Others

వ్రతం చెడినా.. ఫలితం దక్కని గద్దర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రజా గాయకుడు’ గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి భంగపాటు ఎదురయింది. వ్రతం చెడినా అతనికి ఫలితం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌కు కొంత ప్రచారం చేసినా అంతిమంగా ఆయనకు మొండి ‘చెయ్యి’ మిగిలింది. తనకుతాను అతిగా ఊహించుకుని గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించినా, నామినేషన్ వేసే అవకాశం మాత్రం రాలేదు. ఆరంభ శూరత్వం మాదిరి గత కొన్ని నెలలుగా అన్ని పార్టీలు, ప్రజలు మద్దతునిస్తే తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని తనకు తాను చెప్పుకున్నాడు. ప్రచార-ప్రసార మాధ్యమాలలో గొప్పలు పోయాడు.
ఏ పార్టీ కూడా గద్దర్‌ను బలపరచలేదు. చివరికి తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కనె్నత్తి కూడా ఆయనవైపు చూడలేదు. తాను దశాబ్దాలుగా విశ్వసించిన వామపక్ష భావజాలం వారు సైతం ఆయన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపలేదు. కొంతకాలం సీపీఎంతో అంటకాగి తిరిగినా ఆ పార్టీగాని, దానికి అనుబంధంగా బరిలోకి దిగిన బిఎల్‌ఎఫ్ గాని గద్దర్ నామస్మరణ చేయలేదు. దాంతో అసలు తత్వం గద్దర్‌కు బోధపడి ఉంటుంది. ఎన్నికలకు ముందు ఎంత గొంతు చించుకుని పాటలు- పద్యాలు పాడినా అభ్యర్థిత్వానికొచ్చేసరికి సమీకరణలు పూర్తిగా మారిపోతాయన్న మాట తెలిసివచ్చి ఉంటుంది. వామపక్ష భావజాలం, ముఖ్యంగా మావోయిస్టుల ‘వౌత్ పీస్’గా దశాబ్దాలు కొనసాగిన గద్దర్‌కు ఈ రకమైన అవమానం, భంగపాటు ఎదురవుతుందని తాను సైతం ఊహించి ఉండడు. తాను ప్రాథమికంగా ‘రసవాది’నన్న మాట మరిచి పూర్తి రాజకీయ నాయకుడినన్న అతిశయానికి పోవడం వల్లనే ఈ పరాభవం ఎదురయిందని ఆయన ఇప్పటికైనా గమనిస్తే మేలు.
ఆశువుగా పాట పాడటం, హాస్యం ఒలికించేలా పదాల విరుపులతో మాట్లాడటం, చమత్కారాలు గుప్పించడం, చతురోక్తులు విసరడం, ఎదుటివారిని పదునైన మాటలతో విమర్శించడం... ఇది రాజకీయం కాదన్న మాట ఇప్పటికైనా గద్దర్ గుర్తించి ఉంటాడు. కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త హోదాలోనైనా తనను ముందుపెడతారనుకున్న ఆశ సైతం లేకుండాపోయింది. సినీతార విజయశాంతి స్టార్ కేంపెయినర్‌గా కాంగ్రెస్ తరఫున దూసుకుపోతోంది. తొందరపడి ఒకటి రెండుచోట్ల కాంగ్రెస్ నాయకులకు ప్రచారం నిర్వహించినా, పత్రికా ప్రకటన ఇచ్చి రాహుల్ గాంధీ సభలు జయప్రదం చేయాలని విజ్ఞప్తిచేసినా, భట్టివిక్రమార్క, మధుయాష్కీ లాంటి కాంగ్రెస్ నాయకులతో రాసుకు పూసుకు తిరిగినా గద్దర్‌కు వీసమెత్తు ఫలితం దక్కలేదు. పైగా పదిమందిలో పలచనయ్యాడు, దగ్గరివారివద్ద చులకనయ్యాడు. రాజకీయంగా ‘తప్పటడుగు’ వేశాడన్న అపప్రదను మూటగట్టుకున్నాడు.
ఆమధ్య ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ లాంటి వారితో కలిసి ఓ కూటమిని గద్దర్ ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. విచిత్రమేమిటంటే ఊహించని రీతిలో కృష్ణయ్యకు కాంగ్రెసు టిక్కెట్ దక్కడం. గత ఎన్నికల్లో కృష్ణయ్య తెలుగుదేశం నుంచి గెలుపొందగా, ఇపుడు ఆ పార్టీ తన బద్ధవ్యతిరేకి అయిన కాంగ్రెస్‌తో కూటమిగా ఏర్పడింది. కృష్ణయ్యకు అనూహ్యంగా కాంగ్రెస్ టిక్కెట్ లభించింది. ఈ సమీకరణతో తేలింది ఏమిటంటే గెలిచే గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని. వాస్తవానికి గజ్వేల్‌లో గద్దర్ గెలిచే అవకాశం ఉంటే ఏదో ఒక పార్టీ ఆయనను సంప్రదించేది, అభ్యర్థిగా నిలవమని కోరేది. తనకు తానై నెలల తరబడి బలపరచాలని బతిమాలుకున్నా ఎవరూ కనె్నత్తి చూడలేదు. ప్రతిపాదన చేయలేదంటే ఏమిటి అర్థం? గద్దర్ గెలిచే అభ్యర్థి కాదనేకదా? ఈమాత్రం దానికి ఇన్ని పిల్లిమొగ్గలు వేయాలా? ఇంత హడావుడి సృష్టించాలా? ఢిల్లీ యాత్రలు చేయాలా?
