AADIVAVRAM - Others

మానస దోషాలు మాయమైన వేళ..12 (రాస క్రీడాతత్త్వము)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథాగమనం సాగాలి కనుక, మనం ముందుకు సా గుదాం.
గోపికలలా విరహభక్తి పారవశ్యంలో లీనమైనందువల్ల, వారిలోని గర్వమూ, అసూయ, వంటి దోషాలన్నీ నశించిపోగా, వారి పిలుపులకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు వారి కళ్ళ ఎదుట మళ్ళీ సాక్షాత్కరించాడు.
గోపికలందరికీ పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినట్లయింది. వాళ్ళందరూ ఆయన్ని ఒక్క సారిగా చుట్టేసారు. ఇక్కడ శ్రీకృష్ణ కర్ణామృతశ్లోకం ఒకటి స్మరించదగినది వుంది.
శ్లో॥ లలాటఫలకే వక్షఃస్థలే కౌస్త్భుం
నాసాగ్రే నవవౌక్తికం కరతలే వేణుం కరే కఒకణమ్
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం
గోపస్ర్తిపరివేష్టితో విజయతే గోపాల చూడామణిః ॥
(శ్రీకృష్ణకర్ణామృతం)
( భావం : నుదుట కస్తూరీ తిలకం, ఛాతీమీద కౌస్త్భుమణి, ముక్కు చివర ముత్యపు బులాకీలు, చేతిలో మురళి, రెండు చేతులకు కంకణాలు, వంటి నిండా హరిచందనపు పూత, మెడలో ముత్యాల హారాలు, చుట్టూతా వేల కొలది గోపికలు, వీటితో వెలుగొందుతున్న ఆ గోపాలచూడామణి సర్వోన్నతంగా ప్రకాశించాడు.)
అప్పటికి ఆ జీవులందరికీ మానస దోషాలన్నీ తొలగి పోయి వున్నాయి కనుక, అవ్యాజమైన ప్రీతిభావంతో వారు స్వామి చుట్టూ చేరి, తోచిన సేవ చేయసాగారు.
(i) ఒకామె ఆయన రెండు చేతులూ పట్టుకుని నవ్వింది.
(ii) ఒకామె ఆయనను తన రెండు చేతులతో తన మీదకు లాక్కొంది.
(iii) ఆయన ఒకింత పవళించగా, మరొకామె ఆయన పాదాలను తన గుండెలకు హత్తుకుంది.
(iv) ఒకామె గుడ్లు మిటకరించి ఆయన వంకే చూసింది.
(v) ఒకామె తన కళ్ళతో ఆయనను లోపలకు పీల్చినట్లు భావించి, వెంటనే యోగి లాగా కళ్ళు మూసుకొని పరవశించిపోయింది.
ఇక్కడ జయదేవుడు గీతగోవింద కావ్యంలో జగన్మోహనమైన గీతమొకటి వ్రాశాడు-
పల్లవి : హరి రిహ ముగ్ధవధూనికరే; విలాసిని!
విలసతి కేళిపరే
చరణం : చందనచర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ
కేళిచలన్మణికుండల మండిత గండయుగస్మితశాలీ 1
పీనపయోధర భారభరేణ హరిం పరిరభ్య సరాగమ్
గోపవధూరనుగాయతి కాచిదుదంచిత పంచమరాగమ్- 2
కాపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజమ్
ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదనసరోజమ్-3
కాపి కపోలతలే మిళితా లపితుం కిమపి శ్రుతిమూలే
కాపి చుచుంబ నితంబవతీ దయితం పులకై రనుకూలే-4
కేళికలా కుతుకేన చ కాచిదముం యమునాజలకూలే
మంజుల వంజుల కుంజగతం విచకర్ష కరేణ దుకూలే-5
కరతలతాళ తరళవలయావళి కలితకలస్వన వంశే
రాసరసే సహనృత్యపరా హరిణా యువతిః ప్రశశంసే-6
శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
పశ్యతి సస్మిత చారుతరామపరామనుగచ్ఛతి వామామ్-7
శ్రీజయదేవ భణితమిద మద్భుత కేశవ కేళిరహస్యం
బృందావనవిపినే లలితం వితనోతు శుభాని యశస్యమ్-8
( భావం : పల్లవి: ఓ విలాసినీ! శ్రీహరి ఆ ముగ్ధగోపికల మధ్యలో కేళీపరుడై విలసిల్లుతున్నాడు.
చరణం : (i) ఆయన ఒంటినిండా హరిచందనం పూసుకొని వున్నాడు. పీతాంబరాలు ధరించాడు. మెడలో వనమాల వుంది. ఆయన చేసే నాట్యకేళికి ఆయన చెవుల కుండలాలు కదులుతుంటే, అది చిరునవ్వుతో ఒకింత ఉబ్బిన ఆయన చెక్కిళ్ళకు ఒక అలంకారంగా వుంది.
(ii) ఒక గోపికకు గుండెలలో పొంగు పెరిగి, మురళి వాయిస్తున్న ఆ స్వామిని తన గుండెలు దిగబడేలా కౌగలించుకుని, గొంతు పెంచి పంచమరాగంలో ఆ స్వామికి వంతపాడుతోంది.
(iii) ఒక గోపిక ఒకింత దూరాన నిలబడి, ఆ స్వామి పాటకు తాళంగా తన కళ్ళు తిప్పుతోంది. ఆ కదలికలలో ఒక్కొక్క కదలికకూ ఒక్కొక్క మన్మథుడు ఊడి పడుతుంటే, ఆ అమాయకురాలు మాత్రం మధుసూదనుడి వదన సరోజాన్ని అలా ధ్యానం చేస్తూనే వుంది.
(iv) ఒక గోపిక ఏదో రహస్యం చెబుదామని ఆ స్వామి చెవి దగ్గర మూతి పెట్టేసరికి, ఆయన బుగ్గలు రెండూ పులకలతో నిండిపోయాయి. అది చూసి ఆ విలాసిని చటుక్కున ముద్దే పెట్టేసింది.
(v) స్వామి యమునా తీరంలో ఒక పొదరింట దాక్కోగా, పసిగట్టి, కలసి నృత్యం చేద్దాం రమ్మని ఒకామె ఆయన ఉత్తరీయం పట్టుకు లాగింది.
(vi) స్వామి చుట్టూతా వ్ఱయాకారంగా చేరిన గోపికలు చేతులతో తాళం వేస్తుండగా, స్వామి మురళీనాదాలు పొంగులెత్తుతుంటే, ఒకామె తాళం వెయ్యటం మాని ఆయనతో అడుగు కలిపి నృత్యం చేయగా, ‘‘శహభాష్!’’ అని స్వామి ఆమెను మెచ్చుకున్నాడు.
(vii) ఆ రాసకేళిలో స్వామి ఒకరిని కౌగలించు కుంటున్నాడు. ఒకరిని ముద్దాడుతున్నాడు. మరొకరిని ఆటలాడిస్తున్నాడు. ఒకామె దూరాన నిలబడి అందంగా నవ్వుతుంటే, చూస్తున్నాడు. మరొకతె కోపించి ఎటో పోతుంటే, వెంటపడుతున్నాడు.
(viii) బృందావనంలో కేశవస్వామి చేసిన అద్భుతమైన, కీర్తికరమైన, కేళియొక్క రహస్యాన్ని శ్రీజయదేవుడు లలిత లలితంగా పలుకుతున్నాడు. ఆ పలుకులు మీకు శుభాలను కలిగించుగాక. ఇక్కడ కేళిరహస్యమనే మాటను మనం గమనించాలి.)

(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060