Others

కొత్త తరాలొచ్చాయ్.. తిలకించండి కామ్రేడ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతికేళ్లకో కొత్తతరం తమ సత్తా చాటుతుంది. నూతన ఆలోచనలతో ప్రపంచాన్ని తమతో తీసుకెళుతోంది. తరాల మధ్య అనేక అంశాలలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వందేళ్ల క్రితపు ‘డైనమిక్స్’ అంతే శక్తిమంతంగా పనిచేస్తాయని అనుకోవడం అమాయకత్వం. ఈ ప్రాథమిక సత్యం జీవితంలోని అన్ని పార్శ్వాలకు అన్వయమవుతుంది. దీన్ని విస్మరించి పాత పద్ధతులను అనుసరిస్తే ప్రాసంగికతను కోల్పోవడం తప్ప ఇంకేమీ జరగదు. ఇంత స్పష్టంగా పరిస్థితి కళ్లకు కడుతున్నా- మొదటి పారిశ్రామిక విప్లవ కాలం నాటి డైనమిక్స్, వైరుధ్యాలు నాల్గవ పారిశ్రామిక విప్లవ కాలంలోనూ కొనసాగుతాయని ఊహించడం, కాలానుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం విషాదం గాక ఏమవుతుంది? దురదృష్టవశాత్తూ దేశంలో మార్క్సిజం ఇప్పటికీ అంతే ప్రాసంగికమని విశ్వసించే పార్టీలున్నాయి. అందులో ప్రమాదకరమైన పార్టీ మావోయిస్టు పార్టీ.
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించకుండా జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని అంచనా వేయకుండా, మారిన డైనమిక్స్‌ను పసిగట్టకుండా వందేళ్ల పూర్వపు ఆలోచనలకు, భావజాలానికి జీవన విధానానికి పట్టం కడదాం రండి.. రారండోయ్.. అని తుపాకులు, మందుపాతరలు పేలిస్తే ఏమైన అర్థం ఉందా..? రెండు వందల ఏళ్ల క్రితపు వ్యవసాయం, వాణిజ్యం-వ్యాపారం, పారిశ్రామిక పరిస్థితులకు ప్రభావితమై ‘సమతుల్యత’ సాధించేందుకు కారల్ మార్క్స్ చేసిన సూత్రీకరణలు వర్తమానంలోనూ ఉపకరిస్తాయనుకోవడం, వాటిని అన్వయించుకోవడం, యథాతథంగా ఆచరణలో పెడతామనడం అత్యంత దారుణమైన సంగతి తప్ప మరొకటి కాదు. ఈ రెండువందల ఏళ్ళలో వ్యవసాయం, వాణిజ్యం-వ్యాపారం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచాన్ని తిలకించే విధానం సంపూర్ణంగా మారిపోయిందన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆయుధాలతో, మందుగుండు సామగ్రితో సమాజంలో సమతుల్యత సాధిస్తామనుకోవడంలోని సహేతుకత ఏపాటిదో ఎవరికివారే ఆలోచించవచ్చు. వైరుధ్యాలు మారాయి, డైనమిక్స్ మారాయి. ఉత్పత్తి విధానం, పంపిణీ విధానం పూర్తిగా మారింది. సంపద సృష్టి విధానం మారింది. ఇంత మారినా పట్టించుకోకుండా, సుత్తి-కొడవలి పనిముట్ల దగ్గరే ఆలోచనలను స్తంభింపజేసి అడుగు ముందుకేయాలనుకోవడం అభాసుపాలు కావడం తప్ప మరొకటి కాదు.
