AADIVAVRAM - Others

కాన్వాస్‌పై రంగుల ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ చిత్రకళా రంగంలో కొత్త తరం తెర పైకి వచ్చింది. తమ ప్రతిభా వ్యుత్పత్తితో అటు వీక్షకుల్ని, ఇటు కళా విమర్శకుల్ని ఆకర్షిస్తున్నారు. వారిలో టేలర్ శ్రీనివాస్ ఒకరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం ఊపందుకున్న సమయంలో ఆయన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) కోర్సును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. తాను పుట్టి పెరిగిన పూర్వపు మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామంలోనూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అదే సమయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ఆదరణ పెరిగింది. పాటలు.. వివిధ కళా ప్రదర్శనలు అంతటా కనిపించసాగాయి. దాంతో అప్పటికి ఐదారు సంవత్సరాలుగా తాను గీస్తున్న తెలంగాణ గ్రామీణ జీవిత చిత్రాలకు, గ్రామ దేవతా బొమ్మలకు, పండుగలు పబ్బాలను కాన్వాసు పైకి బట్వాడా చేయడంతో పలువురి నుంచి మంచి ‘గుర్తింపు’ లభించింది. ఇక అప్పటి నుంచి టేలర్ శ్రీనివాస్ తెలంగాణ గ్రామ జీవితాన్ని వర్ణాలతో అటు కాన్వాస్‌పై, కాగితంపై చిత్రీకరిస్తూ ఎందరినో అబ్బుర పరుస్తున్నారు. తెలంగాణ పల్లె సౌందర్యం, జాతరలు... సంతల్లో ఇంత వైవిధ్యంతోపాటు కళాత్మకత కనిపిస్తుందా? అని వీక్షకులు ఆశ్చర్య చకితులయ్యేలా నిరంతరంగా ఆయన బొమ్మలు గీస్తూ ఉన్నారు.
అలా సాధన చేయడంతో తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఇతరులకన్నా భిన్నమైన స్టైల్ రూపొందించుకోవడంలో ఏ చిత్రకారుడికైనా చాలా కాలం పడుతుంది. శ్రీనివాస్ మాత్రం కాలేజీ చదువు పూర్తయ్యే లోగానే తనదైన ప్రత్యేక ‘లైన్’ సృష్టించుకున్నారు.
బాల్యం నుంచి తన చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంత వ్యక్తులను, పరిసరాలను నిశితంగా పరిశీలించడంతో ప్రతిభావంతంగా కాన్వాసుపైకి రంగుల్లో వాటిని దింపడం ఆయనకిప్పుడు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. అది ఆయనకో వరం. ఎంతో అవలీలగా కాగితం - కాన్వాసుపై రంగులను రేఖలను పలికించే, సృజనాత్మకంగా ఆవిష్కరించే అనుభవం సాధించి ఆ కళలో కృతకృత్యుడయ్యాడు. తన తరం చిత్రకారుల్లో ప్రతిభావంతుడిగా పలువురి విమర్శకుల చేత గుర్తింపు, గౌరవం పొందారు. ముఖ్యంగా ఆలుమగలు (కపుల్) సిరీస్‌లో ఆయన వేసిన చిత్రాల్లో తెలంగాణ గ్రామీణ జంటలు తొంగి చూస్తాయి. ఆ అమాయక చూపులు, హావభావాలు, వస్తధ్రారణ, వైవిధ్యమైన ఆభరణాలు... ఇట్లా గ్రామీణుల్ని గొప్ప కళాత్మక రీతిలో ఆకర్షణీయమైన ‘ఫ్రేమ్’లో ఆయన బంధించి చూపడం అపురూపం.
పండుగలకు పబ్బాలకు జానపద కళాకారులు గ్రామాల్లో తమ కళను ప్రదర్శిస్తూ యాచించడం సహజం. ఆ దృశ్యాలను ఎంతో ప్రతిభావంతంగా, శక్తిమంతమైన రేఖలతో ఆ కళాకారులను చిత్రాల ద్వారా కళ్లకు కట్టడం టేలర్ శ్రీనివాస్‌కు కొట్టిన పిండి. వారి కాలిగోటి నుంచి తలకు చుట్టుకునే వస్త్రం వరకు సమస్తం కళాత్మకంగా, కంటికి ఇంపుగా చిత్రిక పట్టారు. ఆ విధంగా తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని అనేక చిత్రాల్లో కళ్లకు కట్టి తన ప్రతిభను చాటుకున్నారు.
తెలంగాణ మహిళలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను సైతం శ్రీనివాస్ ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు. ఆ చిత్రణలో ఆయనకే సొంతమైన ప్రత్యేక లైన్‌తోపాటు టెక్చర్ కనిపిస్తోంది. ఎంపిక చేసుకునే ఫ్రేమ్ సైతం విభిన్నంగా ఉండటం వల్ల ఆయన బొమ్మలు శక్తిమంతంగా దర్శనమిస్తాయి.
జానపద కళాకారులైన శారదకాండ్రును, సొన్నాయిల వాళ్లను ఎర్రగొల్లలను చిత్రించిన తీరు కళాప్రియులను ఎంతగానో తన్మయుల్ని చేస్తుంది. వాటిలో వైవిధ్యం, సృజనాత్మక పలకరింపు, వాస్తవికతకు దగ్గరగా ఆ చిత్తరువులు జీవం పోసుకుని కనిపిస్తాయి. ఓ చిత్రకారుడికి ఇంతకు మించిన గుర్తింపు.. గౌరవం ఏముంటుంది?
