Others

పౌరాణిక నాటక చక్రవర్తి ‘షణ్ముఖి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు షణ్ముఖి ఆంజనేయరాజు 90వ జయంతి సందర్భంగా..
----------------------------------------------------------------------------------
మంచి నాటకమెప్పుడూ మన్ననలందుకొంటూనే ఉంటుంది. పాత్రధారులూ అంతే! ప్రశంసల విరివానలో తడుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆరోజుల్లో పౌరాణిక నాటకాలకున్న ప్రజాభిమానం అంతాఇంతా కాదు. నాటకం ఎప్పుడెప్పుడా అని ఎదురుతెన్నులు చూసిన కాలమది. రాత్రి మొదలుపెట్టిన నాటకం సూర్యోదయం వరకు కొనసాగిన సందర్భాలనేకం ఉన్నాయి. ఎవరో పెద్దవాళ్ల కోసం అక్కడ రెండు మూడు చెక్క కుర్చీలు మాత్రమే కనిపిస్తుండేవి. మిగతా ప్రేక్షకులందరూ అప్పటికే కింద పరచిన బరకాల మీదో, లేదా వాళ్లే వెంటతెచ్చుకున్న చాపల మీదో కూర్చుని నాటకాన్ని ఆద్యంతం తిలకించేవారు. పద్యం బాగుంటే ‘వన్స్‌మోర్’లు హోరెత్తేవి. చప్పట్లు సరేసరి! ఆ ముచ్చట్లు వర్ణనాతీతంగా ఉండేవి. రాగ మాధుర్యాన్ని అందించే నట గాయకులు కొందరైతే, నటనా ప్రాభవాన్ని ప్రదర్శించే ఉత్తమ నటులు మరికొందరుండేవారు. ఈ రెండూ కలిసిన ఉద్దండులు ఇంకొందరుండేవారు. అలాంటి కళాసరస్వతి ముద్దబిడ్డలలో - ప్రధానంగా రాగాన్ని ఆలపిస్తూ, పద్యానికి పట్ట్భాషేకం చేసిన పౌరాణిక నటుల్లో ‘ఆంధ్ర బాలగంధర్వ’ బిరుదాంకితులు శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ‘పౌరాణిక నాటక చక్రవర్తి’ అనే గుర్తింపును కూడా వారు పొందారు. షణ్ముఖి 1928 డిసెంబర్ 1వ తేదీన అనపర్తిలో జన్మించారు. వీరి తండ్రి రంగరాజు గారు కూడా నటులు కావటం విశేషం. పిన్నవయసులోనే వీరికి నాటక రంగం వైపు దృష్టి మళ్లింది. ఆ అభిలాష మోదుకూరులో 1940 ఏప్రిల్ 9న జరిగిన వేమన జయంత్యుత్సవాల్లో ప్రథమంగా సహదేవుని పాత్ర పోషించటానికి దోహదం చేసింది. ఆనాడు షణ్ముఖి ప్రతిభకు మోదుకూరు మోదవార్థిలో తేలియాడింది. ఇక, కేవలం 14ఏళ్ల వయసులోనే తెనాలిలో శ్రీకృష్ణ పాత్ర ధరించి ‘చక్రం’ తిప్పగలిగారు. ఆనాటి ప్రదర్శన చూసిన ప్రఖ్యాత నటులు మాధవపెద్ది వెంకటరామయ్య గారు పులకరించిన గుండెతో ప్రశంసా పారిజాతాల్ని షణ్ముఖిపై కురిపించారు. ఆ తరువాత ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వెంట ‘గాంధీ చరిత్ర’ను బుర్రకథగా చెపుతూ కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన ఊరూవాడా పర్యటించారు. అలా ఎన్నో సోపానాలను అధిరోహిస్తూ షణ్ముఖి క్రమంగా శిఖరాగ్రానికి చేరుకొన్నారు. పద్య నాటకానికి రంగు, రుచి, వాసన ప్రసాదించిన లబ్ధప్రతిష్ఠులుగా ఆంజనేయరాజు గారు చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టించుకొన్నారు. ఎందరు కృష్ణులున్నా, ఎంత రాత్రి అయినా షణ్ముఖి పద్యాన్ని వినకుండా ప్రేక్షకులు ఇంటిముఖం పట్టేవారు కాదు. ‘చెల్లియో చెల్లకో...’ పద్యం అనాలంటే ఆయనకే చెల్లింది. పేరునుబట్టి చూసినా ఆయన ‘జెండాపై కపిరాజే’! శ్రీరాముడు, శివుడు, నారదుడు, నక్షత్రకుడు, బిల్వమంగళుడు, విజయరామరాజు - ఇలా ఎన్నో పాత్రలు పోషించినా, చివరకు వేదికపై ‘కురుక్షేత్రం’లోని కృష్ణుని పద్యాలను ప్రేక్షకుల కోరికపై పాడక తప్పేదికాదు. ఇతర రాష్ట్రాలు సైతం షణ్ముఖి గానానికి నీరాజనం పట్టాయి. సన్మానాలు ఆయన్ను చుట్టుముట్టాయి. తణుకు నన్నయభట్టాచారక పీఠం నిర్వహించిన ‘్భవన విజయం’ రూపకంలో షణ్ముఖి రామరాజభూషణుని పాత్ర ధరించి ‘నభూతో నభవిష్యతి’ అన్న రీతిలో జేజేలందుకొన్నారు. ‘మాంగల్య విజయం’ సినిమాలో శ్రీరామునిగా నటించారు. సంగీత కచేరీలు చేశారు. భౌతికంగా మాత్రం నాటకప్రియుల నుండి దూరమైనా ఇప్పటికీ ‘రాజుగారి బాణి’ మధురవాహినిగా ప్రేక్షక హృదయాలలో ప్రవహిస్తూనే ఉంది.

- రసరాజు, 6281299346