Others

పురోగమనమా? తిరోగమనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలభై ఏళ్ళ క్రితం మాట. అప్పుడు నేను నాలుగవ తరగతి చదువుతున్నాను. సైకిల్ షాపులో పావలా ఇస్తే గంట సేపు సైకిల్ అద్దెకి ఇస్తారు. నా ఈడు పిల్లలందరికీ సైకిల్ తొక్కాలని మహాసరదాగా ఉండేది. పెద్దవాళ్ళ సైకిల్ తొక్కాలంటే సీటు అందదు. ఫెడల్స్‌మీద కాళ్ళు పెట్టి అడ్డ తొక్కుడు తొక్కేవాళ్ళం. సైకిల్ షాపులో పిల్లలు తొక్కుకునే చిన్న సైకిల్ అద్దెకు ఇస్తారు. నేను దాచుకున్న డబ్బులతో అప్పుడప్పుడు అద్దె సైకిల్ తీసుకుని తొక్కటం నేర్చుకున్నాను. మొట్టమొదటిసారిగా అందరికన్నా ముందుగా సీటుమీద కూర్చుని తొక్కుతూంటే నా స్నేహితులందరూ నన్ను హీరోని చూసినట్లు చూశాడు.
ఆ ఉత్సాహంతో మా ఇంట్లో కూడా అందరి మెప్పు పొందాలని సైకిల్ తొక్కుకుంటూ వచ్చాను. ‘‘బామ్మా! ఎలా తొక్కుతున్నావో చూడు!’’ అంటూ గర్వంగా చెప్పాను. వత్తులు చేసుకుంటూ కూర్చున్న ఆవిడ ఊడిపోగా మిగిలిన నాలుగు పళ్ళతో పళ్ళు పటపట కొరికి ‘‘పిదపకాలం.. పిదప బుద్ధులు’’ అని గొణుక్కుంది. మా నాన్నగారు అది చూసి ‘‘ఇంకోసారి నీ చేతిలో సైకిల్ చూశానంటే వీపు పగలగొడతాను, వేధవా!’’ అన్నారు. అందరూ మెచ్చుకుంటూంటే ఇంట్లో వాళ్ళు చీవాట్లు పెడతారేమిటి? అనుకుంటూ చిన్నబోయిన మొహంతో అమ్మ దగ్గర కూర్చున్నాను.
‘‘చూశారా! అత్తయ్యగారూ! పిల్ల సన్నాసి ఏదో ముచ్చటపడి సైకిల్ తొక్కుతూంటే మీ అబ్బాయి ఎలా అంటున్నారో!’’ అన్నది అమ్మ.
‘‘లేకపోతే ఏమిటే! చక్కగా ఆడుకుంటూ శరీర దారుఢ్యం పెంచుకోవలసిన వయసులో అలుపు తెలియకుండా ఈ సైకిళ్ళేమిటి? పిల్లల తెలివితేటలే వాళ్ల ఆరోగ్యాన్ని మింగేస్తున్నాయి’’ అన్నది బామ్మ.
‘‘మీకు తెలియదేమో! సైకిల్ తొక్కటం కూడా వ్యాయామమే!’’ అన్నది అమ్మ.
‘‘ఏదైనా నడక ముందు తీసికట్టే!’’ అంటూ కొట్టిపారేసింది బామ్మ.
బామ్మ మాటలు అప్పుడు అర్థం కాలేదు గానీ పెద్దయిన తర్వాత అర్థం అయింది. ఇంట్లో అన్నం వండటానికి కుక్కర్లు, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లు, పిండి రుబ్బటానికి గ్రైండర్లు, మిక్సీలు.. ఇంకా అన్ని పనులకీ కష్టం తెలియకుండా మిషన్లు వాడుతున్నారు. మగవాళ్ళు కూడా పక్క వీధిలో షాపుకి వెళ్ళటానికి బైక్ బయటకు తీస్తున్నారు. ఆఫీసునుంచీ రాగానే టీవీ ముందు కూర్చుంటున్నారు ఇక శరీరానికి వ్యాయామం ఎక్కడుంది? దాంతో బీపీలు, షుగర్లు మేమున్నామంటూ కూడబలుక్కున్నట్లు జంటగా వచ్చేస్తున్నాయి. ఇక ప్రతి ఒక్కరికీ కళ్ళజోళ్ళు తప్పనిసరి. డాక్టర్ దగ్గరికి వెళితే ప్రతిరోజూ వాకింగ్ చేయమని చెబుతారు. ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మాటే అది. పెద్దలు చెబితే తలకెక్కలేదు. వేలకి వేలు ఖర్చుబెట్టి టెస్ట్‌లు చేయించి డాక్టర్లు చెబితే వింటున్నాము.
