Others

‘హోదా’ పోరాటంలో రాజకీయాలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మాన్ని మనం కాపాడితే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని పెద్దలు చెబుతారు. రాష్ట్ర విభజన అనంతరం అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ను ధర్మబద్ధంగా ఆదుకోవాలని ఇటీవల ధర్మపోరాట దీక్షలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షకు వివిధ రాజకీయ పక్షాలు, పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. అధికార తెదేపా నాయకులు, కార్యకర్తలతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మేధావులు, రచయితలు సైతం ఢిల్లీ వెళ్లి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని గళం విప్పారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ సహా 23 రాజకీయ పార్టీల నాయకులు ధర్మాపోరాట దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షను వైకాపా, భాజపా నేతలు తప్ప ఎవ్వరూ తప్పుపట్టలేదు. నిజానికి ఈ దీక్షను ఐదున్నర కోట్ల సీమాంధ్రుల దీక్షగా పేర్కొనాలి.
కేంద్రంలో భాజపా ప్రభుత్వ పాలన ముగుస్తున్నా, విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు ప్రధాని మోదీ సుముఖంగా లేరు. 2014 ఎన్నికల సభల్లో తాను చెప్పిన మాటలకు భిన్నంగా మోదీ వ్యవహరిస్తున్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని అమలుచేయకపోగా చంద్రబాబుపై మోదీ రాజకీయ ‘దండయాత్ర’కు దిగినట్లు ఇటీవల గుంటూరు సభలో ఆయన మాటలు తేటతెల్లం చేశాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖకు రైల్వేజోన్ , కడప ఉక్కు కర్మాగారం , దుగ్గరాజుపట్నం పోర్టు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, రాజధానికి నిధులు, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలపై భాజపా నేతలు నోరు మెదపడం లేదు. ఈ విషయమై తెదేపా, భాజపా నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తప్ప సీమాంధ్రులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. చంద్రబాబు మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా, అదేరీతిలో భాజపా నాయకత్వం వ్యవహరిస్తోంది. సీమాంధ్రులు అడిగే న్యాయమైన హామీలను అమలు చేయకపోగా, ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం మరింత రాజుకొంది.
ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించటంలో చంద్రబాబు విఫలమైతే, లేదా అతనిలో చిత్తశుద్ధి లేకపోతే, తమకున్న చిత్తశుద్ధి ఏమిటో భాజపా, వైకాపా నాయకులు చెప్పాలి. ఇప్పటి వరకూ తాము చేసిన, చేయబోయే కార్యాచరణ ప్రణాళికలేమిటో కేంద్ర ప్రభుత్వం విశదపరచాలి. విభజన చట్టంలోని హామీలు చంద్రబాబుకో, జగన్‌కో, మరో పార్టీ నాయకునికో చెందినవి కావుకదా? అవి పూర్తిగా సీమాంధ్ర ప్రజల హక్కులు. చట్టబద్ధ హామీలను అమలు చేయకపోవటాన్ని ఏమనాలి? పార్లమెంటులో ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండాపోతే- రాజ్యాంగంపై ప్రజలకు విశ్వాసం ఎలా ఉంటుంది? చట్టసభల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుకు రానివారు, ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తారన్న గ్యారంటీ ఏమిటి? హోదా, విభజన హామీల కోసం ఎవరు గళమెత్తుతున్నారన్నది ప్రశ్న కాదు. గళమెత్తాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నదే ముఖ్యం. ఉందని భావిస్తే కేంద్రంపై అన్ని రాజకీయపార్టీలూ పోరాడాల్సిందే. భావసారూప్యత ఉంటే కలసి పోరాడాలి. లేకపోతే ఎవరికి వారైనా తెగించి పోరాడాలి. అంతేగాని మాట తప్పినవారి పంచనచేరి తమకు ద్రోహం చేస్తే సీమాంధ్రులు సహిస్తారా?

-పోతుల బాలకోటయ్య 98497 92124