AADIVAVRAM - Others

శివమెత్తే గొల్లగట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదవుల విశిష్ట దైవం శ్రీకృష్ణుడంటారు. కానీ, శివమెత్తి ఊగుతారు. శివుడు శాకాహారే.. భక్తులు మాత్రం బలి దానాలతోనే మోక్షమొందుతారు. కులదైవంగా వినతికెక్కి.. సర్వజన జాతరగా భాసిల్లే దురాజ్‌పల్లి భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాల సమ్మేళనం. తెలంగాణాలోనే సమ్మక్క సారలమ్మ జాతరంత ప్రాచుర్యం పొంది గొల్లగట్టుగా భాసిల్లుతూ అందరికి వరాలనొసగే పెద్దగట్టు...అనేక విశిష్టతల పుట్ట! పురాణాల్లో పుంఖానుపుంఖాలుగా కథలు వినిపించే లింగమంతుల స్వామి జాతర స్వరాష్ట్రంలో సరికొత్తగా శోభను సంతరించుకుటోంది.. రెండేళ్లకోమారు మాఘమాసం మొదటి ఆదివారం దిష్టిపూజతో ఉత్సవ అంకురార్పణ గావించి పక్షం నాటికి భక్తజన సందోహంగా మారుతుంది. అయిదురోజులపాటు లింగమంతుల స్వామి నామస్మరణతో పెద్దగట్టు జనగుట్టగా దర్శనమిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వరకు జాతర జరగనున్నది.
* * *
భారతదేశంలోనే ఏకైక యాదవుల పెద్దజాతరగా ప్రఖ్యాతిగాంచిన గొల్లగట్టు నూతన జిల్లాగా అవతరించిన సూర్యాపేటకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దురాజ్‌పల్లి గుట్టపై శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మతల్లి కొలువై ఉన్నారు. ఐదు శతాబ్దాలకుపైగా కోరిన కోరికలు తీరుస్తూ లక్షలాది మంది భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపు పదిలక్షలకుపైగా భక్తులు తమతమ మొక్కులను తీర్చుకుంటారు.
కథనం ఆసక్తికరం
లింగమంతులస్వామి జాతర వెనుకున్న చారిత్రక కథనం ఆసక్తికరంగా ఉంటుంది. శివుడు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు చనిపోయే ప్రతి రాక్షసుడి రక్తపుబొట్టు కింద పడగానే రాక్షసులుగా జన్మిస్తున్నారని, దీంతో విసిగిపోయిన శివుడి స్వేదం బండపై పడినప్పుడు అందులో నుంచి చౌడమ్మ (చాముండేశ్వరీదేవి) జన్మించిందని చారిత్రక కథనం. ఆమె తన నాలుకను ఆకాశమంత చేసి రాక్షసుల రక్తపు బొట్టు భూమిపై పడకుండా సహాయపడటంతో అమ్మవారికి గొర్రెలు, మేకలను బలి ఇస్తుంటారని చెపుతుంటారు. అదేవిధంగా చాళుక్య చక్రవర్తుల కాలంలో సామంతరాజులు దురాజ్‌పల్లి దుర్గాన్ని నిర్మించారు. దీనిని ఉండ్రుగొండపై నిర్మించారు. ఎతె్తైన ప్రాంతంలో ఉండటం వల్ల శత్రుదుర్భేద్యంగా పేరుగాంచింది. కాలక్రమేణా దుర్గం శిథిలమయింది. గుట్ట పరిసరాలలో గొర్రెల కాపరులు మాత్రమే సంచరించేవారు. ఇతమిద్దంగా జాతర మొదలయింది ఎప్పుడో తెలియనప్పటికీ సుమారు అయిదువందల సంవత్సరాలుగా పెద్దగట్టుపై శివాలయం ఉండేదని ప్రతీతి. మొక్కులు తీర్చుకునేందుకు శివాలయానికి బయలుదేరిన ఒక గర్భిణి గంపనెత్తుకొని గుట్టపైకి చేరుకోలేక మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచిందనేది ఓ కథ. భక్తురాలి మరణంతో చలించిన శివుడు (లింగమంతుల స్వామి) అక్కడ ఉండలేక దిగివచ్చి గుట్ట దక్షిణాన ఉన్న కింది గుట్టపై వెలిశాడన్న కథనం ప్రచారంలో ఉంది. దేవుడు దిగిరావడంతో పెద్దగుట్ట బోసిపోయిందని, కిందిగుట్ట ప్రాశస్త్యం పెరిగిందని భక్తులు కథలుగా చెప్పుకుంటారు. అదేవిధంగా మెంతనబోయిన భిక్షం అనే గొర్రెల కాపరి దప్పిక తీర్చుకునేందుకు పెద్దగట్టుకు దక్షిణాన ఉన్న చెరువు వద్దకు వెళ్లగా అక్కడే దేవుడి ప్రతిమలు ఆయనకు లభ్యమయ్యాయని మరో కథనం. ఆయన కోరిక మేరకు మెంతనబోయిన వంశస్తులు కిందిగుట్టపై చిన్న ఆలయాన్ని నిర్మించి లింగ ప్రతిష్ట చేశారని, అందువల్లే (లింగమంతుల స్వామిగా) పేరొచ్చిందని స్థానికులు పేర్కొంటుంటారు. గుట్టపై ఉన్న కోనేరు అన్నికాలాల్లోనూ నీటితో కళకళలాడుతుందని ప్రజలు చెబుతుంటారు.
