిల్ జమీన్’ నినాదంతో ఉద్యమించిన భీం ఆత్మార్పణం చేసి నేటికి 78 సంవత్సరాలు గడిచాయి. 1940 సెప్టెంబర్ 1న నిజాం పోలీసులతో జోడేఘాట్‌లో జరిగిన ముఖాముఖి యుద్ధంలో భీం నేలకొరిగాడు. ఆయనతోపాటు సుమారు 200మంది గిరిజనులు అసువులు బాశారు. భీం మరణించినప్పటికీ, ఆయన రగిలించిన ఉద్యమం ఇప్పటికీ సజీవంగానే ఉన్నది. అన్ని తాలూకాల నుంచి ఘర్‌పట్టి, నాగర్‌పట్టి, చౌభినా, బంచరాయి భూముల శిస్తులను నిజాం ప్రభుత్వ అధికారులు బలవంతంగా ఆదివాసీ ప్రజల నుండి వసూలు చేసేవారు. వారి అనుమతి లేనిదే అడవిలో ఏ పని చేయడానికి ఆస్కారం లేదు. నిజాం ప్రభుత్వం ప్రజలపై చాలా క్రూరంగా ఆధిపత్యం చెలాయించేది. అమాయక ఆదివాసీ ప్రజలు ఆ క్రూరత్వాన్ని ఏళ్ల తరబడి వౌనంగా భరించారు. అటువంటి సమయంలో కుంరం భీం గిరిజనులలో చైతన్యం తీసుకువచ్చి, నిజాం ప్రభువులపై యుద్ధం చేయడం ప్రారంభించాడు. అధికారుల వద్ద నుంచి బల్లెం, బర్చి, బాణం వంటి ఆయుధాలను చేసుకొని వారిపై యుద్ధం చేశాడు.
1 సెప్టెంబర్ 1940న అసలు యుద్ధం విషయమై ఇప్పటికి కూడా స్పష్టత లేదు. నిజాం సర్కారు చేసిన ప్రకటన సారాంశంలో ఇలా ఉంది.. ‘అయిదేళ్ల క్రితం ఓ గోండు ఈ రాష్ట్రంలోకి వచ్చి, ఆసిఫాబాద్‌కు 12 మైళ్ళ దూరంలో ఒక అడవిలో మకాం వేసినాడు. అచట 300 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు. కొందరు శిష్యులు కూడా అతనికి జత కూడినారు. ఆ గ్రామ పటేల్ ద్వారా తాలూక్దార్ గోండులకు రాయబారాలు పంపినారు. కాని గోండులు మాత్రం- మళ్ళీ రాయబారానికి వస్తే పటేల్‌ను చంపేస్తామని చెప్పినారు. మరుసటిరోజు తుడుందెబ్బ మోగించారు. పోలీసువారు 800 అడుగుల ఎతె్తైన గుట్టను భద్రముగా ఎక్కినారు. నాలుగు గంటలపాటు తాలూక్దార్ వారికి బుద్ధిరావాలని చాలా ప్రయత్నం చేసినా లాభం లేకపోయేసరికి గోండులను కాల్చినాడు. గోండు నాయకుడు పోలీసువారికి 10 గజాల దూరంలో కిందపడి చనిపోయాడు. అతని బంధువు కూడా చనిపోయాడు. 8 మంది అక్కడికక్కడే చనిపోయినారు. 13 మందికి తుపాకీ గుళ్ల దెబ్బలు తగిలినవి. మిగతావారు అడవిలోకి పారిపోయినారు’. ఈ ప్రకటనలో అవాస్తవాలను చొప్పించి నిజాం సర్కార్ సమర్ధించుకుంది.
కానీ, కొన్ని వాస్తవ విషయాలతో పాటు పోలీసు కాల్పుల ఘటన అందరినీ కదిలించినది. అప్పటికే కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పరచుకున్న బద్ధం ఎల్లారెడ్డి హుటాహుటిన ఆసిఫాబాద్ వెళ్ళి, ఆసుపత్రిలో క్షతగాత్రుల నుండి వివరాలు సేకరించారు. ఆ వివరాలన్నీ గోలకొండ పత్రికకు వ్రాశారు.
