Others

వోటర్ల నిరసనకు ప్రతిరూపం ‘నోటా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ తనకు నచ్చకపోతే- తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబౌవ్) మీటను నొక్కే అవకాశాన్ని ఓటరుకు ఎన్నికల సంఘం కల్పించింది. అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు ఓటరుకు దక్కిన ‘నోటా’ అవకాశం ఇటీవలి కాలంలో విస్తృత ప్రచారమైంది. ‘నోటా’ ఓట్ల కారణంగా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం ఓటమి చెందుతున్న సందర్భాలున్నాయి. ఓటింగ్ ప్రక్రియలో అంతర్భాగంగా ‘నోటా’ ఓట్లను కూడా లెక్కించి ప్రకటించటం వలన ఎంతమంది ఓటర్లు పోటీచేస్తున్న అభ్యర్థులను తిరస్కరించినదీ స్పష్టంగా తెలుస్తోంది.
పదహారవ లోక్‌సభ ఎన్నికలలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘నన్ ఆఫ్ ది ఎబౌవ్’(నోటా) ఆప్షన్‌ను దాదాపు దేశవ్యాప్తంగా 60 లక్షల మంది ఓటర్లు వినియోగించుకొన్నారు. 543 లోక్‌సభ నియోజకవర్గాలలో 1.1 శాతం ఓటర్లు నోటా ఉపయోగించుకోగా, పాండిచ్చేరిలో అత్యధికంగా మూడు శాతం, మేఘాలయలో 2.8 శాతం, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలిలలో 1.8 శాతం మంది ఓటర్లు నోటా మీటను నొక్కారు. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వదోదర నియోజకవర్గంలో 18,053 మంది గత ఎన్నికల్లో ఓటర్లు నోటా వినియోగించారు. ప్రప్రథమంగా ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మిజోరామ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 2013 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం పోల్ అయిన ఓట్లలో 1.85 శాతం 15 లక్షల పైగా ఈ మీట నొక్కారు. రానురానూ ఎన్నికల్లో ‘నోటా’ను వినియోగించుకునే ఓటర్ల సంఖ్య పెరుగుతోంది.
కొన్ని పార్టీల అభ్యర్థులకు నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు వుండటంతో నోటాకు ఎన్నికలలో ఓట్లు రావటం ప్రారంభమైంది. తాజాగా జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో సగటున నోటాకు 1.1 శాతం దక్కాయి. తెలంగాణలోని మొత్తం 119 శాసనసభా నియోజకవర్గాలలో నోటా 2,24,709 ఓట్లు కైవసం చేసుకొంది. 2014 ఎన్నికలలో 1,52,174 ఓట్లురాగా ఈసారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అనేక పార్టీలకు వచ్చిన ఓట్లకంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావటం విశేషాంశం. ఛత్తీస్‌గఢ్‌లో 2.1 శాతం, మధ్యప్రదేశ్‌లో 1.5 శాతం, రాజస్థాన్‌లో 1.3 శాతం, తెలంగాణ 1.1 శాతం, మిజోరాం 0.5 శాతం నోటాకు లభించాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 15 లక్షల 20వేల 446 ఓట్లు నోటాకు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో నోటా శాతం ఎక్కువగా నమోదు అయింది.
అభ్యర్థులపై కొరడా..
భారత ప్రజాస్వామ్యం చట్టబద్ధంగా ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా ప్రభుత్వాన్ని నడిపే మన ప్రతినిధులను ఎన్నుకొని దేశ భవిష్యత్తు రూపుదిద్దుకొనే అధికారం ఓటరుకు సంక్రమిస్తోంది. నిర్భయంగా, నిష్పక్షపాతంగా దేశాన్ని శక్తిమంతం చేసే ఓటుహక్కు, పోటీలో వున్న అభ్యర్థులకు ఎవరికీ వేయకుండా నోటా మీట నొక్కటం భారత ఎన్నికల సంఘం ప్రోత్సహించే అంశం కాదు. అందువలన నోటాకు ప్రచారం అంతంత మాత్రమే. ఓటింగ్ కంపార్టుమెంటులో వున్న బాలెట్ యూనిట్‌లో బాలెట్ పత్రంపై ఆఖరున నోటా బటన్ తప్పనిసరిగా వుంటుంది. ఇంతకుముందు ఏ పార్టీకి ఏ అభ్యర్థికీ ఓటువేయటం ఇష్టంలేనివారు ఎన్నికల అధికారి ముందు బాహాటంగా దరఖాస్తు ఇవ్వవలసి రావటంతో రహస్య ఓటుహక్కు నీరుకారేది. నోటా ప్రవేశంతో ఆ ప్రమాదం తప్పుతోంది.