ఏ కాలంలోనైనా సంపద సృష్టి- పంపిణీ అనేది కీలకం. సంపద సృష్టి రెండువందల ఏళ్ల క్రితం ఓ రీతిన ఉంది. ప్రస్తుతం పూర్తిగా కొత్త రూపంలో కనిపిస్తోంది. నేడు కృత్రిమ మేధ ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. రెండువందల ఏళ్ల క్రితం అంటే మార్క్సిస్టు మూల సూత్రాల ప్రతిపాదన సమయంలో మానవుని ‘చెమట’కు అధిక ప్రాధాన్యమున్నది. సంపద ఆ చెమట-నెత్తురు ఆధారంగా ఎక్కువ సృష్టింపబడింది. ప్రస్తుతం ఆ సన్నివేశం తారుమారైంది, ఆ ‘దృశ్యం’ మారింది. సంపద సృష్టి మేధ- కృత్రిమ మేధ ఆధారంగా జరుగుతోంది. అతి కీలకమైన ఈ ‘మార్పు’ను గుర్తించకుండా అంతే సాంద్రతతో మార్క్స్ సూత్రీకరణలను అమలులోకి, ఆచరణలోకి తీసుకొస్తామని ఉబలాటపడితే బొక్కబోర్లా పడటం తప్ప మరొకటి ఉండదు. వాస్తవానికి ప్రపంచమంతటా మార్క్సిజం విఫలమైన సన్నివేశం స్పష్టంగా కనిపిస్తున్నా భేషజాలకు పోయి ఆ దృశ్యాన్ని చూసేందుకు నిరాకరిస్తూ అంతా తమ విశే్లషణ- వింగడింపు ప్రకారమే కొనసాగుతోందని, తమ ‘నడక’ను మార్చుకోవలసిన అవసరం లేదని వారు వాదించడం విడ్డూరం గాక ఏమవుతుంది?
మావోయిస్టులైతే మరింత మొరటుగా దండకారణ్యంలో దండు నిర్మించి రక్తం కళ్ల జూసుకుంటూ రెండువందల ఏళ్ళ క్రితం డైనమిక్స్ ఆధారంగా రూపొందిన సూత్రాలకు వాస్తవ రూపం ఇస్తామని కంకణం కట్టుకోవడం ఎంతటి అజ్ఞానమో ఇట్టే అర్థమవుతోంది. ప్రజల సంక్షేమం- అభివృద్ధికి అంకితమై పనిచేయలసిన విప్లవ పార్టీ ఇలా రెండువందల ఏళ్ళ క్రితపు ఆలోచనల ఆధారంగా ఏర్పడిన సిద్ధాంతాలను, సూత్రాలను సజీవంగా నిలిపేందుకు పాటుపడతామని, రక్తం చిందిస్తామని సమాజాన్ని సమూలంగా మారుస్తామని ప్రతిజ్ఞచేస్తే ఏమిటి ప్రయోజనం?
వాస్తవానికి సమాజం సమూలంగా మారిపోయింది. దాన్ని చూడకుండా, పట్టించుకోకుండా, తమ హింస- విధ్వంస చర్యల ఆధారంగా మాత్రమే సమాజం మారాలి.. అదే నిజమైన మార్పు అనుకోవడం సంకుచితత్వం తప్ప మరొకటి కాదు. అది ప్రపంచాన్ని, ప్రజల్ని అర్థం చేసుకోలేనితనం. ఆ వితండవాదం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సమాజగతిని, చలన గతిని సరైన రీతిలో అర్ధం చేసుకోలేని మార్క్సిస్టులు, మావోయిస్టులు ఈ సమాజాన్ని ఎలా మారుస్తారు? ఆ పరికరాలు వారిదగ్గర లేవని ఎప్పుడో చేతులెత్తేశారు. తమ ఊహకు, అంచనాకు మించి సమాజం ఎదిగి అందనంత ఎత్తులను తాకింది. ఈ నేపథ్యంలో ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప దాన్ని సమూలంగా మార్చే నైపుణ్యం- శక్తి- యుక్తి సృజనాత్మకత ఏవీ వారిలో లేవని కాలమే నిరూపించింది. జర్మనీలో ‘బెర్లిన్ గోడ’ కూలిన దృశ్యాన్ని- వైనాన్ని చూసేందుకు ఇష్టపడక ఇంకా ఆ శిథిలాలలో మార్క్సిజాన్ని వెతికి దానికి ఆక్సిజన్ అందించి నిలబెట్టాలని చూడడం హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. రష్యాలో లెనిన్ విగ్రహాలను క్రేన్ల సాయంతో తొలగించడాన్ని, చైనాలో తియాన్మన్ స్క్వేర్ వద్ద విద్యార్థులు, యువకులు సైనిక ట్యాంకులకు ఎదురొడ్డి ప్రజాస్వామ్యం