AADIVAVRAM - Others

బృందావనానికి పండిన పుణ్యం.. (రాస క్రీడాతత్త్వము-6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక రెండవ అంశం - రాసలీలా ఘట్టంలో పంచా ధ్యాయిలో వ్యాసభగవానుడు పదే పదే ఉపయోగించిన పదం-‘‘రమణ’’ శబ్దమే. ఈ శబ్దం ‘‘రము క్రీడాయాం’’ అనే ధాతువులోంచి వచ్చింది. ఇక్కడి క్రీడ బాలక్రీడే. ఇక్కడి బాలికలు గోపికలే గాని పురుషోత్తము డైన శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. అందుకే వ్యాసమహర్షి ఆ అధ్యాయాల్లో అనేక చోట్ల ‘‘రమయాంచ కార’’ (ఆడింపజేసెను) (్భగ-10, అధ్యా-39, శ్లో-49) వంటి పదాలనే అధికంగా ప్రయోగించాడు.
ఇక్కడే మరి కొన్ని విశేషాలను కూడా చెప్పవలసి వుంది. కానీ, ఆ విశేషాలను రాసక్రీడా ఘట్టంలో ఆయనే చెప్పబోతున్నాడు గనుక, ఇక్కడ మళ్ళీ చెప్పటంలేదు. ఇక మనం రాసలీలా కదలోకి ప్రవేశిద్దాం.

వేణుగానం :-
శ్లో॥ అంగుళ్యగ్రై రరుణకిరణైర్ముక్త సంరుద్ధరంధ్రం
వారం వారం వదనమరుతా వేణుమాపూరయంతమ్
వ్యత్యస్తాంఘ్రిం వికచకమలచ్ఛాయ విస్తారినేత్రం
వందే బృందావన సుచరితం నందగోపాల సూనుమ్ ॥

భావం :

ఎర్ర ఎర్రని కాంతులీనే ఆ వేళ్ళ చివళ్లు పిల్లనగ్రోవి చిల్లులను మూస్తున్నాయి, తెరుస్తున్నాయి. ఆయన నోటి గాలులు ఆ మురళిని మాటి మాటికీ నింపుతున్నాయి. కాళ్ళు మెలివేసుకుని ఆయన విలాసంగా నిలబడి వున్నాడు. ఆయన కళ్ళు పద్మాల్లాగా వికసించి వున్నాయి. బృందావనానికి పండిన పుణ్యం ఆయనే. అట్టి నంద గోపాల కుమారునికి వందనం.)
శ్రీకృష్ణ బలరాములకు పౌగండ దశ నడుస్తోంది. (అంటే 5 నుంచి 10 సంవత్సరాల వయస్సు). 7-8 సంవత్సరాల వయస్సులోనే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతోద్ధరణ లీల ప్రదర్శించాడు. ఆ తరువాత వచ్చిన శరదృతువులోనే రాసక్రీడాలీల జరిగింది. వారికింకా ఉపనయనాలు కూడా కాలేదు. యథేచ్ఛగా ఆవులు మేపుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు గోవులను కాచుకుంటూ అడవుల్లో తిరిగేటప్పుడు, జగన్మోహనంగా వేణుగానం చేస్తూ వుండేవాడు. ఏమి రాగమో, ఏమి కీర్తనో, ఎవరూ చెప్పలేరు కానీ, ఆయన ఆ పిల్లనగ్రోవి వాయించుకొంటూ, అరమోడ్పు కన్నులతో అడవిలో అలా అలా తిరుగుతూ వుంటే, మేసే ఆవులు కూడా ఎక్కడివక్కడే నిలచిపోయి వింటూ వుండేవి. పక్షులు కదిలేవి కావు. మానవులకు ఒళ్ళు తెలిసేది కాదు. ప్రకృతి స్తంభించిపోయినట్లు వుండేది. ఆ ఘట్టాన్ని కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు పరవశించి వర్ణించాడు.

శ్లో॥ మందం మందం మధురనినదై ర్వేణు మాపూరయంతం
బృందం బృందావనభువి గవాం చారయంతం చరంతమ్
ఛందోభాగే శతమఖ ముఖ ధ్వంసినాం దానవానాం
హంతారం తం కదయ రసనే గోపకన్యాభుజంగమ్ ॥

భావం :

ఆయన మెల్లమెల్లగా తన మధుర వేణురాగాలతో అడవిని నింపేస్తూ, ఆ బృందావన పరిసరాల్లో గోవులను మేపుకుంటూ, తనూ తిరిగేవాడు. ఆయన తిరిగేది నేలమీద కాదు, వేదాల చివర్లలో. దేవేంద్రుడికే లొంగని దానవులను సంహరించే మహావీరుడాయన. గోపకన్యల మనసులను దోచిన విటుడాయన. ఓ నాలుకా! ఆయనను కీర్తించు.)
అలా వుండగా, శరత్ ఋతువు వచ్చింది. ఒక పౌర్ణమినాటి రాత్రి పండు వెనె్నల అడవంతా పరుచు కుంటున్న సమయంలో, శ్రీకృష్ణ్భగవానుడికి ఒక కొత్త ఆలోచన వచ్చింది.
ఈ నాడు గోకులంలో వున్న గోపికలలో-

(i) గోలోకం నుంచీ వచ్చి జన్మించినవారు కొంద రున్నారు.
(ii) రామావతారం నాటి ఋషులు కొందరున్నారు.
(iii) మిథిలానగరంలో తన్ను చూచి ముచ్చట పడ్డ తత్త్వవేత్తలు కొందరున్నారు.
(iv) ఆనాటి తన మాతామహ స్థానమైన కోసల దేశ వాసులు కొందరున్నారు.
(v) రామావతారం నాటి అయోధ్యవాసులు కొంద రున్నారు.
(vi) కొందరు దేవాంగనలు గోపికలై పుట్టినవారూ వున్నారు.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060