తాను పుట్టి పెరిగిన టేక్మాల్ గ్రామంలో ప్రతి శనివారం పశువుల సంత (అంగడి) జరుగుతుంది. ఆ దృశ్యాలను సైతం ఆయన ఎంతో ప్రతిభావంతంగా కాగితం పైకి తీసుకొచ్చారు. చిత్రకారుడు తన పరిసరాలను అధ్యయనం చేసి కళాత్మకంగా చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని శ్రీనివాస్ చక్కగా పాటిస్తూ వస్తున్నారు. అందులో ఎలాంటి శషభిషలు లేకుండా నిజాయితీగా చిత్రీకరించడం మూలంగా ఆ చిత్రకారుడు ఘన విజయం సాధించాడు. నేల విడిచి సాము చేస్తే ఆ ‘వాతావరణం’ అభాసుపాలవుతుంది. టేలర్ శ్రీనివాస్ దాన్ని గుర్తెరిగి వాస్తవికతకు వనె్నలద్దడం మినహా నేలవిడిచి సాము చేయలేదు. ఆ రకంగా ఆయన చిత్రాల్లో పశువులు - కోళ్లు దర్శనమిస్తాయి. మేకలు, గొర్లు సైతం మూగగా ముచ్చటగొల్పుతాయి. అలాగే పెద్దపులి మీద సవారీ చేసే కాళికాదేవి చిత్రం చిత్రకారుడు తనదైన శైలిలో గీసి సమగ్ర గ్రామీణ జీవితాన్ని కళ్ల ముందు ప్రదర్శించాడు.
ఇలా జీవితాన్ని ఒడిసిపట్టి పది మంది ముందు రంగుల్లో ప్రదర్శించడం వెనుక శ్రీనివాస్ బాల్యం నుంచే ఉన్న తపన కనిపిస్తోంది. ఆ తపన - ఆర్ద్రత, అభినివేశం, అంకితభావం, సాధనా గుణం లేనట్లయితే రాణించడం కష్టం.
తన గ్రామం టేక్మాల్‌లో ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న సమయం నుంచే చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకుని డ్రాయింగ్ క్లాస్‌లో శ్రద్ధగా నేర్చుకుని అభ్యాసం చేస్తూ అడుగు ముందుకేశాడు. లోయర్ హైయ్యర్ డ్రాయింగ్ పరీక్ష 1995 నాటికే పూర్తి చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలో టెక్నికల్ సర్ట్ఫికెట్ కోర్సును సైతం పూర్తి చేసి, ఉపాధి కోసం సైన్ బోర్డులు, బ్యానర్లు రాసి, పాఠశాల భవనాలలో, గుళ్లలో చిత్రాలు గీసి తన ప్రతిభను సజీవంగా నిలుపుకున్నారు. తనలోని కళను మరింత మెరుగుపరచుకోవాలని భావించి ఇంటి పరిస్థితులు పూర్తిగా సహకరించకపోయినా 1995లో మాసాబ్ ట్యాంక్ వద్దగల ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణుడై పెయింటింగ్ తరగతులకు హాజరయ్యాడు. అంతకు పూర్వం డ్రాయింగ్ లోయర్ హైయ్యర్ పూర్తి చేయడంతో కాలేజీ విద్య మరింత ఆసక్తిగా మారింది. హిస్టరీ ఆఫ్ ఆర్ట్‌తోపాటు థియరీ నేర్చుకోవడం వల్ల రంగుల ప్రపంచపు ఊహలు విప్పారాయి. కాలేజీలో అసైన్‌మెంట్స్‌ను శ్రద్ధతో పూర్తి చేయడంతో తన ‘కళ’లో మార్పు కనిపించింది. తన చిత్రాలలో ద్యోతకమైన ఆ ‘మార్పు’కు మరింత వనె్నలద్దేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘ఎంఎఫ్‌ఏ’లో చేరాడు. అక్కడ లక్ష్మాగౌడ్, డిఎల్‌ఎన్ రెడ్డి తదితర ప్రతిభావంతులు బోధకులు ఉండటం, వారి సాంగత్యంలో, వారి మార్గదర్శనంలో తెలంగాణ గ్రామీణ జీవిత విశ్వరూపాన్ని కాన్వాసుపైకి తీసుకొచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత దశాబ్దంన్నర కాలంగా తన కలం - కుంచె పరిసరాలతో పోటీ పడుతున్నాయి. ఆ రకంగా అసంఖ్యాకంగా గీసిన చిత్రాలతో 2008, 2009, 2011, 2012 సంవత్సరాల్లో సోలో చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు లెక్కకు మిక్కిలి గ్రూపు ప్రదర్శనల్లో పాల్గొని వీక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ శ్రీనివాస్ చిత్రాన్ని కొనుగోలు చేసి తన గ్యాలరీలో పెట్టుకోవడమంటే ఆయన చిత్ర కళ ఔన్నత్యమేమిటో తేటతెల్లమవుతోంది. 2002 సంవత్సరంలో అఖిల భారత చిత్రకళా పోటీలో రజత పతకాన్ని ఆయన గెలుచుకున్నారు. ఇంకా అనేక సత్కారాలు అందుకున్న టేలర్ శ్రీనివాస్ కుంచె నుంచి మరెన్నో అద్భుత వర్ణ చిత్రాలు ఆవిష్కృతమవుతాయనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు!
( టేలర్ శ్రీనివాస్ 99896 70759, 94416 47697)

-వుప్పల నరసింహం 99857 81799