AADIVAVRAM - Others

చెత్త లారీ ( స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన రోజుకి కొత్త బట్టలు కొనడానికి స్వస్తిశ్రీని తల్లి రెడీమేడ్ దుస్తుల దుకాణానికి తీసుకెళ్లింది. దాదాపు డజను డ్రెస్‌లని చూశాక ఒకటి స్వస్తిశ్రీకి నచ్చింది. కాని దాని ధర అందుబాటులో లేకపోవడంతో తల్లి దానికన్నా తక్కువ ఖరీదైంది కొన్నది.
‘నీ అంత పిసినారివి నువ్వే’ స్వస్తిశ్రీ తల్లిని అన్న మాటలు ఆ దుకాణంలోని అంతా విన్నారు.
ఆమె బదులు మాట్లాడకుండా డబ్బు చెల్లించి బయటకి వచ్చింది.
ఇద్దరూ ఆటో కోసం నిలబడ్డారు. పక్క నించి వెళ్లే ఓ చెత్త లారీలోంచి కొంత చెత్త కింద పడటం చూసిన స్వస్తిశ్రీ తల్లితో చెప్పింది.
‘ఆ లారీని చూశావా? ఎంత చెత్తని రోడ్డు మీద పడేసి పోతోందో? అది తప్పు కదా?’
‘అవును. తప్పు’
కొద్దిసేపాగి తల్లి మళ్లీ చెప్పింది.
‘ఇటీవల నువ్వు కూడా ఆ చెత్త లారీలా ప్రవర్తిస్తున్నావు తెలుసా?’
‘చెత్త లారీలానా? అంటే?’ స్వస్తిశ్రీ ఆశ్చర్యంగా అడిగింది.
‘చెత్తని పోస్తున్నావు’
‘నేను రోడ్ మీద చెత్తని ఎప్పుడు పోశాను? అబద్ధాలు నేర్చావు’
‘అదిగో. మళ్లీ ఇప్పుడే చెత్తని పోసావు’
స్వస్తిశ్రీ తల్లి వంక సాలోచనగా చూసింది.
‘అన్నయ్యతో ‘నువ్వు మూర్ఖుడివి’ అని, అక్కయ్యతో ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని, నీ ఫ్రెండ్‌తో ‘నువ్వు తిక్కదానివి’ అని.. ఇలా ఈ మధ్య చాలా చెత్తని పోస్తున్నావు. నీకు కోపం వచ్చినప్పుడల్లా నీ నోట్లోంచి వచ్చే పిచ్చిమాటలన్నీ ఆ చెత్తతో సమానం. అవి చెడు వాసనలు వేయడమే కాక, వినడానికి అసహ్యంగా కూడా ఉంటాయి. రోడ్డు మీది చెత్తని చూస్తే నీకు ఎలా రోత పుడుతుందో అలా నీ మాటలు విన్న వాళ్లకి కూడా రోత పుడుతుంది. చెత్త లారీ కేవలం చెత్తనే పోస్తుంది తప్ప మంచి వాటిని పోయలేదు. కాని నీ నోట్లోంచి వచ్చే మాటల విషయంలో నీకు అదుపు ఉంది. ఏవి రావాలో, ఏవి రాకూడదో అన్నది ఎంపిక చేసుకుని మాట్లాడే స్వేచ్ఛ నీకు ఉంది. చెత్త లారీలా ద్వేషపూరితమైన మాటల బదులు సువాసనని ఇస్తూ అగరుబత్తిలు అమ్మే సైకిల్ వాడిలా ప్రవర్తిస్తూ, ప్రేమపూరితమైన మాటలు మాట్లాడటం నీ చేతుల్లోనే ఉందని నువ్వు గ్రహించాలి’
ఇద్దరూ ఆటో ఎక్కారు. ఇంటికి చేరేదాకా వౌనంగా ఉన్న స్వస్తిశ్రీ ఆటో దిగాక చెప్పింది.
‘ఈ పుట్టిన రోజు నించి నేను చెత్త లారీలా చెత్తని పోయడం మానేస్తాను. సువాసనని ఇస్తూ అగరుబత్తిలు అమ్మే సైకిల్‌వాడిలా ప్రవర్తిస్తాను’

మల్లాది వెంకట కృష్ణమూర్తి