Others

వెడలిపోయితిని బిడారు విడచి.. రాత్రి చీకటిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మహాకవి ఇక్బాల్ జయంతి
*
‘‘సమస్త ప్రపంచములో
మెరుగైనది హిందూస్థానము
కల స్వనముల విహంగాలము మనము
ఇది మన నందన వనము
భారతీయులందరూ ఒకే మతానికి చెందినవారు,
మన నాగరికత చాలా గొప్పదని’’-

రోమాలు నిక్కబొడుచుకునేలా ఒకే గొంతుతో పాడుతున్న
‘‘సారే సారే జహాఁసె అచ్ఛా- హిందూసితాఁ హమారా హమారా
హంబుల్ బులుఁహైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁహమారా, హమారా.’’
పాట తలుచుకోగానే ఇంత గొప్పగా రచన చేసిన మహమ్మద్ ఇక్బాల్ వెంటనే మన మనసుల్లో మెదులుతాడు.
1877 నవంబర్ 9వ తేదీన జన్మించిన ఇక్బాల్‌కు గుండె లోతుల్లోంచి ఈ పాట ఎప్పుడు వచ్చిందో తెలుసా... ఇక్బాల్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రాన్ని అధ్యయనంచేసి, లాహోర్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకునిగా చేసేవాడు. 1904వ సంవత్సర కాలంలో లాహోర్ పట్టణంలో వై.యం.సి.ఏ. అనే ఒక సాంస్కృతిక సంస్థ వుండేది. లాహోర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి లాల్‌హర్ దయాల్ ఈ సంస్థలో సభ్యుడుగా వుండేవాడు. అతనికి ఆ సంస్థ కార్యదర్శితో తగాదా రావడంతో తానే స్వయంగా ‘యంగ్‌మెన్స్ ఇండియన్ అసోసియేషన్’ అనే సంస్థని నెలకొల్పాలని సంకల్పించాడు. ఆ సంస్థ ప్రారంభోత్సవ సభకు తమ కళాశాల అధ్యాపకుడైన మొహమ్మద్ ఇక్బాల్‌ను అధ్యక్షునిగా ఆహ్వానించాడు.
ఇక్బాల్ తన అధ్యక్షోపన్యాసాన్ని ఒక చక్కని పాటతో ప్రారంభించాడు. ఆ పాటే ‘‘సారే జహాసే అచ్ఛా హిందూ సితాహమారా...’’ తర్వాత ఆ పాటకు సుప్రసిద్ధ సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్ 1945లో ఈ పాటకి రాగ్ మిశ్రా పిలూ (హిందుస్థానీ సంగీతం) ఆధారంగా స్వరకల్పన చేయడంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ప్రొఫెసర్ అనే్స్తర్ లోబో కవాతు పాటగా స్వరకల్పన చేశారు.
‘‘హిందుస్తాన్ హమారా గీతం విన్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది. బరోడా జైల్లోవున్నప్పుడు నేను ఎన్ని వందలసార్లు ఆ గీతాన్ని పాడుకొన్నానో చెప్పలేను’’ అన్నారు మహాత్మాగాంధీ.
‘‘పారశీక, ఉరుదూ భాషలలో నాకు అంతగా పరిచయంలేని కారణంగా మహాకవి ఇక్బాల్ కవితలోని సౌందర్య మధురిమలను సంపూర్ణంగా ఆస్వాదించ లేకపోతున్నానే అనే అసంతృప్తి నాకు గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది’’ అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్.
మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు రాఖేష్‌శర్మ రోదసిలో విహరిస్తుండగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశం ఇప్పుడు ఎలా కనిపిస్తున్నది అని ప్రశ్నిస్తే ‘‘సారే జహాసె అచ్ఛా హిందూ సితా హమారా’’అని సమాధానం చెప్పాడట. కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో మహమ్మదాలీ సోదరుడు వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి నిరాకరించడంతో గాంధీజీ వందేమాతరానికి బదులు ‘సారే జహాసె అచ్ఛా’ గేయాన్ని ఆలపించవచ్చని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రధాని అయిన తర్వాత మొదటి విలేఖరుల సమావేశంలో ఈ పాటను గుర్తుచేశారు. అంతటి ప్రసిద్ధిగాంచిన గేయ రచయిత మొహమ్మద్ ఇక్బాల్.
