Others

మావోయిస్టులకు ఇది.. ఆత్మవిమర్శనా కాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఇటీవల ఐదురోజులపాటు ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సు జరిగింది. మనదేశం నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక చలనగతులపై నిపుణులు పలు పత్రాలను సమర్పించి చర్చలు చేశారు. దీని ప్రభావం ప్రపంచమంతటా కనిపించింది. అందరిచూపు అటువైపే నిలిచింది. మరోవైపు ఈ సదస్సు ప్రారంభానికి ఒక రోజుముందు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో ఎస్సార్ కంపెనీకి చెందిన ఇనుప ఖనిజాన్ని రవాణాచేసే పైప్‌లైన్‌ను మావోయిస్టులు ధ్వంసం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కిరండోల్ నుంచి విశాఖలోని ఎస్సార్ కంపెనీకి సరఫరా అవుతున్న ఇనుప ఖనిజాన్ని ధ్వంసం చేయడంతో ద్రవరూపంలోని ఆ ఖనిజం పొలాల్లోకి పారింది. చిత్రకొండ జాన్‌బాయ్ నుంచి వెళుతున్న ఈ పైప్‌లైన్‌ను మావోలు ధ్వంసం చేశారు. గతంలోనూ వీరు ఇనుప ఖనిజ సరఫరాను పలుమార్లు ధ్వంసం చేశారు. ఈసారి మరింతగా రెచ్చిపోయి అధికంగా నష్టపరిచారని తెలుస్తోంది. తమ ఉనికిని చాటుకోవడానికి విలువైన ఖనిజ సంపదను ఎందుకు కొరగాకుండా చేయడం సబబేనా? పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయా?
ఓ పక్క దావోస్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ పారిశ్రామిక ప్రగతి, సాంకేతిక అభివృద్ధికి తమ మనోభావాలను వెల్లడిస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంటే తద్భిన్నంగా మావోయిస్టులు ఇలా పారిశ్రామిక ప్రగతికి గండికొడుతూ పోతుంటే దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుందా? త్వరలో ఆర్థికపరంగా భారత్ చైనాను అధిగమించగలదని రఘురామ్ రాజన్ చెప్పారు. దక్షిణాసియా దేశాల్లో భారత్ వృద్ధిరేటు క్రమంగా పెరుగుతోందని, రానున్న రోజుల్లో మన దేశం మెరుగైన స్థానంలో నిలుస్తుందని విశే్లషించారు. చైనా, భారత్‌ల మధ్య పోటీ ఇరు దేశాలకు ప్రయోజనకరమేనని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ రకమైన దిక్సూచి లాంటి విశే్లషణలు వెలువడుతున్న తరుణంలో తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల పేర దారుణంగా చంపి రోడ్డుపై శవాలను పారేశారు. గత సంవత్సరం బామ్రగఢ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు ఉప్పందించిన వారిగా అనుమానితులైన ఆరుగురిని అపహరించి వారిలో ముగ్గురిని వదిలిపెట్టి, మిగతా ముగ్గురిని కాల్చిచంపారు. గత సంవత్సరం ఎన్‌కౌంటర్‌లో తమ కామ్రేడ్స్ మృతికి ఇది ప్రతీకారమని బ్యానర్లు కట్టి వారు తమ మనోవికారాన్ని చాటుకున్నారు. ప్రజల కోసమే తమ పోరాటమంటూ ఆ ప్రజలనే ఇలా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం న్యాయమా? ఇలా వందలాది మందిని ఇన్‌ఫార్మర్ల పేర హతమారిస్తే, ఆస్తులను ధ్వంసం చేస్తే ఆర్థిక ప్రగతి జరుగుతుందా? అదే రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఆర్ అండ్ బీ ఉద్యోగులు గాయపడ్డారు. ఇలా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో మానవ హననం, ఆస్తినష్టం వంటి విధ్వంసాలకు మావోలు తెగబడితే ఎక్కడ తేలుతాం? ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకునే మావోయిస్టులు ఇలా ప్రజల ఎదుగుదలను అడ్డుకుంటూ, వారి జీవితాలతో చెలగాటమాడితే ఒరిగేదేమిటి?
ప్రపంచీకరణ అనంతరం జరిగిన పరిణామాలను పట్టించుకోకుండా స్వాతంత్య్రం రాకపూర్వపు ఆలోచనలతో, అవగాహనతో మావోలు ఇలా అరాచకాలకు పాల్పడితే దానికి ప్రాసంగికత ఉంటుందా? కమ్యూనిస్టు దేశంగా చెప్పుకుంటున్న చైనా 12.25 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో వెలిగిపోతోంది. ఒకప్పుడు భారత్-చైనాల వృద్ధిరేటు సమానంగా కొనసాగాయి. చైనా ముందుగా మేల్కొని సంస్కరణలు చేపట్టి ప్రపంచమార్గాన్ని అనుసరించడం మూలంగా శరవేగంగా అభివృద్ధిని సాధించింది. ఈ విషయం అందరికీ తెలుసు. దానికి ప్రత్యామ్నాయం లేదని చైనానే ఘంటాపథంగా చెప్పి ఆచరిస్తుండగా ఇక్కడ మావోలు దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరించడంలో ఏమాత్రం అర్థం లేదు. కమ్యూనిస్టులైనా, సోషలిస్టులైనా, ప్రజాస్వామిక వాదులైనా ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరచడం ముఖ్యం. దీన్ని విస్మరించిన వారికి చరిత్రలో స్థానం లేదు, ఉండదు. మరి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలంటే వర్తమానంలో ఏంచేయాలి? ప్రపంచీకరణను అనుసరించి అడుగులు వేయాలని పాతికేళ్ల క్రితం తెలుగువాడైన ప్రధాని పి.వి.నరసింహారావు సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సహకారంతో ఆ సంస్కరణలు పట్టాలపైకెక్కి సజావుగా కొనసాగుతున్నాయి. దాంతో ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో తలెత్తుకుని పయనించగలుగుతోంది. దీన్ని తలకిందులుచేసి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టి నియంతృత్వంతో పాలిస్తామని మావోలు బందూకులు పట్టుకుని బయలుదేరితే దానికి మాన్యత ఉంటుందా? అలా మందుపాతరలు- మర తుపాకులతో ప్రస్థానాన్ని ప్రారంభించి దశాబ్దాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గొర్రె తోక బెత్తెడు మాదిరి ఎదుగుదల లేదు. ఆమాత్రం దానికి ఇంత హింస, నరమేధం, విధ్వంసం అవసరమా?
