Others

మావోల ‘వివేకం’ అపాయకరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషేధిత మావోయిస్టు పార్టీ చేస్తున్న హింస, విధ్వంసకాండ కారణంగా ప్రాణభయంతో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిమంది గుత్తికోయ గిరిజన కుటుంబాలు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి- కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలకు వలసవచ్చి దిక్కులేని పక్షుల్లా జీవిస్తున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోకుండా భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గుత్తికోయల పిల్లలకు పాఠశాలలు లేవు. వారు ఆవాసం ఉంటున్న ప్రాంతాలలో ఆసుపత్రులు లేవు, రవాణా సౌకర్యం లేదు. కనీసం తాగేందుకు మంచినీళ్లు సైతం లేవు. వారు ఇలాంటి దుర్భర పరిస్థితిలో బతకడానికి కారణం మావోయిస్టులే. వారివల్లనే గిరిజనులు ఇలా విస్థాపనకు గురయ్యారు. మావోయిస్టులు ఈ తెగపై విశ్వాసం లేక, నమ్మకం లేక వీరిపై కక్షగట్టి అనేక దాడులు చేశారు. గిరిజన తెగల మధ్య తంపులు సృష్టించి, ఒక తెగపై మరో తెగను ఉసిగొల్పి తమ పబ్బం గడుపుకుంటున్నారు. మావోలు గోండు తెగకు అండగా నిలిచి గుత్తికోయ తెగలపై దాడులు నిర్వహించడంతో, ద్వేషం పెంచుకోవడంతో వారు ఈ దాడులను తట్టుకోలేక వలసబాట పట్టారు.
ఇలా తెలంగాణలోని వివిధ జిల్లాల అటవీ ప్రాంతాలకు గుత్తికోయ తెగలు వలసవచ్చారు. అటవీశాఖ అధికారులు సైతం వీరిపై దాడులు చేశారు. అక్రమంగా అటవీ భూములను ఆక్రమించుకుంటున్నారని కేసులు పెడుతున్నారు. వారికున్న స్వల్ప సరకు- సరంజామాను ధ్వంసం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ తంతు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. దాంతో వారి వెతలు పెరిగాయి. కష్టాలు-కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి.
తమ స్వస్థలాల్లో ఉన్నట్టయితే ఏదో కష్టం చేసుకుని, జీవనం గడిపేవారు, కాయో-పండో తిని జీవనం గడిపేవారు. మావోయిస్టుల కార్యకలాపాల కారణంగా తమ స్వస్థలాలను వదిలి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పక్షుల్లా బయలుదేరారు. వీరి అవస్థలను ప్రసార- ప్రచార మాధ్యమాలు బయటి ప్రపంచానికి తెలియజేశాయి. దాంతో ఈ సంక్షోభాన్ని ఉమ్మడి హైకోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించి వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని, వారిపై దాడులు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో దీనివల్ల తెలుస్తోంది. కొన్నిచోట్ల రాష్ట్ర ప్రభుత్వం వారికి కొన్ని కనీస సౌకర్యాలు కల్పించింది. వారి పిల్లలకు మినీ అంగన్ వాడీలను ఏర్పాటు చేసింది. పౌష్టికాహారం అందిస్తోంది. కొందరికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆసుపత్రుల్లో చికిత్సలు అందుతున్నాయి. గర్భిణులు ప్రసవాలు చేయించుకుంటున్నారు. సమీప ప్రాంతాల్లో కూలీ-నాలీ చేసుకుంటున్నారు. వీరిలో చాలామంది తమదైన ‘యాస’లో తెలుగులో మాట్లాడుతున్నారు. వారిని మీడియా పలకరించినప్పుడు తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. గిరిజనులకు అందాల్సిన అన్ని పథకాలు, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు తమకూ అందాలని కోరుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
విచిత్రమేమిటంటే.. ఇలా దూరంగా తమమానాన తాము బతుకుతున్నా- తమ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని, తమ సమాచారం పోలీసులకు అందించి ఇక్కడికొచ్చి తల దాచుకుంటున్నారని ఆరోపిస్తూ మావోయిస్టులు అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి కొందరిని హతమార్చిన సంఘటనలున్నాయి. తమ వెంట ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్ళి శిక్షించిన సందర్భాలూ ఉన్నాయి. పక్షుల్లా పరాయిచోట బతుకుతున్నా మావోల పంజామాత్రం తమమీద పడుతూనే ఉందని వారు వాపోతున్నారు. ఈ రకమైన కార్యక్రమం ఏవిధంగా ఆహ్వానించతగ్గది? గిరిజనులను, ఆదివాసీలను అన్నివిధాలా ఆదుకుని వారికోమార్గం చూపి సాధికారతతో జీవించేందుకు సహకరించకుండా ఇలా భయభ్రాంతులకు గురిచేస్తూ, నీడలా వెంటాడుతూ వారి జీవితాలతో ఆడుకుంటే భావ్యంగా ఉంటుందా?
