AADIVAVRAM - Others

‘పైల్స్’పై ఎనె్నన్నో అపోహలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘు ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. ప్రతి రూపాయిని నాలుగైదుసార్లు ఆలోచించుకొని మరీ ఖర్చు చేస్తాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని మల విసర్జనలో రక్తం కనిపించింది. వేడి చేసిందేమోనని కొబ్బరిబోండాం తాగాడు. మరుసటి రోజు కూడా రక్తస్రావం కలగటంతో తన ఇంటి దగ్గరలోని మందుల షాపు వ్యక్తిని కలిసి తన సమస్య చెప్పాడు. కంగారు పడనవసరం లేదు. ఇది పైల్స్ అని మందుల షాపు అతను ఏవో బిళ్లలు ఇచ్చాడు. కొన్ని రోజులు బాగానే తగ్గినట్లు అనిపించినా మరలా రెండు నెలలకి తిరిగి అదే సమస్య. మళ్లీ ఏవో మందులు తెచ్చుకోవటం వాడటం. ఇలా ఒక సంవత్సరం తర్వాత కూడా మలవిసర్జనలో రక్తం వస్తూనే ఉండటంతో స్పెషలిస్ట్‌ని కలిస్తే సమస్య పైల్స్ కాదని, పెద్ద పేగు కేన్సర్ అని తెలిసింది. సమస్య మొదలైనప్పుడే వచ్చి ఉంటే జబ్బు పూర్తిగా నయం చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడేమీ చేయలేమని డాక్టర్లు చేతులెత్తేసారు.
* * *
రాధిక ఒక గృహిణి. ఈ మధ్యే పెళ్లి చేసుకొని అత్తవారింట అడుగు పెట్టింది. వారం క్రితం మల విసర్జన సమయంలో నొప్పి వచ్చింది. పెద్దగా పట్టించుకోలేదు. రెండో రోజు మరింత నొప్పి దానితోపాటు రక్తం కూడా పడింది. ఇంటి చిట్కాలు ప్రయత్నించింది అయినా తగ్గలేదు. పైగా నొప్పి ఎక్కువ కాసాగింది. భర్తకి చెబితే ఏమనుకొంటాడో అని, పోనీ అత్తగారికి చెబుదామా అంటే రోగిష్ఠి అమ్మాయిని కోడలుగా పంపించారని ఎక్కడంటారో అని భయంతో ఎవరికీ చెప్పకుండా బాధ పడుతోంది. రోజూ విరేచనానికి వెళ్లాలంటే భయం. ఆ భయంతో తినడం తగ్గించేసింది. కొన్ని రోజుల్లోనే కొత్త పెళ్లికూడురు కాస్తా పెళ్లికళ పోయి రోగిష్టిలా కనిపించసాగింది.
* * *
రమేష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ తీసుకొంటాడు. ఒకరోజు మలద్వారం వద్ద ఒక వేడిపొక్కు రావటం.. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. మరల రెండు నెలలు తిరిగేసరికి మరింత పెద్ద గడ్డ రావడంతో పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి వెళితే అది ఫిస్టులా అని మరలా ఆపరేషన్ చేశారు. అంతే. ఆ ఆపరేషన్ తర్వాత నుంచి మలవిసర్జనపై నియంత్రణ కోల్పోయి తనకు తెలియకుండానే విరేచనం బట్టల్లో అయిపోవడం మొదలయింది. అది ఫిస్టులా ఆపరేషన్ వల్ల కలిగిన కాంప్లికేషన్ అని, నయం అయ్యే అవకాశం లేదని తెలిసి క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
...ఇవి కథలు కావు. నిజమైన మానసిక వ్యధలు. మన నగరంలో మన ఊరిలో మన సందులో కూడా ఎందరో ఇలా బాధ పడుతున్నారంటే అది అతిశయోక్తి కాదు.
పైన చెప్పిన మూడు కేసుల్లోనూ బాధ వర్ణనాతీతం.
వీటికి ప్రధాన కారణం - రోగం పట్ల అవగాహనా లోపం. బయటికి చెప్పుకోవాలంటే ఉండే బిడియం. చికిత్సా ప్రక్రియల గురించి సరిగా తెలియకపోవడం.
