Others

‘పంచాయతీ పోరు’లో రాజకీయాల జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు నగారా మోగింది. అనాదిగా వర్గ రాజకీయాలతో ముడిపడినందున ఒక్కసారిగా పల్లెల్లో రాజకీయ పరిస్థితి మారిపోతోంది. ఎన్నికలకు తెర లేవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా వేడి పుట్టించే వాతావరణం ఏర్పడిందని పేర్కొనవచ్చు. బడా రాజకీయ నేతలకు వ్యూహ,ప్రతి వ్యూహాలు రూపొందించుకోవడానికి, బలమైన అనుచరవర్గం తయారుచేసుకోవడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆయుధంలా వాడుకొనే అవకాశం వుంటుంది.
ఒకప్పుడు గ్రామ సర్పంచులుగా ఎన్నిక కావడం అంటే- ఎంతో హోదా కింద, గౌరవ మర్యాదల కింద భావించేవారు. మొదట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తరువాత అంచలంచెలుగా ఎదగాలని ఎందరో నిర్ణయించుకునేవారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ వుండేది. సర్పంచ్‌లుగా గెలిచిన వారిలో ఒకరు సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యేవారు. అప్పట్లో సమితి ప్రెసిడెంట్ హోదా ఎమ్మెల్యే హోదాకు సమానంగా వుండేది. దాదాపు ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో సమానంగా పంచాయతీ సమితి వుండేది. సమితి ప్రెసిడెంట్లుగా ఎంపికైన వారిలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నుకునేవారు. ఏపీలో ఎన్టీ రామారావు అధికారం చేపట్టాక మండల వ్యవస్థ ప్రారంభమైంది. ఇప్పుడు ఒక సమితి స్థానంలో నాలుగైదు మండల ప్రజాపరిషత్తులు ఏర్పడ్డాయి. సర్పంచ్‌లుగా గెలిచిన వారిలో కొందరు రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రుల స్థాయికి ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులైన జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర రెడ్డి లాంటి ప్రముఖులు మొదట సమితి ప్రెసిడెంట్లుగా ఎన్నికైనవారే.
ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1985లో ‘నూతన పంచాయతీరాజ్ చట్టం’ అమలులోకి తీసుకురావడంతో సమితులు రద్దయ్యాయి. చివరిగా సమితి అధ్యక్షుల ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 1980లో జరిగాయి. ఎన్.టి.రామారావు తీసుకొచ్చిన కొత్త పంచాయతీ చట్టంలో కూడా మూడంచెల పంచాయతీ వ్యవస్థ (సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు) వున్నప్పటికీ నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు ఏర్పాటు చేశారు. వార్డు మెంబర్‌ను, సర్పంచ్‌ను, మండల అధ్యక్షుడిని, జిల్లా పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ప్రజలు ఎన్నుకునే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఈ విధంగా 1986లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పట్లో దేవేందర్ గౌడ్ లాంటి నేతలు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎంపికయ్యారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలోనే ఐదంచెల పంచాయితీ వ్యవస్థ 1995లో అమలులోకి వచ్చింది. సర్పంచ్‌లతో పాటు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లాపరిషత్ చైర్మన్‌లు అంటూ ఐదు విభాగాల వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఎంపీటీసీల నుంచి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిని, జడ్పీటీసీల నుంచి జిల్లాపరిషత్ చైర్మన్‌ను ఎన్నుకుంటున్నారు. జడ్పీటీసీలు మండల స్థాయిలో ఓటర్ల ద్వారా ఎన్నికవుతున్నారు. చిన్న పంచాయతీ అయితే ఒకరు, పెద్ద పంచాయతీ అయితే ఇద్దరు, ముగ్గురు చొప్పున ఎంపీటీసీలు (2000 నుంచి 3000 మంది ఓటర్లతో) ఎన్నికవుతున్నారు.
గతంలో పంచాయతీలకు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఆరేడు సంవత్సరాలకు ఇంకా పైబడి ఎన్నికలు జరిగేవి. ఇలా 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత 1980లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1987లో ఏడు సంవత్సరాల విరామం అనంతరం ఎన్నికలు జరిగాయి. ఇలా అస్తవ్యస్తంగా ఉన్న పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ పరిధిలో చట్ట్భద్రత వుండాలని 1989లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నూతన పంచాయితీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చారు. గ్రామ పంచాయతీలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎమ్మెల్యే, ఎం.పీ. ఎన్నికల తరహాలో క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగే విధంగానూ, సర్పంచ్‌లకే నేరుగా చెక్‌పవర్ వుండాలని, కేంద్రం నుంచి వారి ఖాతాలోకి నేరుగా నిధులు వెళ్లాలని ఆయన భావించారు. ఆ కేటాయింపులకు ‘పంచాయతీరాజ్ రోజ్‌గార్ నిధులు’ అని పేరుపెట్టారు. రాజీవ్‌గాంధీ ఈ చట్టానికి నాంది పలికి మొదట ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 1992లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా వున్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత ఏర్పడింది.
మొదట్లో సర్పంచ్ పదవిని హోదా కింద భావించినవారు రానురానూ రాజకీయ, వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే విధంగా మారారు. ప్రపంచీకరణ ఫలితంగా పల్లెలకు ఆనుకుని జాతీయ రహదారుల వద్ద భూమి విలువ పెరగడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధిచెందడం, కొత్తకొత్త పరిశ్రమలు, కార్పొరేట్ కళాశాలలు రావడం వంటి మార్పులు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, పరిశ్రమల యజమానులకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతి అవసరం కావడంతో తద్వారా సర్పంచ్‌లకు, ఇతర పాలకవర్గ సభ్యులకు భారీఎత్తున కమీషన్ల రూపంలో ఆదాయం వస్తున్నది. ఇలాగే కొన్ని మేజర్ పంచాయతీల పరిధిలో ఈత, తాటి, చింత వనాలు వుండడం, చేపలు, రొయ్యలు పెంపకానికి కృత్రిమంగా చెరువులు ఏర్పడడం, వాటికి వేలం పాటలు నిర్వహించడంతో పంచాయతీలకు ఆదాయం బాగా పెరిగింది.
గ్రామాల్లో రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తుండడంతో వీటి కాంట్రాక్ట్ పనుల ద్వారా సర్పంచులకు, వార్డ్ మెంబర్లకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. అందుకే కొన్ని మేజర్ పంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా గెలుపుకోసం లక్షలు కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరిగాయి. 2007లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తిరుపతి సమీపంలోని తిరుచానూరు, రేణిగుంట, హైదరాబాద్ శివారులోని శంషాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య వున్న కొన్ని పంచాయతీల్లో, విశాఖ నగరం పరిసరాల్లోని గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం నేతలు పోటాపోటీగా డబ్బు ఖర్చు చేశారు.
ఇపుడు తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ పోరులో ప్రధాన రాజకీయ పార్టీలు తమ పట్టును నిరూపించుకునేందుకు తపన పడుతున్నాయి. కీలక పంచాయతీల్లో సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకునేందుకు ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు నేతలు వెనుకాడడం లేదు. భవిష్యత్ రాజకీయాలకు పంచాయతీ పదవులు పునాది వంటివని భావిస్తూ గ్రామస్థాయి నాయకులు బరిలోకి దిగుతున్నారు. పంచాయతీల్లో ఎన్నికల కోలాహలం చూస్తుంటే.... జాతిపిత మహాత్మా గాంధీ ఆశించిన ‘గ్రామ స్వరాజ్యం’ సంగతేమే కానీ, రాజకీయాలు మాత్రం రసకందాయంలో పడ్డాయి.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212