AADIVAVRAM - Others

ఓటమిని తట్టుకోవడం నేర్పాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు కళాశాలలలో వారం రోజుల వ్యవధిలోనే రెండు ఆత్మహత్యల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల్లిదండ్రుల రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో అందరి హృదయాలను కలచివేసింది. ఎందుకు ఇలా జరుగుతోంది? అభం శుభం ఎరుగని చిన్నారుల జీవితాలలో మధ్యలోనే వాడిపోతున్నాయి. పసిమొగ్గల భావి జీవితం ఆనందంగా గడపడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.’
బ్రతికే ధైర్యం కొరవడిందా?
ఇటీవల వార్తా పత్రికలలోని వార్తలను గమనిస్తే ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించుటలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. విద్యార్థుల జీవితాలు మధ్యలోనే తుడిచిపెట్టుకు పోతున్నాయి. ఆధునిక కాలంలో కాలంతోపాటుగా పరుగులు తీస్తూ ప్రకృతిని శాసించే స్థాయిలో సాంకేతికంగా ఎంతో పురోగమించాం. ఎన్నో అవకాశాలు, వసతులు, సౌకర్యవంతమైన జీవన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఒత్తిడితో కూడిన చదువులు, ఉద్యోగాలు, ఆర్థికంగా ఆకాశాన్ని అందుకోవాలనే ఆలోచనలు, విలాసవంతమైన జీవన విధానాలతో సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటనను పరిశీలిస్తే పిల్లలు హత్యలు చేయడానికి కూడా ప్రేరేపించబడుతున్నారు. మన తండ్రులు, తాతల వద్ద లక్షలు, కోట్ల రూపాయలు లేకున్నా ఆనందమయ జీవితం గడిపేవారు. అందుకు ప్రధాన కారణం వారసత్వంగా వచ్చిన జీవన నైపుణ్యాలే. వారిలో బ్రతకగలం అనే మనోధైర్యం ఉండేది. కాని నేటి తరంలో అవి కొరవడుతున్నాయి. మార్కులు, ర్యాంకులే ప్రాతిపదికగా, చిన్నతనం నుండే ఐఐటీలు, మెడికల్ ఫౌండేషన్‌ల పేరుతో వారి బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేసే స్థాయిలో, ఒత్తిడితో కూడిన విద్యా విధానం, క్రమశిక్షణ కొరవటం, విచక్షణ లేమి ఇవన్నీ కలిసి విద్యార్థులను మానసిక వికలాంగులుగా తయారుచేస్తున్నాయి. చిన్నపాటి సమస్యను కూడా తనకు తానుగా పరిష్కరించుకోలేని దుస్థితిలోకి విద్యార్థి లోకం నెట్టివేయ బడుతున్నారనడంలో సందేహం లేదు.
మార్కులే ప్రామాణికమా...?
విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారు కాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్ఠగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యా సంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుతీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలెన్నో ఉన్నాయి. అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల.
తల్లడిల్లేది తల్లిదండ్రులే
పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని.. ఇలా వివిధ రకాల కారణాలతో విద్యార్థులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే. బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది తల్లిదండ్రులే... పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్టు విలవిల్లాడేది తల్లిదండ్రులే... మరి పిల్లలు చేస్తున్నది ఏమిటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కన్నవారిని శోకసముద్రంలో ముంచేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితంలో సాధించాలన్న కసి ఉండాలే తప్ప.. ఓ పరీక్షలో తప్పానని, మార్కులు (90% మార్కులు దాటినా కానీ) తక్కువగా వచ్చాయని ప్రాణాలు తీసుకోవటం సబబేనా? తల్లిదండ్రులు కూడా వారిపై మార్కుల ఒత్తిళ్లు తేవడం సమంజసమేనా? పరీక్ష ఫలితాలతోపాటే విద్యార్థుల ఆత్మహత్యల వార్తలూ మామూలయ్యాయి. విద్యా సంస్థలను అడిగితే మీ పిల్లలను నెంబర్ 1 చేయడమే మా లక్ష్యం అంటారు. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలు నెంబర్ 1 కావాలనే ఉంటుంది. మరి అర్థాంతరంగా రాలిపోతున్న ఈ చిన్నారుల గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరు ఎలాంటి బాధ్యత వహించాలి...
ఐఐటి, మెడిసిన్‌లు మాత్రమే చదువులా...?
ప్రపంచంలో ఎక్కడా లేని విద్యా విధానం మన రాష్ట్రాలలో రాజ్యమేలుతోంది. రెండే కోర్సులు పిల్లలను శాసిస్తున్నాయి. ఇంజనీర్, డాక్టర్ వృత్తులలో మాత్రమే పిల్లలు రాణిస్తారా? ప్రపంచంలో వేరే ఇతర వృత్తులకు మన పిల్లలు పనికిరారా? హైస్కూల్ స్థాయిలోనే ఇంటర్మీడియెట్ సిలబస్ బోధనతో పిల్లలను ఒత్తిడికి గురి చేయడం భావ్యమా... వత్తిడిని భరించలేని పిల్లలు బలవన్మరణాలతో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులూ విద్యా సంస్థలు ప్రభుత్వాలు ఆలోచించాలి.
ఇంటర్నల్ మార్కులు వేస్తున్నా...
ఇటీవలే ఇంటర్ ఫస్టియర్‌లో విలువల పరీక్ష పూర్తయిన ఆ సబ్జెక్ట్‌ను బోధించిన వారు కాలేజీలో కరువయ్యారు. విలువల విద్య - జీవన నైపుణ్యాలు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కర దీపికలు ప్రభుత్వ పాఠశాలలకు అందజేయడం జరిగింది. విలువల విద్య జీవన నైపుణ్యాలు బోధన పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండటం హర్షణీయం. పదవ తరగతిలో విలువల విద్య జీవన నైపుణ్యాల కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేస్తున్నా, సరైన శిక్షకులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో విద్యార్థులకు గుణాత్మకతను అందించలేక పోతున్నారు.
‘జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు. అవే కాలం, ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురిగొల్పబడతాయి. మనమై ఆధారపడిన, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలించడం భావ్యమా. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు.
ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్ల ముందు కనిపిస్తుంది.

