Others

అందరివాడు అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుచెబితే చాలు అందరి హస్తాలు ముకులితమై నమస్కరిస్తాయి. ఆయన ఆలోచనాపథాన్ని గుర్తుచేస్తే చాలు అగ్రవర్ణ కాఠిన్యులు కూడా ‘బడుగుజీవుల ఉద్దరణ’ కోసం మాట్లాడతారు. ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకూ అంబేద్కర్ జయంతి సభలను బడుగు వర్గాలవారు జరిపేవారు. వెలివాడలోనో, నాలుగురోడ్ల కూడలిలోనో ఉన్న ‘చూపుడు వేలు’ దగ్గరికి వెళ్ళి స్తుతించేవాళ్ళు. నివాళులర్పించేవాళ్ళు. ఆయన కార్యాచరణ కోసం ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ‘బడుగు జీవుల మనిషి’ అందరి మనిషయ్యాడు. వెలివాడల నరుడు విశ్వనరుడయ్యాడు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపడం కాలగమనంలో వచ్చిన మార్పుకు సంకేతం. ఆయన పేరు చెప్పకుండా, ఆయన త్యాగనిరతిని ధ్యానించకుండా పరిపాలన చేయలేని పరిస్థితికి పాలకులు వచ్చారు. కానీ అంబేద్కర్ జీవిత పాఠంలోని మూడు ముఖ్యమైన అంశాలనైనా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుందాం. 1. చదువుకోవాలంటే తరగతి గదులకు దూరంగా కూర్చోవాలి. దాహం వేస్తే నిలబడి దోసిలి పట్టాలి. గుడి ముందునుంచి వెళ్ళాలంటే తల దించుకొని నడవాలి. ఇలాంటి అవమానాలకు నిమ్న కులాల బతుకులు సమిధలు. వర్తమాన సమాజంలో ఈ పరిస్థితిని ఎంతవరకు ఎదిరించాం? ఇంకా పాతుకుపోయిన అంటరానితనం ఊడల మాటేమిటి? 2. కసితో చదివి దేశంలోనే అత్యంత విద్యావంతుల్లో ఎగువ వ్యక్తిగా అంబేద్కర్ ఎదిగాడు. నేడు విద్యకు దూరమైనవారి శాతమెంత? విద్యాధికులను చేసేందుకు పాలకులు చేస్తున్న కృషి ఎంత? 3. ప్రపంచ దేశాలలోనే సుదీర్ఘమైన, సముచితమైన రాజ్యాంగానికి అంబేద్కర్ ప్రాణం పోశారు. ఈ రాజ్యాంగ పరిరక్షణలో మన పాత్ర ఎంత? రాజ్యాంగ ఫలాల పంపిణీలో మన కర్తవ్యమెంత? ఇది కూడా మన ముందున్న ప్రశే్న. విభిన్న జాతుల, విభిన్న మతాల, విభిన్న కులాల, విభిన్న ప్రాంతాల, విభిన్న సాంప్రదాయాల, విభిన్న మనుజులంతా ఒకే దేశంగా బతికేలా అంబేద్కర్ రాజ్యాంగ అవకాశాలు సృష్టించారు. భరత జాతిని ముందుకు నడిపేందుకు తన చూపుడు వేలుతో మార్గాన్ని నిర్దేశించారు. భరతజాతి బతికున్నంతవరకు దేశం సర్వోన్నత మహాదేశంగా వర్ధిల్లేలా చేశారు. అలాంటి మహనీయునకు నిజ నివాళులర్పిద్ధాం.
(నేడు అంబేద్కర్ వర్ధంతి)

-పోతుల బాలకోటయ్య