AADIVAVRAM - Others

రస ప్రవాహం.. గోపికా గీత (రాస క్రీడాతత్త్వము-11)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాననుకొన్నట్టే జరుగుతున్నందుకు కృష్ణుడు లోలోపలే నవ్వుకుంటూ, ‘‘ప్రియతమా! అంతకంటే భాగ్యమా? నీ మాటకు తిరుగా? ఇదిగో కొంచెం వంగుతున్నాను. మెల్లిగా నా భుజాల మీదికి ఎక్కు’’ అంటూ చేతులు నేలకు ఆనించి, ముందుకు వంగాడు.
ఆ వగలాడి తన అదృష్టానికి తనే పొంగిపోతూ, ఎక్కడ లేని కులుకులూ కులుకుతూ, చీర సవరించుకుంటూ, వెనక్కి తిరిగి స్వామి మీద ఎక్కి కూర్చోబోయింది.
కాలివ్రేళ్ళ మీద కొంచెం పైకెగిరి, స్వామి భుజాల మీద కూర్చోవాలనుకున్న ఆ గోపిక, ‘‘్ఢం’’ అని క్రింద పడ్డది. ఎప్పుడు మాయమైనాడో గానీ, శ్రీకృష్ణుడు మాయమై పోయాడు.
ఆ పిల్లకు ముందు ఉక్రోషం, తరువాత భయమూ, చివరికి ఏడుపూ ఎగతన్నుకొని వచ్చాయి. స్వామి స్పర్శను పొంది పోగొట్టుకున్నది కనుక, ఆమెకు విరహతాపం తీవ్రమై, ఒళ్ళంతా అగ్గి మంటలై, గిలగిలలాడింది. ఈ వేదనలో ఆమె గర్వం బూడిదై, మనసు వెలితై, స్వామికోసం వలవలా ఏడ్చింది.
కొంతసేపటికి కృష్ణుడి కోసం వెతుకుతున్న ఇతర గోపికలు అక్కడకు వచ్చి, జరిగిందంతా విని, తామందరికీ గర్వభంగం చేయటం కోసమే స్వామి ఇలా చేశాడని తెలుసుకొని, ఆశ్చర్యపోయారు. విరహ వేదనతో ఉడుకెత్తి పోతున్న ఆ వగలాడి మీద జాలితో, ఆ గోపికలు శ్రీకృష్ణుడి కోసం మళ్ళీ అడవంతా కలయతిరిగారు. అలా తిరుగుతూ తిరుగుతూ, స్వామి లీలామానవుడనే గుర్తింపు పెంచు కుంటూ, ఇటు తిరిగి అటు తిరిగి, మళ్ళీ యమునానది తీరానికి చేరారు.
కృష్ణుడు మనం వెతికితే దొరికేవాడు కాదని వారికి అప్పటికే అర్థమైంది. ఇక వెతకడం మానేశారు. అప్పటికి వారి మనసుల నిండా కృష్ణుడే నిండిపోయాడు. వారి మాటలను ఆయనే ఆక్రమించాడు. వారి చేష్టలకు ఆయనే ఆధారమయ్యాడు. స్వామి ఎటు పోయాడో, ఎప్పటికి వస్తాడో తెలియకపోయినా, ఇక పైన తామేమి చెయ్యాలో, ఎటు పోవాలో, ఆ దారి తెలియకపోయినా, ఆ గోపికలకు తమ ఇళ్ళు మాత్రం గుర్తుకు రాలేదు.
నడిచి నడిచి అలిసిపోయన ఆ గోపికలంతా యమునా తీరపు ఇసుక తినె్నల్లో ఒక చోట చేరి, అందరూ కలిసి ఆ స్వామి ఆగమనాన్ని ప్రార్థిస్తూ, ఆ స్వామినే కీర్తన చేస్తూ, పాటలు పాడారు.
గోపికా గీత :
ఇక్కడే శ్రీమద్భాగవతంలో గోపికాగీత అనే అధ్యాయం వుంది. కేవలం 19 శ్లోకాలున్న ఈ అధ్యాయానికి వందల పేజీల వ్యాఖ్యానాలున్నాయి. ఈ గోపికాగీతలోని శ్లోకాల ఛందస్సు కూడా సంగీతానికీ, నాట్యానికీ, అనువుగా తాళబద్ధంగా సాగుతూ వుంటుంది.