తమను ఎదురించాడనే కోపంతో రగిలిపోయిన తాలూక్దార్ (కలెక్టర్) జంగ్లత్, మద్దుర్ కలిసి 100 మంది జవాన్లను, 40మంది అరబ్‌లను వెంటబెట్టుకొని తెల్లవారుజామున 4-00 గంటలకు బాబేఝరికి చేరుకున్నారని, గాఢ నిద్రలోఉన్న ఆదివాసి గోండులపై కాల్పులు జరిపారని, పారిపోతున్న వారిని, చెట్లచాటున దాక్కున్నవారిని వెతికిమరీ కాల్చేశారని తెలిసిందని ఎల్లారెడ్డి తన నివేదికలో పేర్కొన్నారు. గూడెంలో ఉన్నటువంటి కోళ్ళు, గొర్రెలను సైతం నిజాం పోలీసులు ఎత్తుకుపోయినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, స్థానిక అధికారులు గోండులపై క్రూరమైన విధానాలను అవలంబించారని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీలపై అంతటి కాఠిన్యత అవసరంలేదని ఇద్దరు వకీళ్ళు చేసిన ప్రకటన ఉర్దూ పత్రిక ముషిరే దక్కన్‌లో ప్రచురితమైనది. చనిపోయిన వారి పట్ల లెక్కలేదని, సంఘటన స్థలానికి ఎవ్వరినీ వెళ్ళనీయకుండా ప్రభుత్వ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అందులోవారు వివరించారు.
కుంరం భీం ఉద్యమ ప్రస్థానాన్ని తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ఎథనాలజిస్ట్ పైమన్‌డార్ఫ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది. జోడేఘాట్ ఉదంతం పత్రికలకెక్కడంతో ఈ ఘటనపై పలువురు సమాజ సేవకులు, నాయకులు స్పందించారు. అసిఫాబాద్‌కు చెందిన న్యాయవాదులు అడవిలోకి వెళ్ళి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ కాల్పుల ఘటనమీద విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు గోండులపై దారుణ కృత్యాలకు పాల్పడ్డారని వారు చెప్పారు. వందల మంది గిరిజనుల శవాలను కుప్పలుగా పోసి దహనం చేయగా కిలోమీటర్ల మేర దుర్వాసన వస్తూనే ఉందని, అక్కడ కనీసం మంచినీరు కూడా త్రాగే పరిస్థితి లేదని వారు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీ వేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రజానాట్యమండలి సంస్థ ఇద్దరు న్యాయవాదులతో కమిటీని ఆసిఫాబాద్‌కు పంపించింది. వారే కాకుండా వివిధ సంస్థలలో పనిచేస్తున్న రాజకీయ ప్రముఖులు యం.నర్సింగరావు, కాశీనాథరావు, రామాచారి బాటేఝరిలో పర్యటించారు. అధికారుల దుశ్చర్యలను తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వం గిరిజనుల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుంరం భీం పోరాటం ఫలితంగా గిరిసీమల పరిరక్షణకు రూపొందించిన 1/70 చట్టం, పేసా చట్టం నేడు అపహాస్యానికి గురవుతున్నాయి. ఫలితంగా స్వతంత్య్ర భారతదేశంలోనూ బాటేఝరే, జోడేఘాట్ ఘటనలు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. 12 గ్రామాలపై స్వయంపాలన కావాలంటూ 78 సంవత్సరాల క్రితం కుంరం భీం రాజేసిన నెగడు నిత్యం ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా మండుతూనే ఉంది. అభివృద్ధి పేరిట సాగిస్తున్న విధ్వంసంలో ఆదివాసీలు సమిధలవుతూనే ఉన్నారు. వారిని అడవుల నుంచి, భూముల నుంచి తరిమేస్తున్నంత కాలం బాబేఝరి, జోడేఘాట్ లాంటి తిరుగుబాట్లు అనివార్యమవుతూనే ఉంటాయి.

-తేజావత్ నందకుమార్ నాయక్ 9000 222 550