ఇదంతా పదేళ్ళ క్రితంవరకూ వున్న పరిస్థితి. ఇపుడు ఆడ, మగ, పిల్లలు అనే తేడా లేకుండా మందుబాబుల్లా అందరూ సెల్‌ఫోన్లకి అలవాటుపడిపోతున్నారు. ఆటలు, పాటలు అదృశ్యమైపోయాయి. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయడం తగ్గిపోయింది. వీధి వీధికీ టిఫెన్ బండ్లు, కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి. అవన్నీ ఎప్పుడు చూసినా జనంతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. అదేమంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నాం, వంట చేసే టైం లేదు అంటారు. ఆరుబయట, తోపుడుబళ్ళ మీద తయారుచేసే ఆహారం తిని హాస్పిటళ్ల పాలవుతున్నారు. ఒక చేత్తో సంపాదించినదంతా మరో చేత్తో హాస్పిటల్‌కి ఖర్చుపెట్టాల్సి వస్తూంది. ఈ రోజుల్లో చదువులకీ, ఆరోగ్యానికీ పెట్టినంత ఖర్చు మరి దేనికీ ఖర్చుపెట్టడం లేదేమో అన్పిస్తుంది నాకు.
గతంలో టిఫిన్లు తినేవాళ్ళు తక్కువ. శుభ్రంగా కడుపునిండా అన్నం తినేవాళ్లు. రాత్రి పడుకోబోయేముందు మిగిలిన అన్నంలో పెరుగు, జీలకర్ర, ఉల్లిపాయలు కలిపి ఉంచి తెల్లవారగానే చద్దన్నం పిల్లలకు పెట్టేవారు. దానితో పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. తీరిక సమయాల్లో ఆడవాళ్ళు పెరట్లో కూరగాయ మొక్కలు పెంచేవారు. తాజా కూరలు లభించేవి. మొక్కలకు పాదులు చేసి, నీళ్ళు తోడి పోయటం వంటి పనులు చేయడంవల్ల శరీరానికి వ్యాయామం చేసినట్లు అయ్యేది. మగవాళ్ళు కూడా పొలాలకు నడిచి వెళ్ళేవారు. పొలంలో కష్టించి పనులు చేయటంవల్ల ఒక్కొక్కరు 80, 90 ఏళ్ళు సునాయాసంగా జీవించేవారు.
ఇప్పటి తరానికి కష్టం ఏమిటో తెలియదు. వ్యవసాయం అనేది చదువు లేనివారు చేసే పనిగా ముద్రపడిపోయింది. వ్యవసాయం చేసుకునే అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు తిరస్కరిస్తున్నారు.
మొన్నీ మధ్య నేను, నా భార్య భద్రాచలం వెళదామని అంటే, మా అబ్బాయి కారులో తీసుకువెళ్లి చూపించాడు. దారిలో విజయవాడలో ఆగి, కనక దుర్గమ్మ దర్శనం చేసుకుందామని బంధువుల ఇంట్లో దిగాము. మా అబ్బాయి బాపట్లలో వున్న కోడలిని కూడా తీసుకువస్తానని బయలుదేరాడు.
‘‘అంత దూరం వెళ్లి తిరిగి ఏం వస్తావు? మనం ఇక్కడ ఉన్నామని ఫోన్ చేసి, అమ్మాయిని బస్‌లో రమ్మని చెప్పు’’ అన్నాను.
‘‘చేతిలో కారు ఉంచుకుని బస్‌లో రమ్మని చెబితే కష్టాలు పెడుతున్నానని గృహహింస కేసు పెట్టినా పెడుతుంది’’ అన్నాడు నవ్వుతూ.
వాడు నవ్వుతూ అన్నా నా మనసు చివుక్కుమన్నది. నిజమే! ఈ తరం ఆడపిల్లలకి బస్‌లో ప్రయాణం చేయటం కష్టం. ఇల్లు ఊడవమంటే అవమానం. వాకిట్లో కళ్లాపి చల్లటం, ముగ్గు వేయటం ఏనాడో మర్చిపోయారు. ముగ్గు వేసేటప్పుడు రోజూ వంగోటంవల్ల పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అలవాటు పడ్డారు. చక్కగా కింద కూర్చుని భోజనం చేస్తే కాళ్ళు, కీళ్లకి ఎక్స్‌ర్‌సైజులా అవుతుంది.
మేధావులు తమ తెలివితేటలతో రకరకాల సాధనాలు కనిపెడుతున్నారు. ఆ పని తేలికగా జరిగిపోతుంది. సమయం కలిసి వస్తుంది. కానీ కాళ్లతో, చేతులతో చేయగలిగే పనులు చేయకపోతే ఆ నైపుణ్యం క్రమక్రమంగా అంతరించిపోతుంది. సుఖాలకి అలవాటుపడ్డ శరీరం జబ్బులకి స్వాగతం పలుకుతుంది. తద్వారా మనిషి జీవించే కాలం తగ్గిపోతుంది. ఇదివరకు ఎనభై ఏళ్ళ వయసులో కూడా కళ్ళజోడు లేకుండా చదివేవారు. ఇపుడు ఏడెనిమిదేళ్ళ వయసు పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. ‘పిల్లల తెలివితేటలే వాళ్ళ ఆరోగ్యాన్ని మింగేస్తున్నాయి’ అనే బామ్మ మాట నిజం అవుతూంది. పెద్దవాళ్ళు యధాలాపంగా అన్నా, అనుభవంతో చెప్పిన మాటలు అవి. ఈ పరిస్థితులన్నీ చూస్తే ఎటుపోతున్నాం మనం? ఇది తిరోగమన పయనమా? పురోగమన పయనమా! అనిపిస్తుంది నాకు.

-గోనుగుంట మురళీకృష్ణ