పైన చెప్పిన మూడు ఉదాహరణలు మూడు రకాల రోగాలైనా చాలామందికి ఆసన ప్రాంతంలో వచ్చే అన్ని వ్యాధులూ ‘పైల్స్’ అని ఒక బలమైన మూఢ నమ్మకం.
నేటి మారుతున్న పరిస్థితుల్లో జనానికి తమ ఆరోగ్యం పట్ల స్పృహ మరియు అవగాహన పెరుగుతోంది. ఇది సంతోషించదగ్గ విషయమే. కానీ ఈ స్పృహ కొన్ని వ్యాధుల వద్దే ఆగిపోతోంది.
ప్రతి పది వేల మందిలో ఒకరికి వచ్చే కేన్సర్ గురించి, వేయి మందిలో ఒకరికి వచ్చే గుండెనొప్పి గురించి, వంద మందిలో ఒకరికి వచ్చే షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు కానీ...
ప్రతి పది మందిలో ఎనిమిది మందిని, జీవితంలో ఏదో ఒక దశలో ఇబ్బంది పెట్టే ఆర్ష మొలలు (మొలలు, మూల రోగం) ఫిజర్, ఫిస్టులా వంటి సమస్యల గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి బదులు మందుల షాపులకు వెళుతున్నారు.
సొంత వైద్యాలు చేసుకుంటూ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకొంటున్నారు. సిగ్గుతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొందరు దొంగ డాక్టర్ల బారిన పడుతుంటే, మరి కొందరు ఆపరేషన్లు చేయించుకున్నా ఫలితం లేక మరలా వ్యాధి బారిన పడుతున్నారు. ఆపరేషన్ల మూలాన వచ్చే విపరిణామాలతో ఇబ్బంది పడుతున్న వారు కొందరైతే సిగ్గుతో వ్యాధిని తీవ్రతరం చేసుకొంటున్న వారు మరికొందరు. దీనిని ఆపాలి.
మొలలు కూడా జ్వరం లాంటి ఒక సాధారణ సమస్యే అని అందరూ గుర్తించాలి.
విరేచనం సాఫీగా జరగాలంటే ఏమి చేయాలో ప్రతి కుటుంబం తెలుసుకోవాలి.
అసలు ఈ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
మనకు మారుతున్న జీవన శైలి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతోంది.
జనం సమయానికి తినడం లేదు సమయానికి నిద్ర పోవడం లేదు.
అర్ధరాత్రి బఫెలు పెరుగుతున్నాయి.
ఎంతో కాలంగా తింటూ వచ్చిన వంటల స్థానాన్ని ఫాస్ట్ఫుడ్ ఆక్రమిస్తోంది.
చిన్నపిల్లల చేతుల్లో లేస్, కుర్కురేలు పెరుగుతున్నాయి.
అర్ధరాత్రి ఉద్యోగాలు బయలాజికల్ క్లాక్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి.
ఓ వైపు మన ఫోన్లు స్మార్ట్ అవుతోన్న కొద్దీ ఇంకోవేపు మన శరీర వ్యవస్థలు మందగిస్తున్నాయి. ప్రధానంగా జీర్ణ వ్యవస్థ మందగిస్తోంది.
శారీరక శ్రమ లేని గంటలకొద్దీ కూర్చుని చేసే ఉద్యోగాలు.. ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు.
మొలలను ఎలా గుర్తించాలి?
1.మల విసర్జనలో నొప్పి లేని రక్తస్రావం
2.రక్తం పిచికారీ కొట్టినట్లు చింది కొట్టడం.
3.రక్తం ఎర్రగా తాజాగా ఉండటం.
4.మల ద్వారం వద్ద ఏదో బయటకు వచ్చినట్లు అవడం
5.కొన్నిసార్లు మల ద్వారంలోంచి జిగురు వంటి స్రావం రావటం
6.మల ద్వారం వద్ద దురద.
మొలలు ఎన్ని రకాలు?
ఇవి రెండు రకాలు - 1.బాహ్య మొలలు 2.అభ్యంతర మొలలు లేదా లోపలి మొలలు.