భారతీయ ఓటర్ల హక్కులలో నోటా ఒక మలుపు. రానురాను రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టడం తీవ్రం కావడంతో సంస్కరణలలో భాగంగా నోటా ప్రవేశించింది. రాజకీయ పార్టీలు సృష్టిస్తున్న కాలుష్యం వలన విద్యావంతులు, మేధావులు ఎన్నికలకు దూరమవుతున్నారు. పోలింగ్ శాతం తగ్గిపోతోంది. ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రాణప్రదమైన ఓటింగ్‌ను బహిష్కరించటంకంటే, అభ్యర్థులందరికీ అర్హత లేదని ఓటరు భావించినట్లయితే ఓటింగ్‌లో పాల్గొని అసమ్మతి, అసంతృప్తి వ్యక్తంచేయటానికి నోటా ప్రవేశించింది. 2013 సెప్టెంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ అవకాశం లభిస్తోంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీ.యు.సి.ఎల్) సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటీషన్‌పై అప్పటి ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివమ్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ, ఓటర్లకు తమమీద ఉన్న అభిప్రాయం ఎలా ఉన్నదీ పార్టీలకు, అభ్యర్థులకూ ప్రతికూల ఓటింగ్ వల్ల తెలిసే అవకాశం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ప్రపంచంలో ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, యునైటెడ్ స్టేట్స్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్ వంటి దేశాలలో తటస్థంగా ఉండే అభ్యంతరం తెలిపే, వ్యతిరేకత వ్యక్తంచేసే ప్రక్రియ ఉంది. కానీ ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఓటర్లకు మార్గదర్శిని ప్రచార వివరాలలో నోటాకు ప్రాధాన్యత యివ్వటం లేదు.
‘నోటా’కూ గుర్తు!
2013లో నక్సల్ ప్రభావిత బస్తర్, సర్గూజా, రాయపూర్, తనార్ధ, ఖైరఘర్, ఖల్లారి, డోంగార్‌గన్ నియోజకవర్గాలలో గెలిచిన ఓడిన అభ్యర్థుల మధ్య పోలయిన ఓట్ల తేడాకంటే, అధికంగా నోటాకు ఓట్లు పడ్డాయి. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే లోగడ 46,000 మంది ఓటర్లు నోటా నొక్కారు. మధ్యప్రదేశ్‌లో పాన్మిమల్ ఎస్టీ నియోజకవర్గంలో 9,228, మెహగాన్‌లో 136, ఛత్తీస్‌గఢ్ బస్తర్ చిత్రకోట్‌లో భారీగా 10,848 గతంలో నోటా ఓట్లు నమోదు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఆప్ అభ్యర్థి కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి షీలాదీక్షిత్ పోటీలో కూడా 460 మంది నోటా మీటనొక్కారు. నోటా వినియోగం పట్ల సామాన్య ప్రజానీకానికి కూడా అవగాహన కల్పించాలని నాడు సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
ప్రజాస్వామ్యంలో పోలింగ్‌కు వెళ్ళకుండా తిరస్కరించటానికి బదులుగా, పోటీచేసే అభ్యర్థులు అనర్హులని భావిస్తే, వారిని తిరస్కరించే సౌలభ్యం కల్పించే నోటా నిస్సందేహంగా ముందడుగు. సామాన్య ప్రజలైనా, విద్యావంతులైనా కొంతమేరకైనా నిరాశా నిస్పృహలను, అనాసక్తి, తీవ్రభావాలను పోగొట్టే ఆయుధంగా నోటాను పరిగణించవచ్చు. 2017లో మహారాష్ట్ర బోరి పంచాయత్‌లో 85.57 శాతం మంది నోటాను వినియోగించుకున్నారు. నాందేడ్ జిల్లా ఖుగాన్ ఖుర్ద్‌లో నోటాకు 627 ఓట్లువస్తే, సర్పంచ్‌కు 120 ఓట్లు లభించాయి. రానున్న ఎన్నికలలో నోటా ప్రభావం అంచనాకు అందదు.
అందరికీ సుపరిచితమైన నోటా, భారత ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా, నీతివంతంగా అవినీతి, అసమర్ధులైన అభ్యర్థులపై ఓటర్లు ఆగ్రహం, నిరసన, అసంతృప్తి వ్యక్తంచేసే శాంతియుత అస్త్రంగా ఈ ఎన్నికలు రుజువుచేస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలలో 15.2 లక్షల ఓట్లుపొందిన నోటా ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల కొందరి విజయావకాశాలను తలక్రిందులు చేసాయి. వేలాదిగా ఓటర్లు, ఓటు ద్వారా చెంపపెట్టు అందించారు. మధ్యప్రదేశ్‌లో నోటా ఓటర్ల ఆగ్రహం, నలుగురు మంత్రులను పరాజితులు చేసింది. రాజస్థాన్‌లోనూ అదే ప్రభావం. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భారత ఎన్నికల సంఘం, న్యాయస్థానాల సూచనమేరకు ‘నోటా’కు సైతం ఓక గుర్తును కేటాయిస్తే అది మరింతగా తన ప్రభావాన్ని చూపుతుంది.

-జయసూర్య సెల్- 9440664610