అంతంత మాత్రంగానే సౌకర్యాలు
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే పెద్దగట్టు జాతర తాత్కాలిక ఏర్పాట్లతోనే సాగుతుంది. వందల సంవత్సరాలుగా జాతర సాగుతున్నా నేటికి శాశ్వత ఏర్పాట్లు చేపట్టకపోవడం పట్ల భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జాతర వేలం పాటల ద్వారా సమకూరే ఆదాయంతోనే తాత్కాలిక ఏర్పాట్లు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా జాతరకు హాజరయ్యే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏలాంటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు చెట్ల నీడలోనే సేద తీరుతుంటారు. గుట్టపై ఉన్న ఒక్క ట్యాంకు, పరిసర ప్రాంతాలలోని బోర్ల ద్వారా వచ్చే నీటితో లక్షలాది మంది భక్తుల దాహం తీరకుండాపోతుంది. తాత్కాలిక స్నానాల గదులు కూడా అరకొరగానే ఏర్పాటు చేస్తుండటంతో మహిళా భక్తులు అనేక ఇక్కట్లకు గురవుతుంటారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న అరకొరగానే పనులు పూర్తిచేస్తుండటంతో నేటికి పూర్తిస్థాయిలో శాశ్వత ఏర్పాట్లు లేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచినప్పటికీ రాష్టప్రండుగగా గుర్తించక పోవడంతో ఆశించిన మేరా పెద్దగట్టు అభివృద్దికి నోచుకోలేదని భక్తులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్టేట్‌ఫెస్టివల్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈసారి రూ.1.70 కోట్లు
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన దురాజ్‌పల్లి జాతరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. 2015లో అప్పటి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాట్లకు రూ.2.10 కోట్లు మంజూరు చేయించినా అందులో సగం మాత్రమే ఖర్చుచేశారు. గుట్టకింద భాగంలో నూతనంగా కోనేరు నిర్మాణం మినహా తాత్కాలిక పనులే చేపట్టారు. ఆతర్వాత 2017లో జాతర సందర్భంగా ప్రభుత్వం రూ.1.29కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కోనేరు ఆధునీకరణతో పాటు సిసిరోడ్లు, మెట్లు, బోర్ల ఏర్పాటుచేశారు. పైప్‌లైన్‌ల నిర్మాణం చేపట్టారు. శాశ్వత ప్రాతిపాదికన మరుగుదొడ్లు, స్నానాల గదులను నిర్మించిన నాణ్యత లోపంతో అవి రెండేళ్లకే శిథిలావస్థకు చేరుకున్నాయి. అదేవిధంగా కొండపై పూజారి నివాసం పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించిన నేటికీ పూర్తికాలేదు. ఈసారి జాతరకు ప్రభుత్వం రూ.1.70కోట్ల నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. గుట్టపై కళ్యాణ కట్ట నిర్మాణం, తాగునీటి బోర్లు, పైపులైన్‌ల ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా మిషన్ భగీరథ కింద పైపులైన్ ఏర్పాటుచేసి భక్తులకు తాగునీటిని అందించేలా పనులు చేపడుతున్నారు. విద్యుదీకరణ, రైలింగ్ నిర్మాణం, యాదవుల సంప్రదాయ దుస్తులు, సంప్రదాయ సామాగ్రిని కొనుగోలు చేయనున్నారు.
ప్రకృతి పండుగలు
సమ్మక-సారక్క అనుభవంతో ప్రత్యేక ఏర్పాట్లు
జాతరలంటే మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు. ప్రకృతి పండుగలుగా జాతరలను నిర్వహిస్తాం. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారక్క జాతరను రెండుసార్లు విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో రెండవ అతిపెద్ద జాతరగా పేరొన్న పెద్దగట్టు జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నాం. రాష్ట్రంలో రెండు అతిపెద్ద జాతరలను నిర్వహించే అరుదైన అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రధానంగా పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌పై దృష్టి సారించి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నాం. ప్రభుత్వం కేటాయించిన రూ.1.70కోట్ల నిథులతో జాతర పనులు చేపట్టి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.
-దుగ్యాల అమయ్ కుమార్ సూర్యాపేట కలెక్టర్

-ఇల్లెందుల గోపీనాథ్ 9848031718