1958లో ఉర్దూ కవి సాహిద్ లుథియాన్వి ‘‘్ఫర్ సుభహ్ హోగీ’’ అనే హిందీ సినిమాకి ఈ పాటని అనుకరణ గీతంగా రాశాడు. ఇది సామాన్యులకి పేదవాళ్ళ జీవితాలమధ్య వాస్తవికతని చూపించేలా వుంది. అంతేకాకుండా అసలు పాటలో ఉన్న ముఖ్యోద్దేశం చెడకుండా రాశారు. భారతదేశంలో అన్ని పాఠశాలల్లోను, సభలు, సమావేశాల్లో, పెరేడులలో సైనిక కవాతు గీతంగా, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవాలలో (బీటింగ్ ది ట్రీట్) ముగింపు పాటగా ప్రసిద్ధిచెందింది.
మొహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ, పారశీ భాషలలో ప్రముఖ కవి. ఇతనికి ‘‘అల్లామా’’ (మహా పండితుడు) అనే బిరుదు ఉంది. బహుముఖ ప్రజ్ఞ్ఞాశీలి అయిన కవి. మొహమ్మద్ ఇక్బాల్ 1905 సంవత్సరంలో విద్యార్జనకై ఇంగ్లండ్ బయలుదేరినప్పుడు ఢిల్లీలో ఉన్న హజరత్ నిజాముద్దీన్ దర్గాను దర్శించాడు. ఆ సమయంలో తన విద్యాయాత్ర సఫలమవ్వాలని ప్రార్థిస్తూ ‘‘ఇల్లిజాయె ముసాఫిర్’’ అనే శీర్షికతో కొన్ని పద్యాలు వ్రాశాడు. వాటిని చూస్తే ఇక్బాల్‌కున్న విద్యాతృష్ణ ఎలాంటిదో మనకు తెలుస్తుంది. లండన్‌లో బారిష్టర్ చేసిన తర్వాత జర్మనీ బెర్లిన్ విశ్వవిద్యాలయంలో ‘‘పర్షియన్ భాష- వేదాంతాల’’ మీద పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీని పొందాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో కొన్నాళ్లు ప్రొఫెసర్‌గాచేసి మ్యూనిచ్ విశ్వవిద్యాలయంలో ప్రాక్ పశ్చిమ సాహిత్యల తులనాత్మక పరిశీలనచేసి రెండవసారి పిహెచ్.డి పట్టాను పొందారు.
‘‘హిస్టరీ ఆఫ్ మెటాఫిజిక్స్ ఇన్ ప్రష్యా’’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, జనాబ్ మొహమ్మద్ జిన్నా మొదలైన జాతీయ నాయకులతో ఆయన జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు సైతం గ్రంథరూపంలో వెలువడడం విశేషం. మొహమ్మద్ ఇక్బాల్‌కు ఉర్దూ, పారశీ, ఇంగ్లీష్, సంస్కృతం మొదలైన భాషలలో లోతైన పాండిత్యం వుంది. ఆయన రచనలలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల అఖండ భారతదేశాన్ని ప్రతిబింబింపచేశాడు. ఉరుదూ, పారశీక కవులెవ్వరూ దక్షిణ భారతదేశాన్ని వర్ణించినట్లులేదు. కానీ ఇక్బాల్ కావేరీ నదిని కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధం వుండేది.
