Others

మావోల ఉచ్చులో యువత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని వౌలాలీ ప్రాంతంలో ఇటీవల ముగ్గురు యువతులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలలో వీరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూష అనే ఈ యువతులు చిన్నప్పటి నుంచే మావోయిస్టు భావజాలంతో ప్రభావితమై పని చేస్తున్నారని వినికిడి. అనూష, అన్నపూర్ణలు గెరిల్లా దళ జీవితాన్ని సైతం గడిపారు. మావోయిస్టు ప్రముఖ నాయకుడు ‘ఆర్కే’తో సంభాషించి, వీరు గెరిల్లా దళ జీవితంలోకి అడుగిడారని, తుపాకులు ధరించి ఫొటోలు సైతం దిగారని తెలుస్తోంది. మూడు పదుల లోపు వయసుగల ఈ అమ్మాయిలు అనంతరం అర్బన్ నక్సల్‌గా రూపాంతరం చెందారు. మావోల అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలో వీరు చురుగ్గా పాల్గొంటూ, యువతను మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. ఆత్మకూరు సోదరీమణుల మాదిరి ఎంతోమంది ఈ రకమైన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
ఇదే సమయంలో హైదరాబాద్‌లోని భూభౌతిక పరిశోధన సంస్థ సాంకేతిక అధికారి వెంకట్రావు ఛత్తీస్‌గఢ్‌లోని మావోలకు మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను అందజేస్తుండగా అక్కడి పోలీసులు అరెస్టుచేశారు. దీంతో అర్బన్ నక్సల్స్ ‘అక్టోపస్’ అంతటా వ్యాపించారని తేలింది. ఇలా యువతను పెడదోవ పట్టించడం వల్ల అటు ఆ వ్యక్తులకు, ఇటు సమాజానికి ఎలాంటి మేలు చేకూరడం లేదు. మావోలు కలలు గంటున్న సమాజం నిజానికి ఎక్కడా కనిపించడం లేదు. ఆ ఛాయలే లేనపుడు యువతను అటువైపు ఆకర్షించడంలో అర్థమేమిటి?
అధునాతన కంప్యూటర్ పరిజ్ఞానంతో నేటి యువత కుస్తీపడుతోంది. తాజాగా ‘పైథాన్’ అనే కంప్యూటర్ లాంగ్వేజిని మరింత మెరుగుపరుస్తున్నారు. కృత్రిమ మేధకు మెరుగులు దిద్దుతున్నారు. వివిధ కంప్యూటర్ లాంగ్వేజీలను నేర్చుకుని నూతన ఆవిష్కరణల దిశగా యువత ప్రయాణిస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మకూరు సోదరీమణులు అరెస్టయిన హైదరాబాద్‌లోనే ‘పైథాన్’ లాంగ్వేజిని బోధించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులు సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ లాంగ్వేజికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ యువతతోపాటు అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల యువత సైతం అటువైపుచూస్తున్నారు. అనేక ‘స్టార్టప్’లతో మమేకమై నూతన ఆవిష్కరణల కోసం శ్రమిస్తున్నారు. విద్యాసంస్థలు కూడా పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మావోలు ఊహిస్తున్నట్టు విప్లవ సాహిత్యం, మార్క్స్ -ఏంగిల్స్, లెనిన్-స్టాలిన్ తదితరుల పుస్తకాలను అధ్యయనం చేసేందుకు యువత ఇష్టపడటం లేదు. నేడు యువత సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. అన్నింటికీ సామాజిక మాధ్యమాలే వేదికలవుతున్నాయి. పల్లెలు-పట్నాలు అన్న తేడా లేకుండా అందరూ ‘డిజిటల్ తెర’కు అధిక సమయం కేటాయిస్తున్నారు. ఇది అందరి ఎరుకలో ఉన్నదే! స్మార్ట్ ఫోన్‌తో ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశం ఏర్పడటంతో అందరూ దానికి ‘అంకిత’మవుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎదురయ్యే అన్నీ అవసరాలు డిజిటల్ మోడ్‌లోకి మళ్ళాయి. నాలెడ్జి కీలకం కావడంతో నాలెడ్జి ఎకానమీ వ్యాప్తి చెందుతోంది. సంపద ఇప్పుడు ఈ రకంగా సృష్టించబడుతోంది. సమాజమంతటా ఈ నాలెడ్జి ఎకానమీ పరివ్యాప్తమవుతున్న నేపథ్యంలో మావోయిస్టుల ‘‘ప్రత్యామ్నాయ’’ పద్ధతులు ఎలా పాదుకొంటాయి? వాటికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుంది? ఈ విషయమై స్పష్టత లేకుండా ఎంతమంది అమాయక యువతీ యువకులను వామపక్ష తీవ్రవాదమనే ఊబిలోకి దింపుతారు?
