AADIVAVRAM - Others

తొలి గజల్ సృష్టికర్త ‘జూకా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సాహిత్యంలో గజల్‌కు విశేష ప్రాచుర్యముంది. కాస్త నెమ్మదిగానైనా తెలుగులో కూడా గజల్ సాహిత్యానికి పెద్ద పీట లభించింది. దక్షిణ భారతంలో మొట్టమొదటగా ఉర్దూ - పర్షియన్ భాషల్లో గజల్స్ సృష్టించింది నెల్లూరీయుడు జూకా. జూకా కలం పేరు. యావత్ దక్షిణ భారతదేశంలో గాలిబ్ మహాకవి ఏకలవ్య శిష్యుడితనే. ఉర్దూ, పర్షియన్ భాషల్లో గాలిబ్ శిష్యులు ఇంకెవరూ ఈ ప్రాంతం నుండి లేరు. జూకా మరణించింది 1875వ సం.లో. అయినా దాదాపు 100 సంవత్సరాలు అజ్ఞాత కవిగానే మిగిలిపోయాడు. అసలు జూకా ఎవరు? జూకా గురించి కొంత తెలుసుకోవలసిన అవసరం ఉంది.
తళ్లికోట యుద్ధానంతరం 1565 సం.లో ఉదయగిరి గోల్కొండ పాలన కిందకు వచ్చింది. 1684లో ఔరంగజేబు దక్షిణాపథాన్నంతా ఆక్రమించాడు. పరిపాలనా సౌలభ్యం కొరకు దక్షిణాపథాన్ని ఆర్కాట్‌గాను, ‘సిరా’గాను రెండు భాగాలుగా విభజించారు. నిజాముల్, ముల్క్ పాలనలో ఉండింది. దక్షిణ భారతదేశంలోని మొగల్ సామ్రాజ్యాన్ని ఆరు భాగాలుగా విభజించి పరిపాలనను సులభం చేసుకున్నాడు. ఈ ఆరు భాగాలలో బీజాపూర్ ప్రాంతం చాలా పెద్దది. అందువలన బీజాపూర్‌ను మరలా రెండు భాగాలుగా చేసి బీజాపూర్, కర్ణాటక బీజాపూర్‌లుగా విభజించి, కర్ణాటక బీజాపూర్‌లో చాలా భాగానికి పాలిగాండ్లను, జాగీర్‌దార్లనూ ఏర్పాటు చేసి వారివారి జాగీర్లపై వారికి హక్కును కల్పించారు. ఆర్కాట్ కేంద్రంగా హైదరాబాద్ విభాగంలోనికి ఉదయగిరి, సర్వేపల్లిని చేర్చారు. ఆర్కాట్ మొదటి పాలకుడు సాదత్ ఉల్లాఖాన్. ఇతను నవాయితీ వంశస్థుడు.
ఉదయగిరి వ్యవహారాలు చూసేందుకు ఫౌజ్‌దారుగా ముస్త్ఫా అలీఖాన్‌ను నియమించారు. ఈ అలీఖాన్ తనకు నిర్వహణాది కార్యక్రమాలలో సహాయం కొరకు జూకా తాతను (తండ్రికి తండ్రి) హఫిజ్ మహమ్మద్ ఆలీని నియమించి ఉదయగిరికి సంబంధించిన పూర్తి బాధ్యతలను అప్పగించారు. అప్పుడే వీరు బీజాపూర్ నుండి సంసారంతో సహా ఆర్కాటుకు వచ్చి అచ్చట నుండి నెల్లూరు వచ్చారు. జూకా తండ్రి హఫీజ్ అహ్మద్ మీరా నాయతీ మరియు పినతండ్రి పరిపాలనాధికారాన్ని పొందారు. ఉదయగిరి ఆఖరి జాగీరుదారు అబ్బాస్ ఆలీఖాన్ బ్రిటీషు వారికి ఎదురుతిరిగిన కారంగా, ఖైదీగా బంధించి చెంగల్పట్టులో ఉంచారు. ఇతను అక్కడే మరణించాడు.
