Others

విలువలకు పాతర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలీదు. కాని, పంచ్ డైలాగ్‌ల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది’ అనే డైలాగ్ ఇటీవల ఒక చిత్రంలో మహేష్‌బాబు పలికాడు. కేవలం పంచ్ డైలాగ్స్ మాత్రమే కాదు. సినిమాల ప్రభావం కూడా జనాల మీద గట్టిగానే ఉంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజయితే, తమ కథానాయకుడు ప్రపంచాన్ని జయించాడనే రేంజ్‌లో హీరోలకు పెద్ద, పెద్ద కటౌట్లు పెట్టి, పాలాభిషేకం చేస్తున్నారు అభిమానులు. తమ హీరోల పేరుమీద రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ, హీరోలపై అభిమానాన్ని చాటుకుంటున్నారు కాని సినిమా అనేది ప్రజలను కొంతవరకు చైతన్యపరచడమే కాకుండా వారిని చెడుదోవలోకి కూడా తీసుకెళ్తుందని అనడంలో సందేహం లేదు.
ఆనాటి కాలంలో తెలుగు సినిమా అంటే అందులో ఏదో ఒక సందేశం ఉండేది. ఆనాటి హీరోలు, దర్శకులు మానవత్వ విలువలు చూపించేవారు. పాత్రల మధ్య ప్రేమానుబంధాలు, ఏ విధంగా ఉండాలో వివరంగా ప్రేక్షకుల మదిలోకి దూసుకుపోయేలా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించేవారు. కథానాయకుడు, కథానాయిక పాత్రలు చాలా ఉన్నతంగా, గొప్పగా ఉండేవి. ప్రతీ పాత్ర, ఇతర పాత్రలతో సంభాషించేటప్పుడు అర్ధవంతమైన మాటలు మాట్లాడేవారు. ఒక ప్రతి నాయకుడు మరియు కొన్ని నెగెటివ్ పాత్రలు తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు ప్రేక్షకులను అలరించేవి. హాస్యం కూడా అందరిని నవ్వించే విధంగా సినిమా తీసేవారు. ఇక కుటుంబ విలువల్లో తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని మరియు అన్నతమ్ముళ్ల మధ్య మరియు అన్న చెల్లెళ్ల మధ్య విలువలను ఉన్నతంగా, విలువలతో, అర్ధవంతంగా తీసేవారు. సంగీతం కూడా పాటలు వినిపించే విధంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉండేది. ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే విధంగా ఆనాటి చిత్రాల్లో చూపించేవారు.
నేడు కూడా ట్రెండ్‌కి తగ్గట్లు, విలువలతో కూడిన చిత్రాలు చాలావరకు వస్తున్నప్పటికి, కొన్ని చిత్రాల్లో బూతు డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తోపాటు అర్ధరహితమైన మాటలను రాస్తున్నారు. ఉదాహరణకు బాద్షా చిత్రంలో జూ.ఎన్టీఆర్ పలికే ‘బాద్షా డిసైడ్ అయితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది’ వంటివి చాలానే వచ్చాయి. కొంతమంది దర్శకులు విలువలను కాలరాస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో ఇంటికి పెద్దవాడైన వెంకటేష్‌ను, చిన్నవాడైన తమ్ముడు మహేష్ ‘ఏరా’, ‘చెప్పరా’ అని పిలుస్తుంటాడు. ఇలాటి వాటివల్ల కొంతమేరకు సొసైటీలో విలువలు తగ్గుతున్నాయి. ఎంత సినిమా అయితే మాత్రం ఇలాంటి పదాలను వాడటం పెద్ద తప్పు. ఇక ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో మంచి, చెడులను వివరించే తండ్రులను హీరోలు అస్సలు లెక్కచేయట్లేదు. పైగా అలా ఉన్నవాడినే హీరో అని కొంతమంది ప్రేక్షకులు భావిస్తున్నారు. ఉదాహరణకు రేసుగుర్రం చిత్రంలో హీరో (అల్లు అర్జున్) తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు, పబ్బులకు తిరుగుతూ, తండ్రి తాగిన సిగరెట్స్ కాలుస్తూ, అన్నను లెక్కచేయని పాత్ర చేశాడు. ఆ పాత్ర మన జనాలకు హీరోయిజంగా కనపడింది అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే, ఇలా వచ్చిన చిత్రాల సంఖ్య చాలానే ఉంటుంది. మన దర్శకులు, కథానాయకుని క్యారెక్టర్ మీద తప్ప, మిగతా అన్ని పాత్రలను బఫూన్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. కనీసం కథానాయిక పాత్రను కూడా చాలావరకు సరిగ్గా తీర్చిదిద్దట్లేరు. వీరిని కేవలం నాలుగు లవ్ సీన్స్, ఐదు పాటలకే పరిమితం చేస్తున్నారు. హీరో చేసే కొన్ని పిచ్చి పనులకు కూడా హీరోయిన్ లవ్‌లో పడిపోతుంది అంటే హీరోయిన్‌లను కొంతమంది ఏవిధంగా వారి క్యారెక్టర్స్‌ను తీర్చిదిద్దుతున్నారో అర్ధంచేసుకోవచ్చు. ఇక సంగీతం, పాటలను వినిపించకుండా అందిస్తున్నారు సంగీత దర్శకులు. ఇక ఐటెంసాంగ్‌లు అంటూ సినిమాలో ఏదోఒకచోట విదేశీ భామలతో పాటలను షూట్ చేసి, సినిమాలో ఇరికిస్తున్నారు. వీటివల్ల కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. హాస్యం కూడా డబుల్ మీనింగ్‌లతో సాగడంతో, కొంతవరకు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి.
నేడు మన తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారని సంతోషపడాలో లేక మన సినిమాలలో విలువలు దిగజారుతున్నాయని బాధపడాలో తెలియని అయోమయంలో నేటి ప్రేక్షకులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మన టాలీవుడ్‌లో విలువలతో కూడిన చిత్రాలతోపాటు సందేశాత్మక, ప్రయోగాత్మక చిత్రాలు వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు మరియు మన సమాజానికి, సినిమాల ద్వారా కొంతమేరకు మంచి కూడా జరుగుతుంది. ఆ దిశగా మన తెలుగు చిత్ర పరిశ్రమ మంచి చిత్రాలను తీస్తే, సినిమాల విజయాలు, హిట్ల శాతం కూడా పెరుగుతుంది. దర్శక, నిర్మాతలు, హీరోలు ఆ దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంది.

-బానాల కృష్ణ, హైదరాబాద్