మానసిక వత్తిడి

జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహజం. నేటి పోటీ ప్రపంచంలో తాము అనుకున్నది సాధించాలనే కాంక్ష మరియు ప్రస్తుతమున్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగాలనుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, వైఫల్యాల మూలంగానే భావోద్వేగాలకు లోనై వాటిని పరిష్కరించుకునే క్రమంలో తీవ్ర వత్తిడికి లోనవుతున్న మూలంగా పరిష్కార శక్తిలో మార్పు వచ్చి నిరాశా నిస్పృహలకు లోనయ్యే వారెందరో వున్నారు. ఫలితంగా వారి జీవన విధానంలో అపసవ్యత నెలకొంటోంది. ఆశించిన జీవితానికి, అనుభవిస్తున్న జీవితానికి మధ్య వ్యత్యాసం ఎక్కువైనపుడు కలిగే ఆందోళన, వత్తిడి మూలంగా మానసిక, శారీరక అనారోగ్యాలకు లోనవుతున్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు. అత్యధిక వ్యాధులకు మూలాలలో మానసిక వత్తిడి కూడా కారణం.
ధైర్యం చెప్పేవారు లేక...
ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. కుటుంబంలో సమస్యలు వస్తే ఓదార్చేవారు కరువయ్యారు. గత తరంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యులతో చర్చిస్తే తాతయ్య, బామ్మ, పెదనాన్న, పెద్దమ్మ, అన్నయ్య ఎవరో ఒకరు ఓదార్పు నిచ్చేవారు.
స్థాయికి మించి లక్ష్య నిర్థారణ
స్థాయికి మించి లక్ష్యాలను పెట్టుకోవడం, వాటిని చేరుకోలేక ఏం చేయాలో తెలియక, చెడు ఆలోచనలు మనసులో చేరడం మూలంగా ఆత్మహత్యల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి.
కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం..
గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వల్ల ఏదైనా సమస్య వస్తే తాతయ్య, బామ్మలు, బాబాయి, పిన్ని, సోదరులు కలిసి చర్చించుకునేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా కొంత ఓదార్పు లభించేది. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

కొన్ని సూచనలు

* పిల్లల శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని లక్ష్య నిర్ధారణ చేసుకోవాలి.
* పరీక్షల సమయంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలి.
* పిల్లలకు మేమున్నాం అనే భరోసాను తల్లిదండ్రులు ఇవ్వాలి.
* పిల్లలకు ఓటమిని తట్టుకోవడం నేర్పాలి.
* ప్రతి కళాశాలలో కౌనె్సలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సైకాలజిస్ట్‌లను నియమించడం.

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321