హఫీజ్ అహ్మద్ మీరానయతీకి ఐదుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. వీరందరూ నెల్లూరు సంతపేటలోని మహమ్మద్ గౌస్ సత్రం అని పిలువబడుతున్న చోట జన్మించారు. ఇది వీరి మేనమామ ఇల్లు. గౌస్ సాహెబ్ జవుళి వ్యాపారస్థుడు. ఇతనికి బిడ్డలు లేని కారణంగా ‘జూకా’ పెద్ద అన్న అయిన హాజీ రహంతుల్లాను దత్తు తీసుకున్నారు. (ఇతనే వి.ఆర్. కళాశాల భవన దాత) జూకా అసలు పేరు మహమ్మద్ హబీబుల్లా, జననం 1828. కలం పేరు మాత్రమే జూకా.
చిన్నప్పుడు ఇంటి వద్ద వౌల్వీ (గురువు)గారి చేత విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. తన 12వ ఏట నుండే కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నాడు. తర్వాతి కాలంలో మద్రాసు నగరానికి వెళ్లారు. అప్పట్లో బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా మాత్రమే రాకపోకలుండేవి. మద్రాసులో సయ్యద్ ముర్తుజాబీ విష్ అను అతని వద్ద మూడేళ్లు శిష్యరికం చేశారు. ముర్తుజాబీ విష్ పర్షియన్ భాషలో అపారమైన కృషి చేసినవారు.
ఆనాటి మద్రాసు జాగీర్దారు నాలాజాహి వంశానికి చెందిన గులాంగౌస్ అజమ్‌కు కూడా కొంత సాహిత్య ప్రవేశం ఉండేది. వీరు 1846 నుండి ప్రతివారం ‘ముషాయిరా’ (కవి సమ్మేళనం) నిర్వహించేవారు. ఈ కవిసమ్మేళనానికి జూకా తన గురువు ముర్తుజాబీవిష్ గారి ఆదేశం మేరకు తన కవిత్వాన్ని సమ్మేళనానికి పంపారు. జాగీర్దారు అయిన గులాంగౌస్ అజీమ్‌గారి ద్వితీయ వివాహ సందర్భంగా (ఇనామీ ముషాయిరా) కవి సమ్మేళనంలో అత్యుత్తమ కవిత వ్రాసిన కవికి సన్మానం చేయదలచి మహమ్మద్ హుస్సేన్ రాఖిమ్ అను కవి నిర్వహణలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాహిత్య రాజకీయం జరిగింది. జూకా కవిత కవి సమ్మేళనంలో చదవబడితే తప్పకుండా అతనికే సన్మానం అందుతుందని, తద్వారా తన ప్రాముఖ్యత జాగీర్ గులాంగౌస్ అజమ్ గారి వద్ద పోతుందన్న కారణంగా ఈ కవిసమ్మేళనంలో రాఖీమ్ ఒక నిబంధనను జతపరిచాడు. ఏ కవి అయినా అతను వ్రాసిన కవితలను కవి సమ్మేళనంలో అతనే స్వయంగా చదివి వినిపించాలని. ఈ నిబంధనకు అంతరంగ కారణం - జూకాను సమ్మేళనంలో లేకుండా చేయడమే. జూకాకు నత్తి కనుక. ఈ సంఘటనానంతరం జూకా నెల్లూరు వచ్చేశారు.
తదుపరి విమర్శక కవిత్వం వ్రాశారు. అందులో జాగీర్దారు గులాంగౌస్ అజమ్ పేరు మీదుగా వ్రాయబడిన ‘గుల్జార్ ఎ అజమ్’ అనే గ్రంథం అసలు రచయిత రాఖీమ్ అని ఉదాహరణలతో సహా నిరూపించారు.
తర్వాత వివాహం - అబ్బాయి పుట్టడం జరిగింది. ఈ కాలంలో జూకా గాలిబ్ మహాకవి వ్రాసిన ‘పంచ్-అహంగ్’ చదవడం జరిగింది. పంచ్ అనగా ఐదు, అహంగ్ అనగా శబ్దాలు అని. ఈ గ్రంథ పఠనం జూకా మెదడును మొదళ్ల నుంచి కుదిపివేసింది. తానెంత బావిలో కప్పో తేల్చి చెప్పింది. అందుకే అంటారు ‘ఈ గ్రంథం చదవక ముందు నేను సాహిత్యంలో చాలా కృషి చేశానని అనుకునేవాణ్ణి. కాని ‘పంచ్-అహంగ్’ చదివిన తరువాత నేను రచించిన రచనల్లో ఏమీ పసలేదని తేల్చుకున్నాను’ అని.