అలహాబాద్‌లో జరిగిన ఒక వార్షికోత్సవంలో మాట్లాడుతూ మొహమ్మద్ ఇక్బాల్ ‘‘మతం ప్రజలను విభజించదు- కలుపుతుంది. భారతదేశంలో ఉన్న ప్రతి వర్గం, తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటూనే పరస్పర అవగాహనతోను, సహకారంతోను వర్థిల్లాలి’’ అని ప్రబోధించాడు. 1931 మార్చి నెల 1వ తేదీన ఒక సభలో మొహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ‘‘చైనీయులు, అరబ్బులు, జపనీయులు, ఇరానీయులు తమ దేశ నామాలతో వ్యవహరింప బడుతున్నట్లు హిందూస్థానీయులమైన మనందరం కూడా హిందువులుగానే పరిగణింప బడతాం’’ అన్నాడు.
ఇక్బాల్ గొప్ప సంస్కృత పండితుడని చెప్పుకున్నాం. 1932లో ఆయన ఒక గ్రంథానికి పీఠిక రాస్తూ సంస్కృత పదాలకున్న సూక్ష్మార్థ విశే్లషణ, శబ్ద ప్రపంచంలో మఱి ఏ ఇతర భాషకు లేదన్నాడు. బుద్ధుని బోధనలను భారతీయులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఇక్బాల్ బాధపడ్డాడు. చెట్టు తన ఫలాల రుచిని తాను తెలుసుకోదన్నట్లు భారతజాతి ఆయన విశిష్ఠతను గుర్తించలేక పోతున్నదంటాడు. మానవత్వాన్ని గౌరవించడమే అసలైన సంస్కృతి అని బుద్ధుడు నొక్కి వక్కాణించడం గమనార్హం అంటాడు.
వ్యక్తిత్వాన్ని కోల్పోయి పాశ్చాత్యులకి తలొగ్గిన దేశ స్థితిని చూసి ఎంతో ఆవేదనపడిన ఇక్బాల్ కలంలోంచి వెల్లువైన ఈ ‘‘్ఫల్సఫా- యే- ఖుదీ’’ అనువాదం ఆత్మ శతకంగా బహుచిరస్మరణీయం.
విప్లవం లేని జీవితం మృత్యువుతో సమానమన్నాడు పేదలకు తిండి పెట్టలేని పొలాలను తగలబెట్టండి. మేల్కోండి పేదలారా... ధనికుల మెడలు పడగొట్టండి. బానిసల రక్తాన్ని పొంగించండి. ప్రజాస్వామ్య యుగం వస్తున్నది అని ఎలుగెత్తి చాటాడు.
నీలో విప్లవం పుడితే/ నాలుగు దిక్కులు మారినా
ఆశ్చర్యం లేదు.
పొద్దు గడుపును/ కొండల్లో ఎడారుల్లో
గూటిలో బందీ కావడం/ గరుత్మంతునికి అవమానం
ఆత్మ బతికివుంటే
అపార సాగరాలు నడకతోనే దాటవచ్చు
ఆత్మబ్రతికి వుంటే
కొండ వరుసలు మఖమల్ వలె మెత్తన
ఆత్మ బతికి వుంటే/ దరిద్రుడే మహరాజు
లేకుంటే మహరాజే/ దరిద్రునికన్నా హీనుడని
ఆ దేశమునకు/ ఆయుధములతో పనిలేదు
ఏ దేశ యువకుల ఆత్మ/ ఉక్కువలె గట్టి అగునో
విద్యాద్రావకములో/ నానవేయుము నీ ఆత్మను
మెత్తన కాగా వినియోగించు
ఎక్కడ కావలసిన అక్కడ
నీవు పక్షిరాజువు/ ఎగురుటయే నీ పని
నీ యెదుట మిన్నులు
ఇంకా ఎన్నో వున్నవి. - ఇలా మనిషి ఆత్మకున్న విలువని తెలియజేసి భారతీయుల్లో ఉత్తేజాన్ని కలిగించాడు.
ఆదరణే జీవితం. ఆదరణే ఉత్తమమైనదైతే గమ్యాన్ని చేరుకోగలం అని ఒకచోట చెప్తాడు.
