Others

మృత్యుబేహారులకు శిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు దశాబ్దాల క్రితం కాంబోడియాలో లక్షలాది మందిని ఊచకోత కోసిన కమ్యూనిస్టు (మావోయిస్టు) నాయకులను అంతర్జాతీయ కోర్టు దోషులుగా నిర్ధారించి, వారికి జీవిత ఖైదు శిక్షలను విధించింది. 1975-79 ప్రాంతంలో కాంబోడియాలో కమ్యూనిస్టులు (మావో అభిమానులు) అధికారాన్ని హస్తగతం చేసుకుని తమ మావోయిస్టు సిద్ధాంతాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ దేశంలో సుమారు నాల్గవ వంతు ప్రజల్ని కాల్చి చంపారు. ఆధునిక మానవ జాతి చరిత్రలో ఇంతటి దారుణం ఎక్కడా జరగలేదు. ‘కెమరోగ్’ పేర కొన్ని సూత్రీకరణలు- సిద్ధాంతాలు రూపొందించుకుని చైనాలో మావో కన్నా గొప్పగా విప్లవాన్ని విజయవంతం చేయాలన్న తాపత్రయంతో విప్లవానికి ఉపయోగపడరనుకున్న లక్షలాది మందిని దారుణంగా కడతేర్చారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ ఉన్మాదం కొనసాగింది. పోల్‌పాట్ అనే నాయకుని ఆధ్వర్యంలో ఈ హననకాండ జరిగింది. ఆ సమయంలో ఖియూ సంఫన్ దేశాధ్యక్షుని స్థానంలో ఉన్నారు. కెమ‘రోగ్’ సిద్ధాంతకర్తగా నువాన్ చియూ వ్యవహరించారు. వీరిద్దరు ఇప్పుడు జీవించి ఉన్నారు. అంతర్జాతీయ కోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం వీరికి జీవిత ఖైదు విధించింది. అంతేగాక కాంబోడియాలోని అత్యున్నత కోర్టులోనూ వీరిపై విచారణ జరగ్గా అందులోనూ దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్నారు.
ఆ రోజుల్లో వియత్నాం నుంచి తరలి వచ్చిన వియత్నామీయులను, చామ్ తెగ ముస్లింలను నిర్ధాక్షిణ్యంగా చంపారు. పట్టణాలను, నగరాలను ఖాళీ చేయించి ‘శ్రమ’ పేరిట పొలాలకు, ఇతర పనులకు తరలించి, హింసించి తమ సిద్ధాంతాలకు ఉపయోగపడరని భావించిన అసంఖ్యాకులను హతమార్చారు. ‘రిపబ్లిక్ ఆఫ్ కంపూచియా’గా ప్రకటించుకుని హిట్లర్ కన్నా అతి ఘోరంగా వ్యవహరించారు. ఇదంతా కమ్యూనిస్టు వ్యవస్థను స్థాపించాలన్న ‘కసి’తోనే కొనసాగించారు. ఇంచుమించు 20 లక్షల మందిని చంపారని ఒక అంచనా. కాని ఆ సంఖ్య చాలా ఎక్కువేనని విశే్లషకుల మాట. ఈ ఊచకోతలపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం ఖియూ సంఫన్ (87), నువాన్ చియా (92)లకు యావజ్జీవ కారాగార వాసం విధించింది.
చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం స్ఫూర్తితో కాంబోడియాలో ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. చైనాలోనూ లక్షలాది మంది ప్రజల ఆ విప్లవ సమయంలో హత్యకు గురయ్యారు. ఎంతో విధ్వంసం జరిగింది. హింస, విధ్వంసం ద్వారా పాత సమాజాన్ని సమూలంగా నేలమట్టం చేసి నూతన మానవుడిని, నూతన సమాజాన్ని నిర్మిస్తామన్న ఓ వెర్రి ఆలోచనతో ఈ ఉన్మాదానికి తెరదీశారు.
విచిత్రమేమిటంటే జర్మనీలో హిట్లర్ దాదాపు ఇదే ఆలోచనతో ‘కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపులు’ నిర్వహిస్తే, కిరాతక దాడులకు పూనుకుంటే ఖండించిన కమ్యూనిస్టులు చైనాలో, కాంబోడియాలో చేసింది అదే. దానికి పది రెట్లు ఎక్కువ మారణహోమం సృష్టించారు. ఊచకోతలకు పాల్పడ్డారు. దారుణ హత్యలకు బరితెగించారు. అమానవీయ పద్ధతిలో ఎంతోమందిని కాల్చి చంపారు. దాంతో హిట్లర్‌కు, కమ్యూనిస్టులకు ఏమిటి తేడా? అన్న ప్రశ్న తలెత్తింది. ఈ వైఖరి ప్రపంచంలోని పలుదేశాల్లో కమ్యూనిస్టులు- మావోయిస్టులు అనుసరించినా చైనా, కాంబోడియాలో మాత్రం శ్రుతిమించారు. ఆ రకంగా కోట్లాది మంది మృత్యువుకు కారణమయ్యారు. మరి వీరిని మానవతావాదులని ఎలా భావించగలం? నాజీలకన్నా ఉన్నతులని ఎలా అనగలం?
