Others

యువత పయనం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ జనాభా 125 కోట్లు కాగా, సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య ఇప్పటికే 200 కోట్లు దాటిపోయింది. నేటి యువతలో చాలామంది సెల్‌ఫోన్ వలలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఎంతసేపూ స్మార్ట్ఫోన్‌తో గడుపుతూ ఎంతోమంది యువతీ యువకులు తమ చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక వేదికలపై విహరించేవారు కొందరైతే, మరికొందరు నిత్యం చాటింగ్‌ల్లో మునిగితేలుతుంటారు. ఇక సెల్ఫీల మాయాజాలంలో చిక్కుకుని కొందరు ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. చదువుకున్న యువతలో కొందరు డబ్బు కోసం సైబర్ నేరాలకు తెగిస్తున్నారు. ఇంకొందరు సెల్‌ఫోన్లను లైంగిక వేధింపులకు సాధనాలుగా వాడుకుంటున్నారు.
ఎక్కువ సేపు సెల్‌ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రభావం ఆరోగ్యానికి ముప్పు తెస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా యువతరం పెడచెవిన పెడుతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిదురించే వరకు కొందరికి చెవిలో ఇయర్ ఫోన్లు ఉండితీరవలసిందే. నీడపాటున కూర్చున్నా- పిట్టగోడ మీద కూర్చున్నా.. అలా ఎక్కడ నలుగురు కూర్చున్నా సెల్‌ఫోన్ అరచేతిలో ఉండి తీరవలసిందే. ట్రాఫిక్ రద్దీలో రోడ్డు దాటుతున్నా, వాహనాలను నడిపినా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటారు. సెల్‌ఫోనే ప్రపంచం - జీవితం- భవిష్యత్ అనుకుంటూ కాలం గడిపేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు- ఆరు కాయలుగా వృద్ధి చేసుకొనేందుకు నిత్యం సరికొత్త ఫీచర్లతో పలురకాల స్మార్ట్ఫోన్లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. యువతరాన్ని ఆకర్షిస్తూ కోటానుకోట్ల ఆదాయాన్ని ఫోన్ తయారీ సంస్థలు వెనుకేసుకుంటున్నాయి. యువతీ యువకులు నేడు వస్తున్న ఫోన్లను చూసి ‘కొత్తరకం’ అనగానే కొని జేబులో పెట్టుకుంటున్నారు. ఆకర్షణ - అదనపు హంగులు కలిసి సాంకేతిక జ్ఞానాన్ని ఆఫర్లతో అందు నిక్షిప్తం చేసి, రకరకాల పేర్లతో, ఆఫర్లతో డిస్కౌంట్లతో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ధర గురించి ఆలోచించకుండా ప్రతి వినియోగదారుడు రెండు, మూడు సెల్స్ వెంటబెట్టుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థల్లో భారీ జీతాలు పొందేవారే కాదు, విద్యార్థులు, ఎలాంటి ఆదాయం లేని యువకులు కూడా ఖరీదైన ఫోన్లను కొంటున్నారు. ఇలా చూస్తే కోట్లమంది వినియోగదారులు సెల్‌ఫోన్ వ్యసనానికి బానిసలయ్యారన్నది అక్షర సత్యం.
ట్రాఫిక్‌లో వెళుతూ వాహనం నడుపుతున్నా అర చేతిలో సెల్, చెవిలో హెడ్‌ఫోన్స్ ఉండవలసిందే. ఇలా వాహనాలను నడపడం వల్ల తమకే కాదు, ఎదుటివారు సైతం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని యువతీ యువకులు గ్రహించడం లేదు. నేటి విద్యార్థులు పెన్ను, పుస్తకం వంటివి మరచిపోతారేమోగాని సెల్‌ఫోన్ మాత్రం మరచిపోరు. అది అంతలా యువతరాన్ని ప్రభావితం చేసింది. సెల్‌ఫోన్లు, సామాజిక మీడియాకు బానిసలవుతున్నందున విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది, విద్యా విలువలు పడిపోతున్నాయి. నానాటికి విద్యా విధానం దిగజారిపోతుందని విద్యావేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. ఈ అభిప్రాయం నూటికి నూరుపాళ్ళు నిజమని అంగీకరించి తీరవలసిందే. గతంలో నలుగురు విద్యార్థులు కలిస్తే- ‘తర్వాత ఏం చదువుదాం? ఏ కోర్సు చేద్దాం? కోచింగ్‌కు వెళదామా? గ్రూప్1 లేదా గ్రూప్ 2కి ట్రై చేద్దామా? ఐఎఎస్, ఐపిఎస్ టచ్ చేద్దామా’ అంటూ డిస్కస్ చేసేవారు. నేడు అదే నలుగురు మిత్రులు కలిస్తే నోరు పెగలదు. అందరూ ఏకాగ్రతతో సెల్‌ఫోన్‌లో మునిగిపోతున్నారు. కనుకనే పరీక్షల్లో, ఉద్యోగాల్లో గెలుపు శాతం తగ్గుతోంది.
తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ విషయాలు చెప్పినా నేటి యువతరానికి ఇవన్నీ పట్టవు. చదువు కోసం, తమ భవిత కోసం ఆధునిక సాంకేతికను వాడుకోవచ్చన్న ఆలోచన చాలామందికి లేదు. సెల్‌ఫోన్లు దుర్వినియోగం చేస్తూ రకరకాల నేరాలకు పాల్పడుతున్నారెందరో. చాటుగా యువతుల ఫోటోలు తీయడం, వాటిని మార్ఫింగ్ చేయడం, నీలిచిత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవడం, అశ్లీల సందేశాలు, ఫొటోలు పంపుతూ అమ్మాయిలను ఏడ్పించడం వంటి నేరాలకు కొందరు యువకులు పాల్పడడం రోజూ మీడియాలో చూస్తున్నాం, పత్రికలలో చదువుతున్నాం. సెల్‌ఫోన్లను మంచి కోసం వినియోగించడం లేదంటే- నేరాల కోసం వినియోగిస్తున్నరన్నది వాస్తవం. ఈ వ్యసనంతో తమ భవిష్యత్‌ను వారే నాశనం చేసుకుంటున్నారు. కన్నవారి కలలను కల్లలుగా మిగులుస్తున్నారు. ఇంకొందరైతే చింపిరి జుట్టుతో, చినిగిన దుస్తులతో తిరుగుతూ అదే ఫ్యాషన్ అంటున్నారు. ఇదంతా అనుకరణ వల్ల వచ్చిన అవస్థలు. సినిమాల్లో తాము చూసిన వాటిని ఆచరించడమే జీవితం అని, అదే ఫ్యాషన్ అని పొరబడుతున్నారు. వీరి పోకడలను చూసి ఏమీ అనలేక తల్లిదండ్రులు వౌనంగా భరిస్తున్నారు.
చదువు, సంస్కారం, వ్యక్తిత్వం, గుర్తింపు, గౌరవం, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను కొందరు యువకులు పట్టించుకోవడం లేదు. వీటి గురించి పెద్దలు చెప్పినా వినే ఓపిక వారికి లేదు. ఫ్యాషన్లు ఇలా దిగజారుస్తున్నా, ఇంకా దాదాపు పాతిక శాతం బుద్ధిమంతులైన యువతరం ఉందని మాత్రం మరచిపోరాదు. వారే నిజమైన భావి భారత పౌరులనుకోవలసిందే. నేటి విద్యాలయాలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలనుకోవలసిందే. విద్య, విజ్ఞానముంటే కదా రంగుల భవిష్యత్ ఆచరణలో నిజమయ్యేది. సెల్‌ఫోన్ వుంటే చాలు- లోకం అవసరం లేదు, దేశం అవసరం లేదు, సమాజం అవసరం లేదు, కుటుంబ కష్టనష్టాలు అవసరం లేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు - దౌర్జన్యాలు-కుంభకోణాలు - అవినీతి - కల్తీలు- మోసాలు వంటి సమస్యలున్న సంగతి కూడా యువతకు తెలియడం లేదు.
పలు దేశాలు యువశక్తే మా ప్రగతి, మా సంపద అంటుంటే, మన యువత మాత్రం నిర్వీర్యమై చిలుము పట్టి శక్తిని కోల్పోతోంది. మహాకవి శ్రీశ్రీ ‘కొందరు యువకులు పుట్టుకతోనే వృద్ధులు’ అని ఏనాడో అన్నారు. బహుశా ఇలాంటి యువతరం- రానుందని తెలిసే ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే ఆ మాట అన్నారేమో! చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదన్న వాస్తవం గ్రహించినపుడే యువతలో కదలిక వస్తుంది.

-మురహరి ఆనందరావు