గద్దర్ సంగతి అలా పక్కనపెడితే, తన కుమారుడు సూర్యకిరణ్‌కు బెల్లంపల్లి టిక్కెట్ కోసం ఆయన పడరాని పాట్లుపడ్డా.. ఎక్కే గడప, దిగే గడపగా తిరిగినా టిక్కెట్ ఇప్పించుకోలేకపోయాడు. పుత్ర వాత్సల్యంతో హద్దులు చెరిపేసుకుని హైదరాబాద్‌లో, హస్తినలో హడావుడి చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇది పరాభవంపై పరాభవంగాక ఏమవుతుంది? గద్దర్ గాయకుడు, ప్రజల్లో కొంత పేరుంది.. దీని పునాదిగా గజ్వేల్ టిక్కెట్ కోసం ఆశపడటంలో కొంత అర్థం కనిపిస్తోంది. మరి ఆయన కుమారుడు సూర్యం ఏ ఆధారంగా బెల్లంపల్లి టిక్కెట్ ఆశించాడో ఎవరికీ అర్థం గాని అంశం. గద్దర్ కొడుకు కావడమే అతని అర్హతగా భావించాలా? ఈ రకమైన రాజకీయాలు గద్దర్ లాంటి వ్యక్తులు ప్రోత్సహించవచ్చా?... ఎవరైనా తన సొంత సత్తాతో పైకి ఎదగాలని ప్రబోధించాల్సిన వ్యక్తి ఇలా తన పలుకుబడిని పెట్టుబడిగాపెట్టి కుమారుడిని అందలం ఎక్కించాలని తాపత్రయ పడటం తగునా? అందులో విప్లవ విలువలతో జీవితం గడుపుతున్నానని తనకుతానే గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఈ రకమైన పనికి పూనుకుంటే అందులో ఏమాత్రం ‘ఆదర్శం’ ఉంటుందో ఎవరికివారే ఊహించవచ్చు. ఇంతటి పుత్రవాత్సల్యం ఆహ్వానించదగ్గదా?
అరిషడ్వర్గాలకు ఆలవాలమైన మనిషిని అర్థం చేసుకోవడం అంత సులువుకాదని గద్దర్ ఇప్పటికైనా గ్రహించి ఉండాలి! అలాగే మనిషినే అర్థం చేసుకోలేని తనం ఆధారంగా మానవ సమాజాన్ని మార్క్సిజం మారుస్తుందని విశ్వసించడం ఎంతటి అప్రాసంగికమో సైతం తెలిసి వచ్చి ఉండాలి!
మనుషుల చర్యలపై ఆధారపడిన ఈ సమాజాన్ని రెండువర్గాలుగా విభజించి, మెజార్టీగా ఉన్నవర్గానికి అధికారం కట్టబెట్టేందుకు మార్క్సిజం ఇరుసుగా పనిచేస్తుందనుకోవడం ఎంతటి బేలతనమో ఇట్టే అవగతమవుతోంది. మనిషి అంతరంగాన్ని, తదుపరి చర్యని ఊహించని, పసి గట్టనివారు సమాజాన్ని ‘ఏకరూపత’ (సోషలిజం)లోకి తీసుకొస్తామనడం విడ్డూరం గాక ఏమిటి?
భారతదేశంలో దశాబ్దాలకు పైగా ఈ భ్రమల్లో బతుకుతూ మార్క్సిజంపై ఆరాధనాభావం పెంచుకుని చాలామంది జీవనం గడుపుతున్నారు. గద్దర్‌కు వాస్తవ జీవితం ఎలా ఉంటుందో ఈ అనుభవం నేర్పి ఉంటుంది. మార్క్స్ ఊహాలోకం వేరు, వాస్తవిక ప్రపంచం వేరు అన్న సంగతి నగ్నంగా తెలిసివచ్చి ఉంటుంది. ఈ రెండింటినీ అర్థం చేసుకోలేని, జీర్ణించుకోలేని స్థితిలో గద్దర్ పూర్తిగా గందరగోళంలో చిక్కుకున్నాడు. ఆయన మాట తీరు, వ్యవహారశైలి, ఆకాంక్షలు, ఆలోచన స్థాయి, తనకుతాను అతిగా ఊహించుకునే వైనంతో- తనేమిటో తాను మరిచిపోయాడనిపిస్తోంది. గత వైభవం నీడల్లో గద్దర్ కలలుగంటున్నాడు. అందుకే తనకు, తన కుమారుడికి శాసనసభ టిక్కెట్లను ఆశించి భంగపడటం.
ఏడుపదుల జీవితంలో సమకాలీన సమాజంలో తన ‘ప్రభ’ను, పునర్వైభవాన్ని ప్రదర్శిస్తారనుకోవడం అత్యాశ కిందకే వస్తుంది. అది ఎవరి జీవితంలోనూ సాధ్యం కాదు. అనేక వైరుధ్యాల పుట్టగాగల గద్దర్ జీవితంలో అది అసలే సాధ్యం కాదు. సాధ్యమైన ‘కళ’ను పదిమందికి పంచి, వంద మందికి మేలుచేసే కార్యక్రమం చేపట్టడంలోనే ఆయన జన్మకు సార్ధకత. అంతేగాని ఎన్నికల ఎండమావుల చుట్టూ పరుగెత్తడంలో ఏమాత్రం ప్రాసంగికత కనిపించదు.

-వుప్పల నరసింహం 99857 81799