ఉదాహరణకు మొదటి శ్లోకం :
జయతి తేధికం జన్మనా వ్రజః
శ్రయత ఇందిరా శశ్వదత్ర హి
దయత! దృశ్యతాం దిక్షు తావకాః
త్వయి ధృతాసవ స్త్వాం విచిన్వతే ॥
(భాగవతం-స్కం10, అధ్యా-31, శ్లో-1)
(భావం :నీ పుట్టుకతో ఈ గోకులమంతా సర్వోన్నతం గా వుంది. లక్ష్మీదేవి ఇక్కడ నిరంతరం వుంటోంది. ఓ ప్రియా! నీవాళ్ళూ, నీమీదే ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళూ, నీకోసం వెతుకుతున్నారయ్యా! కనిపించు.)
ఈ గోపికాగీతలో పరమవిరహభక్తి యొక్క తత్త్వమం తా బహు విస్తారంగా ప్రదర్శింపబడి వుంది.
ఈ గోపికాగీతలోని నాల్గవ గీతం ఇలా వుంది.
న ఖలు గోపికానందనో భవాన్
అఖిల దేహినా మంతరాత్మదృక్
విఘనసార్థితో విశ్వ గుప్తయే
సఖ ఉదేయివాన్ సాత్వతాం పతే ॥
(భావం : ఓ సఖా! నీవు గొల్లవారి పిల్లవాడవు కాదు. దేహధారులందరిలోనూ వ్యాపించి వున్న అంతరాత్మ సాక్షివి నువ్వే. జగత్పరిపాలన చేయమని బ్రహ్మదేవుడు ప్రార్థిం చాడు కనుక, మా వంశంలో పుట్టి, మా కళ్ళకు కనిపిస్తున్నావు.)
ఈ విధంగా, ఒక వైపు శ్రీకృష్ణుడ్ణి భర్తగా శృంగార భావంతోనూ, మరో వైపు ఆ స్వామిని పరమాత్మగా నిర్మలభక్తితోనూ, భావన చేస్తూ, ఆ గోపికలు చాలా సేపు గానాలు చేశారు. ఈ గోపికాగీత అధ్యాయంలో చివరి శ్లోకం ఇలా వుంది.
శ్లో॥ యత్తే సుజాత! చరణాంబురుహం స్తనేషు
భీతాశ్శనైః ప్రియ! దధీమహి కర్కశేషు
తేనాటవీ మటసి తద్వ్యదతే న కింస్విత్
కూర్పాదిభిర్ భ్రమతి ధీర్ భవదాయుషాం నః ॥
(భావం : ఓరుూ! అందమైన జన్మగలవాడా! నువ్వు మమ్మల్ని వదలి వెళ్ళావని కాదయ్యా మా బాధ. నిన్ను భావించే మా భావనలలో నీ మెత్తని చరణాలను మా గుండెలకు హత్తుకోవాలని ఆశపడి కూడా, మా మొరటు గుండెలు గుచ్చుకుంటాయేమోనని జంకి, మెల్లి మెల్లిగా, మెత్త మెత్తగా ఆ శ్రీపాదాలను దగ్గరకు తీసుకుంటూ వుంటామే, అలాంటి ఆ పాదాలతో నువ్వు అడవంతా తిరుగుతున్నావయ్యా! ఆ నీ సిరిపాదాలలో ఏ గులక రాళ్ళు గుచ్చుకుంటాయోనని మా మనసు విలవిల లాడుతోందయ్యా! నీమీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతు కుతున్న మాకు, ఈ మాటలు తలుచుకుంటేనే తల తిరిగిపోతోందయ్యా!)
గోపికాగీతలో ప్రతి పదమూ రస ప్రవాహంగా ఉంటు ంది. ఈ గీతికలలోకి వెళ్ళిపోతే ఇక బయటకు రాబుద్ధే కాదు.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి 9866330060