Others

వైద్యవిద్యకు గ్రహణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిపుణులైన వైద్యులను తయారు చేయాల్సిన వైద్య కళాశాలలు ఇపుడు బోధనా సిబ్బంది, వౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. గతంలో వలే వైద్య విద్యార్థులకు నేడు బోధన సరిగా అందకపోవడంతో అరకొర జ్ఞానంతో పట్టాలు అందుకున్న వారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ప్రమాదం ఏర్పడుతోంది. వైద్య కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే ప్రజారోగ్యం మెరుగు పడుతుంది. 30 శాతం వరకూ బోధనా సిబ్బంది లోటు ఉన్నా ఫరవాలేదని భారతీయ వైద్య మండలి ఇటీవల పేర్కొనడం వైద్య విద్యను వ్యాపార మయం చేయడం తప్ప మరొకటి కాదు. బోధనా ఆస్పత్రుల్లోని పడకల్లో కనీసం 70 శాతం మంది రోగులు ఉండాలన్న నిబంధనను సైతం సడలించి 50 శాతం రోగులుంటే చాలని వైద్య మండలి నిర్ణయించడం మరింత ప్రమాదకర పరిణామం. నిబంధనలకు ఇలా సడలింపులిస్తుంటే వైద్య వృత్తిలో ప్రమాణాలు దిగజారడం ఖాయం. వైద్య కళాశాలల్లో ఎంతోమంది అధ్యాపకులు, ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నా, ఆ ఖాళీలను శాశ్వత ప్రాతిపదికపై భర్తీ చేయడం లేదు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరిపినా అది నిజమైన పరిష్కారం కాబోదు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు అధ్యాపకుల, సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నా పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం లేదు. దీంతో ఎన్నో ఆశలతో వైద్య కళాశాలల్లో చేరిన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. బోధనా సిబ్బంది, కనీస వసతులకు సంబంధించి తనిఖీలు చేయాల్సిన వారు ప్రలోభాలకు లొంగిపోతున్నారు. సరైన తనిఖీలు లేకుండానే ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతులివ్వడం జరుగుతోంది. నకిలీ వైద్యులను, నకిలీ రోగులను, అద్దెకు తెచ్చిన పరికరాలను చూపించి తనిఖీల్లో ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు బయటపడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు రోగులకు ఎలాంటి సేవలు చేయగలరు? తగినంత జ్ఞానం, అనుభవం లేని వారు డాక్టర్లుగా చెలామణి అయితే రోగులకు ప్రమాదం కాదా? కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వైద్య పరీక్షలకు సైతం రోగులు నోచుకోని పరిస్థితి ఎదురవుతోంది. నిర్ణీత ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులిస్తామని భారతీయ వైద్య మండలి చేస్తున్న హెచ్చరికలు తాటాకు చప్పుళ్ల మాదిరి ఉన్నాయి. కనీస సౌకర్యాలు, తగినంత మంది అధ్యాపకులు లేని ప్రైవేటు వైద్య కళాశాలలను రద్దు చేయాలి. మిడిమిడి జ్ఞానంతో, తగినంత అనుభవం లేనివారు వైద్యం చేస్తే ప్రజల ఆరోగ్యం గాలిలో దీపం అవుతుంది. వైద్యవృత్తి పట్ల సమాజంలో గౌరవం పెంచేలా ప్రభుత్వం అన్ని వసతులను సమకూర్చి, అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి.

-సి.కనకదుర్గ, హైదరాబాద్