Others

జాక్‌పాట్ కొడతారా? జావ కారిపోతారా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఒకతాటిపై నిలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పూనుకోవడం పట్ల అటు ఏపీలోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశానికి బద్ధ శత్రువులైన కరడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఈ కలయికను జీర్ణించుకోలేక పోతున్నారు. నిబద్ధత గల తెదేపా నాయకులు కూడా చంద్రబాబు చర్యలను సమర్థించుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజలొ రెండు పార్టీల ఐక్యత పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం, కాంగ్రెస్ కలయిక ఎవరికి ప్రయో జనం? ఈ కలయిక వల్ల తెలుగుదేశం ప్రయోజనం పొందుతుందా? ఏపీలో సోదిలోకి లేకుండా పోయిన కాంగ్రెస్ లాభ పడుతుందా? లేక బీజేపీ, వైఎస్‌ఆర్ కాం గ్రెస్, జనసేన పార్టీలు లాభపడతాయా? అన్నది కోటి డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ తెలంగాణ ఎన్నికల వరకే పరిమితమా? విస్తృత స్థాయిలో ము న్ముందు కొనసాగుతుందా? కేసీఆర్ హవా నేపథ్యంలో తెలంగాణలో తెదేపా ఉనికిని నిలుపు కునేందుకే మహాకూటమి నాటకానికి తెరతీశారా? తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఈ దోస్తీ ఉంటుందా? అన్నవి ఏపీలో మెజారిటీ ప్రజల సందేహాలు. మరో విచిత్రం ఏమిటంటే... మోదీపై కోపంతో, ఏపీకి ప్రత్యేక హోదా సహా పలు అంశాలలో అన్యాయం చేశారన్న సాకుతో ఎన్డీయే నుంచి వైదొలగిన చంద్రబాబు ... తెలంగాణలో తన పార్టీకి కనీసం నాలుగు స్థానాలైనా దక్కించుకునే స్థితిలో గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ కాగా, చంద్రబాబు నాయుడే ఏకంగా జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, యూపీఏని ఉద్ధరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ వాదులు ఆమోదించలేకపోతున్నారు.
చంద్రబాబు దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశం కావడం ఏపీ రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టమే. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు. ఆ నాటి నుంచి 35 ఏళలుగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ లోనూ కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీపై రాజీలేని పోరాటం సాగిస్తూ ఉంది. బద్ధ విరోధ పార్టీల కలయికను ఉభయ పార్టీల కీలక నేతల నుంచి కార్యకర్తల వరకూ వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, వట్టి వసంతకుమార్, రామచంద్రయ్య, అంతకు ముందే నాదెండ్ల మనోహర్ వంటి వారు నిష్క్రమించారు. మరి కొంతమంది కీలక నాయకులు వలస పట్టే యోచనలో ఉన్నారు.
మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ చచ్చినా కలవదు అన్న డిప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు చర్యలను సమర్థించలేక, మంత్రి పదవులు ఎక్కడ పోతాయోనన్న భయంతో నోళ్లకు తాళాలు వేసుకున్నారు. కానీ, నిబద్ధత కల్గిన కార్యకర్తల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి అది కమ్మ పార్టీగా, కాంగ్రెస్ రెడ్డి పార్టీగా ముద్ర పడి పోయాయి. ఆయా సామాజిక వర్గాలే ఆ పార్టీలకు పట్టుకొమ్మలుగా నిలిచి పెంచి పోషిస్తున్నాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని ఆయా సామాజిక వర్గాలు ఆమోదించలేకపోతున్నాయి. రాజకీయ కంపల్షన్ అన్న మాట చంద్రబాబు వాడినా, రెండు కులాలకు చెందిన నాయకులు అంగీకరించడం లేదు. ఈ దశలో కలిసి పనిచేయడం ఎలాగో అర్థం కాదు.