‘పంచ్ - అహంగ్’ ప్రభావంతో గాలిబ్ శిష్యులు కావాలనే ఏకైక ధ్యేయంతో అందరిని వదిలి ఢిల్లీకి ప్రయాణమైనాడు. ఆర్థికం హైదరాబాద్‌లో ఆపేసింది. తిరిగి ధనం సంపాదించి ఢిల్లీ పోవాలనే తపనతో సర్ సాలార్‌జంగ్ వద్ద పర్షియన్ లేఖకుడిగా ఉద్యోగంలో చేరాడు. హైదరాబాద్‌లోనే తన కలాన్ని ఝళిపించి రచనలు చేశారు. తను వ్రాసిన రచనలు ఉత్తరాల ద్వారా గాలిబ్‌కు పంపి ప్రత్యుత్తరాలు పొందేవారు.
ఈ విశ్వంలో ఉండే కష్టాలు, విశ్వంలో మానవ జీవితం, భూమిపై జీవనం ఈ మూడు ఇతని కవిత్వ ప్రేరణలు. గజల్ రచనల్లో నిష్ణాతులైన కవులు మీర్ - తఖీ మీర్, మీర్ గాలిబ్‌లు తమ రచనల్లో అనేకానేక భావాలను చొప్పించేవారు. కానీ వారి కోవలోకి చెందిన జూకా మాత్రం అతీంద్రియ భావాల తాలూకు నీడలు కూడా తన రచనలపై పడనీయలేదు. గజల్ రచయితల్లో ప్రత్యేక పంథాను తొక్కిన వారు జూకా.
జూకా చేసిన కృషి తనకూ, తన ఏకైక గురువు గాలిబ్‌కు మధ్య అజ్ఞాతంగానే ఉండిపోయింది. అయితే ఢిల్లీ వాసి మహాకవి గాలిబ్‌పై ‘తలామీజా - ఎ - గాలిబ్’ (గాలిబ్ శిష్యులు) అను అంశంపై పరిశోధన చేసిన స్కాలర్ మాలిక్ రాంగారు.
ఉర్దూ - ఎ - అల్లా, ఊద్ - ఎ - హిందీ అను రెండు గ్రంథాలు. ఇవి గాలిబ్ తాను ఇతరులకు వ్రాసిన ఉత్తరాలు. గాలిబ్ అనంతరం వీటిని సంపాదించి ప్రచురణ గావించారు. పై గ్రంథాలను తన పరిశోధనా కాలంలో పరిశోధించి, అందు జూకాకు గాలిబ్ మహాకవి వ్రాసిన దాదాపు 20 ఉత్తరాలలోని సారాంశాన్ని గ్రహించి, హైదరాబాద్ వచ్చి జూకా బంధువులను అతికష్టం మీద కలిసి ముద్రణకు నోచుకోని చేతి వ్రాత ప్రతులన్నింటిని కొనుగోలు చేసి తీసుకొని వెళ్లారు. వీటి ద్వారా జూకాను వెలుగులోకి తెచ్చిన మొదటి వ్యక్తి స్కాలర్ మాలిక్.
జూకా మరణానంతరం జూకా కుమారుడు మహమ్మద్ మీరా ‘ఖాష్ - ఓ - ఖమాష్’ అను గ్రంథాన్ని ముద్రణ వేయించారు. అనగా చెదురు ముదురు లేఖలు అని అర్థం. విశేషమేమిటంటే జూకా తనే స్వంతంగా సంకలనం చేసి ఆ ప్రతిని గాలిబ్ మహాకవికి పంపి దానికి ముందు మాట వ్రాయించి, తెప్పించి తన వద్దనే ఉంచుకున్నాడు. జూకాను గురించి దాచిపెట్టబడిన ఓ నిజం, జూకా మానవ శృంగారాన్ని గజల్‌లో వ్రాశారు. ఇది దాదాపు 80 పేజీల చేతివ్రాత పుస్తకం. ఇది అంగాంగ వర్ణనా కవిత్వం కాదు. శాస్ర్తియ శృంగారం మానవులకు అవసరం అనే దృష్టితో వ్రాయబడ్డ గ్రంథం. కానీ ఈ రచనకు మాత్రం జూకా ఇంకో కలం పేరు ఉపయోగించారు. ఆ పేరు షేక్ - అలీ - బేబాక్ అని. ఈ వ్రాత ప్రతి ప్రస్తుతం హసన్ ఉద్దీన్ అహ్మద్, ఐఎఎస్ (రిటైర్డ్) మదీనా కాంప్లెక్స్, హైదరాబాద్ వారి పుస్తక భాండాగారంలో ఉన్నది. ఇతనూ నెల్లూరు వాడే. శృంగారాన్ని గజల్‌లో వ్రాసిన మొట్టమొదటి కవి జూకానే. దక్షిణ భారతదేశ గాలిబ్ అయిన జూకా కవితా మాధుర్యాన్ని కొంత రుచి చూద్దాం.
