Others

ఆనాటి హృదయాల.. (యన్‌టిఆర్ క్షమాపణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడేవిటి? క్షమాపణలు చెప్పడమేమిటి? ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఈ సంఘటన తెలియాలి. తెలిస్తేనే యన్‌టిఆర్ ఔన్నత్యం అర్థవౌతుంది.
అప్పటికీ, ఇప్పటికీ ఎంత వ్యత్యాసం! ఆ రోజుల్లో జర్నలిస్టు ఇంటర్వ్యూకి వస్తున్నాడంటే ప్రొడ్యూసరు సైతం పక్కకు తప్పుకోవాల్సిందే. జర్నలిస్టులకు ప్రెస్ షో వేస్తున్నారంటే, కేవలం ప్రెస్, ప్రెస్‌కి చెందిన కుటుంబాలు తప్ప మరెవ్వరూ ఉండేవారు కాదు- అంత కట్టడి.
జర్నలిస్టులు కూడా ఇంటూరి, మెరుపు కృష్ణ, కాగడా శర్మ, మోహన్‌కుమార్, గౌతమ్, వెంకట్, శ్రీనివాస్, యన్నార్ చందూర్, అర్జునరావు, నేనూ, నందకుమార్ ఇలా అందరం బాగా చదువుకున్నవాళ్లమే వుండేవారం.
‘యమగోల’ చిత్రం షూటింగు సమయంలోనే ఒకే సంచలనం. నరసరాజుగారి స్క్రిప్టు.. యన్‌టిఆర్, జయప్రద, రావుగోపాలరావు, సత్యనారాయణ వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆ విషయం వెంకటరత్నం (ప్రొడ్యూసరు) షూటింగు ప్రోగ్రెస్ వంకతో ప్రెస్‌ని పిలిచి ఆత్మీయంగా కష్టసుఖాలు పంచుకొనే ప్రయత్నం చేశారు.
ఈ సినిమా ప్రారంభమే చిత్రంగా జరిగింది. యన్‌టి రామారావు వెంకటరత్నంకి డేట్స్ ఇచ్చారు. వెంకటరత్నం పెద్ద కెమెరామన్. ఎక్కువ అక్కినేని సినిమాలనే చేశారు. అయినా వెంకటరత్నానికి డేట్స్ ఇవ్వడం యన్‌టిఆర్ ప్రత్యేకత! ఇంకేముంది? వెంటనే ప్రారంభించాలి. అప్పుడప్పుడే హిందీ సినిమాల్లో బిజీ అవుతున్న తాతినేని రామారావు దర్శకుడు. హడావుడిగా ప్రారంభించారు. షూటింగు కూడా హడావుడిగా జరిగింది. పెద్ద కథేకాదు ‘యమగోల’ చిత్రానికి ముందు ‘దేవాంతకుడు’ చిత్రం వచ్చింది. అదీ యన్‌టిఆర్ చేసిందే. ఆ సినిమా బాగా పోలేదు. ఈ సినిమా మీద ఆశ లేదు. ఈ సినిమాని ప్రమోట్ చేసే వాళ్లుకావాలి!
అప్పట్లో పబ్లిసిటీ సాధనాలు తక్కువ.
ఇప్పట్లా రైటప్స్‌కి బట్టరూ -జామూ రాసే రోజులుకావు. నిజాన్ని నిర్భయంగా రాయాలి. అలా రాయడంలో కాగడా శర్మ ముందుండేవాడు. తర్వాత వెండి తెర హైద్రాబాద్ పత్రిక బీఏవి శాండిల్య ముందుండేవాడు. ‘సినీ హెరాల్డ్’లో ఆంజనేయశాస్ర్తీ రివ్యూల విషయంలో చాలా నిక్కచ్చిగా వుండేవారు. పన్యాల రంగనాథ్, వరదాచారి వీరి అంతేవాసులు. నేను రివ్యూస్ మద్రాసునుంచి పంపిస్తుండేవాడ్ని. రివ్యూస్ చూసి సినిమాకెళ్లే రోజులు. అందుకే ప్రెస్‌కి విపరీతమైన గౌరవ మర్యాదలు జరిగేవి.
సినిమా విడుదలయింది. ఒక వారం గడిచింది.
కొంతమంది ఫరవాలేదన్నారు. మరికొందరు గోలగోలగా ఉందన్నారు. నేను ‘యమహా.. మహాగోల’ అంటూ సంచలన విజయం సాధించిందని ఉటంకిస్తూ రాశాను. శర్మలాంటివారు అడిగారు కూడా- అంత బావుందా నీకు అంటూ. ‘యమగోల’ చిత్రానికి ప్రథమ హీరో డివి నరసరాజే. తర్వాతే సత్యనారాయణ, యన్‌టిఆర్, గోపాలరావులు. ఇదే విషయాన్ని రాయడం జరిగింది.
కనె్నమెర హోటల్లో సక్సెస్ మీట్.
ఏడు గంటలకి-. అరగంటే ప్రెస్‌మీట్. విజయాన్ని పంచుకోవడం- తర్వాత డిన్నరుంటుంది.
ఆరున్నర నుంచే జర్నలిస్టులు వస్తున్నారు. ఏడు గంటలయ్యేసరికి అందరూ వచ్చేశారు- ప్రొడ్యూసరు వెంకటరత్నం, డైరెక్టర్ రామారావు కంగారుపడుతున్నారు. జయప్రద వచ్చింది- గోపాలరావూ వచ్చారు. యన్‌టిఆర్ రాలేదు. అందరిలో టెన్షను. ఏమైవుంటుంది? ఏడు గంటలంటే అయిదు నిముషాలు తక్కువ ఏడుగంటలకి యన్‌టిఆర్ వుండితీరాలి. ఆ లెక్కన చూసుకుంటే పది నిముషాలు లేటు.
ఇంతలో యన్‌టిఆర్ రావడంతోనే ప్రెస్‌ని పలకరిస్తూ అలవాటుగా చేతులు జోడిస్తూ.. అయిదు నిముషాల ఆలశ్యానికి పది నిముషాలు క్షమాపణలు చెప్పేరు. వెంకట్, గౌతమ్‌లు (అందరికంటే పెద్దవారు) (ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి) ‘మీరు అయిదు నిముషాలే లేటు. మా జర్నలిస్టులు అరగంట లేటుగా వచ్చినాసరే ఆశ్చర్యపోనఖ్ఖర్లేదు. సినిమా హిట్ అయ్యింది. ఎంజాయ్ చేద్దాం! ఈ విజయానికి మీ స్పందన తెలియచేయండి!’ అన్నారు. తర్వాత నవ్వుల పువ్వులు వెల్లివిరాశాయి. అది ఆరోజు-
మరి ఈ రోజు? జర్నలిస్టులకు ప్రవేశం లేదు అని బోర్డులు పెడుతున్నారు. హతోస్మి!

ఇమంది రామారావు