తెలంగాణ విషయానికి వస్తే.... తెదేపాతో కలిసి మహాకూటమిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకూ లాభకరం అన్న సందేహం ఆ పార్టీ వర్గాలలో ఉంది. 40 ఏళలుగా ఉప్పు, నిప్పు మాదిరిగా ఉన్న పార్టీల కార్యకర్తలు నాయకుల కౌగిళ్లను చూసి ఇప్పుడు కలిసి పోతారా? కలిసి పని చేస్తారా? ఒక పార్టీ ఓట్ బ్యాంక్ మరో పార్టీకు నిస్సంకోచంగా ఓటు వేస్తుందా? ఈ కలయికను వ్యతిరేకిస్తున్న వర్గాలన్నీ ప్రత్యామ్నాయంగా టీఆర్ ఎస్ వైపు వెళ్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. కెసీఆర్ కోరుతున్నది అదే.. చంద్రబాబు కాంగ్రెస్‌ను ముద్దు పెట్టుకోవడంతో తమకు లాభం చేకూరుతుందని టీఆర్‌ఎస్ వర్గాల వారు సంబరపడుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో ఉన్నంత దారుణమైన స్థితిలో లేదు. అయినా కేసీఆర్ ను ఓడించేందుకు తెలుగుదేశంతో పొత్తు అనివార్యమని టీ-కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను నమ్మించేందుకు యత్నిస్తున్నారు. నామ మాత్రంగా ఉన్న తెదేపా ఓట్లపై ఆధారపడి 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నదని కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఢిల్లీలో పరిణామాలు తెలంగాణ మారు మూల గ్రామాల్లోని కార్యకర్తలనుంచి ఉన్నత స్థాయి నాయకుల వరకూ మింగుడు పడడం లేదు. పార్టీ టికెట్ ఆశిస్తున్న కింది స్థాయి నాయకులలో గుబులు లేపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఈ పరిణామాల పట్ల కలవరపడుతోంది. అపర చాణక్యుడుగా పేరొందిన చంద్రబాబు తెలంగాణ మహా కూటమిలో చక్రం తిప్పితే, రెడ్డి కులస్థులు ప్రత్యామ్నాయ పార్టీని వెతుక్కోక తప్పదన్న ధోరణి కన్పిస్తోంది. ఈ కలయిక ఇష్టం లేని రెడ్డి సామాజికవర్గం ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రెడ్డి వర్గం అభ్యర్థులకు మరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ ఆర్ సీపీ, జన సేన పోటీ దాదాపు మృగ్యమే. అయితే ఆ పార్టీలకు కొంత కార్యకర్తల బలం ఉంది. ఇప్పుడు ఆ కార్యకర్తలు డైలమాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు లక్షల్లో ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే, ఆ పార్టీకి, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే తలంపులో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్, 108, ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఫీజుల రీ ఇంబర్స్ మెంట్ పథకాల వల్ల ప్రయోజనం పొందిన వారెందరో..! ఆ పథకాలను అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్, ఇటు కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ వైఎస్ రాజశేఖర రెడ్డిని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దుమ్మెత్తి పోసిన చంద్రబాబుతో రాహుల్ గాంధీ భేటీని బొత్తిగా ఆమోదించలేక పోతున్నారు. వీరంతా టీఆర్‌ఎస్ ను ప్రత్యామ్నాయంగా ఎంచు కుంటే.. మహా కూటమి కొంప మునిగినట్లే. ఏమైనా తెదేపా, కాంగ్రెస్ కలయిక ఏ మేరకు ఏ పార్టీకి ప్రయోజనం కల్గించిందన్నది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది. కాంగ్రెస్ పొత్తుతో తెలంగాణలో తెలుగుదేశం జాక్ పాట్ కొడుతుందా..? జావకారిపోతుందా..? అన్నది డిసెంబర్ 11న తేటతెల్లమై పోతుంది.

-మల్యాల పళ్లంరాజు