AADIVAVRAM - Others

పేదపిల్లల నేస్తం.. డ్రైవర్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను పెద్దగా చదువుకోలేదని అతడు దిగాలు పడలేదు.. తనకు ఎలాంటి ‘డిగ్రీలు’ లేకున్నా, పేదింటి పిల్లలను చదువులో తీర్చిదిద్దాలన్నదే అతడి నిరంతర తపన.. ఆ ధ్యేయంతోనే తాను సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని పేదపిల్లలను చదివించేందుకు పెద్ద మనసుతో కృషి చేస్తున్నాడు.. పేదరికం ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసు గనుక అతను చదువుకు దూరమైన పిల్లలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నాడు. పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు జీవనోపాధి కోసం పనులకు వెళ్లడంతో చిన్నారుల బాగోగులను పట్టించుకొనేవారే ఉండరు. కొన్ని ఇళ్లలో తండ్రులు మద్యానికి బానిసలు కావడం, తల్లులు పాచిపనులకు వెళ్లడంతో ఇక పిల్లలు బడిబాట పట్టే అవకాశమే లేదు.. ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన ఆటోడ్రైవర్ రాజా పేదపిల్లల విద్య కోసం నడుం బిగించాడు..
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాజా ఆటో నడుపుతూ తన సంపాదనలో అధిక భాగాన్ని పేదపిల్లల చదువు కోసం ఖర్చు చేస్తూ స్థానికుల ప్రశంసలు పొందుతున్నాడు. తమకు ఆసరాగా ఉండాలని కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను పనుల్లోకి పంపడం అన్యాయమని, బడివయసు బాలలను తరగతుల్లో చేర్చాలని రాజా తపన పడుతుంటాడు. ఆటో నడపగా వచ్చే డబ్బులు తన దైనందిన అవసరాలకు సరిపోకున్నా- డ్రైవర్ రాజా పేద పిల్లలకు పుస్తకాలు, దుస్తులు కొని ఇస్తుంటాడు. నిరుపేద పిల్లలను చదివించడంలో ఉన్న ఆనందం తనకు ఎక్కడా లభించదని ఆయన ఎంతో ఆత్మసంతృప్తితో చెబుతుంటాడు.
పేదపిల్లలకు అండగా నిలవాలన్న సంకల్పంతో మొదలైన డ్రైవర్ రాజా ‘అక్షర ఉద్యమం’ ఇపుడు ఎంతగానో విస్తరించింది. మొట్టమొదటిగా అతడు ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థిక సాయం చేశాడు. ప్రస్తుతం రాజా చేసిన సహాయంతో దాదాపు పదమూడు వందల మంది విద్యార్థులు పాఠశాలకు వెళుతూ హాయిగా చదువుకుంటున్నారు. పదో తరగతి వరకూ విద్యార్థులకు అండగా ఉంటే చాలు, ఆ తర్వాత వారంతట వారే చదువులో దూసుకుపోతారని రాజా చెబుతుంటాడు. పుస్తకాలు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేని పిల్లలకు ఆర్థిక సాయం చేయడమే కాదు, వారికి అవసరమైన స్కూలు బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, లంచ్ బాక్స్‌లు, దుస్తులు వంటివి రాజా కొని ఇస్తుంటాడు. ప్రతి విద్యార్థి కోసం ఏడాదికి కనీసం 1,700 రూపాయలు ఖర్చు పెడుతున్న రాజాను మిగతా ఆటోడ్రైవర్లు అభినందిస్తున్నారు. పేద పిల్లల కోసం తన సంపాదనను ఖర్చు చేస్తున్నా ‘మనసున్న మారాజు’ గనుక డ్రైవర్ రాజాకు ఎలాంటి కష్టాలు లేవని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల చదువు కోసం డబ్బులు ఖర్చు చేయడమే కాదు, వారి ఆరోగ్యం గురించి కూడా రాజా శ్రద్ధ చూపుతుంటాడు. పేద పిల్లలకు తరచూ వైద్య పరీక్షలు చేయిస్తుంటాడు. ఆరోగ్యంగా ఉన్నపుడే బాలలు చదువులో బాగా రాణిస్తారని అంటాడు. హెచ్‌ఐవీ సోకిన పిల్లల్లో ఆత్మస్థయిర్యాన్ని కలిగించేందుకూ కృషి చేస్తున్నాడు. పిల్లలను ఆటపాటల్లో ప్రోత్సహించినపుడు వారు శారీరకంగా, మానసికంగా శక్తిని పుంజుకుంటారని చెబుతుంటాడు. పిల్లల మధ్య సరదాగా గడిపేందుకు ఇష్టపడే డ్రైవర్ రాజా వారికి పలురకాల పోటీలు పెడుతూ బహుమతులను సైతం ఇస్తుంటాడు.