సమకాలీన సమస్యల ప్రతిస్పందనకు ఈ గజల్ ఒక ఉదాహరణ. భారతదేశంలో ఇంగ్లీషు పరిపాలన వచ్చేసింది. బ్రిటీషు సంస్కృతి ఎల్లెడలా విస్తరిస్తుంది. దీన్ని చూచి ఈ కవి అంటారు. నేను పరిమళాన్ని గ్రోలే పిట్టను - ప్రతి పువ్వు వద్ద నేనుంటాను. కానీ పువ్వు పరిమళాన్ని వెదజల్లుతున్నదన్న భ్రమలో ఉన్న మీరు అది పరిమళమో, పిడుగు ప్రభంజనమో తెలుసుకోలేకున్నారు. ఎందుకంటే పువ్వు పరిమళాన్ని ఆస్వాదించే నాకు పరిమళమే కాకుండా ఉన్న గూడు కూడా లేకుండా పోయింది. ఎంతటి భావాన్నయినా చెప్పగలిగిన ఈ రెండు పాదాలు ఎంత చిన్నవో చూడండి.
‘మోజే గుల్ భీహై కోరుూ బర్ ఖే
భలా అయినన్ బహార్
యాతో గుల్ బాంధా ధాయా ఆజ్
ఆషియా మిల్‌తా నహీ’
మచ్చుకు మరో తునక తనెంత ధైర్యవంతుడో చెప్తుంది.
‘హిమ్మత్‌కి బులంధీ కొ కోరుూ
ఓజ్ న నహుండే
హై నబ్జా - ఎ ఖానిదా ఫలక్ మేరే
ధమన్ కా’
ధైర్యం ఎత్తులు కొలిచే ధైర్యవంతుడెవడూ లేరు. కానీ నా ధైర్యం ముందు ఆకాశం ఎండకు వంగిన మొక్కలాంటిది. మూర్ఖ మతస్థులకు తన గజల్ చర్నాకోలుతో ఓ చురక.
‘అనే లగీ హై షర్మ్ ఖుదాసే భీ మాంగతే
మూండాంప్ లేతే హై డస్త్ - ఎ - దువాసే హమ్’
స్ర్తి సిగ్గు పడేటప్పుడు రెండు చేతులూ ముఖానికి కప్పుకుంటుంది. అలాగే దైవ ప్రార్థనలో సిగ్గుపడుతున్నట్లుగా చేతులు రెండింటితో ముఖం కప్పుకోవడాన్ని నిరసిస్తున్నాడీ కవి.
ఈ కవి తన జీవిత కాలంలో గాలిబ్‌ను కలవలేదు. ఇతని మరణం (1875) హైదరాబాద్‌లో సంభవించింది. గాలిబ్‌ను కలవాలని రవాణా లేని ఆ రోజుల్లో నెల్లూరు నుంచి ఢిల్లీకి పాద ప్రయాణం చేపట్టారు. హైదరాబాద్‌కు చేరగానే అనారోగ్యానికి గురైనారు. ఇక ప్రయాణం చేయలేదు. గాలిబ్‌ను కలవలేకపోయానని జూకా వ్యధ చెందాడు. వంద సంవత్సరాలకు పైగా అజ్ఞాత కవిగా ఉన్న మహమ్మద్ హబీబుల్లా జూకా నెల్లూరీయుడే. దక్షిణ భారతదేశం మొత్తానికి ఇతనే గజల్ సృష్టికర్త.
నెల్లూరు వి.ఆర్. కాలేజీ ఉర్దూ లెక్చరర్ డా.షేక్ అబ్దుల్ వహాబ్‌గారు జూకా కవిత్వం - వ్యక్తిత్వంపై పరిశోధనను ఉర్దూలోనే చేసి 1986లో డాక్టరేట్ పొందారు. జూకా గారి గురించి విపులంగా చర్చించబడిన తొలి పరిశోధక గ్రంథం ఇదే.

-ఈతకోట సుబ్బారావు 9440529785