పాతికేళ్ళలో ప్రపంచం సంపూర్ణంగా మారిన తీరును పసిగట్టకుండా, కొత్త తరాల సరికొత్త ఆకాంక్షల్ని గుర్తించకుండా, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుని అవి సామాన్య ప్రజల్ని సైతం ప్రభావితం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రత్యామ్నాయం పేర దండకారణ్యంలో జనతన సర్కార్‌ను బలోపేతం చేస్తున్నామని గొప్పలు పోవడంలో ఏమాత్రం ప్రాసంగికత లేదు. ఆ ప్రయత్నం మానవ వనరుల్ని, సంపదను, జరిగిన అభివృద్ధిని ధ్వంసం చేయడానికే ఉపకరిస్తోంది తప్ప పురోభివృద్ధికి ఏమాత్రం దోహదపడటం లేదు. ఈ విషయం దశాబ్దాలుగా రుజువవుతున్నా పట్టించుకోకుండా పిడివాదంతో వ్యవహరించడం వల్ల సమాజానికేమి ఉపయోగం లేదు.
వర్తమానంలో ప్రపంచం తిరుగుతున్న కక్ష్య వేరు, మావోలు స్తంభించిపోయి తిరుగుతున్న కక్ష్య వేరు. గనుక వారు వర్తమానాన్ని అందుకోలేరు. అందుకోగల నైపుణ్యం వారిలో లేదు. వారి చర్యలేవీ సమాజానికి దోహదపడవు, వారి సిద్ధాంతాలు స్ఫూర్తిదాయకాలు కావు. కాలం చెల్లిన ఆ సిద్ధాంతాలు- సూత్రీకరణలను పట్టుకుని వేలాడటంలో వారికి ఆనందం కలగొచ్చు గాని సమాజానికి ప్రయోజనం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
దావోస్ సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించడంలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించేందుకు సాంకేతికపరంగా జవాబులు రూపొందుతున్నాయని చెప్పారు. ఆ ఆనవాళ్లు ఇప్పటికే ప్రపంచమంతటా కనిపిస్తున్నాయి. భారత్‌లోనూ మన కళ్ళముందు కనిపిస్తోంది. దాన్ని మరింత మెరుగుపరచనున్నారు. ప్రజల జీవితంలో కంప్యూటర్లు, కృత్రిమ మేధ విడదీయరాని భాగమయ్యాయని సత్య నాదెళ్ల అన్నారు. ఈ విషయం సైతం అందరి అనుభవంలో ఉన్నదే! మరి ఆ సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ ఫలాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడంలో అందరూ ప్రయత్నించాలి. మావోయిస్టులు సైతం తమవంతు పాత్రను ఈ విషయంలో సమర్ధవంతంగా పోషించాలి. కాని అలా జరగడం లేదు. కేవలం తుపాకీ భాషను బోధించేందుకు ఎక్కువ శ్రమపడుతున్నారు. రక్తం ఏరులై పారేందుకు ఉసిగొల్పుతున్నారు. జరిగిన కొద్దిపాటి అభివృద్ధిని నేలమట్టం చేస్తున్నారు. అమాయకులను ఇన్‌ఫార్మర్ల పేర హతమారుస్తున్నారు.
అర్బన్ నక్సల్స్‌ను ఊహాలోకాల్లో విహరింప జేస్తున్నారు. ఉద్యమం పేర తిరోగమనం దిశగా నడుపుతున్నారు. నైపుణ్యాలు పెంచుకుని జీవితాలను పండించుకోవలసిన తరుణంలో విలువైన జీవితాలను అడవిగాచిన వెనె్నలలా చేస్తున్నారు. తరతరాలుగా ఎన్నింటికో మొఖం వాచిన వర్గాలకు మావోల దృక్పథం శాపంగామారింది, మారుతోంది. దీన్ని ఎవరైనా ఎలా స్వాగతిస్తారు? ఎలా ఆహ్వానిస్తారు? మావోలు ఆత్మవిమర్శ చేసుకునేలా అందరూ ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైందనడంలో ఎలాంటి పొరపాటు లేదు! మేధావి వర్గంతోపాటు యువత ఈ పనికి పూనుకోవల్సిన తరుణమిది!

-వుప్పల నరసింహం 99857 81799