కాంబోడియా కోర్టు, అంతర్జాతీయ కోర్టు ఈ ఉన్మాదుల చేష్టలను, చర్యలను పూర్తిగా తప్పుపట్టింది. శిక్షలు విధించింది. సాధారణ మనిషి సైతం ఈ రకమైన మానవ హననాన్ని ఎలా హర్షిస్తాడు? సమర్ధిస్తాడు? విచిత్రమేమిటంటే ఈ విధానాన్ని, వైఖరిని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ మావోయిస్టులు ముందుకు కదులుతున్నారు. వాస్తవానికి చైనా సాంస్కృతిక విప్లవం ఇచ్చిన ధైర్యంతోనే భారతదేశంలో నక్సలైట్లు పుట్టుకొచ్చారు. చారుమజుందార్ ఆ అరాచకానికి ఆకర్షితుడై, ఆ హింసతో స్ఫూర్తిపొంది దాన్ని భారతదేశంలోనూ కొనసాగించాలని వ్యాసాలను రాశారు, సిద్ధాంతీకరించారు. అది లగాయతు దేశంలో ఆ హింసాత్మక వైఖరి పెడధోరణులు పడుతోంది. చైనాలోని సాంస్కృతిక విప్లవం, కాంబోడియాలోని కెమ‘రోగ్’ సిద్ధాంతాలను భారతదేశ నక్సలైట్లు- మావోయిస్టులు ఆరాధించి ఆచరించేందుకు ప్రయత్నిస్తున్నంతకాలం- వాటికి ఎలాంటి ఆదరణ ఉండదని అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పు చెప్పకనే చెబుతోంది. కాని అదేమిటోగాని భారతదేశ మావోయిస్టులు మాత్రం ఈ ‘ఎరుక’ను విస్మరించి ఇంకా ‘రెడ్ కారిడార్’ నిర్మాణం పేర, ‘విముక్తి’ప్రాంతాల ఏర్పాటు పేర వేలాది మందిని హతమారుస్తూ ఉన్నారు. అంతిమంగా దక్కేది ఏమిటి?.... హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా మాత్రమే!
కాలక్రమంలో చైనాలో, కాంబోడియాలో కమ్యూనిస్టు నియంతృత్వ పాలన కనుమరుగయింది. చైనాలో ఏకపార్టీ పాలన కొనసాగుతున్నప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు. కాంబోడియాలో 1979 ప్రాంతంలోనే కెమ‘రోగ్’ వ్యవస్థ కూలిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతోంది. భారతదేశంలో నియంతృత్వ పాలనకు, అందులోనూ మావోయిస్టుల నియంతృత్వానికి ఆస్కారమే లేదని గత 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర చెబుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా విఫలమైన మార్గానే్న పదేపదే అనుసరించాలనుకోవడం ఏ మాత్రం అభిలషణీయం కాదు.
ప్రపంచమంతటా ప్రజాస్వామ్య దేశాలు కనిపిస్తాయి. ఆ వ్యవస్థలు పరిఢవిల్లుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ‘ఓటు’కు అధిక ప్రాధాన్యత ఉంది. కొన్ని దేశాల్లో పౌరులు ఓటేయకపోతే జరిమానా విధిస్తారట! అంతేగాక ప్రభుత్వం అందించే సాయంలో కోతలు విధిస్తారట! ఇదంతా ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేయడానికే. ప్రజల అభిమతానికి అనుగుణమైన ప్రభుత్వ స్థాపన ముఖ్యమన్నది వర్తమాన యుగం ఆలోచన. ప్రజలు దీన్ని హక్కుగా భావించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ రకమైన మానసిక పరిపక్వత పరివ్యాప్తమవుతున్న సందర్భంలో, మన దేశంలోనూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఓటరును చైతన్యపరిచేందుకు ఇటు ప్రభుత్వ సంస్థలు, అటు స్వచ్ఛంద సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రచార ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలతోపాటు, సోషల్ మీడియాలోనూ ఈ చైతన్యం పెల్లుబుకుతోంది. సింగపూర్ లాంటి దేశాల్లో ఓటువేయకపోతే జాబితా నుంచి వారి పేరును తొలగిస్తారట. ఇలా అనేక దేశాల్లో అనేక పద్ధతులు అనుసరిస్తుంటే భారతదేశంలో మావోయిస్టులు మాత్రం ఎన్నికల్ని బహిష్కరించమని ‘హుకుం’ జారీచేస్తున్నారు. భయభ్రాంతులను చేసేందుకు మందుపాతరలను పేలుస్తున్నారు. ఓటువేస్తే వేలు నరికేస్తామని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఓటువేయకుంటే జరిమానా వేస్తామన్న దానికి, ఓటువేస్తే వేలు నరికేస్తామన్న బెదిరింపునకు ఎంతటి తేడా ఉందో ఎవరికి వారే ఊహించుకోవచ్చు.

-వుప్పల నరసింహం 99857 81799