ఇప్పటికీ కొన్ని ఆటవిక లక్షణాలు పుణికిపుచ్చుకుని వేటపై, పశుపోషణపై, పోడు వ్యవసాయంపై ఆధారపడి తమదైన పద్ధతిలో జీవనం కొనసాగిస్తున్న కోయ-గుత్తికోయలపై మావోయిస్టులు పగబట్టడం దారుణం. బాణాలతో అటవీ జంతువులను వేటాడే వీరిని, గుడిసెల్లో జీవిస్తూ కావడితో వస్తువులను తరలించే ఈ అమాయక ఆదివాసీలను అన్నివిధాలా ఆదుకోవలసిన మావోయిస్టులు ఇలా తమ రాజ్యాధికారం కోసం వీరిని ‘విస్థాపన’కు గురిచేయడం దారుణం. వేల సంవత్సరాల చరిత్రగల వీరిని, వీరి సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడి అదే సమయంలో వారికి మెరుగైన సౌకర్యాలు అందించడానికి గల అవకాశాలను అనే్వషించి వారి దరికి చేర్చవలసిన మానవతా వాదులుగా వ్యవహరించాల్సిన మావోయిస్టులు వారిపట్ల యమకింకరులుగా మారడం అత్యంత విషాదం.
గుత్తికోయలు తాడ్వాయి మండలం అటవీప్రాంతంలో వేసుకున్న గుడిసెలను పోలీసుల సాయంతో అటవీ అధికారులు కూల్చివేశారు. ఇలా పలుసార్లు అక్కడి నుంచి వారిని తరలించినా తిరిగి అక్కడికే చేరుకుంటున్నారని అటవీ అధికారులు తమ వాదనను వినిపిస్తున్నారు. తమకు పునరావాసం కల్పించాలని గుత్తికోయలు కోరుకుంటున్నారు. ఈ వాద-వివాదాల మధ్య వారి జీవితాలు తెల్లారిపోతున్నాయి. ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’ అన్న పద్ధతిలో మావోలు వ్యవహరిస్తున్నారు. ఆపదలో ఆదుకోవలసినవారు తమ రాజకీయ ఎత్తుగడలో భాగంగా గుత్తికోయల్ని ఉపయోగించుకుంటున్నారు.
వర్తమాన సమాజంలో ఇలాంటి మూతక వ్యూహం-ఎత్తుగడలు ఏ మేరకు ప్రాసంగికమైనవి? అమాయక ప్రజలు ముఖ్యమా? రాజ్యాధికారం ముఖ్య మా? మావోయిస్టులు మాత్రం రాజ్యాధికారమే తమకు ముఖ్యమని చాటిచెబుతున్నారు. ఆచరణలో చూపుతున్నారు. మధ్యభారతంలో అరణ్య ప్రాంతంలో ‘రెడ్ కారిడార్’ను విస్తరిస్తున్నామని సంబర పడుతున్నారు. అడవిలోని ఆదివాసీలకు అందాల్సిన ‘జ్ఞానం’ బదులు ఆయుధాలను అందిస్తున్నారు. గెరిల్లా సైన్యంలో భాగస్తులు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. పాఠశాలకెళ్ళాల్సిన బాలలను సైతం మినహాయించకుండా వారిని తమ సంఘంలోకి, సైన్యంలోకి చేర్చుకుంటున్నారు. ఆవిధంగా తమ సిద్ధాంతం బస్తర్ తదితర ప్రాంతాల్లో సజీవంగా ఉందని లోకానికి చాటే ప్రయత్నం చేస్తున్నారు.
నేడు ప్రపంచం పరుగులు తీస్తున్న తీరుకు- మావోలు రూపకల్పన చేస్తున్న ‘జనతన సర్కారు’కు ఎక్కడా పొంతన కుదరట్లేదు. ప్రత్యామ్నాయమంటూ ప్రాణాలు తీస్తూ ముందుకు సాగినా పాజిటివ్ ఫలితాలేవీ కనిపించడం లేదు. కనిపిస్తున్న ఫలితం... విస్థాపన. గుత్తికోయల మాదిరి ఆదివాసీలు విస్థాపన చెంది వలసబాట పడుతున్నారు. తమది కానిచోట ఊపిరి పీల్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం సఫలీకృతం కావడం లేదు. వారి కొత్తతరాలు సైతం ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అనాదిగా వస్తున్న జీవన విధానం ధ్వంసమై కొత్తపరిసరాలలో జీవనం కొనసాగించలేక అనేక అవమానాలకు, అవహేళనలకు గురవుతున్నారు. ఎంతో మర్యాదగా, హుందాగా తమదైన రీతిలో వేల సంవత్సరాలుగా కొనసాగిస్తున్న జీవితాన్ని మావోయిస్టులు ఇలా ‘దెబ్బ’తీయడం ఏవిధంగా ఆమోదనీయం? ఈ మార్పు మెరుగైన దిశగా సాగుతున్నదా? అంటే లేదనే సమాధానమొస్తున్నది. మరలాంటప్పుడు మావో ల ఆలోచనాదృక్పథం ఎంత లోపభూయిష్టమైనదో అర్థర్ధమవుతుంది. గుత్తికోయల కష్టాలను విని హైకోర్టు చలించి ఆదేశాలు జారీచేసింది కాని అడవిలో తిరిగే మావోయిస్టులు మాత్రం కనికరించకపోగా సమీపంలోఉన్న సెల్‌టవర్లను పేల్చేస్తున్నారు. మందుపాతరలతో కల్వర్టులను ధ్వంసం చేస్తున్నారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గుత్తికోయలను ‘ఖతం’ చేస్తున్నారు. ఉన్నచోట ఉండనీయకుండా తరుముతున్నారు. ఇది ఏరకంగా మానవీయమనిపించుకుంటుంది? రాష్ట్ర హైకోర్టు స్పందన సరైనదా? మావోయిస్టుల వివేకం- వివేచన సరైనదా? ఎవరికివారే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలి.

-వుప్పల నరసింహం 99857 81799