Others

ప్రలోభాలకు లొంగితే.. ఓటుకు విలువెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప!
దానాలన్నింటిలో వాగ్దానం అతి తేలిక!!
ప్రజల బాగోగులను ఎంత మాత్రం పట్టించుకోకుండా.. నేతలుగా రాణించాలనుకునే వారు వాగ్దానాలు ఇవ్వడం ఎంతో సులువు. ఎన్నికల సీజన్‌లో అయితే- ఆచరణ సాధ్యం కాని హామీలను అంతూపొంతూ ఉండదన్న విషయం ప్రజలకూ తెలుసు. నిజం మాట్లాడవలసివస్తే వీరు, వారన్న తేడాలెంత మాత్రం లేక మన నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీపడేది వాగ్దానాల్లోనే తప్ప ప్రజాహితంలో ఎంతమాత్రం కాదన్నది ఎవరైనా అంగీకరించాల్సిన నిష్ఠుర సత్యం. జనహితానికో, భావితరాలను దృష్టిలో వుంచుకొని ఆలోచించే వారైనా, ప్రజల కోసం పనిచేసే వారైనా- ఎక్కడైనా ఉంటే అలాంటి నేతల సంఖ్య బహు స్వల్పం.
ప్రజాసంక్షేమం పట్టని నాయకులకు జనం ఓట్లు మాత్రం కావాలి. అన్ని కుటుంబాల్లోని, వీధిలోని వారందరి ఓట్లుకూడా కావాలి. ఎన్ని హామీలు చేసైనా తాను ప్రజాప్రతినిధిగా గెలవాలన్నదే ప్రతి నాయకుడి తపన. ‘జనానికి ఏమి కావాలి? జన సంక్షేమం కోసం ఏం చేయాలి?’ అన్న విషయాలను మరవడంలో చాలామంది నాయకులు ముందు వరసలోనే వుంటారు.
సమాజ హితం ఎంత మాత్రం పట్టకపోయినా-
ఒక నేత తననే ఆశీర్వదించాలని..
ప్రత్యర్థిని ఓడించాలని..
అధికార పగ్గాలు అందించాలని..
తనను మాత్రమే నమ్మాలని..
ప్రత్యర్థి మాటలకు మోసపోవద్దని.. ఇలా మన నాయకులు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తునే వున్నారు.
మద్యం ఏరులై పారుతున్నా...
నోట్ల పంపిణీ సాగుతున్నా...
వింత వింత బహుమతులు...
కుటుంబానికో ప్రత్యేక ప్యాకేజీ...
కాదంటే ఇంకొకటి, లేదంటే మరొకటి...
ఏ రూపంలో ప్రజలు ప్రలోభాలకు లొంగిపోతున్నా- ఈ పరిస్థితులు వాస్తవ రాజకీయాలకు ప్రతీకలే.
రకరకాల ప్రలోభాలకు లొంగిపోయిన ఓటరు తన విలువను తానే దిగజార్చుకుంటున్నాడు! ఓటర్లను ఎవరు ఏ రకంగా ప్రలోభపెట్టినా గెలిచేది ఒక్కరే. ఓడినవారి పరిస్థితి మాటలకందనిది. ప్రజాప్రతినిధిగా గెలిచినవారు చేసే ప్రతిజ్ఞల తీరెలావున్నా- పలు సాకులతో అధికార పార్టీకి దాసోహమనడమే. ప్రజలు ఏవగించుకున్నా- వీలైనంత మేరకు దోచుకునే అవకాశాలు వెతుక్కుంటూ- నేతలు తమ ఇళ్లను సుసంపన్నం చేసుకోవాలి కదా! ప్రజలు కోరుకుంటున్నదేమిటో మరచిపోయి, తన పొట్టనిండితే దారిద్య్రం తీరినట్లేనని భావించే నేటి ప్రజాప్రతినిధులకు- పార్టీలు మారడమైనా, మరొకరితో జతకట్టడమైనా నల్లేరుపై నడకే! పదవులే పరమావధిగా సాగే రాజకీయాల్లో ఓటు పవిత్రతగాని, జనహితం కాని, వారి భవిత కాని నాయకులకు పట్టవు.
చట్టసభలకు ఎన్నికలు నిర్ణీత సమయానికే జరిగినా, ముందస్తుగా జరిగినా ప్రతిసారి గెలిచేది నాయకులే, ఓడిపోయేది అమాయక జనమే. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులన్నది వినడానికి బాగున్నా, అది నిజ జీవితంలో అంతగా కన్పించడం లేదు. రాజకీయ నాయకులు ఎవరికివారు తమ ఉనికిని చాటుకునేందుకు ఎదుటివారి వైఫల్యాలను ఎండగడుతున్నారు తప్ప తాము ప్రస్తుతం చేస్తున్నదేమిటి? భవిష్యత్తులో చెయ్యబోయేదేమిటో కనీసం మాటవరసకైనా చెప్పలేకపోవడం ఎంత విచారకరం!
మెరుగైన ఆలోచనల నుంచి ఆరోగ్యకరమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. ప్రతి ఒక్కరూ నిజాయితీగా వ్యవస్థలో తాను సైతం ఒక భాగమనుకుంటే ఆ వ్యవస్థ మరింతగా రాణిస్తుంది. కాసేపు ఓట్లు, సీట్లు అనే పదాలను నేతలు పక్కన పెట్టాలి. ‘నేనేమి పొందాను, ఇంకేమి పొందాలన్న’ ఆలోచనను వారు విడనాడాలి. నిజాయితీగా ఈ వ్యవస్థ కోసం ఏమివ్వగలిగాను? భవిష్యత్తులో ఇంకేమివ్వగలనన్న కనీస స్పృహ ఎందరు నేతల్లో ఉంది?
రాజకీయ పలుకుబడితో, అధికార మదంతో, బాధ్యతారాహిత్యంతో ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న వారిని ప్రజలు గమనిస్తుండాలి. వ్యవస్థలను నిర్వీర్యం చేసే వారికి ఓటరు దేవుడే దిమ్మదిరిగేలా తీర్పు ఇచ్చితీరాలి.
ఈ పార్టీ, ఆ పార్టీ అని ఆలోచించకుండా- ఉన్నవారిలో కొంచెమైనా మంచి లక్షణాలు కలిగిన నేతలను ఎంపిక చేసుకోవాలి. తమ సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తామనే ప్రజల గురించి నేతలు ఆలోచించాలి. వారు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం తామే అని నాయకులు గుర్తించాలి. ఎంతగా విసిగిపోతే, ఎన్ని ప్రయత్నాలు చేసినా తమను పట్టించుకున్నవారు లేరనుకుంటే ప్రజల్లో ఆ రకమైన అసంతృప్తి ఆగ్రహంగా మారుతుందనేది నేతలు ఆలోచించాలి.
మోసగించడం నేతల తీరైతే- మోసపోయేందుకే ప్రజలున్నారా? ప్రజలంటే కులాలు, మతాలు, ఓటర్లు.. ఇంకొకటి, మరొకటి కాదని నేతలు తెలుసుకోవాలి. తమ పట్ల విధేయతను, విశ్వాసం ప్రకటించే వారికి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారికి ఓటర్లు పట్టం కట్టాలి. నేతలు చేసే వాగ్దానాలకు లొంగిపోకుండా వాస్తవ పరిస్థితులను ఓటర్లు అవగాహన చేసుకోవాలి. ఓటు పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత తమదేనని జనం గ్రహించినపుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు మనుగడ ఉంటుంది.

-డా. కొల్లు రంగారావు