కోసం నినదించిన ఉక్కు సంకల్పాన్ని, సంస్కరణల భావాన్ని చూసేందుకు తిరస్కరిస్తే ఏమిటి ప్రయోజనం? భారతదేశంలో ఎక్కడైతే నక్సల్‌బరి ఉద్యమం ప్రారంభమైందో అక్కడ ఇప్పుడు ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. అక్కడి పొలాలు సస్యశ్యామలంగా తులతూగుతున్నాయి. ప్రజల చేతికి ఓటు అనే పాశుపతాస్త్రం లభించింది. తాజాగా ‘సెల్‌ఫోన్’ దొరికింది. సాధికారతతో జీవించేందుకు ఆసరా అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఏ కాలంలోనైనా కోరుకునేది ఇదే కదా? ఆ సాధికారిత తమ ముంగిళ్లలో కనిపిస్తుండగా మావోయిస్టులు మాత్రం ఇది బూటకపు ప్రజాస్వామ్యం, బూటకపు ఎన్నికలు కాబట్టి వీటిని త్యజించి సాయుధ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రాత్రి-పగలు ఆ పలవరింపుతోనే కాలం గడిపితే అదెలా ప్రాజ్ఞత అవుతుంది? నక్సల్‌బరి ఉద్యమం ప్రారంభించిన తరం అస్తమించింది. ఈ యాభై ఏళ్ళలో రెండు కొత్త తరాలొచ్చాయి. వారి ఆకాంక్షలు-ఆశలు, జ్ఞానం, చొరవ, ముందుచూపు అంతకుముందు తరాలకు సరిపోలవు. మరలాంటప్పుడు నక్సల్‌బరి ఉద్యమం సజీవంగా ఎలా ఉంటుంది? ఆ అవసరమే ఇప్పుడు లేదుకదా? ఆ విషయం అటు జర్మనీలో, ఇటు రష్యాలో, చైనాలో, నక్సల్‌బరిలో తేటతెల్లమయ్యాక ఇంకా మావోలు దండకారణ్యంలో ‘రెడ్ కారిడార్’ కలగనడం అన్యాయం.
మానవులను ప్రత్యర్థులుగా లేదా పక్కకునెట్టేసే సామర్థ్యం గల ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) ఇప్పటికే తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. స్వయం చోదక వాహనాలు వచ్చేశాయి. చదరంగంలో మానవుడినే ఓడించిన కృత్రిమమేధ మనముందున్నది. మనిషిలా ప్రసంగించే హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’ సంచలనం సృష్టిస్తోంది. అలాంటివి మరెన్నో రంగంలోకి రానున్నాయి. మిషన్ లెర్నింగ్ విధానం మరింత విస్తృతమైంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో జరిగే పరిణామాలు మార్క్సిస్టుల- మావోయిస్టుల ఊహలకు అందకుండా ఉన్నాయి. మానవుల ప్రయాణ వేగం పెరుగుతోంది. హైపర్ లూప్ ద్వారా ఇప్పటికే ఎంతో వేగంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పడింది. ఇలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ప్రజలను మరో గ్రహం మీదకు తీసుకెళ్ళి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంటే మరో గ్రహం ముఖ్యంగా అంగారక గ్రహంపై మానవ కాలనీలు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో, నూతన ఆవిష్కరణలతో, స్టార్టప్ సంస్థల ఆవిష్కరణలతో ఉత్పత్తిపెరిగి అశేష ప్రజానీకానికి ఆహారం అందించే కృషి విస్తృతంగా జరుగుతోంది. ఈ నూతన సంవత్సరంలో పుట్టిన పిల్లలు పాతికేళ్ళ తరువాత ఇప్పుడున్న పద్ధతులన్నీ కాలం చెల్లినవిగా భావిస్తారని నిపుణుల అంచనా. మరి 175 ఏళ్ల క్రితపు మార్క్స్ అధ్యయనాలు, సూత్రీకరణలు ఇప్పుడు కాలం చెల్లకుండా ఎలా ఉంటాయి కామ్రేడ్స్?

-వుప్పల నరసింహం 99857 81799