మానవుని ఆత్మమీద ఇక్బాల్‌కు చాలా విశ్వాసం వుంది. ఆత్మే జీవం, ఆత్మను కోల్పోవడం మృత్యువు అని చెప్తాడు. ఈయన గొప్ప కవి మాత్రమే కాదు. తత్త్వవేత్త, రాజకీయవేత్త, అలాగే విద్యావేత్త, న్యాయవాది, పండితుడు. ఉర్దూ, పర్షియన్‌లలో సాహిత్య రచన చేసిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు. ఇక్బాల్ మహా మహోపాధ్యాయుడు. అందువల్లే ఆయనను అల్లామా ఇక్బాల్ అని సంబోధించేవారు.
ఇక్బాల్ తండ్రి, షేక్ నూర్ ముహమ్మద్ ఒక దర్జీ . విద్యావంతుడు, తల్లి ఇమామ్ బీబీ సమస్యలలో పేద పొరుగువారికి సహాయంచేసి ఆదుకున్న గొప్ప మహిళ. ఎంతో ప్రేమగా చూసిన ఆమె మరణం ఇక్బాల్‌ను కుంగదీసింది. ఆమె మరణంతో అతనిలో భావోద్వేగం ఇలా ప్రతిబింబించింది-

‘‘నను కన్న వూరిలో నన్నిక కలవరించేదెవరు
నా లేఖ అందుకోలేదని నిరాశపడేదెవరు
నీ సమాధి దగ్గర నేనీ ఫిర్యాదుచేస్తున్నా...
నిశిరాత్రి ప్రార్థనలలో నా గురించి విన్నవించేదెవరు
ప్రేమాంకిత సముద్రంలో ఓలలాడించిన నీకు
నా సేవలు అందించే తరుణంలో
నువ్వు అందనంత దూరంలో...’’
ఇక్బాల్ గీతాలు ప్రకృతి వర్ణనలతో, ప్రజలకిచ్చే సందేశాలతో ఎంతో ప్రాచుర్యం పొందాయి. డా.అల్లూరి వేంకట నరసింహరాజుగారి అనువాదంలో ఈ గీతాలు-
వెడలిపోయితిని బిడారు/ విడచి రాత్రి చీకటిలో
ఏల కాదు నా నాద/ జ్జ్వాల నీకు చిరు దీపము
అహం ఎంత చేదైనదో/ అవగాహన కలదు నీకు
నీ వ్యాధినిబట్టి నీవే/ నిర్ణయించుకో మందును
వాగుప్రక్క ప్రమయు అను/ రాగమ్మున మత్తిల్లిన
చిలుకలు, గోర్వంకలు కల
కల నాదము సేయుచుండె
తెల్లని కొంగలు అవిగో/ నల్లని కోకిల లివిగో
తనుల విందు అటు చూచిన
కర్ణపేయ మిటు తిరిగిన
మానవత్వం, శాంతి, ప్రజలతో స్నేహభావం ఉండాలనే ఇక్బాల్ ఆదర్శాలు ఉన్నతమైనవి. మానసిక బలహీనత, వివక్షత, అణచివేత మొదలైన వాటికి వ్యతిరేకత చూపించి ఉన్నతమైన దృక్పథంతో ముందడుగు వెయ్యాలని చెపుతుండేవాడు. 1924లో మూత్ర పిండాల వ్యాధికి గురయ్యాడు. రెండవ భార్య మరణం తర్వాత 1938లో ఆయన ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించి ఏప్రిల్ 21వ తేదీన ఇక్బాల్ శాశ్వతంగా కన్నుమూశాడు. ఇక్బాల్ వంటి మహామేథావి, బహుభాషావేత్త, జాతీయవాది, క్రమంగా స్మృతి పథాలలో నుంచి మరుగునపడడం విచారకరం. ఆయన భవ్య స్మృతి నేటి యువతరానికి ఎంతైనా స్ఫూర్తినిస్తుంది.

-నాగలక్ష్మి దామరాజు