Others

దేశ భవిత నిర్ణేతలు విద్యార్థులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాదానం మహాదానం, విద్య కోసం అర్థించువాడు విద్యార్థి’ అన్నారు మన పెద్దలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా విద్యను నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక కొత్త విద్యను నేర్చుకుంటూనే వుంటారు. ఈ కారణంగా ప్రతి ఒక్కరినీ విద్యార్థిగానే భావించాలి. కానీ, నేడు విద్యార్థి అనే పదానికి పరిమితి కుదించి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీలలో చదివేవారినే విద్యార్థులుగా పిలుస్తున్నారు. పూర్వకాలంలో ఐదు సంవత్సరాలు నిండితేకానీ అక్షరాభ్యాసం చేయించి పాఠశాలల్లో చేర్చేవారు కాదు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పట్టుమని రెండేళ్లు నిండకుండానే కిండర్ గార్టెన్ స్కూల్స్, ప్లే స్కూళ్లలో పసివాళ్లకు ప్రవేశం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై, బుడి బుడి అడుగులు వేసే దశలోనే చిన్నారులు విద్యార్థులుగా మారుతున్నారు. పలక, బలపం పట్టి ‘అఆలు’ దిద్దే చేతులు ఇపుడు పెన్ను, కాగితం పట్టి ఏబీసీడీలు రాస్తున్నాయి.
ఏటా నవంబర్ 17న ‘అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని’ ప్రపంచ వ్యాప్తం గా ఆచరించడం ఆనవాయితీగా మారింది. 1939లో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో నాజీలను పొరుగు దేశాలపైకి ఉసిగొల్పాడు నియంత హిట్లర్. జెకస్లావేకియాలోని ప్రాగ్ నగరంలోని విశ్వవిద్యాలయంలోకి నాజీ సేనల ప్రవేశాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులపై అత్యంత క్రూరంగా కాల్పులు జరిపి పదిమంది విద్యార్థి నాయకులను హతమార్చి, వందలాది మంది యువకులను నాజీలు ‘కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపు’ అనే నరకంలోకి తరలించారు. ఆ దుర్ఘటన జరిగింది 1939 నవంబర్ 17న. ఆ తర్వాత మూడేళ్లకు లండన్‌లో సమావేశమైన అంతర్జాతీయ విద్యార్థుల సమైక్య మండలి- ప్రాగ్‌లో విద్యార్థుల బలిదానానికి గుర్తుగా నవంబర్ 17వ తేదీని ‘అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం’గా జరపాలని తీర్మానించింది. విద్యార్థుల పోరాటాన్ని కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా సోవియట్ యూనియన్ మలచుకుని తన అజమాయిషీలోని దేశాలలో నవంబర్ 17న విద్యార్థి దినోత్సవాన్ని నిర్వహించింది.
‘డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారంతా నిజమైన విద్యార్థులని’ ప్రపంచం నేడు అంగీకరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా వయోజన విద్యా పథకం మొదలైంది. గృహిణులు, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా ఏ స్థాయిలో, ఏ వయసు వారైనా విద్యార్థిగా కొత్త విషయాలను నేర్చుకోవాలన్నది నేటి భావన. జ్ఞాన సముపార్జన, దాన్ని సక్రమ మార్గంలో వినియోగించడం, క్రమశిక్షణ, సంకల్ప బలం వంటివి ప్రతి విద్యార్థికీ ఉండాల్సిన లక్షణాలు. పెద్దలను గౌరవించడం, సమాజం పట్ల అవగాహన విద్యార్థికి అదనపు లక్షణాలు. విద్యార్జనకు అంతం లేదని గ్రహించినవాడే నిజమైన విద్యార్థి. విద్యార్థి దశ కీలకమైంది. క్రమశిక్షణతో చదువును అభ్యసించినపుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరు సాంస్కృతిక కళారంగాలలో రాణించాలి. అయితే, ఇందుకు విరుద్ధంగా నేటి తరం విద్యార్థుల్లో చాలామంది పెడమార్గం పడుతున్నారు. విద్యార్థి దశలో తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. కొందరు విద్యార్థులు సినిమాలు, షికార్లతో, ఇంకొందరు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో విహరిస్తున్నారు. దేశభక్తి సైతం సన్నగిల్లుతోంది. వస్తధ్రారణ మార్చుకుంటూ, గెడ్డాలు మీసాలు పెంచుతూ పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తున్నారు. కాలేజీలకు డుమ్మా కొట్టడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. నాయకత్వ లక్షణాలు పెంచుకోలేకపోతున్నారు. జల్సాలకు అలవాటుపడి మత్తుపానీయాలు సేవించడం, పేకాట ఆడటం, ఇతర నేరాలకు పాల్పడడం కూడా కనిపిస్తోంది. నేటితరం విద్యార్థుల్లో సహనం లేకుండా పోతోంది. త్వరగా ఆవేశానికి లోనవుతున్నారు. విద్యార్థి దశలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమించినపుడే విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోగలడు. తద్వారా జాతి భవితను నిర్దేశించగలడు.
స్వామి వివేకానంద వంటి మహనీయుల బోధనలు నేటి తరం కుర్రకారుకు స్ఫూర్తిదాయకం. నైతిక విలువలను పెంచుకుని, సమాజ సేవకు యువత అంకితం కావాలి. స్మార్ట్ఫోన్లు, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా విద్యార్థులు తమ సత్తా చాటుకోవాలి. పుస్తకాలను నేస్తాలుగా భావించి, నైపుణ్యాలు నేర్చుకొంటే విద్యార్థులు జీవితంలో త్వరగా స్థిరపడగలరు. వారు సక్రమ మార్గంలో పయనిస్తేనే దేశానికి మనుగడ ఉంటుంది.

(నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం.....)

-- కామడి సతీష్‌రెడ్డి 98484 45134