లోకం ఇప్పుడు ‘ఆన్‌లైన్’పై నడుస్తోంది. ఆన్‌లైన్ పట్ల విశ్వాసం అపారంగా పెరిగింది. ఈ ఆన్‌లైన్ రోజుల్లో రాజకీయ విశ్వాసాలు రూపాంతరం చెందాయి. ఈ కీలక పరిణామాన్ని మావోలు పరిగణించక పోవడం విడ్డూరం. రోబోల యుగంలో కృత్రిమ మేధ సమాజంలో విస్తరిస్తోంది. వామపక్ష రాజకీయ సిద్ధాంతాలపై విశ్వాసం క్రమంగా సడలుతోంది. సమాజంలో డ్రైవర్ రహిత కార్లు రావడం, వ్యాధులను నిర్ధారించే సాఫ్ట్‌వేర్ రావడం, మనుషులకు సంబంధించిన నిర్ణయాలను ఆల్గొరిథమ్ ద్వారా తీసుకునే సందర్భం వచ్చేసింది. దీన్ని పట్టించుకుని పరిస్థితులను అంచనావేసి తదనుగుణంగా స్పందించడానికి బదులు కాలం చెల్లిన సిద్ధాంతాలను సజీవంగా నిలుపుతామని, అందుకు యువతరాన్ని బలి తీసుకుంటామంటే ఎలా భావ్యమనిపించుకుంటుంది?
వాణిజ్యం-వ్యాపారం ఈ-కామర్స్ ద్వారా కొనసాగుతున్న రోజులివి, కిరాణ సరుకులను సైతం ‘ఆన్‌లైన్’ ద్వారా తెప్పించుకుంటున్న సమయమిది. దిగ్గజ కంపెనీలు ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు పెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వీళ్ళందరూ ప్రజలే. ప్రజలు కాని వారెవరున్నారు? కాని వామపక్ష తీవ్రవాదులు మాత్రం ప్రపంచంలో రెండువర్గాలున్నాయని అంటున్నారు. కాని సమాజమంతటా ప్రజలే కనిపిస్తున్నారు. ద్వైతం కాదు అద్వైతమే అగుపిస్తోంది. ఈ అద్వైతం చుట్టూనే ప్రపంచం పరిభ్రమిస్తోంది. ఈ విషయం స్పష్టంగా అగుపిస్తోంది. దాన్ని తిలకించాలి కదా? అలా చూసేందుకు తిరస్కరిస్తూ బూజుపట్టిన సూత్రీకరణలకే వేలాడుతూ ఉంటే ప్రజలకు ఒరిగేది ఏమిటి? ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. అందుకు స్పష్టమైన విశే్లషణతో కూడిన విధానం ఉండాలి.
మరి మావోల విశే్లషణ ఎలా ఉందో అందరికీ తెలిసిందే! సమాజంలో రెండువర్గాలు (పెట్టుబడిదారులు- కార్మికులు) కొనసాగుతున్నాయి, వీటి మధ్యగల ఘర్షణను తొలగించి కార్మిక కర్షక సమాజం ఏర్పాటు చేస్తే, సర్వసమస్యలు సమసిపోతాయని భావించడం.. ఎంతటి అమాయకత్వమో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు. ఇంతటి రాశీభూతమైన అమాయకత్వం ఆధారంగా నిర్ణయాలు తీసుకుని, వంద కోట్లకు పైగా ప్రజల తరఫున తామే ‘సుమోటో’గా వకాల్తా పుచ్చుకుని దండకారణ్యంలో దండు నిర్మించడం, రక్తం ఏరులై పారేలా తుపాకులకు పని కల్పించడం దండగమారి పని తప్ప మరొకటి కాదు, దారుణమైన విధానం తప్ప మెరుగైనది కాదు.
ఆత్మకూరు సోదరీమణుల మాదిరి అసంఖ్యాక అమ్మాయిలు తమ జ్ఞానాన్ని సమాజం పరం చేస్తూ కార్యాలయాల్లో ఇతరచోట్ల సందడిగా సంపద సృష్టిస్తూ కనిపిస్తుంటే మావోయిస్టులు మాత్రం అలాంటి అమ్మాయిలను చైతన్య మహిళా సంఘాల పేర, ఇతర సంఘాల పేర, గెరిల్లా దళాల పేర వారి జ్ఞానాన్ని మట్టిపాలు జేస్తున్నారు. దుర్వినియోగ పరుస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం లేదని చైనా ఏనాడో ప్రకటించింది. యువతను ఉత్పత్తిరంగంలోకి దింపి ఉత్పత్తిని పెంచి అనేక వస్తువులను చైనా ప్రపంచానికి అందిస్తోంది. అక్కడ కోట్లాది మంది ప్రజలను దారిద్య్రం నుంచి బయటపడేశారు. సంతృప్తికరమైన జీవితాన్ని అందిస్తున్నారు. ఇదికదా.. ఈ కొత్త ఏడాదిలో అందరూ కోరుకోవలసింది?

-వుప్పల నరసింహం 99857 81799