ఎప్పుడూ బయటకే ఉండే మొలలు బాహ్య మొలలు. ఇవి మల ద్వారం వద్ద చర్మం రంగులోనే ఉంటాయి. వీటి నుండి ఎటువంటి రక్తస్రావం ఉండదు కానీ బాగా ముక్కడం వలన ఇందులో రక్తం గూడు కట్టినట్లు అయ్యి అప్పుడప్పుడూ బాగా నొప్పి వస్తూంటుంది.
లోపలి మొలలు - ఇవి నొప్పి కలిగించవు. సైజులో పెద్దవి అయ్యే కొద్దీ ఇవి ఆసన ప్రాంతం నుండి బయటకు వస్తాయి. ఇవి వాటి స్టేజిని బట్టి మరలా నాలుగు రకాలు.
మొదటి స్టేజి: ఇందులో మొలలు బయటకి కనిపించవు. కేవలం రక్తస్రావం ద్వారా మాత్రమే తెలుస్తుంది. వీటికి ఆపరేషన్లు కూడా అవసరం లేదు. కేవలం జీవన శైలిని మార్చడం ద్వారా సరి చేయవచ్చు.
రెండవ స్టేజి: ఇందులో మల విసర్జన సమయంలో మొలలు కొంచెం కిందికి వచ్చి మరల వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. మల ద్వారాన్ని శుభ్రం చేసుకునేప్పుడు చేతికి తగులుతాయి.
మూడవ స్టేజి: మల విసర్జన సమయంలో పెరిగిన మొలలు బయటకు వస్తాయి. మరలా చేయి పెట్టి లోపలికి పంపితే తప్ప ఇవి లోపలికి పోవు.
నాల్గవ స్టేజి: మొదటి మూడు స్టేజీలనూ అశ్రద్ధ చేసినట్లయితే జబ్బు నాల్గవ స్టేజిలోకి పోతుంది. ఈ స్థితిలో లోపలికి మొలలు పూర్తిగా బయటకి వచ్చేసి అలాగే ఉండిపోతాయి.
ఈ స్టేజిలో కూడా అశ్రద్ధ చేస్తే అక్కడ ఇన్‌ఫెక్షన్ దాని నుంచి ప్రమాదకరమైన పరిణామాలు కలుగుతాయి.
మొలలు రావడానికి కారణాలు:
మొలలు పెరగడానికి మొట్టమొదటి కారణం మలబద్దకం.
మనలో చాలామందికి మలబద్దకం ఉందని కూడా తెలియదు.
1.ఆహారంలో కారాలు, మసాలాలు, పచ్చళ్ల వినియోగం పెరగడం.
2.అధిక మాంసాహార వినియోగం
3.నీళ్లు సరిపడా తాగకపోవటం
4.ఫైబర్ ఉండే ఆకుకూరలు కాయగూరలు తీసుకోకపోవడం
5.దాహాన్ని పెంచే వేపుళ్లు వంటి పదార్థాలు ఎక్కువగా వాడటం.
6.ఎక్కువగా కూర్చుని ఉండటం.
7.ఎక్కువసేపు బాత్రూం కమోడ్‌పైన గడపడం.
8.అధికంగా ప్రయాణాలు చేయడం
ఇవి కాక గర్భిణీలకు కడుపులో పెరిగే వత్తిడి వలన కూడా మొలలు వస్తాయి.
మనం ఏం చేయాలి?
బాత్రూంలోకి ఫోన్ వద్దే వద్దు. ఈ మధ్య చాలామందికి బాత్రూంలో కూర్చుని ఫోన్‌ని వాడటం ఎక్కువైంది.
దీని వలన తెలియకుండానే కాలం గడిచిపోతుంది. ఎక్కువసేపు అదే పొజిషన్‌లో ఉంటూ ఉంటే మొలలు పెరుగుతాయి.
మరి కొందరు పిల్లలు ఫోన్‌తో ఆడుకొంటూ మోషన్‌కి వెళ్లాలన్న ఆలోచనని కూడా ఆపేసుకొంటున్నారు. వాళ్లను సరి చెయ్యాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
మల విసర్జనకు ఎప్పుడు వెళ్లాలి?
మన దేశంలో దీనిపై ఉన్నన్ని మూఢ నమ్మకాలు మరెందులోనూ లేవు.
కొందరు ఉదయం మాత్రమే వెళ్లాలని, తిన్న తర్వాత వెళ్లకూడదని, అలా చేస్తే తిన్నది వొంటికి పట్టదని అంటూంటారు. కానీ అది వాస్తవం కాదు. నిద్ర లేవగానే వచ్చే ఆర్థోకోలిక్ రిప్లెక్స్ తినగానే వచ్చే గ్యాస్ట్రో కోలిక్ రిప్లెక్స్ పూర్తిగా సహజమైనవి.
ఆయుర్వేదం ఏమంటుందంటే ‘వేగో న ధారయేత్’. అంటే మనకి ఎప్పుడు మల విసర్జన చేయాలని అనిపిస్తుందో అప్పుడు వెళ్లాల్సిందే.
ఎందుకంటే మనకు వచ్చే మలాన్ని ఆపినట్లైతే అది రెక్టమ్ అనే పెద్ద పేగులో ఉండిపోతుంది. పెద్ద పేగులో మలం నుండి నీరు వెనక్కి తీసుకోబడుతుంది. దాని వలన మలం గట్టిగా తయారవుతుంది. దానిని బయటకు పంపించడానికి మరింత ముక్కవలసి రావడంతో మొలలు పెరుగుతాయి.
కొన్ని పరిస్థితులు మన దేశంలో మారాలి.
పిల్లలకి సరిపోయినన్ని మరుగుదొడ్లు ప్రతి పాఠశాలలో లేవు. ఉన్నచోట్ల కూడా పిల్లలు ఎప్పుడు వెళ్లాలంటే అప్పుడు ఉపాధ్యాయులు పంపించని పరిస్థితులు మన దగ్గరే ఉన్నాయి.
ఉపాధ్యాయుల పరిస్థితి ఇంకా దారుణం. మహిళా టీచర్లయితే మరీ దారుణం.
మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో పనిచేసే వారు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రోజూ ఉదయానే్న దొడ్లో కూర్చుని మల విసర్జనకై రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా బలవంతంగా ముక్కడం కూడా మొలలు పెరగడానికి దారి తీస్తుంది.
ఇదే పరిస్థితి బాత్రూం లేని చిన్నచిన్న వ్యాపారులకు, ఉద్యోగులకు కూడా ఉంటోంది.
బహిరంగ మల విసర్జన కూడా ఒక కారణమే. ఇప్పటికీ మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. కొన్ని ఊళ్లలో అందరికీ మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని ఎంతమంది వాడుతున్నారన్నది ప్రశ్న.
దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయని ప్రముఖ ప్రోక్టలోజిస్ట్ డాక్టర్ పరమేశ్వర్ సీఎం చేసిన విస్తృత సర్వే తెలియజేస్తుంది.
బహిరంగ మల విసర్జనకి వెళ్లే వారు ప్రధానంగా చీకటి పడ్డాక గాని, లేదా తెల్లవారుజామున వెలుతురు రాకముందే బహిర్భూమికి వెళతారు. పలు కారణాల వల్ల వాళ్లు భయంభయంగా మలవిసర్జన చేసి చీకట్లోనే ఇంటికొస్తారు. ఇది అసంపూర్తి మల విసర్జనకు దారి తీస్తుందని, అది పెద్దపేగులోనే గట్టి పడిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అర్శ మొలలు పెరగడానికి ఇది ప్రధాన కారణమని చెప్పవచ్చు.
ఇంకో ప్రధాన కారణం మన వెస్ట్రన్ కమోడ్. మన పూర్వీకులు అందరూ కొన్ని వందల సంవత్సరాలుగా నేలపై కూర్చుని మల విసర్జన చేస్తున్నారు. అయితే 1890లో వెస్ట్రన్ కమోడ్ ప్రవేశంతో దీనిని వాడేవారు పెరిగారు. మోకాళ్ల నొప్పుల మూలాన కూడా ఈ కమోడ్ వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇదే వినియోగంలో ఉంది. అయితే దీని వలన పూబో రెక్టాలిస్ కండరం రిలాక్స్ అవక పేగు సరైన యాంగిల్‌లో ఉండక పూర్తిగా మల విసర్జన అవదు. దీనిని మార్చడానికి వెస్ట్రన్ కమోడ్ వాడేటప్పుడు కాళ్ల కింద స్టూలేసుకుంటే మంచి ఫలితాలనిస్తుంది.
చికిత్సలు ఎలా?
మొదటి స్టేజీలో జీవన శైలి మార్పు సరిపోతుంది.
నాల్గవ స్టేజీలో శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.
రెండవ మూడవ స్టేజీలో ఇప్పుడు చాలా చికిత్సా పద్ధతులు లభిస్తున్నాయి.
మొలలకి రబ్బర్ బ్యాండ్ వేసి తొలగించే రబ్బర్ బాండింగ్. ఇంజక్షన్ ఇచ్చి చేసే స్క్లీరో థెరపీ. ఇన్ఫ్రారెడ్ పద్ధతిలో నయం చేసే ఐఆర్‌సి. మూడవ స్టేజీలో స్టాప్లర్ పద్ధతి. రక్తస్రావం అరికట్టే డిజిహెచ్‌ఎఎల్ పద్ధతి. ఇంకా లేజర్ ద్వారా చేసే చికిత్సలు.. ఇలా చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
ఆయుర్వేదం ఏమంటోంది?
ఆయుర్వేదం మొలల చికిత్సని నాలుగు రకాలుగా చెబుతోంది.
భేషజ చికిత్స: మొదటి స్టేజీలోనే వాటికి మందులు.
క్షార చికిత్స: రెండవ స్టేజీ నుంచి నాల్గవ స్టేజీ వరకు ఉన్న లోపలి మొలలని ఈ చికిత్స ద్వారా నయం చేయవచ్చు.
అగ్ని చికిత్స: బయట ఉన్న మొలలను ప్రత్యేక పరికరాల ద్వారా తొలగించే చికిత్స ఇది.
శస్త్ర చికిత్స: నాల్గవ స్టేజీలో ఉన్న మొలలను శస్తచ్రికిత్స ద్వారా తొలగించాలని మొట్టమొదటి సర్జన్, శస్త్ర చికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతుడు వెయ్యి సంవత్సరాల క్రితమే చెప్పాడు. వీటిల్లో ఇప్పటి పరిస్థితుల్లో ఇతర చికిత్సా విధానాలతో పోలిస్తే క్షార చికిత్స మానవాళికి లభించిన ఒక మహత్తర చికిత్సా విధానంగా భావించవచ్చు.
ఏమిటీ క్షార చికిత్స?
మొక్కల నుంచి తయారుచేసిన ఒకానొక ప్రత్యేక మందుని (తీక్షణ క్షారం)ని ఆర్శమొలలపై లేపనంగా రాసి మొలలు పోయేలా చేసే పద్ధతే ఈ చికిత్సా విధానం.
ఈ పద్ధతిలో రోగిని పడుకోబెట్టి అవసరమైన మత్తుమందు ఇచ్చి పెరిగి ఉన్న అర్శ మొలలని ప్రత్యేక పరికరంతో పట్టుకుని దానికి తీక్షణ క్షారము పట్టించి ఒక నిమిషం (100 మాత్రల కాలం) ఉంచి తీసివేస్తారు. దీని వలన మొలలలోని రక్తం వెంటనే గడ్డ కడుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ హీమ్ మరియు గ్లోబిన్‌గా విడిపోతుంది. నెమ్మదిగా స్రావంగా వచ్చేస్తుంది. క్షార కర్మ వలన మొలలు పూర్తిగా పోయి ఆ ప్రాంతంలో మంచి ఫైబ్రోసిస్ టిష్యూ ఏర్పడి మరలా మొలలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలా అన్ని మొలలనీ ఒకే సిట్టింగ్‌లో చేయవచ్చు.
క్షార చికిత్స వలన ప్రయోజనాలు ఏమిటి?
ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. * కోయడం, కుట్లు వేయడం ఉండదు. * రక్తస్రావం ఉండదు * త్వరగా తిరిగి రోజువారీ పనులు చేసుకోవచ్చు * ఆపరేషన్‌తో పోలిస్తే అతి తక్కువ నొప్పి.

-డా. ఎం.డి.పి.రాజా.. 9849635046